.
. విశీ (వి.సాయివంశీ) …. (భారతీయ సాహితీ దిగ్గజం, మలయాళ రచయిత, సినీదర్శకుడు, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత ఎం.టి.వాసుదేవనాయర్ 91 ఏళ్ల వయసులో మరణించారు. 70 ఏళ్లుగా సాహితీవ్యాసంగంలో ఉన్న రచయిత ఆయన. వాసుదేవనాయర్ పలు మలయాళ ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయాలు ఇవి..)
* నేను పుట్టింది భరతప్పులా నదీ తీరంలోని ఓ గ్రామంలో. అక్కడున్నవారెవరికీ సాహిత్యంతో సంబంధం లేదు. ఇవాళ్టి దినపత్రిక మూడు రోజుల తర్వాత ఆ ఊరికి పోస్టులో చేరేది. ఇక పుస్తకాలైతే పక్షానికోసారి వచ్చేవి. త్రిసూర్‌లో చదువుకునే మా పెద్దన్నయ్య నాకోసం పుస్తకాలు తెస్తూ ఉండేవాడు. వాటినే మా ఇంట్లోవాళ్లు పంచుకుని చదువుకునేవాళ్లం. అంతకుమించి సాహిత్యంతో మాకెవరికీ పరిచయం లేదు.
Ads
* ప్రముఖ రచయిత అక్కితం అచుతన్ నంబూద్రి మా ఇంటికి దగ్గర్లో ఉండేవారు. ఆ ఇంట్లో చాలా పుస్తకాలు ఉండేవి. సెలవు రోజుల్లో ఆయన ఇంటికి వెళ్లి, నాకు నచ్చిన పుస్తకాలు తీసుకుని చదివేవాణ్ని. ఆ రోజుల్లో పిల్లలు ఏదైనా రాస్తే టీచర్లకు చూపించేవాళ్లు. వాళ్లు మెచ్చుకుంటే మరిన్ని రాసేందుకు ఉత్సాహం చూపించేవారు. కానీ నా రాతల్ని నేనెవరికీ చూపించలేదు.
* సాహిత్యంలో నాకు గురువులు లేరు. గొప్ప రచనలే నా గురువులు. నేను రాసినవి నాకే నచ్చకపోతే ఏమాత్రం సందేహించకుండా వాటిని చింపేసేవాణ్ని. ఆ తర్వాత మళ్లీ కొత్తగా మొదలుపెట్టేవాణ్ని. మొదట్లో ఎక్కువగా కవిత్వం రాసేవాణ్ని. అయితే నేను చదివిన కవితల స్థాయిలో నా కవిత్వం లేదని తెలుసుకుని కవిత్వం రాయడం మానేశాను. కవిత్వం హృదయంలోంచి రావాలని నాకు అర్థమైంది.
* నాకు స్నేహితులెవరూ ఉండేవారు కాదు. పుస్తకాలు చదువుతూ, కొండలు, గుట్టల మార్గాల్లో తిరుగుతూ మనసులో రకరకాల వాక్యాలు రాసుకునేవాణ్ని. నేను రాసిన రచనలు పత్రికలకు పంపాలంటే కనీసం వాటి అడ్రస్‌లు కూడా నాకు తెలియదు. అసలు పత్రికల్లో నా రచనలు వేస్తారనే ఆలోచన కూడా లేని అతి మామూలు పల్లెటూరి అబ్బాయిని నేను.
* అప్పట్లో మద్రాసు నుంచి ‘చిత్రకేరళం’ అనే పత్రిక వచ్చేది. అందులో లబ్ధప్రతిష్టులైన మలయాళ రచయితలు రచనలు వచ్చేవి. నేను మూడు రచనలు ఆ పత్రికకు పంపాను. అన్నీ ఒకే పేరుతో ఉంటే వేయరని, ఒకదాని మీద ‘వి.న్.తెక్కెపాట్టు’ అని కలం పేరు పెట్టాను. ‘తెక్కెపాట్టు’ అనేది మా ఇంటి పేరు. మరోదానికి ‘కూడల్లుర్ వాసుదేవ మీనన్’ అని పెట్టాను. కూడల్లుర్ మా ఊరి పేరు. మరో రచనకు ‘ఎం.టి.వాసుదేవ నాయర్’ అని నా పేరు పెట్టాను. రెండు నెలల తర్వాత ఆ మూడు రచనలూ పత్రికలో అచ్చయ్యాయి.
