Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ ఒంటరి నాన్న జీవితంలో మళ్లీ సిటీ మొహం చూడలేదు..!!

September 7, 2022 by M S R

భార్య చనిపోయింది… ఈలోకం నుంచి సాగనంపారు… పదమూడోరోజు కార్యక్రమాలు కూడా ముగిశాయి… రిటైర్డ్ పోస్ట్‌మ్యాన్ మనోహర్ ఇక తన ఊరిని, ఇంటిని విడిచిపెట్టి ముంబైలోని తన కొడుకు సునీల్ ఇంటికి వచ్చేశాడు… నిజానికి ఆ ఇంటికి రావడానికి ఏళ్లు పట్టింది తనకు… కొడుకు ఇంటికి వెళ్దామని ఎప్పుడు చెప్పినా సరే, భార్య అంగీకరించేది కాదు…

వాళ్ల జీవితాల్లోకి మనం ఎందుకు జొరబడటం..? ఏం, ఇప్పుడు ఈ ఊళ్లో బాగానే ఉందిగా అంటూ వారించేది… ఇప్పుడు ఆమె లేదు… అదే ఇంట్లో ఆమె జ్ఞాపకాల్లో బతకడంకన్నా కొడుకుతో ఉందామనే భావన బాగా బలపడింది మనోహర్‌లో… తనకైనా ఎవరున్నారు గనుక… ఇక జీవితమంతా కొడుకుతోనే అనుకున్నాడు…

సునీల్ ఓ పెద్ద కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ఇంజనీర్… మంచి పొజిషన్‌లో ఉన్నాడు… పెద్ద ఇల్లు, కారు… అన్నీ ఉన్నాయి… కొడుకు ఇంటిని చూసి ఓ క్షణం విభ్రాంతికి గురయ్యాడు మనోహర్… లోపల అడుగుపెట్టాడు… కార్పెట్ మీద కాళ్లు పెట్టడానికి మనస్కరించలేదు… అదెక్కడ మురికి అయిపోతుందేమోనని…

Ads

‘అబ్బా, నాన్నా… వచ్చెయ్, రా, ఈ సోఫాలో కూర్చో’ అన్నాడు సునీల్… సోఫాలో కూర్చున్నాడు, ఒక్కసారిగా భయపడ్డాడు… అది దూదికన్నా మెత్తగా ఉంది, తను కూర్చోగానే రెండడుగుల మేరకు లోపలకు లోతుగా కుంగింది… సుఖంగానే ఉంది, కానీ మునుపెన్నడూ ఎరుగని సుఖం అది… టీ తాగాక… ‘రా నాన్నా, ఇల్లు మొత్తం చూపిస్తాను’ అన్నాడు సునీల్…

‘‘నాన్నా… ఇది లాబీ… చాయ్ బిస్కట్ ఇక్కడే… ఎవరైనా గెస్టులు వచ్చినా సరే ఇక్కడే ముచ్చట్లు, బ్రేక్‌ఫాస్టులు… ఇదేమో డైనింగ్ హాల్… ఇక్కడే టైంకు భోజనం… ఇదేమో కిచెన్… ఆ పక్కనే వంటకు సరిపడా సరుకులు పెట్టడానికి చిన్న స్టోర్ రూం… ఇదేమో పిల్లల గది…

‘‘ఆగాగు… పిల్లలకు సపరేటుగా గది దేనికి..? వాళ్లు మీతో ఉండరా..?’’

‘‘ఇది ముంబై నాన్నా… నగరం… ఇక్కడ లైఫ్ స్టయిల్ వేరు… పిల్లల్ని చిన్నప్పటి నుంచే విడిగా పడుకోబెడతాం… తల్లి అప్పుడప్పుడూ వేళకు పాలు పడుతుంది, అంతే…’’

మనోహర్‌కు కాసేపు అర్థం కాలేదు… అర్థమయ్యాక మింగుడుపడలేదు… తరువాత చాలాసేపటిదాకా జీర్ణం కాలేదు…

‘‘నాన్నా, ఇదేమో మీ కోడలు, నేను పడుకునే గది… ఆ కార్నర్‌లో ఉన్నదేమో గెస్ట్ రూం, ఎవరైనా అనుకోకుండా గెస్టులు వస్తే అందులో ఉండటానికి ఏర్పాటు… దాని పక్కనే చిన్న గది ఉంది చూశావా..? అది పెట్ రూం… ఇప్పుడు లేదు, కానీ రేపు ఎప్పుడైనా పిల్లలు కుక్కల్ని తెచ్చి పెంచుకుంటే వాటి కోసం ఓ గది కావాలి కదా… అందుకే ఈ ఏర్పాటు…

ఇద్దరూ మెట్లు ఎక్కి, పైకి చేరారు… రేకులతో కప్పిన ఓ రూం ఉంది కార్నర్‌లో… ‘‘ఇది జంక్ హౌజ్… అంటే పనికిరాని వస్తువులు, విరిగిపోయిన కుర్చీలు, ఇతర సామాన్లను ఇందులో పడేస్తాం… ఎప్పుడో దీపావళికి లేదా హోళీకి క్లీన్ చేయిస్తాం… దీని పక్కనే బాత్రూం, టాయిలెట్ ఉన్నాయి..’’

సునీల్ చెబుతూనే ఉన్నాడు… మనోహర్ తనతోపాటు తెచ్చుకున్న సంచీ అక్కడే ఉన్న ఓ మడతమంచంపై పెట్టి ఉంది… ఆయన సాలోచనగా కొడుకువైపు చూశాడు… అప్పటికే సునీల్ మెట్లు దిగి కిందకు వెళ్లిపోయాడు…

అదే మంచం మీద కూలబడ్డ మనోహర్ మదిలో ఆలోచనలు… ‘‘అసలు ఇదేం ఇల్లు..? ఎప్పుడో ఓ కుక్కను తెచ్చి పెంచుకుంటామేమో అనుకుని, దానికోసం ప్రత్యేకంగా ఓ గది… కానీ వృద్ధులైన తల్లిదండ్రుల కోసం ఏమీ లేదు ఇక్కడ… జంక్ హౌజ్‌లో నా బ్యాగ్ మడతమంచం మీద పెట్టారంటే, ఇందులో ఉండమని చెబుతున్నట్టా నా కొడుకు..? అంటే తానొక వ్యర్థమైన సామానుగా పరిగణిస్తున్నాడా..? కాళ్లు విరిగిన కుర్చీలు, రెక్కలు ఊడిన ఫ్యాన్లలాగేనా తను కూడా..? అందుకేనా దీని పక్కనే బాత్రూం, టాయిలెట్ ఉందని ప్రత్యేకంగా చెప్పాడు… ఇవన్నీ ఊహించే భార్య ఎప్పుడూ ముంబై రావడానికి ఏదో సాకు చెప్పి నిరాకరించేదా..? ఇప్పుడు నేనేం చేయాలి..?’’

పొద్దున్నే సునీల్ మెట్లు ఎక్కి చాయ్ తీసుకుపోయాడు తండ్రి కోసం… అది ఖాళీగా ఉంది… నాన్న సంచీ కూడా కనిపించలేదు… బాత్‌రూం, టాయిలెట్లో కూడా లేడు… కిందకు దిగివచ్చి చూశాడు… మెయిన్ గేటు తీసి ఉంది… నాన్న నిలబడి ఉన్నాడు… కుర్తా జేబుల్లో చేతులు పెట్టుకుని, నిటారుగా నిలుచుని ఉన్నాడు… ఒక జేబులో తన ఊళ్లోని సొంతింటి తాళపుచెవులు తన పిడికిట్లో… భుజానికి తన సంచీ… ఆటోను కేకేశాడు… నాన్నా అని సునీల్ పిలుస్తున్నాడు… మనోహర్ వినిపించుకోలేదు… ఆటో ఎక్కాడు… దగ్గరలోని రైల్వే స్టేషన్ పేరు చెప్పాడు… అది కదిలింది… మనోహర్ మళ్లీ ముంబైకి రాలేదు…!!

(ఫేస్‌బుక్‌లో కనిపించిన ఓ ఇంగ్లిష్ పోస్ట్ ఇది… తెలుగులోకి నా అనువాదం ఇది…  —- శ్రీనివాసరావు మంచాల)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions