కొత్తగా ఓ ఆర్మీ క్యాంప్ కమాండర్ నియమితుడయ్యాడు… తన పరిధిలోని అన్ని విభాగాలు, ప్రాంతాలు తనిఖీ చేస్తున్నాడు… ఓ బెంచీ దగ్గర ఇద్దరు సైనికులు తుపాకులు పట్టుకుని కాపలా ఉన్న దృశ్యం గమనించాడు… దీనికి భద్రత దేనికి అని అడిగాడు… ‘‘సర్, మాకు తెలియదు, మాజీ కమాండర్ కాపలా ఉండమన్నాడు, ఉంటున్నాం, ఇది ఓ సంప్రదాయం అట…’’ అని బదులిచ్చారు వాళ్లు…
.
ఈ కమాండర్‌కు ఆశ్చర్యమేసింది… పాత కమాండర్ ఫోన్ నంబర్ కనుక్కుని కాల్ చేశాడు… ఫలానా బెంచికి సైనిక రక్షణ దేనికి అనడిగాడు… ‘‘నాకేం తెలుసు..? నాకన్నా ముందు కమాండర్ ఇలాగే సైనికులను అక్కడ కాపలా పెట్టేవాడు, ఆ సంప్రదాయాన్ని నేను కొనసాగించాను…’’ అన్నాడాయన… ఈ కొత్త కమాండర్ మరింత ఆశ్చర్యపోయాడు… దీని సంగతేమిటో తేల్చుకుందామని, మరో ముగ్గురు పాత కమాండర్లకు ఫోన్లు చేశాడు… అందరూ అదే మాట చెప్పారు…
.
చివరకు వందేళ్ల వయస్సున్న ఓ ముసలి రిటైర్డ్ జనరల్ దొరికాడు… ‘‘సర్, పిచ్చెక్కిపోతోంది… మీరు 60 ఏళ్ల క్రితం కమాండర్‌గా చేసిన క్యాంపుకి నేనిప్పుడు కొత్త కమాండర్‌ను… ఆ బెంచికి సైనిక రక్షణ దేనికి..? మీరైనా చెప్పండి సార్… మీ హయాంలోనే స్టార్ట్ చేశారట కదా…’’ అనడిగాడు… ‘‘వార్నీ… ఆ బెంచికి వేసిన పెయింట్ ఇన్నేళ్లయినా ఆరలేదా..?’’ అని హాశ్చర్యపోయాడు ఆ పాత కమాండర్…!!!
ఇది కల్పనాత్మక పోస్టు… కానీ ఒకసారి ఎవరైనా ఏదైనా నిర్ణయం తీసుకుంటే, కొన్నిసార్లు దాన్ని మార్చడానికి, సమీక్షించడానికి ఎవరూ ఇష్టపడరు… కొనసాగిస్తారు, అది కాస్తా సంప్రదాయం అవుతుంది… దాని వెనుక కారణాల అన్వేషణ కూడా లేకుండా అందరూ కొనసాగిస్తూ ఉంటారు… అదే ఆ పోస్టు సారాంశం…
Ads
మరొక కథ చెప్పుకుందాం… ఇదేమో రియల్… ఇదీ సైన్యానికి సంబంధించిందే… కాకపోతే ఇది 1898 నాటిది… అప్పట్లో పాకిస్థాన్, ఇండియా వేర్వేరు కావు… బ్రిటిషర్ల పాలనలో ఉన్నాం… ఎక్కడికక్కడ ఆర్మీ అధికారులదే పెత్తనం సాగేది… అది వాయవ్య పాకిస్థాన్… అక్కడ ఓ మర్రిచెట్టు ఉంది… దానికి బేడీలుంటయ్… 120 ఏళ్లుగా ఉన్నయ్… ఎందుకు..? ఆశ్చర్యంగా ఉందా..?
లండి కోటల్ అని ఓ పట్టణం టోర్ఖాన్ బోర్డర్‌లో ఉండేది… అక్కడ జేమ్స్ స్క్విడ్ అనే ఓ బ్రిటిష్ ఆఫీసర్ పెత్తనం నడిచేది… క్రూరత్వం పాలు ఎక్కువ… ఆఫీసర్స్ మెస్ కట్టడం కోసం ఓ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు… అక్కడే ఈ మర్రిచెట్టు ఉంది… ఓ రాత్రి సదరు ఆఫీసర్ ఫూటుగా తాగి అటుగా వెళ్తున్నాడు… ఈ చెట్టు తన మీదకు కోపంతో వంగుతున్నట్టు అనిపించిందట… వెంటనే దాన్ని అరెస్టు చేయాలని అక్కడి కాపలా సైనికులను ఆదేశించాడు…
అంతేకాదు, Iam under arrest అని దాని మెడలో ఓ బోర్డు కూడా వేలాడదీయించాడు, చెయిన్లతో కట్టేయించాడు పొద్దున్నే… ఒక్కొక్కరి బుర్రలు అలా పనిచేస్తాయి… ఆదేశించింది ఓ నియంత వంటి అధికారి, ఇక ఎవడు వ్యతిరేకిస్తాడు… తరువాత బ్రిటిషర్లు పోయారు, దేశం రెండు ముక్కలైంది… ఆ మర్రి చెట్టు అలాగే ఉంది బేడీలతో… లండి కోటల్ కంటోన్మెంట్‌లో ఇప్పటికీ ఉంది… తరువాత వచ్చిన పాకిస్థానీ అధికార్లు దాన్ని అలాగే ఉంచారు, బుర్రలేని ఆఫీసర్లకు గుర్తుగా…! ఆ తరువాత దాని కథ తెలియకుండా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, మిగతా అధికార్లు దాని బేడీలను కొనసాగిస్తూనే ఉన్నారు… సంప్రదాయం మరి…!!
చివరగా…. ఒక వూళ్ళో ఒక సనాతనుడు ఉండేవాడు. తరచూ హోమం చేసేవాడు. హోమగుండంలో పోయడానికి నేతిని గిన్నెలో పోస్తున్నప్పుడు అయన ఇంట్లో ఉన్న రెండు పిల్లులు బయటకు వచ్చి తెగ గోల చేసేవి. దీనితో హోమం అయ్యేంతవరకు పిల్లుల్ని గంప కింద ఉంచేవాడు.
కాలం గడిచింది . అయన వృద్ధాప్యంతో మరణించాడు. కొడుకులు హోమం చేయడం మానేశారు. కొంత కాలానికి వారికి హోమం చేయాలి అనిపించింది. ఏమేమి కావాలో అలోచించి.. లిస్ట్ తయారు చేశారు. “అరేయ్, డాడీ హోమం జరిగేంతవరకు పిల్లుల్ని గంప కింద ఉంచేవారు. మన ఇంట్లో పిల్లులు లేవు, గంప కూడా లేదు” అని బజారుకు వెళ్లి రెండు పిల్లులు, ఒక గంప కొనుక్కొని వచ్చి హోమం చేసేంత వరకు గంప కింద పిల్లుల్ని ఉంచారు… ఎందుకు చేస్తున్నామో తెలియకుండా గుడ్డిగా మనం పాటించేవాటినే తంతు అంటారు…
Share this Article