(రమణ కొంటికర్ల…)……… నీలగిరి పర్వతశ్రేణుల్లో.. దట్టమైన అడవుల్లో.. ఓ పోస్ట్ మ్యాన్ 30 ఏళ్ల ప్రయాణం!
ఉద్యోగస్తులెందరో రిటైరవుతుంటారు.. వాళ్లకు తోచిన రీతిలో పదవీ విరమణ వేడుకలు చేసుకుంటారు.. ఆరోజుకైపోతుంది. కానీ, పదవీ విరమణ తర్వాత కూడా సమాజానికి గుర్తుండేవారు.. ఆయా సందర్భాల్లో యాజ్జేసుకునేవారు మాత్రం కొందరే. అలాంటి వారిలో తమిళనాడుకు చెందిన డి. శివన్ ఒకరు. ఎందుకంటే, ఉద్యోగ జీవితం ప్రారంభించి… 2020, మార్చ్ 7న పదవీ విరమణ వరకూ అలుపెరుగకుండా నడిచిన ఓ బహుదూరపు బాటసారి తను. ఆసక్తికరమైన ఆ పోస్ట్ మ్యాన్ జర్నీ గురించి ఓసారి తెలుసుకుందాం పదండి.
శివన్ ప్రాణాలు రక్షించే హీరో కాకపోవచ్చు. కానీ, సోషల్ మీడియా, మోబైల్ ఫోన్స్, వాట్సప్ సందేశాలు లేని కాలాన… మారుమూల అడవుల్లో ఉత్తరం కోసం నిరీక్షించే ఎందరో గిరిజనానికి దాన్ని దరికి చేర్చిన ఓ ఉద్యోగి.. కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, వ్యవస్థల మధ్య లేఖల రూపంలో ఉన్న సమాచారాన్ని క్రమం తప్పకుండా ఓ వారధై అందించిన ఓ పోస్ట్ మ్యాన్… కాదు కాదు సూపర్ హీరో. ఎందుకంటే అతడి ఉద్యోగ జీవితం మామూలు పట్టణాల్లో పనిచేసిన ఎందరో పోస్ట్ మెన్ కు భిన్నంగా సాగింది. ఆయన జాబ్ జర్నీ మొత్తం నీలగిరి కొండలకే అంకితమైంది. వన్యప్రాణుల దాడులకు వెరవలేదు.
Ads
లోతైన నదులు, వాగులూ దాటేవాడు. కొండలు, గుట్టలు ఎక్కందే ఉత్తరాలందించే తీరాలకు చేరలేడు. ఎప్పుడెలాంటి వాతావరణముంటుందో ఊహకు కూడా అందని ప్రాంతమది. అయినా, తన ప్రయాణాన్ని మాత్రం శివన్ ఆపలేదు. ఎందుకంటే, జస్ట్ సింపుల్… ఏ ఉత్తరంలో ఏముందో…? ఒకానొక కొడుకు తల్లిదండ్రులకు ఆప్యాయతతో దూరమైన ఎడబాటును తగ్గించేందుకు రాసిన అవ్యక్తీకరమైన బంధముండొచ్చు…
అర్జంటుగా చావుబతుకుల్లో ఉన్నవారిని చూసుకునేందుకో, ఆదుకునేందుకో రమ్మనే కబురుండొచ్చు.. లేక, ఓ పిల్లవాడు తన చదువుకు కావల్సిన డబ్బందకపోతే తన చదువు ఆగిపోతుందని పేరెంట్స్ కు రాసిన ఆవేదనే ఉండొచ్చు… అందుకోసం అటవీ జనం నిరీక్షణను గుర్తించిన శివన్ మానవీయకోణమే ఆయన్ను మైళ్ల దూరం నడిపించింది. ఏ పోస్ట్ మ్యాన్ కూడా పని చేయడానికి ససేమిరా అనే ప్రాంతాల్లో.. నిజాయితీగా పనిచేసిన ఓ ఉద్యోగిగా.. ప్రతీ ఉత్తరాన్నీ బట్వాడా చేయించింది.
