Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దటీజ్ KSR దాస్… అసలు తన జీవితం కూడా ఓ సినిమా కథే…

May 30, 2022 by M S R

Bharadwaja Rangavajhala……  అన‌గ‌న‌గా … నెల్లూరు ద‌గ్గర వెంక‌ట‌గిరిలో కొండా సుబ్బ‌రామ‌దాసు అనే పిల్లవాడు పుట్టాడు.

వెంక‌ట‌గిరి రాజా ద‌గ్గ‌ర ప‌న్నులు వసూలు చేసే ఉద్యోగం చేసే చెంచురామ‌య్య దంప‌తుల‌కు పుట్టాడ‌త‌ను.

అలా ఆ దంప‌తుల‌కు ఇత‌ను ఐద‌వ సంతానం.

Ads

ఇత‌ని పిన‌తండ్రి కూడా తండ్రిలాగే … కురిచేడులో ప‌న్నులు వసూలు చేసే ప‌న్లో ఉండేవాడు.

స్థానికుల‌తో గొడ‌వ‌లు రావ‌డంతో .. వాళ్లు అత‌న్ని హ‌త్య చేశారు.

ఆ కేసు వ్య‌వహారం ద‌గ్గ‌రుండి చూసుకోడానికి చెంచురామ‌య్య త‌న కుటుంబాన్ని వెంక‌ట‌గిరి నుంచీ కురిచేడుకు మార్చి త‌మ్ముడ్ని హ‌త్య చేసిన నేర‌స్తుల్లో ఐదుగురిని త‌నే పోలీసుల‌కు ప‌ట్టించాడు.

స‌రిగ్గా ఈ సంఘ‌ట‌న మ‌న సుబ్బ‌రామ‌దాసు బుర్ర‌లో సుళ్లు తిరిగేది.

త‌ర్వాత రోజుల్లో భార‌త‌దేశంలో తొలి యాక్ష‌న్ డైరెక్ట‌ర్ అనిపించుకునేలా చేసింది ఆ క్యూరియాసిటీనే.

చెంచురామ‌య్య‌కు ఇద్ద‌రు బార్య‌లు ఎనిమిది మంది పిల్ల‌లూ ఉండ‌డంతో పాటు ఇప్పుడు కొత్త‌గా త‌మ్ముడి కుటుంబం కూడా త‌న‌నే ఆశ్ర‌యించ‌డంతో గుంటూరు ష‌ఫ్ట్ అయి పిల్ల‌ల‌లో చేతికి అంది వ‌చ్చిన వాళ్ల‌ని ఏదో ఒక ప‌న్లో పెట్టే ప్ర‌య‌త్నం చేశారు.

అలా దాసుగారు … ప‌దో త‌ర‌గ‌తితో చ‌దువు ముగించి … గుంటూరు కృష్ణ‌మ‌హ‌లో బుకింగ్ క్ల‌ర్కుగా చేరారు. నెల‌కు న‌ల‌భై రూపాయ‌ల జీతం..దీనికి తోడు ప్రైవేట్లు కూడా చెప్పేవాడు.

అదో అద‌న‌పు సంపాద‌న‌.

అలాంటి స‌మ‌యంలో కృష్ణ మ‌హ‌ల్ లో అనార్క‌లి విడుద‌లైంది.

ఆదినారాయ‌ణ‌రావు తండ్రి నాయుడు గారితోనూ అంజ‌లీదేవి ద‌గ్గ‌ర బాయ్ గా ప‌న్జేస్తున్న ద‌శ‌ర‌థ్ తోనూ ప‌రిచ‌యం అయి … మ‌ద్రాసు వ‌స్తే సినిమాల్లో ఏదైనా ప‌ని ఇప్పిస్తారా అని అడ‌గారు దాసు.

ద‌శ‌ర‌థ్ ఓకే అన‌డంతో దాసుగారు బేజులో ఇర‌వై రూపాయ‌లు వేసుకుని చ‌లో చెన్నై అనేశారు.

రాగానే ద‌శ‌ర‌థ‌ ఐదు రూపాయ‌ల‌కు ఓ గ‌ది చూసి పెట్టాడు.

అలా ఆ గ‌దిలో చేరి … సినిమాల్లో ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు దాసుగారు.

తెనాలి నుంచీ మ‌ద్రాసు రైలు ప్ర‌యాణంలో ఓ విచిత్ర‌మైన సంఘ‌ట‌న జ‌రిగింది.

కంపార్ట్ మెంట్ చాలా ర‌ష్ గా ఉంది. ఓ కుర్రాడు త‌న కాలు తొక్కాడ‌ని ఇంకో కుర్రాణ్ణి కొట్ట‌బోయాడు.

ఈ గొడ‌వ చూసి దాసుగారు వారిద్ద‌రి మ‌ధ్య‌లోకి వెళ్లి గొడ‌వ చ‌ల్లార్చారు.

కాలు తొక్కించుకుని గొడ‌వ‌కు దిగిన కుర్రాడు త‌ర్వాత రోజుల్లో య‌మ‌గోల లాంటి సినిమాలు తీసిన స్టార్ కెమేరామెన్ ఎస్.వెంక‌ట‌ర‌త్నం .

ఇలా త‌న‌కు ఇండ‌స్ట్రీ ప‌రిచ‌యాలు దొర‌క‌డం తో నెమ్మ‌దిగా గౌరీ ప్రొడ‌క్ష‌న్స్ భావ‌నారాయ‌ణ గారి ద‌గ్గ‌ర చేరిపోయారు.

నిజానికి ఇక్క‌డే దాసుగారి తండ్రిగారి స‌హాయం అవ‌స‌రం ప‌డింది. భావ‌నారాయ‌ణ‌గారి ద‌గ్గ‌ర దాసును చేర్చిన జ‌గ‌న్నాథం విజ‌యా ప్రొడ‌క్ష‌న్ డిపార్ట్ మెంట్ లో ఉండేవారు.

ఆయ‌న‌దీ నెల్లూరే .. వెంక‌ట‌గిరి సంస్ధానంలో దాసు తండ్రి చెంచురామ‌య్య గారు ప‌న్జేసేప్పుడు ఈ జ‌గ‌న్నాథం ఆయ‌న ద‌గ్గ‌ర గుమాస్తాగా ప‌నిచేశారు.

అలా చెంచురామ‌య్య‌గారు మ‌ద్రాసు వ‌చ్చి మా వాడికి సినిమా పిచ్చి కాస్త కుదురైన ప‌న్లో పెట్టు అని జ‌గ‌న్నాథంగారికి చెప్ప‌డంతో ఆయ‌న భావ‌నారాయ‌ణ‌గారి కంపెనీలో కుదిర్చారు అదీ లింకు.

ఎడిటింగ్ నేర్చుకోవాలి అంటే … ఫ్లోర్ తుడ‌వాలి అని కండీష‌న్ పెట్టి దాసుగారికి ఎడిటింగ్ నేర్పించి … త‌న దగ్గ‌రే ఎడిట‌ర్ ను చేసి ఆ త‌ర్వాత … డైరెక్ష‌న్ ఛాన్స్ కూడా ఇచ్చారు భావ‌నారాయ‌ణ‌.

సినిమా పేరు లోగుట్టు పెరుమాళ్ల‌కెరుక . అది మ‌ళ‌యాళ సినిమా క‌ర‌త్ కై రీమేకు. శోభ‌న్ బాబు హీరో. అత‌నికి అది సోలో హీరోగా తొలి సినిమా.

అది ఫ్లాప్ అయ్యింది.

దీంతో దాసుగారిని తిట్టి కంపెనీలోంచీ వెల్ల‌గొట్టారు భావ‌నారాయ‌ణ‌.

అలా మ‌రోసారి వీధిన ప‌డ్డారు దాసుగారు. నిజానికి భావ‌నారాయ‌ణ‌గారు త‌న‌ను చాలా టార్చ‌ర్ పెట్టారు అని దాసుగారికి తెల్సింది వీధిన ప‌డ్డ త‌ర్వాతే.

సినిమా కంపెనీల్లో సిబ్బందికి టిఫెన్లు బోజ‌నాలు కంపెనీలోనే న‌డుస్తాయి క‌దా … దాసుగారికి ఎంత ఆక‌లి వేసినా రెండు ఇడ్లీల‌క‌న్నా ఎక్కువ పెట్టేవారు కాద‌ట‌. అలాగే నాన్ వెజ్ పెట్ట‌మ‌ని భోజ‌నాల‌ప్పుడు అడిగితే అది పెద్ద టెక్నీషియ‌న్ల‌కే అని చెప్పి గెంటేసేవార‌ట

ఎడిట‌ర్ గా త‌న‌కు ప్ర‌మోష‌న్ ఇచ్చినా మూడొంద‌లు జీతం ఇవ్వ‌డానికి చాలా ఇబ్బంది పెట్టేసేవార‌ట‌.