* మొదట్లో కవితలు, ఆ తర్వాత కొన్ని అనువాదాలు, వ్యాసాలు రాసి పత్రికలు పంపాను. అయితే కథలు రాయడం మొదలుపెట్టాకే నా మీద నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ సమయానికి నేను కాలేజీలో చేరాను. ‘కౌముది’ అనే పత్రికకు నా కథ పంపినప్పుడు దాని ఎడిటర్ కె.బాలకృష్ణన్ నాకు ఇంగ్లీషులో ఉత్తరం రాసి, ‘మీ కథ బాగుంది. త్వరలో ప్రచురిస్తాం’ అన్నారు. ఆ తర్వాత కథ ప్రచురితమైంది. రూ.10 పారితోషికం పంపించారు.
* నేను పత్రికలకు కథలు పంపించడం మొదలుపెట్టాక నాకు పారితోషికాలు రావడం మొదలైంది. అప్పటిదాకా నేను కథలు రాస్తానన్న విషయం నా కాలేజీ స్నేహితులకు తెలియదు. ‘జయకేరళం’ అనే ప్రముఖ పత్రికలో నా కథలు ప్రచురితమయ్యాక ఆ విషయం వారికి తెలిసింది. దాంతో నన్ను కాలేజీ ఎలక్షన్స్‌లో నిలబెట్టారు. ఆ తర్వాత కాలేజీ విడిచిపెట్టే సమయంలో వారంతా కలిసి నా కథల్ని పుస్తకంగా వేశారు. అదే నా మొదటి పుస్తకం.
* మా ఊళ్లో వేలాయుదేట్టన్ అనే వ్యక్తి ఉండేవాడు. ఆయనకు మతిస్థిమితం సరిగా ఉండేది కాదు. ఆయన్ని ఓ ఇంట్లో గొలుసులతో కట్టేసి ఉంచేవారు. ఆయన్ని చూడాలంటే పిల్లలం చాలా భయపడేవాళ్లం. నేను కాస్త పెద్దయ్యాక అతనోరోజు మా ఇంటికొచ్చాడు. మా అమ్మని పిలిచి ‘కాస్త అన్నం కావాలి’ అన్నాడు. మా అమ్మ అతణ్ని వంటింట్లోకి తీసుకెళ్లి అన్నం పెట్టింది. వేలాయుదేట్టన్‌కి పిచ్చి తగ్గినా, ఊరి జనం ఆ విషయాన్ని అంగీకరించలేకపోయారు. ఆ ఘటన నా మనసులో చాలా ఏళ్లపాటు నిలిచిపోయింది.
* కాలం మారుతున్న కొద్దీ మన జీవన విధానం మారిపోతుంది. మన జీవితాన్ని చూసే దృష్టికోణం మారుతుంది. అది మన సాహిత్యంలో కూడా ప్రతిబింబిస్తుంది. నవల విస్తృతి పెద్దది కాబట్టి పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది. అది రాసిన తర్వాత కొంతకాలానికి తెలుస్తుంది. కానీ కథ అలా కాదు, రాస్తే నిర్దుష్టంగా ఉండాలి.
* కొందరు రచయితలు ఒకచోట కూర్చుని ఒకే సిట్టింగ్‌లో కథ రాయగలుగుతారు. నేను మాత్రం ఒక ఆలోచనను కొన్ని రోజులపాటు నాలో ఉంచుకుంటాను. కథకు సంబంధించి బేసిక్ ఐడియా ఆలోచిస్తాను. కథ మొదలు, మధ్య, చివర.. పూర్తిగా నా మెదడులోకి వచ్చాకే కథ మొదలుపెడతాను.
* మహాభారతాన్ని మరోసారి చదవడం మొదలుపెట్టినప్పుడు అందులో పూర్తిగా నిజం లేదని అనిపించింది. భీముడి పాత్ర నాకు చాలా నచ్చింది. ఆయన అమిత శక్తిమంతుడు. అది ఆయనకు వరం, శాపం కూడా. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే పాత్ర అది. అందుకే భీముడి దృష్టికోణం నుంచి మహాభారతాన్ని చెప్తూ ‘రెండామూళం’ (రెండో మలుపు) రాశాను.
