ఒక ప్రేక్షకుడు ఎలాంటి ప్రిజుడీస్ లేకుండా… జీరో బేస్డ్ బడ్జెట్ తరహాలో ఓ ఎమ్టీ మైండ్‌తో థియేటర్‌లో అడుగుపెట్టాడు… ఏడ్చుకుంటూనో, తుడ్చుకుంటూనో ఆ టికెట్ రేటు చెల్లించి, సీట్లో కూలబడ్డాడు… దర్శకుడు గౌతమ్ మేనన్ అట… సంగీతం రెహమాన్ అట… సో వాట్..? వాళ్లు గతంలో ఏం ఉద్దరించారో తనకెందుకు..? వాళ్లు లబ్ధి ప్రతిష్టులు కాబట్టి ఈ సినిమా కూడా బాగానే ఉంటుందనే ముందస్తు అంచనాలతో, సినిమా మీద ముందే ఓ పాజిటివ్ అభిప్రాయం ఏర్పరుచుకుని, ఎందుకు చూడాలి..?
ఎస్, తమిళంలో ఈ సినిమా గురువారమే విడుదలైంది… ఏ తమిళ సినిమా అయినా సరే, తెలుగులోకి డబ్ చేసి వదిలేయడం ట్రెండ్ కదా… దీన్ని కూడా వదిలారు… కానీ ఏవో కారణాలతో శనివారం దాకా రిలీజ్ కాలేదు… ఏవేవో తిప్పలు పడ్డారు, మొత్తానికి షోలు పడ్డాయి… కానీ రిలీజ్ రోజున ఉండాల్సిన కీలకమైన హైప్, బజ్ కాస్తా మటాష్ అయిపోయింది… ఈ నేపథ్యం కూడా సగటు ప్రేక్షకుడికి అక్కర్లేదు… నువ్వేం తిప్పలు పడ్డావో వాడికెందుకు..? ఈ సినిమా ఎలా ఉందనేదే ముఖ్యం…
సో, ది లైఫ్ ఆఫ్ ముత్తు సినిమా చూడటం ఆరంభిస్తాడు ప్రేక్షకుడు… ఓ అరగంట, ముప్పావుగంట సినిమా బోర్ కొడుతోంది… థూదీనెమ్మ జీవితం, ప్రతివాడూ అదే గ్యాంగ్‌స్టర్లు, స్మగర్లు, మాఫియా డాన్ల కథలు ఎత్తుకోవడం… ఇందులోనూ ఓ అనామకుడు, అనుకోకుండా గ్యాంగ్‌స్టర్ అవుతాడు… తోకలా ఓ హీరోయిన్… ఓ లవ్ ట్రాక్, జోరుగా యాక్షన్ సీన్లు, ఆ నేరనేపథ్యానికి ఏదో పిచ్చి జస్టిఫికేషన్లు… ఎలివేషన్లు… ఇవి తప్ప వేరే కథలేమీ దొరకడం లేదా మనవాళ్లకు అని చిరాకు పుడుతోంది ప్రేక్షకుడికి… ఆ హీరో కూడా ఈ పాత్ర కోసం తాను బాగా కష్టపడినట్టు బిల్డప్ కనిపిస్తోంది తప్ప ఆ పాత్రలోకి దూరినట్టుగా ఏమీ కనిపించడం లేదు…
Ads
పల్లె నుంచి ముంబై వెళ్లిన గ్యాంగ్‌స్టర్ల కథలు ఇంతకుముందు కూడా చూశాం కదా… ఓ ముప్పావు గంట తరువాత మెల్లిగా కథ కదులుతోంది… కానీ ఒక్క తెలుగు మొహమూ లేదు… ఒక్క రాధిక తప్ప… గతంలో శింబు ఒకటీరెండు సినిమాల్లో కనిపించాడు… చాన్నాళ్లయింది తనను మరిచిపోయి… ఆ హీరోయిన్ పేరు సిద్ధీ ఇద్నానీ… లుక్కు పర్లేదు, కానీ నటనకే స్కోప్ లేదు… అసలు ఆ లవ్ ట్రాక్ ఏదోలా నడుస్తోంది… ఏమాత్రం ఇంప్రెసివ్‌గా లేదు… ఆమెను గతంలో జంబలకిడిపంబ తెలుగు సినిమాలో చూసినట్టు కూడా గుర్తు…
కథ కూడా స్లో… ఇంటర్వెల్ తరువాత ఏమైనా స్పీడ్ పెరుగుతుందేమో అని చూస్తే అదీ లేదు… అక్కడక్కడా ఒకటీఅరా ఇంట్రస్టింగ్ సీన్లు తప్ప సినిమాలో ఏముందని..? అబ్బే… రెహమాన్ ఇదే బీజీఎం అంటూ ఓ దశ ఓ దిశ లేకుండా కొట్టేస్తున్నాడు… ఒక్క పాటా తెలుగు పాటలా ధ్వనించడం లేదు… మొత్తానికి మూడు గంటల సినిమా… చావగొట్టేశాడు… ఫస్ట్ ఓ అరగంట సినిమా ఏమీ చూడకుండానే కట్ చేయొచ్చు… మిగతాది ఎడిటింగులో అరగంట కట్ చేయొచ్చు… రెండు గంటల సినిమా చాలు… అదీ ఓ తమిళ సినిమాను తమిళంలో చూస్తున్నట్టుగా ఉంది… ఖర్మ…!!
Share this Article