బైట‌కు వ‌చ్చిన త‌ర్వాత …

పింజ‌ల సుబ్బారావుగారి కంపెనీలో ఎడిట‌ర్ గా చేరారు. సినిమా పేరు ర‌ణ‌భేరి. కాంతారావు హీరో. గిడుతూరి సూర్యం దర్శ‌కుడు .

ఎడిట‌ర్ గా మూడు వేలు ఇస్తాం ఓకేనా అని సుబ్బారావుగారు అన్న‌ప్పుడు దాసుగారికి ప్ర‌పంచం అర్ధం అయ్యింది.

త‌న‌ను భావ‌నారాయ‌ణ‌గారు ఎలా వాడుకున్నారో అర్ధం అయ్యింది.

అయినా ప‌ని నేర్పారు క‌నుక ఆయ‌న్ను ఎన్న‌డూ తిట్టుకోలేదు అనేవారు దాసుగారు.

అలా ఎడిట‌ర్ గా కుదురుకున్న త‌ర్వాత … డైరెక్ష‌న్ అనే పురుగు తొలుస్తూనే ఉంది. ద‌ర్శ‌కుడుగా తానేమిటో ప్రూవ్ చేసుకోవాల‌నే తాప‌త్ర‌యంతో …

వ‌క్త్ అనే హిందీ సోష‌ల్ మూవీ క‌థ‌ని తీసుకుని … దాన్ని జాన‌ప‌దంలోకి మార్చి ఓ కొత్త క‌థ త‌యారుచేసుకున్నారు.

దాన్ని త‌న స‌న్నిహితుడు అయిన మేక‌ప్ వీర్రాజుకు చెప్పాడు. భ‌లే ఉంది.. సినిమాగా తీయొచ్చు అన్నాడు వీర్రాజు.

నువ్వే నిర్మాత‌వు. నేనే డైరెక్ట‌ర్ ని అన్నారు దాసుగారు.

నేను నిర్మాత‌నేంటీ నా ద‌గ్గ‌ర ఈడ్చితంతే నూట‌పాతిక రూపాయ‌లు లేవు అన్నాడు వీర్రాజు.

ఓకే .. ఆ నూట పాతిక నాకివ్వు అన్నారు దాసు.

ఇచ్చాడు వీర్రాజు.

అందులో ఓ రూపాయి పెట్టి ఆకులు వ‌క్కా కొని నూట‌ప‌ద‌హార్లు ఆకులో పెట్టి … తిన్న‌గా వీటూరి గారిని క‌ల్సి వారి చేతిలో పెట్టారు దాసు వీర్రాజులు.

ఇదేంటి అన్నారు వీటూరి. అయ్యా తాంబూలం. దీన్ని అడ్వాన్స్ గా తీసుకుని మాకు స్క్రిప్ట్ రాయాలి. క‌థ నేను చెప్తాను అన్నారు దాసుగారు. అలాగే అని న‌వ్వారు వీటూరి.

తాన‌నుకున్న క‌థ చెప్పారు దాసు. వీటూరి బానే ఉంది అని … రాసిస్తా అని అభ‌యం ఇచ్చారు.

సంగీతం ఎవ‌ర్ని పెట్టుకోవాలి అనుకున్న‌ప్పుడు … రోజూ సైకిల్ వెన‌కాల డోల‌క్ పెట్టుకుని రికార్టింగ్ స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఏ రికార్టింగులో డోల‌క్ కావాలో అక్క‌డ వాయిస్తూ హ‌డావిడిగా ఉండే ఓ కుర్రాడు గుర్తొచ్చారు దాసుగారికి.

అత‌ని పేరు స‌త్యం. ఓ రోజు అత‌ని సైకిల్ ఆపి … ప‌క్క‌కు లాగి నేను తీయ‌బోయే సినిమాకు నిన్ను మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా పెట్టుకుందాం అనుకుంటున్నా నీకేమైనా అభ్యంత‌ర‌మా అని అడిగారు.

అభ్యంత‌రం లేదుగానీ మీరు సినిమా తీయ‌గ‌ల‌రా అని అనుమానంగా అడిగాడు డోల‌క్ స‌త్యం.

