THE GREAT CHOMSKY EFFECT
………………………………………………..
1988 – 89 లో హైదరాబాద్ లో నోమ్ చొంస్కీని
ఆర్టిస్ట్ మోహన్ కలిసిన తర్వాత రాసిన వ్యాసం
…………………………………………………..
95 ఏళ్ల చొంస్కీ చనిపోయారన్న వార్త వొట్టి
పుకారు మాత్రమేనని ఆయన భార్య చెప్పారు
……………………………………………………
ప్లేటో,అరిస్టాటిల్, మార్క్స్,ఐన్ స్టీన్ ఇలాటి పేర్లు చిన్నప్పట్నుంచి వద్దన్నా వింటుంటాం.
నోమ్ ఛోమ్-స్కీ పేరు మాత్రం మన దేశంలో ఎమర్జెన్సీ తర్వాత వినిపించింది. మా పొలిటికల్ క్లాసుల ప్రిన్సిపాల్ మోహిత్ సేన్ మొదట పరిచయం చేశారు.తర్వాత పుస్తకాలు చదివాక
ఓం ఛోమ్ స్కీ అని దణ్ణం పెట్టుకోబుద్ధయింది.
ఎనభయ్యవ దశకంలో చేకూరి రామారావు, బూదరాజు రాధాకృష్ణలతో కూచున్నప్పుడు
భాషా శాస్త్రానికి ఆయన కొత్తగా చూపిన దారులు, ఆయన సొంత పద్ధతి గురించి ఆరాధనతో మాట్లాడుతుంటే చెవులు రిక్కించి వినేవాళ్లం. తర్వాత లెఫ్ట్ సర్కిల్స్ మిత్రులిచ్చిన ‘మాన్యుఫ్యాక్చరింగ్ కన్సెంట్’ చదివితే అమెరికా,పశ్చిమ దేశాలవాళ్లు , పేదదేశాల మీద
చే సే యుద్ధాలు,ప్రజాస్వామ్యం పేరుతో పచ్చి నియంతల రక్త దాహాన్ని గట్టిగా సపోర్ట్ చేయడం,
ఈ పాపాలన్నిట్నీ జనంతో ఒప్పించడానికి పత్రికలూ,టీవీ తెరల నుంచి ప్రచారం హోరెత్తించడం,తెలిసిన విషయాలే అయినా
ఛోమ్ స్కీ వాటిని ఎక్స్ రే తీసి చూపించడం, వాదనలో,తర్కంలో స్పష్టత,నైతిక బలం,నిర్భీతి మనకో కొత్త ఆలోచనకి ద్వారాలు తెరుస్తాయి.
Ads
పాత భ్రమలేమన్నామిగిలుంటే అన్నీ బద్దలవుతాయి.
అలాటి దిగ్భమలో, ట్రాన్స్‌లో పడి ఉన్న కాలంలో ఒకసారి ఆయన దేవుడులా దిగి ప్రత్యక్షమయ్యాడు.
మేం తపస్సు చేయకుండానే 80వ దశకం చివర్లోనేమో హైదరాబాద్ గోల్డెన్ త్రెషోల్డ్‌కి వచ్చాడు. స్టేజి, మైకులూ, హడావిడి ఏం లేదు. సన్నగా పొడుగ్గా షోగ్గా నవ్వుతున్నాడు. మెస్మరైజింగ్‌గా ఉంది.
పెద్ద ఇంటలెక్చువల్ ఎయిర్స్ ఏం లేవు. అందరూ ప్రశ్నలేస్తున్నారు. ఓపిగ్గా సమాధానాలిస్తున్నాడు. అప్పుడప్పుడు ఓ పక్కకి పొడుగ్గా జారే అలల్లాంటి జుట్టుని ఎగదోసుకుంటున్నాడు.
నేనూ ప్రశ్నలేశాను. క్లుప్తంగా చెప్పినా, వివరంగా మాట్లాడినా మనకి మబ్బులు విడినట్టుంటుంది. ఇంకొక్క సందేహం అనబుద్ధి కాదు.
సెషన్ చివర్లో ఆయన దగ్గరకెళ్లాను. గీసిన క్యారికేచర్ చూపించా. ట్రేడ్‌మార్క్ నవ్వు విరిసింది. నా చుబుకం ఇంత పొడుగుంటుందా అన్నాడు. కొంత ఉండగా ఇంకొంత లాగి అతి చేస్తాం కదా అని గొణిగాను. బొమ్మకింద సంతకం పెట్టాడు. మా కొలీగ్ భరత్‌భూషణ్ కెమెరా క్లిక్‌మంది. ఆ కేరికేచర్ ఎక్కడో పోయిందిగానీ, ఫొటో భూషణ్ దగ్గరే భద్రంగా ఉంది.
