.
“తస్కరాణాం పతయే నమో నమో;
వంచతే పరివంచతే
స్తాయూనాం పతయే నమో నమో…”
అని శివుడి రుద్ర నమక చమకంలో ఉన్న మంత్రార్థం సరిగ్గా పట్టుకోలేక కొంతమంది-
Ads
“దొంగలకు దొంగ;
మోసగాళ్ళకు మోసగాడు అయిన శివుడికి నమస్సులు…”
అన్న విపరీతార్థం చెబుతూ ఉంటారు.
దొంగలకు అధిపతి అయినవాడికి, మోసగాళ్ళకు అధిపతి అయినవాడికి కూడా అధిపతి అయిన శివుడు అని ప్రాథమికస్థాయి అర్థం. మననుండి కొన్ని ఆయన దొంగిలించకపోతే మనం బతకలేము. ఆయన దొంగిలించేవి మనకు చెడు కలిగించేవి. చివరకు చచ్చాక అందరూ వదిలేసి వెళ్ళిపోతే ఆయనమాత్రం శ్మశానంలో కాపలా ఉంటాడు.
రాత్రిళ్ళు దయ్యాలు ఊరిమీద పడకుండా వాటితో ఆయన కాలక్షేపం చేస్తూ మనల్ను కాపాడుతుంటూ ఉంటాడు. బ్రహ్మ అంతటివాడు కూడా పోతే ఆ కపాలాలు మెడలో వేసుకుని ఆయన గౌరవాన్ని కాపాడుతూ ఉంటాడు. మన దగ్గరున్నవాటిలో ఏవి దొంగిలిస్తే మనకు మంచి జరుగుతుందో వాటినే ఆయన దొంగిలిస్తాడు కాబట్టి అలాంటి మంచి దొంగకు నమస్కారం అన్నదే నమక మంత్రార్థం.
వేదమంత్రాలకు సాధారణ వ్యాకరణం, పదాల వ్యుత్పత్తి అర్థం దాటి అన్వయించుకోవాలి. మహామహా దొంగలను కూడా పట్టుకోగలవాడు లేదా వారిని తలదన్నేవాడు అన్నది ఇక్కడ గ్రహించాల్సిన అర్థం. ఆయన పేరే “శివ”. అంటే చైతన్యం, శుభం. మంగళం. దానికి వ్యతిరేకం “అ” చేరితే “శవ”. అంటే అచేతన, అశుభం, అమంగళం.
అలాంటి శుభాలనిచ్చేవాడు చిల్లర దొంగతనాలు ఎందుకు చేస్తాడు ఏమీ పనిలేనట్లు? ఇంతకంటే లోతుగా వెళితే ఇది శివతత్వ పరమార్థ చర్చ అవుతుంది. అయినా మన చర్చ దొంగతనాలగురించి కాబట్టి శివుడికి నమస్కారం పెట్టి… ఆధ్యాత్మిక, అధిభౌతిక, అలౌకిక ప్రపంచంనుండి లౌకిక భౌతిక ప్రపంచంలోకి వద్దాం.
“రుణాలు మంజూరు చేసే యాప్ ‘మనీవ్యూ’కు సైబర్ నేరగాళ్లు సుమారు 49 కోట్ల రూపాయల మేర కుచ్చుటోపీ పెట్టారు. ఈ యాప్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ (API) సిస్టంలోకి చొరబడిన హ్యాకర్లు కేవలం మూడు గంటల వ్యవధిలో దాదాపు 49 కోట్లు కొల్లగొట్టారు.
విజ్డమ్ ఫైనాన్స్ కంపెనీ మనీవ్యూ యాప్ ను నిర్వహిస్తోంది. ఈ యాప్‌ను దుబాయ్, చైనా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన సైబర్ నేరగాళ్ళు హ్యాక్ చేశారు. కొట్టేసిన సొమ్మును 653 నకిలీ ఖాతాలలోకి బదిలీ చేసుకున్నారు. బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ అయిన మొత్తంలో 10 కోట్ల రూపాయలను మాత్రం సిబిఐ పోలీసులు ఇప్పటికి ఫ్రీజ్ చేయగలిగారు”.
-ఇది ఇటీవలి సైబర్ ఆర్థిక నేరాల్లో సంచలన వార్త.
బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు మన డిపాజిట్లకు తక్కువ వడ్డీ ఇచ్చి… మనం తీసుకున్న అప్పుల మీద ఎక్కువ వడ్డీలు వసూలు చేస్తూ వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదిస్తూ ఉంటాయి. సగటు మనిషిని మోసం చేస్తే వచ్చే పది, ఇరవై వేల రూపాయల సైబర్ నేరాల కథలు సందుకు వంద ఉంటాయి. ఓటీపి కథలు, గిఫ్ట్ కూపన్ కథలు, మనీ రీఫండ్ కథలు, లింక్ క్లిక్ కథలు, డెబిట్- క్రెడిట్ కార్డ్ క్లోనింగ్ కథలు ఇలా ఈ సైబర్ కథలు అనంతం.
పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. ఎవరో అనామకుడికి ఫోన్ చేసి ఓటీపి తీసుకుని…వాడి దగ్గరున్న వెయ్యో రెండు వేలో లాగుతూ పోతే ఎన్నేళ్ళయినా కోటీశ్వరులు కాలేరు. దాంతో వందల, వేల కోట్లు మూలుగుతూ ఉండే “మనీవ్యూ”లోకే చొరబడి కొట్టేస్తే పోలా! అనుకున్నారు. మూడు గంటల్లో దాదాపు 50 కోట్లు లాగిపారేశారు.
ఆన్ లైన్ వర్చువల్ పేమెంట్ల హవా నడుస్తోంది. మొన్న దీపావళి వేళ దేశం మొత్తం మీద ఒక లక్ష కోట్ల ఆన్ లైన్ పేమెంట్లు జరిగాయని గర్వంగా చెప్పుకుంటున్నాం. డిజిటల్ యుగంలో ఆర్థిక నేరాల స్వరూప స్వభావం కూడా డిజిటైజ్ అయ్యింది. లుంగీ, మెడలో కర్చీఫ్, బుగ్గన నల్ల చుక్క, చేతిలో కత్తి పట్టి బెదిరించి దొంగతనాలు చేసే రోజులు పోయాయి.
జార్ఖండ్ రాష్ట్రంలో జామ్ తారా జిల్లాలో సైబర్ నేరాలు ఎలా చేయాలో నేర్పించే శిక్షణ సంస్థలు వెలిశాయని ఓటీటీలో వెబ్ సీరీస్ చూసి తెగ ఆశ్చర్యపోయాం. కొన్ని లక్షలమంది సైబర్ నేరాల్లో బుద్దిగా శిక్షణ పొంది… ఆన్ లైన్ దోపిడీలను చక్కటి వృత్తిగా ఎంచుకుని ఎలా స్థిరపడ్డారో తెలుసుకుని బాధపడ్డాం. సమాజంలో అవసరానికి తగినట్లు యుజిసి సిలబస్ మారాలంటే కష్టం కానీ… ఇలాంటి క్షుద్రవిద్యలు నేర్పడానికి వేనవేల సంస్థలు. నేర్చుకోవడానికి లెక్కలేనన్ని జామ్ తారాలు.
ఆర్ కె లక్ష్మణ్ (1921-2015) జగమెరిగిన వ్యంగ్య చిత్రకారుడు. దశాబ్దాలపాటు ఆయన గీచిన ఒక్కో కార్టూన్ ఒక్కో సామాజిక పరిశోధన గ్రంథంతో సమానం. 1990 ప్రాంతాల్లో ఆయన గీచిన కార్టూన్లో ఒక బ్యాంక్ క్యాష్ కౌంటర్. బ్యాంకును దోచుకోవడానికి వచ్చిన దొంగ. తనపై తుపాకీ గురిపెట్టిన దొంగతో క్యాష్ కౌంటర్లో ఉన్న బ్యాంక్ ఉద్యోగి ఇలా అంటాడు.
“We have a loan scheme. I assure you it is equally good. Why don’t you try that instead?
“మా దగ్గర రుణసదుపాయం ఉంది. మీ దొంగతనానికి సరితూగేది. హాయిగా లోన్ తీసుకోకుండా… ఎందుకొచ్చిన ఈ దొంగతనం?”
బ్యాంక్ లోన్ తీసుకుని హాయిగా ఎగ్గొట్టే రాజమార్గం ఉండగా… ఇంత శ్రమ ఎందుకు? అని దొంగకు కౌంటర్లో బ్యాంక్ ఉద్యోగి జ్ఞానబోధ చేసే ఈ కార్టూన్ దాదాపు ముప్పయ్యేళ్ళ కిందటిది. అప్పటికే ఆర్ కె లక్ష్మణ్ అలా అన్నాడంటే… ఇప్పుడయితే ఏమనేవాడో!
వేల కోట్ల రుణాలు తీసుకుని… ఎగ్గొట్టి… రాజకీయ తీర్థం పుచ్చుకుని… దర్జాగా, నిస్సిగ్గుగా ఆ బ్యాంకులకే మార్గదర్శకం చేయగల రాజమార్గం ఒకరిది. ఇలా సైబర్ సాంకేతికతతో గంటల్లో వందల కోట్లు కొట్టేసే ఆన్ లైన్ మార్గం ఒకరిది. దొంగతనం స్వరూపం, స్వభావం మారుతోంది. పరిమాణం పెరుగుతోంది. దొంగతనం మాత్రం యథాతథంగా ఉంటోంది. యథా రాజా తథా ప్రజా!
ఇలాంటి తస్కరులనుండి మన డబ్బును తిరిగీ తస్కరించి… మనకివ్వాలని-
“తస్కరాణాం పతయే నమో నమో…” అని రుద్ర నమకాన్ని నమ్మకంగా పారాయణం చేయడంతప్ప మనం చేయగలిగింది లేదు!
-పమిడికాల్వ మధుసూదన్ 
9989090018
Share this Article