భ‌లే వాడివ‌య్యా .. మేక‌ప్ వీర్రాజుగారు నిర్మాత అని ప‌రిచ‌యం చేశారు దాసుగారు.

స‌త్యం ఆయ‌న‌కి న‌మ‌స్కారం పెట్టి క‌థ చెప్పండి అన్నారు.

దాసుగారు క‌థ చెప్పి ఎక్కడెక్క‌డ పాట‌లు కావాలో క్లియ‌ర్ గా ఎక్స్ ప్లెయిన్ చేసేశారు.

స‌త్యం ఓకే అని సైకిల్ వేసుకుని వెళ్లిపోయి .. ఓ నాల్రోజుల త‌ర్వాత … ఐదు ట్యూన్లు వినిపించారు.

వాటిని ఓకే చేసేశారు దాసు. వీటూరిగారికి ఈ ట్యూన్లు వినిపిస్తే ఆయ‌న సాహిత్యం రాసిచ్చేశారు.

వీటూరికి ఇదంతా కామెడీగానూ ఆశ్చ‌ర్యంగానూ అనిపించేది.

అయినా ముచ్చ‌ట ప‌డి చేసేశారు.

అప్పుడు దాసుగారు తెలుగు సినిమాలు కొని త‌మిళంలో డ‌బ్ చేసే పురుష్య‌దాస‌న్ ను క‌ల్సి క‌థ చెప్పారు.

ఆయ‌న బావుంది అన్న త‌ర్వాత ఇది ఆల్రెడీ ప్రొడ‌క్ష‌న్ లో ఉంది… త‌మిళ హ‌క్కులు ఎంత‌కి కొంటారు అని అడిగారు దాస్ .

న‌ల‌భై వేల వ‌ర‌కు ఇవ్వ‌చ్చు అన్నారు పురుష్య దాస‌న్. అందులో ఐదు వేలు అడ్వాన్స్ ఇమ్మ‌ని అడిగి రికార్డింగ్ స్టూడియో బుక్ చేసి స‌త్యం సంగీత ద‌ర్శ‌క‌త్వంలో వీటూరి రాసిన ఐదు పాట‌ల్నీ రికార్డు చేశారు.

అప్పుడ‌ప్పుడే క‌ళ్లు తెరుస్తున్న బాల సుబ్ర‌హ్మ‌ణ్యంకు అన్ని పాట‌ల‌కూ క‌లిపి వంద రూపాయ‌లు చేతిలో పెట్టార‌ట దాసుగారు. బాలుగారు దాన్నే మ‌హాప్ర‌సాదంగా స్వీక‌రించేశారు.

సుశీల‌గారికి ఎన‌భై రూపాయ‌లు జాన‌కి గారికి డెబ్బై ఐదు రూపాయ‌లు చెల్లించి హ‌మ్మ‌య్య అనుకున్నారు.

అలా … పాట‌లు పూర్త‌య్యాక … వీర్రాజు నేరుగా వెళ్లి కాంతారావు, రాజ‌శ్రీ, వాణిశ్రీ, గీతాంజ‌లి వీళ్లంద‌రితోనూ మాట్లాడి … సినిమా పూర్త‌య్యాకే డ‌బ్బులు అనే ప‌ద్ద‌తికి ఒప్పించి అగ్రిమెంట్లు త‌యారు చేయించుకున్నారు.

వీర్రాజు మీద ప్రేమ‌తో వారంద‌రూ ఓకే అన‌డం దాసుగారికి ముందే తెల్సు.

ఇక షూటింగుకు కావాల్సిన డ‌బ్బులు స‌మ‌కూర్చుకోడానికి బెజ‌వాడ జైహింద్ టాకీసు కు చెందిన దోనేపూడి కృష్ణ‌మూర్తిగారికి తెల్సిన ఓ మార్వాడీ డిస్ట్రిబ్యూట‌ర్ కు క‌థ చెప్పి ఒప్పించి రెండున్న‌ర ల‌క్ష‌లు అడ్వాన్స్ ఇచ్చేలా ఒప్పందం చేసుకుని షూట్ మొద‌లెట్టారు.

ఈ సాయం చేసినందుకు కృష్ణ‌మూర్తిగారిని కూడా ప్రొడ్యూస‌ర్స్ లో ఒకడుగా మార్చారు.

సినిమా పేరు రాజ‌యోగం.

ఓ మోస్త‌రు విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత అదే కాంబినేష‌న్ లో రాజ‌సింహం, క‌త్తికి కంక‌ణం సినిమాలు చేశారు.

త‌న‌కు క‌ష్టకాలంలో స్క్రిప్టు రాసిచ్చిన వీటూరి నిర్మాత‌గా అదృష్ట‌దేవ‌త సినిమా తీశారు. ఇవ‌న్నీ కూడా యావ‌రేజ్ గానే న‌డిచాయి. న‌ష్టాలు రాలేదు… భారీగా లాభాలూ రాలేదు.

అలాంటి స‌మ‌యంలో … భావ‌నారాయ‌ణ‌గారి ద‌గ్గ‌ర త‌ను ప‌న్జేసేప్పుడు మేనేజ‌ర్ గా ఉన్న అట్లూరి పూర్ణ‌చంద్ర‌రావుగారు ఓ అయిడియా ఇచ్చారు … లేడీ యాక్ష‌న్ మూవీ చేస్తే ఎలా ఉంటుంద‌నేది అయిడియా విజ‌య‌ల‌లిత‌ను పిల్చి రౌడీరాణి తీశారు.

నాడియా ఇన్స్ పిరేష‌నే అయినా … అదే సినిమా హిందీలో రాణీ మేరా నామ్ గా రీమేక్ చేశారు. అక్క‌డా హిట్ అయ్యింది.

తెలుగులో విజ‌య‌చంద‌ర్ హీరోగా న‌టించాడు. అది అత‌ని తొలి చిత్రం. హిందీలో వినోద్ మెహ్రా చేశాడు.

భావ‌నారాయ‌ణ‌గారి బామ్మ‌ర్ది వైవి రావ్ కూడా దాసు గారి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఓ సినిమా చేసి పెట్ట‌మ‌ని అడిగాడు. అలా తీసిన సినిమా ట‌క్క‌రి దొంగ చ‌క్క‌ని చుక్క‌.

కృష్ణ హీరోగా వ‌చ్చిన యాక్ష‌న్ మూవీ. ఇంక వెన‌క్కి తిరిగి చూడ‌లేదు. కృష్ణ‌తోనే దాదాపు న‌ల‌భై సినిమాలు తీశారు.

మోస‌గాళ్ల‌కు మోస‌గాడు తో ఇంకో రేంజ్ కు వెళ్లారు.

నెమ్మ‌దిగా భావ‌నారాయ‌ణ‌గారు కూడా దాసూ నాకో సినిమా అన‌క‌త‌ప్ప‌లేదు. ముప్పై వేలు ఇస్తేనే అని చెట్టెక్కాడు దాసు. అలా వ‌చ్చిన సినిమా మంచివాళ్ల‌కు మంచివాడు. అది యావ‌రేజ్ అయ్యింది.

దాసుగారు డైరెక్ట‌ర్ గా పీక్స్ లో ఉన్న‌ప్పుడు … ప్రొడ్యూస‌ర్ రాఘ‌వ బామ్మ‌ర్ది ఎమ్కె రాధ వ‌చ్చి హంత‌కులు దేవాంత‌కులు అనే సినిమా తీయించుకున్నారు.

అప్పుడు దాసు గారి ద‌గ్గ‌ర‌కు ఓ క‌థా ర‌చ‌యిత‌ను డైలాగ్ రైటర్ నూ పంపారు.

ఆ క‌థా ర‌చ‌యితే విజ‌య‌బాపినీడు, డైలాగ్ రైటర్ దాసరి నారాయ‌ణ‌రావు.

క‌త్తుల ర‌త్త‌య్య తీసేప్పుడు మోహ‌న్ బాబు త్యాగ‌రాజు రిక‌మండేష‌న్ తో దాస్ గారి ద‌గ్గ‌ర అసిస్టెంట్ గా చేరాడు.

చివ‌ర‌లో నిర్మాత‌గా మారి తీసిన నేర‌స్తుడు, ఇన్స్ పెక్ట‌ర్ రుద్ర లాంటి సినిమాలు భారీగా దెబ్బ‌తిన‌డంతో .. విర‌మించుకున్నారు. ఆర్ధికంగా భారీగా న‌ష్ట‌పోయారు.

2012 జూన్ ఎనిమిదిన క‌న్నుమూశారు.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions