Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కథ బాగుండగానే సరిపోదు… దానికి సరిపడా సీన్లు పడాలి… పండాలి…

March 11, 2024 by M S R

The Art of Scene Creation..  రచయిత్రి కె.సుభాషిణి 2013లో సాక్షి ఫన్‌డే‌లో ‘లేడీస్ కంపార్ట్‌మెంట్’ అనే కథ రాశారు. What a wonderful Story! గొప్ప కథలు ఒక్కోసారి ఎక్కువమందికి తెలియకుండానే మరుగున పడతాయి. అటువంటి మేలిమి కథ అది. ఆడ కూలీలంతా మేస్త్రమ్మ(మేస్త్రీ భార్య)తో కలిసి రైల్లో ముంబయి వెళ్తూ ఉంటారు. వారితోపాటు పిల్లా జెల్లా, తట్టాబుట్టా! జనరల్ కంపార్టు‌మెంట్‌లో సీట్లు దొరక్క తలుపు దగ్గరే స్థలం చూసుకుని కూర్చుంటారంతా. కథ ఇలా మొదలవుతుంది..

“సమోసా… సమోసా.. వేడి వేడి సమోసా..”

“మా! సమోసమా.. కొనీమా…”

Ads

“వద్దే! తినగూడ్దు…”

“హు.. హు.. ఒక్క సమోసమా…”

“ఎప్పుడు జేసిండేటివో ఏమో. తింటే పొట్టలో అబ్బయితాది. డాటరమ్మ సూదేచ్చాది.”

“హు.. హు.. ఒగటేలేమా…”

“చెప్తే యినవేమే. చిత్రాన్నం చేసకచ్చినా కదా? అది పెడ్తా తిను. మాయమ్మవు కదూ”.

కొంత కథ నడిచాక..

“సమోసా… సమోసా.. వేడి వేడి సమోసా..” పిల్లలున్న చోటే తిరుగుతున్నాడు ఆ పిల్లవాడు. డబ్బాలో సగంపైనే ఉన్న సమోసాలను చల్లారిపోతే ఎవ్వరూ కొనరేమో అని దిగులు ముఖంలో కనిపిస్తోంది. ‘ఈ ఆడోళ్ల దగ్గర డబ్బులు మాత్రం ఉండవు. ఈడ ఐదారుకంటే ఎక్కువ అమ్ముడుపోవు. ఈ డబ్బా పట్టుకొని వీళ్లని దాటుకుని ఎట్ల పోవాలబ్బా’ అని అనుకున్నాడు.

‘పదిమందిమి ఉండాము. ఈ మేస్త్రమ్మ తలా ఒకటీ సమోసా కొనియ్యచ్చు కదా. సచ్చిపోతాంటాది. పైసాకు పీ తినే రకం’ అనుకుంది ఇందాకటి తల్లి.

Art of Scene Creation ఇది. రెండే రెండు సన్నివేశాల ద్వారా రచయిత్రి ఏమీ చెప్పకుండానే చాలా చెప్పేశారు. పని చేయడం తప్ప డబ్బులు దాచుకోవడం తెలీని అమాయకపు ఆడవాళ్లు, వాళ్లని శ్రమ దోపిడీకి గురిచేసే మేస్త్రీ, మేస్త్రమ్మలు, నోరూరించే సమోసాలు కావాలన్న పిల్లల్ని ఊరుకోబెట్టే తల్లులు, మళ్లీ అదే సమోసాల మీద జిహ్వచాపల్యం చూపే అమ్మలు, కొనలేని తమ అశక్తతను మేస్త్రమ్మ పిసినారితనం మీద తోసేసి తృప్తి పడే మనస్తత్వాలు, వీళ్లకు సమోసాలు అమ్మజూసే పిల్లాడు, చల్లారితే సరుకు అమ్ముడుపోదన్న వాడి ఇబ్బంది.. ఎన్ని అంశాలు! రెండు సన్నివేశాల్లో మొత్తం చెప్పేశారు. ఇంత సూక్ష్మంగా రాసేందుకు రచయితలు ఎంత సాధన చేయాలి! ఎంత జీవితం చూడాలి! ఎందర్ని పరిశీలించాలి! కథ ఉంటే సరిపోతుందా? తగ్గ సన్నివేశాలు పడాలంటే మథనం జరగక తప్పదు.

No photo description available.

రచయిత, దర్శకుడు జంధ్యాల గారు గుర్తొస్తున్నారు. Art of Scene Creationకి ఆయన సినిమాలు చక్కని ఉదాహరణలు. ఆయన తీసిన ‘లేడీస్ స్పెషల్'(1993) గుర్తుందా? చాలా మంచి సినిమా. నలుగురు ఆడవాళ్లు తమ ఉద్యోగాలు, సంసారాలు చక్కదిద్దేందుకు చేసే ప్రయత్నమే సినిమా కథ. వాణీ విశ్వనాథ్, సురేష్ హీరో, హీరోయిన్లుగా నటించారు.

వాణి విశ్వనాథ్ మధ్య తరగతి యువతి. తండ్రి లేడు. ఇంటికి తనే పెద్ద. తల్లిని, ఇద్దరు చెల్లెళ్లని, ఒక తమ్ముడిని పోషించాలి. ఒకరోజు తమ్ముడు సిగరెట్ తాగి ఇంటికి వస్తాడు. అది ఆమె పసిగడుతుంది. అతను కంగారు పడతాడు. అప్పుడు డైలాగులు చూడండి.

“భయపడకు గోపీ! నిన్ను కొట్టను. కొడితే నొప్పి తగ్గటంతోనే చెప్పిన మాట మరుపుకొచ్చేస్తుంది. ఇదిగో రా! ఈ డబ్బు తీస్కో! మరిన్ని సిగరెట్లు కాల్చుకో. ఈ నెల అమ్మకి మందులుండవు. ఫర్వాలేదు. ఆయాసపడతుంది. అంతే కదా? నాకు బస్ టికెట్‌కు డబ్బులుండవు. ఫర్వాలేదు నడిచి వెళ్లగలను. దేవికి గైడ్లు కొనలేను. ఫర్లేదు, పరీక్ష తప్పుతుంది. అంతేగా? నువ్వు మాత్రం నిశ్చింతగా సిగరెట్లు కాల్చుకో నాన్నా” అంటుంది. తమ్ముడు ఏడుస్తూ క్షమించమని అడుగుతాడు. అప్పుడు వాణీ విశ్వనాథ్ డైలాగు..

“గోపీ! మన తాతలూ, తండ్రులూ మనకు కేవలం ఇంటి పేరును మాత్రమే మిగిల్చార్రా! సెంటు భూమిని కూడా మిగల్చలేదు. విలాసాలకీ జల్సాలకీ అలవాటు పడే అదృష్టం మనకు లేదు గోపీ! ఈ ఇంట్లో సంపాదించే చేతులు రెండు, పొట్ట నింపుకునే నోళ్ళు ఐదు ఉన్నాయి. నువ్వు కాల్చే ఐదారు సిగరెట్ల ఖర్చుతో ఆకుకూర కొంటే ఒకపూట ఆదరువు వెళ్లిపోతుందిరా! అదీ.. అదీ మన పరిస్థితి. ఖర్చు చేయడం కాదు నాన్నా! సంపాదించడం నేర్చుకో! ఒక్క రూపాయి సంపాదించి నాకు చూపించు. అప్పుడు.. అప్పుడు నా తమ్ముడు ప్రయోజకుడయ్యాడని నేను ‌సంతోషిస్తాను”.

బాగా గమనిస్తే, ఈ సన్నివేశం లేకపోయినా కథకూ, సినిమాకూ ఏమీ నష్టం లేదు. కానీ ఒక మధ్యతరగతి ఇంట్లో పరిస్థితిని ఒక తెలివైన మహిళ ఎలా సరిదిద్దింది, తమ్ముడిని ఎలా దారిలో పెట్టింది అని తెలిపేందుకు ఈ సన్నివేశం చాలా అవసరం, అర్థవంతం. అది జంధ్యాల గారికి చాలా బాగా తెలుసు. అందుకు తగ్గట్లే డైలాగులు చక్కగా అమరాయి. ఇలాంటి సన్నివేశాలు పాత్రని, కథని నిలబెట్టి ఎక్కువకాలం గుర్తుంచుకునేలా చేస్తాయి. ‘లేడీస్ స్పెషల్’ సినిమా చూసిన వారికి ఈ సన్నివేశం తప్పకుండా గుర్తు ఉంటుంది. కారణం ఇందులోని నిజాయితీ, కథను, పాత్రను ముందుకు నడిపే బలం.

కథని బోలెడంత ఊహించుకొంటూ వెళ్లొచ్చు కానీ, పాఠకుడు/ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నివేశాలు రాయాలంటే మాత్రం చాలా మథనం అవసరం. చాలా వరకు అవి జీవితం నుంచే పుట్టాలి. అన్నీ మన అనుభవంలోనివే కానవసరం లేదు. మనం చూసినవే రాయమనీ కాదు. విని, తెలుసుకొని, మనుసులో నిలుపుకొని, దాచుకోవాలి. చెప్పలేం, ఏ జీవితానుభవం ఒక్కోసారి ఏ సన్నివేశాన్ని తయారు చేస్తుందో! – విశీ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions