కరోనా అంటే… కాసుల గని..! బంగారం తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత..! అసలు కరోనా స్పెల్లింగ్ కూడా తెలియనివాళ్లు అప్పటికప్పుడు ఓనర్లుగా వెలిసిన హాస్పిటళ్లు జనం జేబుల్ని, ఆస్తుల్ని ఎలా హారతికర్పూరం చేశాయో… డ్రగ్ మాఫియా బ్లాక్ మార్కెట్‌తో ఎన్ని లక్షల కోట్లు పోగేసుకుందో… అవినీతి రోగంతో కుళ్లిపోయిన మన డ్రగ్, మెడికల్ కంట్రోల్ వ్యవస్థలు ఎలా చేష్టలుడిగాయో అందరూ కళ్లారా చూసిందే కదా… చివరకు కరోనాకు ఎప్పటికప్పుడు సరైన ట్రీట్‌మెంట్ ప్రొటోకాల్ కూడా చెప్పలేక, అమలు చేయించలేక కేంద్రం ఎలా పక్షవాతానికి గురైందో కూడా చూశాం… ఇది కరోనా రోగానికి మించిన విషాదం… మంచినీళ్ల సీసాకు వేక్సిన్ ఇస్తానన్న ఈ భారత్ బయోటెక్ పెద్దమనిషి తరువాత మాటమార్చేసి ఏ రేంజ్ ధరలతో రెచ్చిపోయాడో కూడా చూశాం… కేంద్రం ఎలా తన అడుగులకు మడుగులొత్తిందో కూడా తెలిసిందే… వేలకువేల కోట్లు… అసలు ఫస్ట్ డోసే అందరికీ చేరని స్థితిలో ఉన్నాం, సెకండ్ డోస్‌కు ఇంకెన్నాళ్లు పడుతుందో చెప్పలేం… అప్పుడే ఈ సారు గారి కన్ను బూస్టర్ డోస్ పేరు జపిస్తోంది…
ఇక దీని మార్కెట్‌కు తగినట్టు కొందరు సైంటిస్టులు (ఇన్‌ఫెక్టెడ్ పర్సనాలిటీస్) బూస్టర్ డోస్ లేకపోతే థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ తప్పదనీ మొదలెట్టారు… మరి ముక్కులో వేసే ఈ డోస్ అత్యవసరం అని ముద్రలేసి, మరింత మార్కెట్‌కు బేస్ ప్రిపేర్ చేయాలి కదా… టైమ్స్ నౌ చానెల్ సదస్సులో ఈ ఎల్ల కృష్ణ ఏమంటాడంటే..? రోగనిరోధకశక్తిని ప్రపంచంలో తొలిసారి కనుగొన్న సంస్థ తమదేనట..! ఎందరు నవ్వుకున్నారో..!! మన సిస్టమ్స్‌తో ఓ ఆట ఆడేసుకుంటున్న వ్యక్తులు ఏదైనా చెబుతారు, మనం వినాలి… అక్కడ కేంద్రమే దాసోహం అనగా లేనిది ఆఫ్టరాల్ మనమెంత..? పైగా ఈ సారు గారు అత్యంత దయతో మినరల్ వాటర్ ధరకు అందించిన వాక్సిన్ జస్ట్, ఊపిరితిత్తుల కింది భాగానికి మాత్రమే రక్షణ కల్పిస్తుందట… పైభాగానికి మాత్రం రక్షణ ఉండదట, మాస్క్ ధరిస్తేనే దానికి రక్షణ అట… ఓహ్… ఒక వేక్సిన్ ఓ శరీరావయవం దిగువ భాగానికి రక్షణ కల్పించి, పైభాగాన్ని ఫ్రీగా వదిలేయడం అనేది ప్రపంచ చరిత్రలో గొప్ప వైద్యవిశ్లేషణ, ఇప్పుడు అనిపిస్తోంది అసలు ఈ వేక్సిన్ ప్రభావశీలత ఎంత..? పాపం, శమించుగాక… సాక్షాత్తూ వేక్సిన్ తయారీదారుడే చెబుతున్నాడంటే ఇంకా ఏమేం లోతుపాతులున్నాయో…
Ads
ఇప్పుడు ఈ అపర లూయీ పాశ్చర్ గారు ఇంకా ఏం సెలవిచ్చారంటే తాము తయారు చేసే ముక్కుటీకా వైరస్ సోకని వ్యక్తులకు సరిగ్గా పనిచేయదు అట… ఆల్‌రెడీ సోకిన వాళ్లకు బ్రహ్మాండంగా పనిచేస్తుందట… లేదా తొలి డోస్ తీసుకున్న వాళ్లకు పనిచేస్తుందట… అంటే… కోవాగ్జిన్ తప్పదు, ఆ తరువాత బూస్టర్ కూడా తప్పదు అని చెబుతున్నాడు మహానుభావుడు… అసలు ఈ వేక్సిన్ల గురించి చెప్పే మాటల నిగ్గుతేల్చే వ్యవస్థలు ఏమైనా పనిచేస్తున్నాయా దేశంలో..? ఎవరూ మాట్లాడరు… ఎవరి భయం వాళ్లది… అసలు ఎల్ల కృష్ణ అంటేనే వైద్య, రోగనిరోధక చరిత్ర ఎల్లకాలం గుర్తుంచుకునే మనిషి… ఇక్కడ సదరు సంస్థలో పనిచేసే సైంటిస్టుల పరిశోధన నైపుణ్యాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు… కానీ ఓనర్లకు ఈ వేక్సిన్ ఓబులాపురం మైన్‌లా మారిన తీరు హాశ్చర్యంగా ఉంది… సర్, బూస్టర్ డోస్‌తో ఆగడు, ర్యాపిడ్ బూస్టర్, బూస్టర్ సెకండ్ డోస్… ఈ కథ ఇలా అనంతంగా సాగుతూనే ఉంటుంది… కరోనా అంటేనే ఓ గోల్డ్ మైన్… తవ్వినకొద్దీ బంగారం…!!
Share this Article