అన్నీ బాగున్నవాళ్లు గెలిస్తే ఏం గొప్ప..? విధి వెక్కిరిస్తే, నిలబడి, దాన్ని ధిక్కరించి గెలిచేవాళ్లదే అసలు గొప్ప… అవును, పారాలింపిక్స్ స్వర్ణపతక విజేత అవని లేఖడా నిజంగా గొప్పే… ఎందుకో చెప్పుకుందాం… అలాగే, మరో మాట… ఒలింపిక్స్‌లో గెలిచినా గెలవకపోయినా, ఉత్త చేతులతో తిరిగి వచ్చినా మీడియా విపరీతంగా హైప్ ఇచ్చింది, చప్పట్లు కొట్టింది, పుంఖానుపుంఖాలుగా కథనాలు రాసింది… ఓ చిన్న పతకం సాధిస్తే కోట్లకుకోట్లు గుమ్మరించాయి ప్రభుత్వాలు, సన్మానించాయి, ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఇచ్చాయి, తెలుగు రాష్ట్రాలయితే భూములు రాసిస్తాయి… కానీ అనేక క్రీడల్లో అనేక అంతర్జాతీయ ఈవెంట్లలో ఎంత మంచి ప్రతిభ కనబరిచినా మనవాళ్లకు కనబడదు… మీడియాకు అస్సలు పట్టదు… మొన్నటి నీరజ్ చోప్రా జావెలిన్ పతకం సరే, అభినందించాలి, కానీ తనకన్నా ముందు దేవేంద్ర జఝారియా ఇదే జావెలిన్ పోటీల్లో రెండు స్వర్ణాలు గెలిచాడని ఎందరికి తెలుసు..? కాకపోతే తను గెలిచింది పారాలింపిక్స్‌లో కాబట్టి…! ఈ విశ్వక్రీడా సంరంభం మనకు పెద్దగా పట్టదు కాబట్టి…!! (ఇప్పుడు కాస్త నయం, గతంలో అయితే క్రికెట్ తప్ప ఇక దేన్నీ మన మీడియా ఆటగానే గుర్తించేది కాదు, అందులో ఎన్ని ఫెయిల్యూర్లు, దందాలు ఉన్నా సరే…)
టోక్యో పారాలింపిక్స్‌లో రాజస్థాన్, జైపూర్‌కు చెందిన అవని లేఖడా స్వర్ణాన్ని సాధించింది… వరల్డ్ రికార్డు సమం చేసింది… ఇది ఒక కేటగిరీ షూటింగులో… మరో కేటగిరీలో కూడా ఆమెకు మరో పతకం చాన్సుంది… పారాలింపిక్స్‌లో (దివ్యాంగుల ఒలింపిక్స్) స్వర్ణం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణి, నాలుగో ఇండియన్… అంతకుముందు 1972లో మురళికాంత్ పేట్కర్ స్విమ్మింగులో, 2004, 2016లలో దేవేంద్ర జఝారియా జావెలిన్‌లో, 2016లో మరియప్పన్ తంగవేలు హైజంప్‌లో స్వర్ణాలు సాధించారు… ఇన్నేళ్లకు మళ్లీ ఓ స్వర్ణం… సేమ్, ఒలింపిక్స్‌లో పతకాలు సాధించినవాళ్లతో సమానంగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్ ఈమెకు 3 కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించాడు… నచ్చింది… ఇప్పుడు మళ్లీ ఒకసారి చెప్పుకుందాం… అన్నీ బాగున్నవాళ్లు సాధించేది గొప్పే కావచ్చు, విధిని ఉల్టా వెక్కిరించి ఏదైనా సాధించేవాళ్లు అంతకన్నా గొప్పోళ్లు… అవని లేఖడా కూడా గొప్పదే… ఒక యాక్సిడెంటులో వెన్నెముక తీవ్రంగా గాయపడింది… నడుం కింద భాగం మొత్తం తన స్వాధీనం తప్పిపోయింది… చికిత్సలు, ఫిజియోథెరపీలు కూడా పనిచేయలేదు… డిప్రెషన్, శారీరక వైకల్యం చిన్న వయస్సులోనే ఆమెను కుంగదీశాయి…
Ads
traumatic paraplegia… దీనికి చికిత్స ఉండదని డాక్టర్లు చెప్పేశారు… ఇక లైఫంతా కుర్చీకే అంకితం… తండ్రి ప్రవీణ్ లేఖడా ఓ ఉన్నతాధికారి… తల్లి శ్వేత కూడా ప్రభుత్వ యంత్రాంగంలో అధికారే… తండ్రి ఆమెలో నిరాశ పొగొట్టడానికి నానారకాలుగా ప్రయత్నించేవాడు… కేంద్రీయ విద్యాలయంలో చేర్చాక, మెల్లిగా షూటింగ్ వైపు ఆమె దృష్టిని మళ్లించసాగాడు… అభినవ్ భింద్రా రాసిన ఆటోబయోగ్రఫీ A Shot at History: My Obsessive Journey to Olympic Gold ఇచ్చాడు… తను ఒలింపిక్ స్వర్ణ విజేత… ఆ పుస్తకం అవని జీవిత లక్ష్యాన్ని, పంథాను, ఆలోచనల్ని మార్చేసింది… దీనికితోడు మోడీ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఓ పథకం ఆమెకు మంచి మద్దతునిచ్చింది… దారి నుకె Target Olympic Podium Scheme (TOPS)… Annual Calendar for Training and Competition (ACTC) కింద డబ్బులిచ్చింది… దాంతో ఆమె దాదాపు 12 అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంది… కేంద్రం మరింత సాయం చేయడంతో ఇంటి వద్దే ఓ కంప్యూటరజైడ్ డిజిటల్ టార్గెట్ సిస్టం, ఎయిర్ రైఫిల్, అమ్యూనిషన్, ఇతర విడిభాగాలన్నీ సమకూర్చుకుంది… తన టార్గెట్ పారాలింపిక్స్ స్వర్ణాన్ని గురిచూసి కొట్టింది… అది ఆమె ఒడిలో పడిపోయింది…!!
Share this Article