Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జాజి పూసే వేళ …
జాబిల్లి వేళ…

May 22, 2024 by Rishi

జాజి పూసే వేళ
జాబిల్లి వేళ– మహమ్మద్‌ ఖదీర్‌బాబు

వేటూరి పాటల్లో జాబిలి ఉంటుంది. ‘నవమి నాటి వెన్నెల నీవు దశమి నాటి జాబిలి నేను’ అని రాశాడు. ‘అటు చూడకు జాబిలి వైపు కరుగుతుంది చుక్కలుగా’ అనీ రాశాడు. ‘జాబిలి కన్నా నా చెలీ మిన్నా’ అన్నాడు. ‘జాబిలితో చెప్పనా’ పాట మా ఊరు.. మా వెంకటేశ్వర హాలు.

ఉదిత్‌ నారాయణ్‌ ఏదో రికార్డింగ్‌లో వేటూరి దగ్గరకొచ్చి ‘గురూజీ… ఏ బిల్లి బిల్లి క్యా హై… హర్‌ లైన్‌ మే హై’ అన్నాడట ఆ  పదం ఉన్న కాగితం పై వేలు పెట్టి. ‘బాబూ.. అది మ్యావ్‌ అనే బిల్లి కాదు… చల్లని వెన్నెల కురిపించే బిల్లి జాబిల్లి’ అని చెప్పాడట వేటూరి.

పండితులు తెలిసిపోతారు. వారి దగ్గర గంథం ఉంటుంది. సున్నమూ ఉంటుంది. నోరు పొక్కిన పాటలపై నోరు పారేసుకోవడం సులువు. ‘శుభ సంకల్పం’లో–

‘గుడి లేని దేవత నడిచి పోతా వుంటే
అడుగడుగున దండాలు పాదాలకి
పసిడి పాదాలకి పసుపు వేదాలకి’

అని రాశాడు. ఇక్కడా కవిని వెతకొచ్చు. పద భక్తినీ స్త్రీపాద భక్తినీ చూడొచ్చు.

ఆత్రేయకు తిరుగు లేదు. అర్థం కాని అర్థం లేని ఆత్రేయ పాట లేదు. కాని వేటూరిది ‘కొండలే రగిలే వడగాలి నీ సిగలో పూవేనోయ్‌’ అని రాసిన మల్లాది (?) శైలి. ‘ఎందుకు రాధా ఈ సునసూయల’ పింగళి సంప్రదాయం. పిల్లలు అర్థాలు లేని పదాలను సృష్టించి ఆటలాడుకున్నట్టు వేటూరి ఒకోసారి పాటల్ని పదాలతో నింపుతాడు. పాట నడిచిపోతుంది. పాడుకోవడానికీ బాగుంటుంది. ‘మానసవీణ మధుగీతం’ అది.

రస హీనంగా జీవించడం వేటూరికి నచ్చదు. నది ఒడ్డున జన్మించాడు గనక పాకుడు పట్టడమూ పనికి రాకుండా పోవడమూ ఎరగడు. ఇసుక తిన్నెల మీద పడుకుని చుక్కలను చూసి మురిసే భోగం అతనికి తెలుసు. కనుకనే ‘రసమయం జగతి’ అన్నాడు. ‘ఈ ఉదయం రసోదయమై’ జీవించమన్నాడు. ‘కొమ్మలు తాకిన ఆమనికి కోకిలలు పుట్టే’ వింతను గనమన్నాడు.

‘ఆమె తాంబూలం వేస్తే నీ నోరు పండాల’ అని ఆశీర్వదిస్తుంది శ్రీరమణ ‘బంగారు మురుగు’లోని బామ్మ. ఆ మాత్రం ఉసిగొల్పడం, మురిసే సందర్భాలను గుర్తు చేయడమూ కథే. ‘కాటుకలంటుకున్న కౌగిలింతలెంత వింతలో’ ఎరగని, సమయమివ్వని, ఆస్వాదించని పరుగు పరుగుల నవ జంటలను గూర్చి విని వేటూరి భోరున విలపిస్తాడమో. ‘సగం రాతిరి ఆమె నక్షత్రవీణ’ అని రాశాడు. శుష్క గురకల జీవన నిష్ఫలానికి శోకిస్తాడో ఏమో.

అన్నీ ఉంటాయి. బాధ్యతలు, బరువులు, చేతనలు, చైతన్యాలు. ‘సుడిలోకి దూకాలిరా కడదాకా ఈదాలిరా’ అని ఆయనే రాశాడు. కాని వీటన్నింటి మధ్య లాలిత్యాల జడత్వం ఎందుకు? ‘సన్నజాజులు రువ్వు కనుసన్నజాజులు రువ్వు’.

వేటూరిని తెలుగు పరిశ్రమ వృధా చేసిందేమో. మన కమర్షియల్‌ సినిమాలలో హీరో హీరోయిన్లు తాము ఎన్ని విధాలుగా ప్రణయం చేసుకోగలరో చెప్పే పాటలు తప్ప ఎన్ని మంచి సందర్భాలు సృష్టించగలిగారు. ‘వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై’ అని రాసిన కవికి సవాలు విసిరిన సన్నివేశాలెన్ని. ‘తార తారకీ నడుమ ఆకాశం ఎందుకో’ అని రాస్తే ఒక నిమిషం ఆ కవి సమయంలో మునకలేస్తామే ఆ గంధాన్ని వాంఛించేవారుంటే కదా పాట పుడుతుంది. అలాగని చేతి ఖర్చులకీ పాత బాకీలకీ దొరికిన పాటల్లా రాయడం… ఏమనగలం.. కవి నిరంకుశుడు.

‘ఈ ఎడారి నిండా ఉదకమండలాలు’ అని రాశాడు వేటూరి. కాని ఆయన కెరీర్‌లో ఆయనకు కొన్నే దొరికాయి. వేటూరిని నిందించడానికి వంద పల్లవులు దొరుకుతాయి. శ్లాఘించడానికి వందన్నొకటి.

మెరపులా మెరిశావు వలపులా కలిశావు
కన్ను తెరిచి చూసేలోగా
నిన్నలలో నిలిచావు.. నిన్నలలో నిలిచావు

– మే 22 వేటూరి వర్థంతి…. By Khadeer Babu

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions