Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

The Duet of Silence – ఓ నిశ్శబ్ద యుగళగీతం ‘కూలిపోయింది’

June 19, 2026 by M S R

.

నిశ్శబ్ద యుగళగానం…. మా ఇంటి ముందు రెండు చెట్లు…
వేరువేరుగా పుట్టినా,
వాటి కొమ్మలు మాత్రం
ఎన్నో ఏళ్ల పాత స్నేహితుల చేతుల్లా
ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉండేవి.

ఆకులు గుసగుసలుగా
గాలికి మాత్రమే అర్థమయ్యే
రహస్యాలెన్నో చెప్పుకునేవి.

Ads

వానలు కురిసినప్పుడు
బాదం చెట్టు తన విశాలమైన ఆకులను చాపి
మామిడి చెట్టును కప్పేసేది.
తల్లి తన బిడ్డను ఒడిలో దాచుకున్నట్టుగా.

తుఫాను రాత్రుల్లో మాత్రం
మామిడి చెట్టు పిచ్చిగా ఊగిపోతుంటే,
బాదం చెట్టు మెల్లగా అదుపు చేసేది.
మిత్రుడి ఉన్మాదానికి
హద్దులు నేర్పే మిత్రుడిలా.

వాన చినుకులు మామిడిని ముద్దాడితే,
సూర్యకిరణాలు బాదాన్ని వరించేవి.
అయినా అవి రెండూ కలిసి
ఒకే రాగాన్ని ఆలపించేవి.

ఆ రాగం ఎంత మధురమంటే,
ప్రకృతే కాసేపు ఊపిరి బిగపట్టి
వినిపించుకునేదేమో అనిపించేది.

ఎండాకాలం మండిపడితే
బాదం చెట్టు గొడుగులా నిలిచేది.
మామిడి కొమ్మపై కోయిల కూస్తే,
ఆ పాటలో తానే మునిగిపోయినట్టు
బాదం చెట్టు కూడా వాలిపోయేది.

ఎన్ని ఋతువులు మారాయో…
ఎన్ని సంవత్సరాలు గడిచాయో…
ఆ రెండు చెట్లు తమ యుగళగానాన్ని
ఆపలేదు.

ప్రతి ఉదయం,
నా జీవిత భాగస్వామి ముఖం చూసే ముందు
నా చూపు ఆ చెట్ల వైపే వెళ్లేది.

అర్థరాత్రి లేచి
అనారోగ్యంతో ఉన్న భార్య నుదిటిపై
చేయి వేసి చూసుకునే భర్తలా,
అవి క్షేమంగా ఉన్నాయో లేదో చూసేవరకు
నాకు నిద్ర పట్టేది కాదు.

పెద్ద కొడుకు తెచ్చింది బాదం మొక్క.
చిన్న కొడుకు నాటింది మామిడి మొక్క.

కొడుకులు పెద్దవాళ్లయ్యారు.
రెక్కలు వచ్చాయి.
దూర దేశాలకు వెళ్లిపోయారు.

కానీ చెట్లు మాత్రం
మా ఇంటి మట్టిని వదల్లేదు.

వాటి కొమ్మల్లో
మా కొడుకుల జ్ఞాపకాలను చూసుకున్నాం.
ఆ రెండు చెట్లకు
మేమే తల్లిదండ్రులమయ్యాం.

అలా కాలం ప్రశాంతంగా గడిచింది.

అయితే…
ఒక అర్థరాత్రి
అన్నీ ఒక్కసారిగా మారిపోయాయి.

ఎటువంటి హెచ్చరిక లేకుండానే
బాదం చెట్టు నేలకూలిపోయింది.

ఆ శబ్దం విని
నేను బయటికి పరుగెత్తేలోపే…

నా జీవిత భాగస్వామి కూడా
అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.

ఒకే క్షణంలో
రెండు శిఖరాలు నేలరాలిపోయాయి.

ఇప్పుడు…

ఆవరణ ఖాళీగా ఉంది.
ఇల్లు నిశ్శబ్దంగా ఉంది.

ఒంటరిగా మిగిలిన
ఈ మామిడి చెట్టు మధ్య,
ఒంటరితనంలో విరిగిపోయిన
ఈ వృద్ధుడి మధ్య,

మళ్లీ ఎప్పుడైనా
ఒక కొత్త రాగం పుడుతుందా?

మళ్లీ ఎప్పుడైనా
నిశ్శబ్దం సంగీతమవుతుందా…? ….. వంశీ కృష్ణ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దీపిక పడుకోన్ సరే- హీరోల ‘చిల్లర ఖర్చుల’పై ఎవరైనా నోరెత్తగలరా..?!
  • విజయ్ బాటలో జూనియర్! జూలై 18న ఏం చెప్పబోతున్నాడు?!
  • నిఖార్సుగా, నిజాయితీగా, బేషరతుగా ప్రేమించేవారు ఎవరైనా ఉంటారా?
  • ఏదో ఒకటి గోక్కోవడం అనసూయకు అలవాటే కదా… ఇదీ అదే..!!
  • కేసీయార్ క్షుద్ర జర్నలిజం! అసలు నీరో ఎవరు పెద్ద దొరవారూ!?
  • సర్సర్లే గానీ పాయల్… ఆ కంటెంట్ లేకపోతే సబ్‌స్క్రిప్షన్లు వస్తాయంటావా!?
  • బీఆర్ఎస్ నిధులపై కవిత పేల్చిన పొలిటికల్ కరప్షన్ బాంబు!
  • మరో రాజ్యాంగ పోరాటం! ఆ బిల్లును గెలుకుతున్న సీఎం విజయ్!!
  • అసలు బ్లండర్ కేసీయార్‌కూ తెలుసు! అందుకే కాళేశ్వరంపై ద్రోహ నిశ్శబ్దం!!
  • ఐదు పెళ్లిళ్లు – డజను అఫయిర్స్… కానీ చివరకు ఏమయ్యాడు..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions