The Goat Life సినిమా నాకంత దిగ్భ్రాంతిని ఏం కలిగించలేదు. ఈ సినిమా వల్ల మనసుకి కలిగే పెయిన్ 21 ఏళ్ల కిందే అనుభవించా.
అది 2003 july 22. Teacher గా మొదటి పోస్టింగ్ ప్లేస్ లో జాయిన్ అవ్వడానికి మా నాన్న, అన్నలతో కలిసి వేములవాడ పోయాను. అక్కడ జూనియర్ కాలేజ్ పక్కన నూకలమర్రి పోయే ఆటో ఎక్కి, చెక్కపల్లిలో అచ్చన్నపేట స్టేజీ దగ్గర దిగి బాలరాజుపల్లె బాట పట్టినం. బాటపొంటి నడుస్తాంటే చుట్టూ కనుచూపు మేర నల్లరేగడి భూములు.
నల్లటి చీరమీద పచ్చని డిజైన్లలా పత్తి మొక్కలు. నీళ్లు లేవు. ఆడవాళ్లు బిందెలతో నీళ్లు తెచ్చి లోటలతో ఒక్కో మొలకను తడుపుతున్నరు. చెల్కల్లో పనిచేసే ఆడోళ్ళు వయసులో ఉన్నరు. వాళ్ల వెంట అయితే ముసలోళ్ళు లేదంటే పిల్లలు పనిచేస్తున్నారు. ఊరు కూడా నిశ్శబ్దంగా ఉంది. అందుకు కారణాలు కొద్ది రోజుల్లోనే అర్థం అయ్యాయి. ఇదంతా మా కరీంనగర్ జిల్లానే అయినా ఇది నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి భిన్నంగా ఉంది. అక్కడి పరిస్థితులు అర్థం చేసుకుని ఆకళింపు చేసుకోవడానికి పెద్దగా టైం పట్టలేదు.
Ads
సిరిసిల్ల, జగిత్యాల డివిజన్, ఇటు నిజామాబాద్ జిల్లా మానాల, భీంగల్ దాకా చిక్కటి అడవిలో నీటి ఎద్దడి, సారం లేని భూములు పెట్టుబడి కూడా గిట్టుబాటు అవ్వని వ్యవసాయం, కూలీ కూడా దొరకని బతుకులు. పైగా మరోవైపు నక్సలిజం, పోలీసుల వేధింపులు. మగవాళ్ళు కుటుంబాలను నడుపలేని పరిస్థితుల్లో ఆడపిల్లలు మహిళలు వయసుతో నిమిత్తం లేకుండా బీడీలు చుట్టి కుటుంబాలను నెట్టుకురావాల్సిన దుస్థితి.
పేదరికం, అవిద్య, అనారోగ్యం. అన్నీ కలిసి మంచి బతుకుదెరువు కోసం అప్పోసప్పో చేసి, ఆస్తులు తెగనమ్ముకుని ఏజెంట్ల చేతుల్లో మోసపోయి, బతకలేక చావలేక ఎడారి దేశాల్లో నలిగిన అమాయకపు బతుకులెన్నో దగ్గరగా చూడాల్సొచ్చింది. ఊర్లో ఆడోల్లు ముసలోళ్ళు పిల్లలు మాత్రమే మిగిలిన ఇళ్లను చూసిన ఏడ్చిన రోజులెన్నో.
ఆ కాలంలో HIV కూడా బాగా వ్యాప్తిలో ఉండే. చిన్న చిన్న వయసులో భర్తను కోల్పోయిన మహిళలు తల్లినో తండ్రినో కోల్పోయిన పిల్లలు. నరకానికి నకలుగా ఉండేది. ప్రతి క్లాస్ లో 30% ఇలాంటి పిల్లలే ఉందురు. ZPHS రుద్రంగిలో పనిచేసినప్పుడు అయితే ఏముంది మేడం 10 కాంగానే దుబాయ్ పోవుడేనాయ్ అనే మగపిల్లల మైండ్సెట్ నాకు టెన్షన్ తెప్పించేది. కానీ నా మెజారిటీ పిల్లలు మంచిదారుల్లోనే ఉన్నరు.
ఇప్పుడన్నా స్మార్ట్ ఫోనులు వీడియో కాల్స్ upi ట్రాన్స్ఫర్ లు అందుబాటులో ఉన్నయి. కానీ అప్పట్లో దుబాయ్ పోయిన మనిషి జాడ తెల్వక పోతుండే. సచ్చిన సావు, బతికిన జాడే తెల్వకపోతుండే. యాడాదికో ఆర్నెల్లకో ఉత్తరం వస్తే అదే మహా భాగ్యం. ఫోన్లు ఊళ్లే ఉంటె ఉండేది, లేకపోతే లేదు. వాళ్ళ అదృష్టం మంచిగుండి ఫోన్ చేస్తే గొంతు విని ఇంటోళ్లు గోడగొడ ఏడ్చేటోళ్లు. కొంతమంది పిల్లలకు తండ్రుల మొఖాలే యాదికుండేటియి కాదు. ఎదురొచ్చినా గుర్తుపట్టేటోళ్లు కాదు. ఎవరన్నా మనిషి దేశం నుండి వచ్చిందంటే చచ్చిపోయి తిరిగొచ్చిన మనిషి కోసం ఏడ్చినట్టు ఏడుస్తూ ఊరంతా ఆ ఇంటిముందే జమయ్యేది.
ఇట్లా గల్ఫ్ పోయి కాస్త సంపాయించుకుని బాగుపడ్డది కొందరే. నష్టపోయింది చితికిపోయింది ఎందరో.. ఈ గల్ఫ్ వెతల మీద Peddinti Ashok Kumar అన్న రెండు మూడు కథలు రాసినట్టు గుర్తు. If I’m not wrong జుమ్మేకి రాత్ మే హృదయవిదారకంగా ఉంటది. వీలయితే చదవండి.
నేను విన్న, చూసిన అనుభవాలు ఇంతకన్నా దారుణమైనవి కాబట్టి నేను అంతగా డిస్టర్బ్ అవ్వలేదు కానీ అద్భుతమైన సింపుల్ స్క్రీన్ ప్లే. ఎలాంటి హడావుడి లేకుండా సెల్యులాయిడ్ కు మనల్ని అప్పగించేసారు. Pruthvi నటన కన్నా తన డెడికేషన్ అద్భుతం. తను పారిపోయేముందు బట్టలిప్పి కుళాయి కింద కూర్చోవడం, బాగ్ లో ప్యాంటు తీసి వేసుకునే సీన్లో కన్నీళ్లు ఆగలేదు. అలాగే హకీమ్ చనిపోయే ముందు సీన్లు కూడా కన్నీళ్లు తెప్పించాయి……. [ by కవిత పులి ]
Share this Article