Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మన వ్యవస్థల డొల్లతనాన్ని బరిబాతల చూపించే ఓ వాస్తవ కథనం..!

May 28, 2026 by M S R

.

( ప్రియదర్శిని కృష్ణ ) ….  అందరూ 16 సార్లు పెరోల్ పొందిన డేరా బాబా గురించి రాస్తున్నారు… మన వ్యవస్థ నేరగాళ్లకు అనుకూలమా, పలుకుబడి ఉన్నోడికి చుట్టమేనా అనే విశ్లేషణలు, విమర్శలు బోలెడు… నేను మరో కథ చెబుతాను… వంద శాతం నిజం… దిగ్భ్రాంతికరమైన నిజం… మన చట్టాలు, మన న్యాయ వ్యవస్థల స్థితిని బరిబాతల నిలబెట్టే నిజం… కాస్త తాపీగా చదవండి… ఏ సినిమా కథకూ తీసిపోదు… కానీ ఇది కథ కాదు, చేదు నిజం…

ఈ  కథనం అత్యంత ఆసక్తికరంగా, సమాజంలోని అధికార బలాన్ని, ఒక చీకటి నిజాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది… మొదట కథనం అందరికీ తెలిసిందే… తరువాత ఎవరికీ తెలియని కథనం చివరలో చెప్పుకుందాం…

Ads



నిశ్శబ్ద రాత్రి… రక్తాక్షరాల సాక్షిగా!

ఆకాశంలో నక్షత్రాలు ఎప్పటిలాగే మెరుస్తున్నాయి… కానీ ఢిల్లీలోని ఆ ‘హైఫై’ బార్‌లో మాత్రం గాలిలో ఏదో తెలియని ఉత్కంఠ… ఏదో నెగెటివ్ వైబ్… సమయం అర్ధరాత్రి దాటింది…

“సారీ సర్, టైమ్ అయిపోయింది. ఇక డ్రింక్స్ సర్వ్ చేయడం కుదరదు,” చాలా వినయంగా, అంతే నిశ్చయంగా చెప్పింది ఆ పాతికేళ్ల యువతి. ఆమె పేరు జెస్సికా లాల్. మోడలింగ్ రంగంలో మెరుస్తూ, తన కాళ్ల మీద తాను నిలబడాలనే ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయి. ఆమె అక్కడ సర్వ్ చేస్తోంది.

  • కానీ, అక్కడ నిలబడిన నలుగురు యువకులకు ఆమె మాట వినబడలేదు. ఎందుకంటే వారి తలకెక్కింది కేవలం మద్యం మత్తు మాత్రమే కాదు… అధికార గర్వం, తాత ముత్తాతల సంపద ఇచ్చిన అహంకారం!

“నాతోనే కాదు, లేదు అంటావా?!” అని గర్జించాడు ఒకడు. అతడే మను శర్మ. హర్యానా రాజకీయాలను శాసించే బడా నేత కొడుకు. చుట్టూ ఉన్న ప్రపంచం తన జేబులో ఉందనే భ్రమలో బతికే జులాయి. తెగబలిసిన తండ్రుల కొడుకులందరూ అంతే కదా…

  • గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిగాయి. భయంతో బార్‌లోని జనం వణికిపోయారు. కానీ జెస్సికా లొంగలేదు. ఆ ఇగో తట్టుకోలేని మను శర్మ, పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో ఆమె నుదుటిపై తుపాకీ గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కేశాడు. ఒక్క క్షణం… అంతా నిశ్శబ్దం! జెస్సికా కుప్పకూలిపోయింది. ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది.

ఆగంతకులు చీకట్లోకి పారిపోయారు.

మనుశర్మ

న్యాయమా? ధనమా? — సుదీర్ఘ పోరాటం
తర్వాత కథ అందరికీ తెలిసిందే. పోలీసులు, కోర్టులు, సాక్షుల నోళ్లు నొక్కేయడం… అంతా నడిచింది. ఫలితం? 2006లో దిల్లీ కోర్టు దోషులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది.

  • సమాజం నివ్వెరపోయింది. కానీ జెస్సికా సోదరి సబ్రీనా లాల్ ఓడిపోలేదు. వృద్ధుడైన తండ్రిని చూసుకుంటూ, కన్నీళ్లను ఆయుధంగా మార్చుకుని మీడియా సాయంతో దేశవ్యాప్త ఉద్యమం లేపింది. “డబ్బు ఉన్నవాడికి చట్టాలు చుట్టాలా?” అన్న ప్రజల ఆగ్రహం ముందు చివరకు న్యాయవ్యవస్థ తలవంచక తప్పలేదు. Who killed jessika ప్రశ్న దేశమంతా మారుమోగింది.

300 రోజుల తీవ్ర పోరాటం తర్వాత, దిల్లీ హైకోర్టు మను శర్మను దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. 2010లో సుప్రీంకోర్టు కూడా ఆ శిక్షను ఖరారు చేసింది.

కానీ, తెరవెనుక కథ ఇక్కడే మలుపు తిరిగింది.

పునర్జన్మ… ఒక కొత్త ముసుగు!
14 ఏళ్ల జైలు జీవితం తర్వాత, 2020లో ‘మంచి ప్రవర్తన’ అనే సర్టిఫికెట్‌తో మను శర్మ తీహార్ జైలు నుండి బయటకు వచ్చాడు.

గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడిగా మారి సన్యాసి అయ్యాడేమో కానీ, ఇక్కడ మను శర్మ మాత్రం ‘సిద్ధార్థ శర్మ’గా మారి సరికొత్త వ్యాపార వేత్తగా అవతారమెత్తాడు. తన తాత కేదార్నాథ్ శర్మ 1967 లో స్థాపించి, కాలక్రమేణా ఒడుదుడుకులకు లోనైన ‘Piccadilly Distilleries’ వ్యాపారాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు.

చిత్రం చూడండి…

మనుశర్మ

  • ఏ మద్యం అయితే ఒకరోజు రాత్రి ఒక అమాయక మహిళ ప్రాణం తీయడానికి కారణమైందో… అదే మద్యం సామ్రాజ్యానికి అతడు అధిపతి అయ్యాడు!

అతని నాయకత్వంలో ఆ సంస్థ నుండి వచ్చిన ‘Indri’ (ఇంద్రి) అనే సింగిల్ మాల్ట్ విస్కీ 2023లో ప్రపంచ స్పిరిట్స్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. ఫోర్బ్స్ (Forbes) వంటి ప్రతిష్టాత్మక పత్రికలు “ఎవరీ సిద్ధార్థ శర్మ? ఇంత తక్కువ కాలంలో ఈ బ్రాండ్‌ను ఇంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లాడు?” అంటూ కీర్తిస్తూ కథనాలు రాశాయి.

నిగూఢ సత్యం… ‘డబ్బు’ టు ది పవర్ ఆఫ్ ‘డబ్బు’
ఆ స్కాట్లాండ్ డిస్టిలరీస్ సంస్థలు, అంతర్జాతీయ మీడియా ఈ ‘సిద్ధార్థ శర్మ’ అసలు మూలాలను తవ్వడం మొదలుపెట్టే వరకు ప్రపంచానికి తెలియదు— ఈ సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ మరెవరో కాదు, ఒకప్పుడు దేశాన్ని ఊపేసిన జెస్సికా లాల్ హంతకుడు మను శర్మ అని!

  • ఈ ఎదుగుదల వెనుక కేవలం వ్యాపార దక్షత మాత్రమే లేదు, ఒక శక్తివంతమైన కుటుంబ నేపథ్యం ఉంది:తండ్రి వినోద్ శర్మ: హర్యానా మాజీ కాంగ్రెస్ నేత, ప్రస్తుత బీజేపీ మద్దతుదారుడు.తల్లి శక్తిరాణి శర్మ: రాజకీయాల్లో క్రియాశీలక నేత.

    తమ్ముడు కార్తికేయ శర్మ: రాజ్యసభ ఎంపీ. అంతేకాదు NewsX, Sunday Guardian వంటి పెద్ద పెద్ద మీడియా సంస్థల అధిపతి.

    బాబాయ్: మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు అల్లుడు.

    ఇలా చట్టాన్ని, మీడియాను, వ్యాపారాన్ని శాసించగల ఒక మహా సామ్రాజ్యం అతడి వెనుక నిలబడింది.

ముగింపు… కాలం ఎంత విచిత్రమైనది?

అనాడు మద్యం ఇవ్వలేదన్న కోపంతో ఒక యువతి నుదిటిపై రక్తం చిందించిన చేతులే… నేడు ప్రపంచంలోనే అత్యుత్తమ మద్యం బ్రాండ్‌ను తయారుచేస్తూ కోట్లు గడిస్తున్నాయి. జెస్సికా లాల్ సమాధి కింద నిశ్శబ్దంగా నిద్రిస్తుంటే, ఆమెను చంపిన వ్యక్తి మాత్రం ‘సిద్ధార్థ శర్మ’ అనే కొత్త ముసుగులో సక్సెస్ ఫుల్ ఐకాన్‌గా చలామణి అవుతున్నాడు.

  • ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు… అధికారం, డబ్బు చేతిలో ఉంటే, గతాన్ని ఎంత సులభంగా తుడిచేసి, సరికొత్త భవిష్యత్తును కొనుక్కోవచ్చో నిరూపించే ఒక నగ్న సత్యం!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మన వ్యవస్థల డొల్లతనాన్ని బరిబాతల చూపించే ఓ వాస్తవ కథనం..!
  • అన్నీ అనుకున్నట్టు జరిగితే… నిజమైన ‘మహిళా సాధికారత’… రేవంత్‌కు బలం…
  • చోటా భీమ్ ఒంటి చేత్తో ‘హైదరాబాద్‌’ను ఎలిమినేట్ చేశాడు…
  • తుపాకీ పడితే ‘రికార్డే’… భేష్, హైదరాబాదీ సంచలనం ఈషా సింగ్..!
  • అసలు వంశీ సినిమాలో మోహన్‌బాబు ఎలా ఫిట్టయ్యాడనేదే ప్రశ్న..!
  • True Pilot … ఆకాశం నుంచి కూలిపోతున్నప్పుడు కూడా… అదే నిబ్బరం…
  • బహుముఖ ప్రజ్ఞ… తేజస్వినీ మనోజ్ఞ…! వావ్, మన తెలుగు తేజం..!!
  • ఆక్సిజన్ తరిగి… శ్వాస కష్టమై… వెనక్కి దిగలేక… మంచుకు బలి…
  • అద్భుతం మొదట గుర్తించబడదు..! తర్వాత ఎవరూ గుర్తించనక్కర్లేదు…!
  • ఇది సరసజ్ఞుల కోసం మాత్రమే… రసహీనులు దూరముండగలరు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions