.
Sai Vamshi (విశీ)…… ఇలాంటి సినిమాలు కదా తీయాలి.. ఇట్లా కదా మత సామరస్యం చాటాలి
(The Bonding of a Two Women of Two Religions)
… 2000, జనవరి 22. కేరళ రాష్ట్రంలోని అళప్పుళ జిల్లాలో ఉన్న అంబళాపుళ గ్రామంలో కాంగ్రెస్ వార్డ్ మెంబర్ 34 ఏళ్ల రజియా బీవీ. ఓ రాత్రి పూట ఇంటికొస్తున్న సమయంలో రైల్వే ట్రాక్‌పై ఎవరో కూర్చుని ఏడుస్తున్న శబ్దం వినిపించింది.
Ads
వెళ్లి చూస్తే, ఓ ముసలావిడ. వయసు 70పైనే! ఎవరూ, ఏంటి అని అడిగితే చెప్పడం లేదు. మరో పక్క రైలు వచ్చేస్తోంది. అలాగే వదిలేస్తే ఆమె చచ్చిపోయేలా ఉంది. బలవంతంగా ఆమెను పక్కకు లాగి, ప్రాణాలు కాపాడింది రజియా.
ఆమెను ఇంటికి తీసుకెళ్ళి, ఆమె వివరాలు కనుక్కుంది. ఆమె పేరు చెల్లమ్మ అంతర్జానం. నంబూద్రి వర్గానికి చెందిన బ్రాహ్మణ స్త్రీ. పెళ్లయిన ఐదేళ్లకే భర్త పోయాడు. పిల్లలు లేరు. అటు పుట్టింట్లో, ఇటు అత్తారింట్లో ఆమెకు చోటు లేకుండా పోయింది. దీంతో తెలిసిన ఇళ్లల్లో వంట పనులు చేస్తూ జీవించింది.
కాలం ఆమెను ఏడు పదుల వయసుకు చేర్చేసరికి ఒంట్లో శక్తి నశించింది. దీంతో అందరూ ఆమెను దూరం పెట్టేశారు. పని లేదు, జీవించే మార్గం లేదు. ఏం చేయాలో తెలియక చచ్చిపోవాలని రకరకాల ప్రయత్నాలు చేసింది. ఏదీ ఫలించక, చివరకు రైల్వే ట్రాక్‌పై కూర్చుని, రైలు కింద పడి చావాలని అనుకుంది. ఇదీ తన కథ.
ఆమెను తిరిగి తన కుటుంబంతో చేర్చాలని రజియా రకరకాల ప్రయత్నాలు చేసింది. కానీ ఏదీ ఫలితం ఇవ్వలేదు. ముసలి వయసులో ఉన్న ఆమెను చూసుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. దీంతో ఆమెను తన తల్లిగా భావించి, తన వద్దే ఉంచుకోవాలని అనుకుంది రజియా. భర్త అడ్డు చెప్పలేదు, పిల్లలు ఏమీ అనలేదు.
కానీ సమాజం ఒకటి ఉంది. అది ఊరికే ఉండదు. బంధుగణం ఉంది. అది మౌనం వహించదు. వారికీ వీరికీ తంపులు పెట్టి ఆనందించే అల్లరి మూక ఉంటుంది. ఇలాంటివి చూస్తూ అది చూస్తూ ఊరుకోదు. కానీ రజియా వాటి గురించి పట్టించుకోలేదు. తన తల్లి తనతోనే ఉండాలని తీర్మానించుకుంది. ఈ క్రమంలో ఆమెకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి.
ముస్లింల ఇళ్లల్లో బ్రాహ్మణ స్త్రీ ఉండటమా? పూజలు చేయడమా? ‘హరామ్’ అన్నారు ఆ మతపెద్దలు. బ్రాహ్మణ స్త్రీ వెళ్లి ముస్లింల ఇంటి భోజనం చేస్తూ, అక్కడే ఉండటమా అన్నారు ఈ మతపెద్దలు. అయినా రజియా వెరవలేదు. చెల్లెమ్మను తనే స్వయంగా గుళ్లకు తీసుకుని వెళ్లేది. తాను బయట నిలబడి, ఆమెను లోపలికి పంపేది.
ఇదంతా ఆమె రాజకీయం కోసం చేస్తుందని కొందరు విమర్శించారు. మెల్లగా మొదలైన గొడవలు క్రమంగా ముదిరాయి. చేసేది లేక, చెల్లమ్మను తీసుకెళ్లి ఓ ఆశ్రమంలో ఉంచింది రజియా. కానీ తనను చూడకుండా ఉండటం ఆమె వల్ల కాలేదు. కానీ తీసుకొచ్చి తన ఇంట్లో ఉంచుకునే అవకాశం లేదు. ఎలా? వచ్చిందో ఆలోచన.
2004లో తనకున్న స్థలంలో ప్రభుత్వ పథకం ద్వారా ఓ రెండు గదుల ఇల్లు కట్టింది రజియా. చెల్లమ్మను తీసుకొచ్చి అందులో ఉంచింది. ఇంక తననూ, తన తల్లిని ఎవరూ విడదీయలేరు అనుకుంది. అయితే ఆ ఇంటి నిర్మాణం నేపథ్యంలో ప్రతిపక్షాలు ఆమె మీద అవినీతి ఆరోపణలు చేశాయి.
అప్పుడే మొదటిసారి చెల్లమ్మ అంతర్జానం, రజియా బీవీ బయటికొచ్చి, మీడియా ముందు తమ కథ చెప్పి, ఆ ఆరోపణలను తిప్పికొట్టారు. మతసామరస్యానికి గొప్ప ప్రతీకగా నిలిచారు. ఆ తర్వాత 96 ఏళ్ల వయసులో చెల్లమ్మ మరణించింది. హిందూ సంప్రదాయాల ప్రకారమే ఆమెకు రజియా కర్మకాండలు చేసింది.
2012లో బాబు తిరువల్లా అనే మలయాళ దర్శకుడు వీరి జీవితం ఆధారంగా ‘తనిచల్లా న్యాన్’ (Thanichalla Njan) అనే సినిమా తీశారు. చెల్లమ్మగా ప్రముఖ నటి కె.పి.ఎ.సి.లలిత, రజియాగా కల్పన (‘ఊపిరి’ సినిమాలో నాగార్జున ఇంట్లో పనిమనిషి పాత్ర) నటించారు.
జాతీయ సమైక్యతా భావం కలిగిన ఉత్తమ చిత్రంగా ఈ సినిమా జాతీయ పురస్కారం అందుకుంది. రజియా పాత్ర పోషించినందుకు కల్పనకు ఉత్తమ సహాయ నటి పురస్కారం అందించారు. రెండు వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు స్త్రీలు ఒక బంధాన్ని ఏర్పరచుకుంటే, దానికి మతాలు ఏమాత్రం అడ్డు రావని నిరూపించేలా ఈ సినిమాను చాలా అందంగా తీశారు.
చెల్లమ్మ కోసం తన ఇంట్లో దేవుడి విగ్రహాలు ఉంచుతుంది రజియా. అది చూసి, ముస్లిం మతపెద్దలు ఆమెను తప్పుపడతారు. ‘నాది ఇస్లాం మతం. దాన్ని కచ్చితంగా పాటించడం నా ధర్మం. అందులో భాగంగా ఇతరుల మతాన్ని వారు సక్రమంగా ఆచరించే అవకాశం ఇవ్వడం నా బాధ్యత. అదే అసలైన ముస్లిం లక్షణం. ఇందులో ఏ తప్పూ లేదు. మా అమ్మ ఆ విగ్రహాలను పూజించి, తన దేవుణ్ని ప్రార్థిస్తుంది. నేను నమాజుతో నా దేవుణ్ని వేడుకుంటాను. అంతే!’ అంటుంది.
చాలా గొప్ప సన్నివేశం అది. గుడికి వెళ్లిన చెల్లమ్మ అక్కడ దేవుడికి రజియా పేరు మీద అర్చన చేయించడం మరో గొప్ప సన్నివేశం. సినిమా ముగింపును కూడా చాలా అర్థవంతంగా చూపించారు.
ప్రస్తుతం ఇలాంటి సినిమాల అవసరం చాలా ఉంది. మతాల మధ్య మంటలు ఇంకా ఇంకా పెరుగుతున్న కాలంలో, వాటిని ఆర్పే గంగాజలం లాంటి కథలు ఇంకా ఇంకా రావాలి. మరిందరు రజియాలు, చెల్లమ్మలు తయారవ్వాలి. మతసామరస్యానికి ప్రతీకలుగా నిలవాలి.
PS: ఇందులో రజియా పాత్ర పోషించిన కల్పన నటి ఊర్వశి చెల్లెలు. అనేక తమిళ, మళయాళ సినిమాల్లో నటించారు. జాతీయ అవార్డు అందుకున్న ఆమె తెలుగులో నాగార్జున ‘ఊపిరి’ సినిమాలో నటిస్తూ, 51 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లోనే కన్నుమూశారు. ఆ తర్వాత రెండేళ్ల క్రితం కె.పి.ఎ.సి.లలిత కూడా మరణించారు. ఇప్పుడు ఆ ఇద్దరూ ఈ లోకంలో లేరు.
సినిమా యూట్యూబ్‌లో Subtitlesతో ఉంది.
Link: https://youtu.be/AvbxM_ukDKE?si=Of8S-nZvxV8tde1w
Share this Article