1985లో తమిళనాడు నీలగిరి జిల్లా వెళ్లింగ్టన్ పట్టణంలో ఓ స్టాంప్ కలెక్టర్ గా ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ లో చేరారు శివన్. సరిగ్గా 3 దశాబ్దాల పాటు.. రోజుకు 15 కిలోమీటర్ల చొప్పున శివన్ ప్రయాణం కాలినడకన సాగేంది. రైల్వే ట్రాకులు దాటుకుంటూ.. ట్రెక్కింగ్ ఎక్స్పర్ట్స్ సైతం అబ్బురపడేలా కొండలనెక్కుతూ ఉదయం ప్రారంభమయ్యే ఉద్యోగం.. సాయంత్రానికెప్పుడో ఇంటికి చేరేది. అసలా అడవిలోకెళ్తే మళ్లీ వస్తామో, రామో అనేంత వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ అది. అలాంటిచోట క్రూరమృగాలనెదుర్కొంటూ.. వృత్తి జీవితానికి చేయాల్సిందానికన్నా ఎక్కువే న్యాయం చేశాడు కాబట్టే శివన్ ఓ మామూలు పోస్ట్ మ్యాన్ ఉద్యోగంలోనూ ప్రపంచం గుర్తించే సూపర్ హీరో అయ్యాడు.
శివన్ వెళ్లే దారిలో ఎలుగుబంట్లు, గౌర్స్, ఇతర అడవిదున్నలు ఎదురుపడుతూ బెదిరిస్తూ ఉండేవి. కొన్నిసార్లు దాడులను కూడా ఎదుర్కోవల్సి వచ్చింది. అలా కూనూర్ ప్రాంతమంతా దట్టమైన అడవిలో కొన్ని ప్రాంతాలకు ఓ నాల్గైదు కిలోమీటర్ల దూరం మాత్రమే బస్సులుంటే వాటిలో ప్రయాణించి.. మిగిలినదంతా కాలినడకనే తన జర్నీ కొనసాగించేవాడు.
శివన్ లైఫ్ స్టోరీకి ఇన్స్పైరైన అర్జున్ డేవిస్, ఆనంద్ రామకృష్ణన్, అర్జున్ కృష్ణన్ అనే ముగ్గురు కలిసి ఓ డాక్యుమెంటరీని కూడా రూపొందించారు. తమిళంలో తబల్కరన్ పేరుతో ఉన్న ఆ వీడియో చూస్తే.. శివన్ ఎందుకు హీరోనో దృశ్యరూపకంగా కనిపిస్తుంది. తబల్కరన్ అంటే పోస్ట్ మ్యాన్. అయితే, కేవలం ఉద్యోగ జీవితంపై చిత్తశుద్ధి ఉండటమో… ఉత్తరాల కోసం ఎదురుచూసే అటవీజనంపై మానవీయ కోణంలో స్పందించే ఆలోచనో ఉన్నంత మాత్రాన శివన్ లాంటి ఓ సామాన్యుడు అంత వైల్డ్ లైఫ్ జర్నీని కాలిబాటన చేయలేడు. అందుకు తగ్గ ధైర్యసాహసాలు, తెగింపు గుణమూ ఉండబట్టే ఆ అడవుల్లో శివన్ జర్నీ… ఆటుపోట్లెదుర్కొన్న ప్రేమ కబుర్లతో కూడిన ఓ గాఢమైన ప్రేమలేఖలా సాగిపోయింది.
అయితే, దురదృష్టకమైన విషయమేంటంటే… అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన కాలంలోనూ శివన్ ఉత్తరాలను బట్వాడా చేసేందుకు కాలినడకనే ప్రయాణించడం.. పోస్టల్ డిపార్ట్ మెంట్ పై.. అందులో ఉద్యోగుల జీవితాలపై కేంద్ర ప్రభుత్వ శీతకన్నుకు నిలువెత్తు రూపం. ఇంకా తపాలా సేవలు కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ శివన్ తరహాలో అందించాల్సిన దుస్థితిలోనే ఉండటంపైన కూడా.. శివనే స్వయంగా ఎన్నో సందర్భాల్లో ఒకింత బాధ పడ్డ పరిస్థితి.
బ్లూడార్ట్ కంపెనీ వంటివి చేరుకోని ప్రదేశాలకు కూడా శివన్ ఓ పోస్ట్ మ్యాన్ గా లేఖలు చేరవేసేవాడు. ఉదయం ఎనిమిదిన్నరకు నిత్యం తన ఉద్యోగ జీవన ప్రయాణాన్ని ప్రారంభించేవాడు. హిల్ గ్రోవ్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో కూనూర్ పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి.. ఉత్తరాలు, ఇతర పార్సెల్ సర్వీసులేమున్నాయో చూసుకుని.. తన జర్నీ స్టార్ట్ చేసేవాడు. అలా ఆరు కిలోమీటర్ల మేర అటవీ ప్రయాణం.. తేయాకు తోటల మీదుగా సాగేది. ఆపై నీలగిరి పర్వత శ్రేణుల్లో.. రైల్వే ట్రాకుల పైనుంచి మరో 40 నిమిషాలు నడిచేవాడు. వడుగన్ తొట్టం వంటి ప్రాంతాలకు చేరుకునే ముందు సుమారు 2 కిలోమీటర్ల మేర చీకటి సొరంగాల గుండా శివన్ కాలినడక ప్రయాణం సాగేది.
అడవి.. జంతువులది. మన జస్ట్ వచ్చిపోయేవాళ్లం. వాటి మానాన వాటిని వదిలిస్తే అవి మనల్ని ఏమీ చేయవని నేను నమ్ముతానంటాడు శివన్. ఓసారి ఓ ఏనుగుల గుంపు దాడికి గురయ్యాడు శివన్. ఓ తల్లి ఏనుగు శివన్ పై విరుచుకపడబోతే… దగ్గర్లో ఉన్న ఓ ట్రక్కు డ్రైవర్ గమనించి శివన్ ను కాపాడాడు. కానీ, రాను రాను ఆ అడవిలో జంతువులు కూడా శివన్ ను గుర్తించసాగాయి. అతడివల్ల తమకెలాంటి ప్రమాదం లేదనే భరోసా ఏర్పడ్డ తర్వాతే.. అంతటి అడవిలో శివన్ ప్రయాణం సులభమైంది. ఆ తర్వాతే ఒకింత నిర్భయంగా సాగింది.
తమిళనాడులోని దక్షిణ ప్రాంతంలో శివన్ అనే పోస్ట్ మ్యాన్ పేరు తెలియనివారుండరు. అంతెందుకు భారతదేశంలోనే అత్యుత్తమ పోస్ట్ మ్యాన్ ఎవ్వరంటే.. శివన్ అని చెప్పేలా అడివిన జయించిన కథానాయకుడు. శివన్ దృష్టిలో ఉత్తరమంటే.. కేవలం ఏదో నాల్గు ముక్కలు అక్షరాలు రాసిన కాగితపు లేఖ కాదు… ఎన్నో భావోద్వేగాల సమాహారం.. ఎన్నో అవసరాలను తీర్చగల్గే.. ఆప్యాయతలను వెదజల్లే సమాచారం. అందుకే లేఖకు అంతగా ప్రాధాన్యమిచ్చిన శివన్.. ఆ తర్వాత ఎందరికో స్ఫూర్తిగా నిల్చాడు. ఉద్యోగ జీవితమంటే ఎలా ఉండాలో తెలియజెప్పాడు. శివన్ అంత త్యాగం చేయకపోయినా.. ఎంచుకున్న రంగంలో ఉద్యోగాన్ని కొంతవరకైనా చిత్తశుద్ధితో చేస్తే.. ఆ వృత్తికి ఎంత న్యాయం చేయొచ్చో ఈ 70 ఏళ్ల శివన్ కథ చెబుతుంది.
Share this Article