శంకర్ జీ……. *సుందర తెలుగు….* ఆసాంతం చదవండి…. సరదాగా, నవ్వుకోవడానికి…
*చచ్చినట్టు’ బతికించే భాష!*
తెలుగువాడికి సాటి ఇంకొకడు లేడు. అందరిదీ ఒక దారైతే మనవాడిది ఇంకోదారి!
Ads
అందరూ పొగ *పీలిస్తే* తెలుగువాడు పొగ *తాగుతాడు.*
-ఇంతేకాదు తెలుగువాడు దెబ్బలు ‘తింటాడు’. దెబ్బలు ఏమైనా తినే పదార్థాలా? అంటే ఉలకడు పలకడు.
సంస్కృతం అమరభాష అంటారు. దాని సంగతేమో కానీ తెలుగు మాత్రం కచ్చితంగా అమరభాషే! ఇందుకు ఉదాహరణలు ఉన్నాయి.
*ఎవరి మీద అయినా ప్రేమ వచ్చినా, కోపమొచ్చినా ‘సచ్చినోడా’ అని తెలుగువాడు పిలుస్తాడు. ‘సచ్చినోడు’ ఎలా పలుకుతాడని ఆలోచించడు.
*చచ్చినా ఒప్పుకోను అంటాడు. చస్తే ఎలా ఒప్పుకుంటాడు? చచ్చినాక ఒప్పుకుని చూపించిన వాడు ఒక్కడైనా ఉన్నాడా?
*ఆశ చావడం లేదంటాడు. చెట్లకే ప్రాణం ఉందని చెప్పుకుని చావనివాళ్లు ఇంకా ఉన్నారు. అలాంటి వాళ్లు ఆశకు ప్రాణం ఉంటుందని ఎలా ఒప్పుకుని ‘చస్తా’రు?
*తెలుగువాడు కంటి చూపుతో చంపేస్తాడు. అతడి శక్తి అలాంటిది.
ఇలాంటి అతీత శక్తులు యావత్ ప్రపంచంలో తెలుగువాడికి మాత్రమే ఉన్నాయి.
ఎంత గొప్ప! ఎంత చిత్రం !
*మత్తు పానీయాలైన సారా, బ్రాందీ, విస్కీలను ‘సేవిస్తున్నా’ నంటాడు. అదే సమయంలో మంచినీళ్లు తాగుతున్నానంటాడు తప్ప సేవిస్తున్నాననడు.
ఇదేం చిత్రమో!
*ఇంకా చిత్రమేంటంటే మందు ‘కొడుతున్నా’నంటాడు. కొట్టడానికి మందేమన్నా మనిషా? పశువా?
*బాతాఖానీ కొట్టకు అంటాడు. దీని పరిస్థితీ ఇదే.
*అనారోగ్యకరమైన నిషా పానీయాన్ని ఆరోగ్యప్రదాయిని అయిన మందు పేరుతో పిలుస్తాడు! అంతా ‘మందే’ అనుకునేవాడు తప్ప ఇంకెవ్వడైనా ఈ పని చేయగలడా?
*తెలుగువాడు ఎందులోనైనా ఆటను చూడగలడు. మాట్లాడతానంటాడు. పోట్లాడతానంటాడు.
*మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటాడు. మనసు పూర్తిగా కాకుండా అందులో ఏభై శాతమో, డెబ్భైఅయిదు శాతమో ఉంచి కోరుకుంటాడా ఏంటి?
ఇంకోమాట!
*హృదయపూర్వకంగా అభినందిస్తున్నానంటాడు. కాసేపు హృదయాన్ని పక్కనబెడితే, అభినందించే అవకాశం ఉందా? ఉంటుందా?
*తెలుగువాడి ‘న్యాయమే’ వేరు.
బడాయి గానీ మాట మాట్లాడితే ‘మనస్సాక్షిగా’ అంటాడు. మనసుకు ఏమన్నా రూపం ఉందా? మాట ఉందా? వచ్చి సాక్ష్యం చెప్పడానికి!
*అగ్నిసాక్షిగా పెళ్లాడాను అని కూడా అంటాడు. అగ్ని ఏదో చిటపటలాడుతుంది కానీ ఎవరైనా సంసారంలో చిచ్చుపెడితే అదొచ్చి అడ్డుపడుతుందా ఏంటి?
*కళ్లలో నిప్పులు పోసుకుంటున్నాడంటాడు! పోసుకోమనండి చూద్దాం!
*పెళ్లికాని ఆడపిల్లను గుండెల మీద కుంపటి అంటాడు. ఇది ఎంత తప్పు! గుండెల మీద కుంపటి పెట్టుకున్న మొనగాళ్లు యావత్ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారా?
*మాటేగా ఏదైనా అంటాడు. గుండె మీద బరువు తగ్గించుకున్నానంటాడు. గుండెల మీద బట్టల బరువు తప్ప ఇంకేం బరువు ఉంటుంది!
*నవ్వితే నవరత్నాలు రాలతాయంటాడు. రత్నాలా పాడా? మరీ గట్టిగా నవ్వితే పళ్లు రాలిపోతాయేమో! చిటికెలో పని అయిపోతుందంటాడు.
*అతిశయం కాకపోతే చిటికె వేస్తే శబ్దం అవుతుంది కానీ పని ఎలా అవుతుంది !
*ఒట్టిమాటలు కట్టిపెట్టోయ్ అని గురజాడ చెప్పినా మనవాళ్లు వినరు.
*అప్పు తీసుకునేటప్పుడు ‘నీ డబ్బు వడ్డీతో సహా పువ్వుల్లో పెట్టి ఇస్తా’నంటారు. వడ్డీ ఇస్తే ఇవ్వచ్చుగానీ పువ్వుల్లో పెట్టి ఇచ్చినవాడు ఎవడైనా ఉన్నాడా? ఇది అప్పిచ్చిన పిచ్చివాడి చెవిలో పువ్వు పెట్టడం కాదూ!
*ఎవరో చిన్నచూపు చూస్తున్నారని తెలుగువాడు ఆక్షేపిస్తాడు. దూరపు చూపు, దగ్గరి చూపు ఉంటాయి తప్ప చిన్న చూపు, పెద్ద చూపు అని ఎక్కడైనా ఉంటాయా?
*వంట చేయడాన్ని చేయి కాల్చుకోవడం అంటాడు. ఇదే నిజమైతే ఆడవాళ్ల చేతులన్నీ ఏమైపోయేవి !
*సంగీతమంటే చెవి కోసుకుంటానని ఒక్కొక్కరు వంకర్లు తిరిగిపోతుంటారు. అయితే అతడు ఎంతసేపు పాటలు వింటున్నా కోసుకున్న చెవి కిందపడదే అని నిరాశ పడ్డవాళ్లూ ఉన్నారు.
*తప్పు చేసినవాడు అడ్డంగా దొరికిపోయాడు అంటారు. దొరికినవాడెవడైనా అడ్డంగా దొరుకుతాడా? నిలువుగా దొరుకుతాడు తప్ప.
*అన్నట్టు గిట్టనివాణ్ని అడ్డమైనవాడు అని తిడతారు. అదేంటి? దాని భావ మేంటి? పండితార్థం ఏమైనా పిండితార్థం ఒకటుంది.
*పశువా అని తిట్టినట్టు. మనుషులు నిలువుగా ఉంటారు. పశువులు అడ్డంగా ఉంటాయి. అదీ సంగతి!
*ఎవడి మీదైనా కోపం వస్తే ఏ మొహం పెట్టుకుని వచ్చావంటాడు తెలుగువాడు. ఎవడికైనా ఒకటే ముఖం ఉంటుంది కానీ బ్రహ్మలాగా నాలుగు ముఖాలు, రావణబ్రహ్మలాగా పది ముఖాలు ఉండవు కదా!
*ఫలానావాడు తలలు మార్చేరకం అనేది కూడా తెలుగువాడి వాడుక. ఇదెలా సాధ్యం? వినాయక వృత్తాంతంలోలాగా తలలు మార్చేశక్తి సామాన్య మానవులకు ఉంటుందా ?
*తెలుగువాడు బండ చాకిరీ చేస్తానంటాడు. బండ దాని మొహం! ఎక్కడ పడేస్తే అక్కడే ఉంటుంది కానీ అది చేసే చాకిరీ ఏముంటుంది?
*ఏముంది ఎడమ చేత్తో చేస్తానంటాడు. ఎడమ చేత్తో చేసే పనులేంటో అందరికీ తెలుసు. దానితో అన్ని పనులూ అతివేగంగా చేస్తానంటే ఎలా కుదురుతుంది?
*అన్నం ఉడకలేదా అంటాడు. ఇదేంటి? ఉడికితే కానీ అన్నం కాదు కదా!
*జోకులు పేల్లేదు అంటాడు. జోకు ఏమైనా బాంబా? పేలడానికి!
*వీపు విమానం మోత మోగుతుందని అంటాడు. విమానం మోత మోగితే ఆ వీపు అసలు ఉంటుందా? మనిషి అసలు ఉంటాడా?
*లేస్తే మనిషిని కానంటాడొకడు. మరి లేచినవాళ్లందరూ ఏంటి? అలాంటప్పుడు కూర్చుని ఉంటేనే మేలు కదా!
*శక్తిని కూడా భక్తికి ముడి పెట్టడం తెలుగువాడికి రివాజు.
*ఉన్న పూజలు చాలక బడితెపూజ ఒకటి.
*జంతువుల్లో కూడా దేవుళ్లను చూసుకుని భారతీయులు ఆరాధిస్తారు. ఇందుకు తెలుగువాడు కూడా మినహాయింపు కాదు. ఎటొచ్చీ మనుషుల్లో జంతువుల్ని చూడటం అతగాడి ప్రత్యేకత.
*గిట్టనివాళ్లను పంది, కుక్క, గాడిద అని తిట్టే తెలుగువాడు, ఇష్టమైనవాణ్ని పులి, సింహం, గుర్రం అని అభిమానంగా చూస్తాడు. పిలుస్తాడు.
*ఏదైనా కళ్లారా చూస్తే తప్ప నమ్మకూడదు. తెలుగు భాష ఇందుకు ఇంపు అయిన మినహాయింపు.
*గుండె జారిపోయింది అంటారు. ఇప్పటివరకు ఎవరికైనా జారిపోయిందా? లేదే!
*నీ నోరు పడిపోను అని తిట్టిపోస్తారు. ఎవరి నోరు అయినా ఎప్పుడైనా పడిపోవడం చూశామా?
*పాడమని అడిగితే గాయకులు గొంతుపోయింది అంటారు. గొంతు ఎక్కడికి పోతుంది? పోతే ఎవరు తీసుకురాగలరు?
*నోరు పారేసుకోవడం అంటారు. అది ఎలా సాధ్యం?
*మా ఆయనకు నోట్లో నాలుకలేదని ఓ ఇల్లాలు వాపోతుంటుంది. నోట్లో నాలుక లేకుండా మనిషి ఎలా ఉంటాడు?
*‘వాసన చూడు’ అంటారు. వాసనను పీలుస్తారు కానీ ఎలా చూస్తాం?
*రుచి చూడటం కూడా అంతే. ఎవరు చూడగలరు?
*పత్రికలు చదివి చదివి వాటిలోని పడికట్టు మాటలను కంఠస్థం చేసేశాడు తెలుగువాడు.
*ఫలానావాడు బాధకు గురయ్యాడు అంటాడు. మధ్యలో గురి ఎందుకు? బాధపడ్డాడు అనొచ్చుగా.
*దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడంటారు. దిగ్భ్రాంతి చెందాడు అనడు. దిగ్భ్రాంతిని ఎలా వ్యక్తం చేస్తాడంటే చెప్పడు.
*తప్పు చేస్తే పాపం అంటాడు సరే. ఎదుటివాడు కష్టాల్లో ఉంటే అయ్యో ‘పాపం’! అంటాడు. తెలుగు భాష ఏమన్నా పుణ్యానికి వచ్చిందా ఏంటి?
*దేశ భాషలందు తెలుగు లెస్స* అని శ్రీకృష్ణ దేవరాయలు చెప్పాడని గొప్పగా చెబుతాం. ఇంగ్లీషు మాటలు తెలుగులో కలవని రోజుల్లో అన్న మాటలివి. తెలుగంతా ఇంగ్లీషు మయం అయిన ఈ రోజుల్లో అయితే ‘ప్రపంచ భాషలందు తెలుగు లెస్స’ అనక తప్పదు.
*తమిళుడు తన భాషలో మాట్లాడుతుంటే తమిళుడికి తప్ప ఇంకొకరికి అర్థం కాదు.
*బెంగాలీ తన భాషలో మాట్లాడుతుంటే బెంగాలీకి తప్ప ఇంకొకరికి అర్థం కాదు.
~తెలుగు తప్ప భారతీయ భాషలన్నీ అంతే.
మరి తెలుగువాడో.. తెలుగు అని చెప్పి మాట్లాడుతుంటే అన్ని భాషలవాళ్లకూ ఎంతో కొంత అర్థమవుతుంది. ఇందుకు ఇంగ్లీషు, ఉర్దు, తమిళం, కన్నడం, హిందీ లాంటి సమస్త భాషలూ ఇందులో ‘గూడు’ కట్టుకునో ‘భవనం’ కట్టుకునో ఉంటాయి.
*ఇంగ్లీషు మాత్రం ఇంతకన్నా పొడిచిందేముంది? ఇది తెలుగువాడి వ్యూహం. అందువల్ల తెలుగు మనుగడకు ఎట్టి పరిస్థితిలో ఢోకా రాదు.
*తెలుగు భాషా జిందాబాద్!*
Share this Article