‘ఆడుజీవితం’ మనసుకు ఎక్కాలంటే కొంత సెన్సిటైజేషన్ కావాలేమో?
… నాకు తెలియని జీవితం కావడం వల్లనా? నాకు అర్థం కాని తీరంలోని కథ వల్లనా? ఏదీ అనేది స్పష్టంగా చెప్పలేను కానీ ‘ఆడుజీవితం’ నాకంతగా ఎక్కలేదు. సినిమా బాగా లేదని కాదు. మొత్తం చూసిన తర్వాత ఒక సినిమా చూశానన్న ఫీలింగ్ తప్ప అంతకుమించి ఏమీ అనిపించలేదు. కొన్ని విషయాలను ఫీల్ అవడానికి మనలో కొంత సెన్సిటైజేషన్ అవసరం కావొచ్చు. అది లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవు. అతి విషాదపు సినిమాలను చూడ్డంలో నాకేమీ కష్టం లేదు.
కానీ ‘ఆడుజీవితం’ మొదటి సీన్ నుంచే ఒక సినిమాగా కాక, డాక్యుమెంటరీగా అనిపించింది. అక్కడే నాలో విసుగు మొదలైంది. పైగా గల్ప్ గురించి కొన్ని విషయాలు విని, కథలు చదివి ఉన్నాను కాబట్టి కథలో తర్వాత ఏం జరుగుతుందో, జర్నీ ఎలా ఉండబోతోందో ముందే అర్థమైపోయింది.
Ads
… మలయాళంలో స్టార్స్ అనదగ్గ అందరికీ జాతీయ అవార్డులు వచ్చాయి. ఈసారి పృథ్విరాజ్‌కు ఆ ఛాన్స్ ఉంది. గుహ కింద కూర్చున్నప్పుడు మేకకు ఒక రొట్టెముక్క పెట్టి, తర్వాత తను తింటాడు. చాలా చిన్న షాట్ అది. కానీ ఆయన నటన, ఆ ఎక్స్‌ప్రెషన్ భలే నచ్చాయి. తన ఇంటికి వెళ్లే ముందు గొర్రెలకు వీడ్కోలు చెప్పే సన్నివేశంలో ఆయన నటన అద్భుతం.
ఎడారి ప్రాంతంలో, భాష రాని చోట పడే అవస్థను చాలా ఆర్ద్రంగా చూపించారు. ఈ పాత్రను మొదట సూర్యని అడిగారట. డేట్లు ఖాళీలేక ఆయన వదిలేసుకోవాల్సి వచ్చింది. సూర్య ఈ పాత్ర చేసుంటే ఎలా ఉండేదో? పృథ్విరాజ్ అద్భుతంగా చేశారు. What a Performance! సినిమాను రెండున్నర గంటలు ఓపిగ్గా చూసేందుకు నా వరకూ ఆయన నటన మాత్రమే కారణం.
… గల్ఫ్ బాధితుల గురించి 2017లో పి.సునీల్‌కుమార్‌రెడ్డి ‘గల్ఫ్’ అని ఓ సినిమా తీశారు. సినిమా గొప్పగా లేకపోయినా, చూసేందుకు బాగుంటుంది. నిజజీవితంలో జరిగే చాలా అంశాలను చూపించారు. గల్ఫ్ గురించి పూర్తిస్థాయిలో తీసిన ఏకైక తెలుగు సినిమా అదే కావొచ్చు. కమర్షియల్ అంశాలను జత చేసినా మూలాంశం చెడకుండా తీశారు. ‘ఆడుజీవితం’తో సమానంగా గుర్తింపు పొందగలిగిన చిత్రం. సరే! పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు.
… తెలుగు సాహిత్యంలో పెద్దింటి అశోకన్న గల్ఫ్ బాధితుల గురించి కథలు, నవల రాశారు. ‘జుమ్మేకీ రాత్ మే’, ‘ప్రాణం ఖరీదు వంద ఒంటెలు’.. ఇలాంటి కథలు ఆయన రాసినవే. సరస్వతి రమ గారు చాలాకాలం సాక్షి ఫన్‌డేలో ‘ఇసుకచెట్టు’ పేరుతో గల్ఫ్ జీవితాల గురించి కథలు రాశారు. అవి పుస్తకరూపంలో వస్తే బాగుండు.
చాన్నాళ్ల క్రితం చక్రవేణు గారు రాసిన ‘కువైట్ సావిత్రమ్మ’ కథ గల్ఫ్‌కు వెళ్లేవారి పరిస్థితిని మరో కోణంలో చూపించింది. వేంపల్లె షరీఫన్న రాసిన ‘కోయేటు లెక్క’, మా నాగేంద్రకాశీ గారు రాసిన ‘కువైట్ అబ్బులు’, ‘ఎడారి ఖర్జూరం’, శ్రీఊహ ‘ఇసుక అద్దం’, నూనె ఆనంద్ ‘కతార్ బాబాయ్’ కథలు కూడా ఎడాది దేశాల్లో ఉన్న మనవారి గురించి, ఇక్కడున్న వాళ్ల కుటుంబాల తీరుతెన్నుల గురించి చెప్తాయి. సినిమా అయిపోయింది, ఇక పుస్తకం చదవాలి ….. by విశీ
Share this Article