చోమ్‌స్కీ వెళ్లిపోయిన చాలాసేపటి వరకూ జనం ఆ స్పెల్‌లోనే ఉన్నారు.ఆయన సమాధానాల గురించి మళ్లీ మాట్లాడుకుంటూ చాయ్ కొట్లకు చేరుకున్నారు.
ఐదేళ్ల క్రితం మానవ హక్కుల బాలగోపాల్ చనిపోయినపుడు చాలా మంది పెద్దలూ, అభిమానులూ వచ్చారు. ఆయన మిత్రుడూ, శిష్యుడూ అయిన అనాటి మంత్రి మాణిక్యవరప్రసాద్ వచ్చారు. ఆయన పక్కనే నేనున్నా.ఎదురుగా డజన్లలో ఎలక్ష్రానిక్ మీడియా కెమెరాలు, అందరూ మైకులు ముందుకు తోస్తున్నారు. వరప్రసాద్ గారు మాట్లాడుతూ బాలగోపాల్‌తో తన అనుభవాలు చెప్తూ,చివర్లో నాకు తెలిసినంత వరకు నోమ్ ఛోమ్‌స్కీ తర్వాత అంతటి మేధావి బాలగోపాలే’ అని ముగించారు. ఆయన అలా తప్పుకోగానే రిపోర్టర్లు వరసగా నా దగ్గరకొచ్చి ఇందాక మంత్రిగారు ఏదో పేరు చెప్పారు. ఎవరాయన అందరూ అడగడమే. ఒక్క రిపోర్టర్‌కి తెలీదు.
ప్రపంచంలో నేటికీ అత్యధికులు కోట్ చేసే పదిమంది రచయితల్లో ఆయన ఒకడంటారు. ఇంతవరకు గడిచిన అన్ని యుగాల్లో మనం విన్న పదిమంది మహా మేధావులలో ప్లేటో (6), ఫ్రాయిడ్ (7) తర్వాత ఎనిమిదవ స్థానం ఛోమ్-స్కీదేనంటారు. “సజీవులై ఉన్న మేధావులలో అత్యంత ప్రముఖుడు” ఆయనేనని “న్యూయార్క్ టైమ్స్” రాసింది. ఈ రాతలన్నీ ఆయన భాషా శాస్త్రవేత్తగా ఉన్నపుడు. కానీ పత్రికలూ, ఛానళ్లూ, సకల ప్రసార సాధనాలు జనానికి అబద్ధాలు చెప్పి, మోసంచేసి మైమరపించే పనులు ఎలా చేస్తున్నాయో ఆయన రాయడం మొదలెట్టాక “అమెరికన్ క్రీమ్” బుడగకి వందకన్నాలు పడతాయనే భయంతో ఆయన గురించి రాయడం మానేశారు. అందరూ ఆయన పుస్తకాలు చదివేసి అసలు విషయం తెలుసుకుంటే తమ పీఠాలూ, కార్పోరేట్లూ, లాభాలకేం గాను. అందుకే ఆయనపై అప్రకటిత నిషేధమ్ .అందుకే ఆయన ప్రముఖుడు కాకుండా పోయాడు. చాలామందికి తెలీకుండా పోయాడు.
పబ్లిక్ పర్సనాలిటీలుగా మనుషులు మారడం.
స్టార్ లైపోయి జిగేల్ మని మెరవడం వారిచుట్టూ వ్యక్తి పూజ వల్ల అసలు విషయాలు, సమస్యలు వెనక్కి పోతాయంటాడు. అందుకే తన జీవితం గురించి మాట్లాడడానికి ఇష్టపడడు.
కానీ గొప్ప ఆలోచనలూ, భావాలూ సృష్టించిన వారంటే అందరికీ కుతూహలం ఉంటుంది.
కనుక ఆయన జీవితం గురించి కొంచెంగా.
1928 డిసెంబర్ 7న ఫిలడెల్ఫియా (పెన్సిల్వేనియా,అమెరికా)లో పుట్టాడాయన. 1929లో స్టాక్‌మార్కెట్ కుప్పకూలి ‘గ్రేట్ డిప్రెషన్’ మొదలై అమెరికా కకావికలం అయింది.
ఛోమ్‌స్కీ తల్లిదండ్రులిద్దరూ హీబ్రూ టీచర్లు.
కనుక ‘డిప్రెషన్’లోని నిరుద్యోగం బాధలు
లేకుండానే బతుకు సాగింది.
పన్నెండేళ్ల వయసులో స్కూల్ న్యూస్‌పేపర్‌లో ఆయన మొదటి వ్యాసం ‘బార్సెలోనా పతనం’
మీద వచ్చింది. చిన్న వయసులోనే స్పానిష్ అంతర్యుద్ధం గురించి రాసి ఫాసిజం
తల ఎత్తుతోందని బెంగపడ్డాడు.