* నా రచనల్లో స్త్రీ పాత్రలు చాలా బలంగా ఉంటాయంటారు. అందుకు కారణం మా అమ్మ. ఆమె ప్రభావం నా మీద చాలా ఉంది. మా ఇంట్లో ఉన్న కొద్దిపాటి తిండిని కూడా చుట్టుపక్కలవారితో కలిసి పంచుకోవాలనుకునే తత్వం ఆమెది. మేము నలుగురం అన్నదమ్ముళ్లం ఆస్తిని పంచుకోవాలని అనుకున్నప్పుడు మా అమ్మ మధ్యలోకి వచ్చి, ‘ఆస్తిలో నా కూతురికి కూడా భాగం ఉంది. మగపిల్లలు ఎలాగైనా బతికేస్తారు, ఆడపిల్ల గతేంటి? తనకు చేయూత కావాలి. తనకూ భాగం ఇవ్వండి’ అంది. అది ఆమె దృఢమైన స్వభావం. అయితే నా రచనలేవీ ఆమె చదవలేదు.
* రచనలు వేరు, సినిమాలు వేరు. నేను చాలా సినిమాలకు స్క్రిప్టులు రాశాను. నా రచనలు సినిమాలుగా మారాయి. అయితే సినిమా విషయంలో కొన్ని సర్దుబాట్లు తప్పవు. దాంతోపాటు కొన్ని కొత్త విషయాలు కలిపేందుకు కూడా అక్కడ స్వేచ్ఛ ఉంటుంది. అయితే సాహిత్యాన్ని కొట్టే మరో సాధనం మాత్రం ఏదీ లేదు. అందుకే సినిమా రచన కన్నా నాకు సాహిత్యమే ఎక్కువ ఇష్టం.
***
(1948లో వాసుదేవ నాయర్ తొలి కథ ‘విషువాఘోషం’ రాశారు. కథ, కవిత్వం, నాటకం, నవల, వ్యాసం, బాలసాహిత్యం, ప్రసంగం, అనువాదం, యాత్రాసాహిత్యం.. ఇలా అన్ని సాహిత్య ప్రక్రియల్లో కలిపి సుమారు 100 దాకా పుస్తకాలు రాశారు. దాదాపు 40 మలయాళ సినిమాలకు స్క్రిప్టు అందించారు.
8 మలయాళ సినిమాలకు దర్శకత్వం వహించారు. 20కిపైగా కేరళ రాష్ట్ర ప్రభుత్వ సినిమా పురస్కారాలు అందుకున్నారు. ఏడుసార్లు జాతీయ సినీ పురస్కారాలు అందుకున్నారు. 1995లో జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నారు. తెలుగు రచయిత శ్రీరమణ రాసిన ‘మిథునం’ కథ ఆధారంగా 2000లో ‘ఒరు చిరు పుంజిరి’ అనే సినిమా తీశారు.
మలయాళ సినీరంగంలో క్లాసిక్స్ అని చెప్పుకునే ‘మురపెన్ను’, ‘నిర్మాల్యం’, ‘ఓప్పోల్’, ‘నఖక్షతంగల్’, ‘పంచాగ్ని’, ‘వైశాలి’, ‘ఒరు వడక్కన్ వీరగాథ’, ‘సుకృతం’, ‘తీర్థదానం’, ‘కేరళవర్మ పళస్సి రాజా’ తదితర సినిమాలకు వాసుదేవనాయరే రచయిత. ఆయన రాసిన కథలతో ఇటీవల జీ5 ‘మనోరథంగల్’ సిరీస్ తీయగా, మోహన్‌లాల్, మమ్ముట్టి, ఫహద్ ఫాజిల్ వంటి అగ్రనటులు నటించారు. కమల్‌హాసన్ ఈ సిరీస్‌కి నెరేటర్‌గా వ్యవహరించారు).
***
సేకరణ, మలయాళం నుంచి తెలుగు అనువాదం:
Share this Article