వాళ్ల మామయ్యకున్న చిన్న పుస్తకాల షాపు దగ్గరకు యూరప్ నుంచి వలస వచ్చిన వారంతా చేరి రాజకీయాల గురించి చర్చించుకునే వారు.
మన కుర్ర ఛోమ్‌స్కీ కూడా చర్చల్లో చేరేవాడు.
వాళ్ల మామయ్య ఫ్రాయిడ్‌ని బాగా చదువుకున్నాడు. టీనేజ్ ఛోమ్‌స్కీకి ఫ్రాయిడ్ బాగా అర్ధం
కావడానికది తొలిమెట్టు.
యూనివర్శిటీలో చదివినా ఆ సబ్జెక్ట్‌ల మీద బొత్తిగా ఆసక్తి లేక చదువు ఆపేసి డ్రాపౌట్‌గా మిగిలాడు. పాలస్తీనా వెళ్లి అరబ్, యూదు సహకారాన్ని సోషలిస్టు పరిధిలో పెంచాలనుకున్నాడు గానీ ఇజ్రాయిల్ మొండితనం చూసి ఆ పని మానుకున్నాడు.
పెన్సిల్వేనియా యూనివర్శిటీ భాషా శాస్త్రం టీచర్ జెల్లిగ్ హేరిస్‌ను కలిశాడు. శాస్త్ర విషయాల్లో రాజకీయాల్లో ఇద్దరికీ దోస్తీ కుదిరింది. హేరిస్ సలహాపై తత్వశాస్త్రం, మ్యాథమెటిక్స్ చదివాడు. మళ్లీ కాలేజీలో చేరాడు. బి.ఎ., ఎం.ఎ. డిగ్రీలొచ్చాయి. 1949లో భాషా శాస్త్రవేత్త కెరోల్ స్కాజ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకి ఓ అబ్బాయి. ఇద్దరమ్మాయిలు. 1951లో హార్వర్డ్‌లో చేరాడు. 1954లో ఎంఐటి లింగ్విస్టిక్స్ రీసెర్చ్‌లో మునిగాడు. 55లో మొదటి గ్రంథం నుండి ఒక చాప్టర్‌ను సమర్పించగా పెన్సిల్వేనియా యూనివర్శిటీ పిహెచ్.డి. ఇచ్చింది. 56కి పుస్తకం పూర్తయింది గానీ అది సాంప్రదాయక రచనగా లేనందున1975 వరకు ఎవరూ అచ్చెయ్యలేదు. అప్పుడు కూడా అందులో కొంత భాగమే పబ్లిష్ అయింది.
1960 వియత్నాంలో అమెరికా యుద్దానికి నిరసనగా ప్రదర్శనల్లో పాల్గొన్నాడు. దానివల్ల తన కెరీర్ చాల నష్టమని తెలిసినా తెగించాడు. ‘మేధావుల బాధ్యత’ అని 1966 “ది న్యూయార్క్ రివ్యూ ఆఫ్ బుక్స్’లో ఆయన రాసిన ఆర్టికల్ ప్రపంచ ప్రఖ్యాతమయింది. ప్రభుత్వాలు చెప్పే అబద్ధాల్ని బయట పెట్టే పరిస్థితిలో మేధావులుండాలంటూ బాధ్యతని వివరంగా చెప్పాడు. ఇక ఆ తర్వాత ఆ పత్రికలో ఛోమ్‌స్కీ రాత రాకుండా బంద్ చేశారు.
1967లో పెంటగన్ ముందు, జస్టిస్ డిపార్ట్‌మెంట్ దగ్గరా యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు చేసిజైలుకెళ్లాడు. అక్కడ నార్మన్ మైలర్‌తో స్నేహం కుదిరింది.
ఛోమ్‌స్కీ తత్వవేత్తగా, భాషా శాస్త్రజ్ఞుడుగా ఎదగడానికి పెద్ద పునాది ఉంది. ప్లేటో, డెస్కార్టెస్, రూసో, హంబోల్ట్, కార్ల్ మార్క్స్ ల ప్రభావం
ఆయనపై చాలా ఉంది.సమాజాలు ఆర్థిక వర్గాలుగా విడి ఉన్నాయన్న మార్క్స్ విశ్లేషణ ఎంతో ఉపయోగ పడుతుందన్నాడు. కానీ కార్మికవర్గ నియంతృత్వం అనే భావనని వ్యతిరేకించాడు.
అలాగే లెనిన్ రాసిన దానికీ అధికారంలోకి వచ్హాక
ఆయన ప్రవర్తనకూ పొంతన లేదంటాడు.
జార్జి ఆర్వెల్ వ్యాసాలూ నవలలను ఎక్కువ కోట్‌చేస్తాడు. నియంతృత్వ ప్రభుత్వాలు,
ప్రచారంతో మైండ్ కండిషనింగ్ చేయడానికి వాడే పద్ధతులూ, భాష గురించి దశాబ్దాలకు ముందే ఆర్వెల్ రాశాడని పొగుడుతాడు.
భాషా శాస్త్రానికి సంబంధించి ఆయన్ను మొదట అమెరికన్ పత్రికలు తెగ పొగిడాయి. ఇది ‘భాషాశాస్తంలో ఛోమ్‌స్కీయన్ విప్లవం’ అని న్యూయార్క్ టైమ్స్ రాసింది . ‘ఈయన భాషా శాస్త్రంలో ఐన్‌స్టీన్’ అని పత్రికలన్నీ కోరస్‌లో అరిచాయి. అమెరికన్ విదేశాంగ విధానాన్ని
ఆయన తిట్టినపుడు పత్రికలన్నీ కట్ట కట్టుకుని ఆయన్ని బాయ్‌కాట్ చేశాయి .
భాషకు సంబంధించి ఆయన చేసిన అంత లోతైన పరిశోధనలూ విస్తృతమైన విశ్లేషణల గురించి చిన్న వ్యాసంలో టూకీగా చెప్పడం మంచి పనికాదు. ఒకప్పుడు ఈ పుస్తకాల కోసం వెతికి, వేటాడడం నానా చావు అయ్యేది. ఇప్పుడు ఇంటర్నెట్, ఫ్లిప్‌కార్ట్‌లున్నాయి కనుక మీ పని ఈజీ.
ఇంకో విషయం ..భాషాశాస్తంలో మీరు కొమ్ములు తిరిగిన మహానుభావులు కాకపోయినా అవి మీకు సునాయాసంగా అర్ధమయ్యే స్టైల్లో రాస్తాడాయన.
భాషకి విశ్వ జనీనమైన వ్యాకరణం ఉందంటాడు. ఇది ‘జెనెటిక్’ జన్మహక్కని చెప్తాడు. ఇది మానవ జాతికున్న విశిష్ట లక్షణమనీ ప్రత్యేకతనీ, విశ్లేషణ, భాషని ఉపయోగించడం మానవులకున్న అద్భుతమైన సృజనాత్మక శక్తి అంటూ….
“విశ్వజనీన సృజనాత్మక వ్యాకరణం”కనిపెట్టాడు.
తప్పటడుగులేసే చంటిపిల్లలు ఎలాంటి అనుభవం లేకపోయినా, ఏదో అసాధారణమైన శక్తితో భాషను సునాయాసంగా నేర్చుకోవడం అనేది ఒక ప్రాథమిక వ్యాకరణం పుట్టుకతోనే వచ్చే లక్షణమని తేల్చాడు.
ఇంకా గ్రీక్, రోమన్ భాషలు మధ్య యుగాల తర్వాత, యూరోపియన్ భాషలు 15వ శతాబ్దంలో సముద్ర వ్యాపారమార్గాలు కనిపెట్టిన తర్వాత యూరోపియన్ వలస పాలకుల కొత్త రకాల భాషలు వినడం
17 వ శతాబ్దం నాటికి అది ఈ విశ్వ వ్యాపితమైన సాధారణ వ్యాకరణం రావడాన్ని సవివరంగా చెప్తాడు. మరీ ముఖ్యంగా యూరోపియన్ భాషలన్నీ లాటిన్ మూసలోనే ఒదిగి ఉన్న కాలంలో భారతీయ పండితుడు పాణిని (క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం) రచనలతో ఆధునిక భాషా శాస్త్రమ్ ప్రారంభమైందని బ్రిటిష్ వారికి వెలిగింది.
18వ శతాబ్దంలో ఇంగ్లీషు వలస పాలకులు సంస్కృత భాష ఉందని తెలుసుకున్నారు. సంస్కృతం, గ్రీకు, లాటిన్‌కు పోలికలు కనిపించాయి. మూడు శతాబ్దాలుగా భారతదేశంలో చదువుతున్న సంస్కృతం దాని వ్యాకరణం తాత్విక నిబద్ధత, విశ్లేషణలో సమగ్రత అన్నీ సంప్రదాయక యూరోపియన్ వ్యాకరణం, తత్వానికంటే
చాలా ముందుకు పోయాయని వలస పాలకులు గ్రహించారు. పాణినిపై అప్పటి బ్రిటిష్ అధ్యయనాలు తదనంతర శాస్త్రవేత్తల కృషి ఛోమ్‌స్కీ చదివి
తన సొంత విశ్లేషణతో కొన్ని నిర్ధారణలు చేశాడు.
ఇప్పుడే చెప్పినట్టు అవి మీరు ఆయన పుస్తకాల్లో చదువుకుంటేనే బాగుంటుంది…. Mohan, Artist 9704541559 (తాడి ప్రకాష్)
Share this Article