ఉమ… ఏడెనిమిదేళ్లు ఉంటాయేమో… కోయంబత్తూరు… తండ్రి బాలకృష్ణన్, తల్లి తంకమణి… తండ్రి తన యుక్తవయస్సులో ఉన్నప్పుడు ఎంబీబీఎస్ ఒక సంవత్సరం చదివి, వదిలేసి, వద్దులే అని తండ్రి చెప్పగానే తిరిగి వచ్చేశాడు… ఓ డాక్టర్ దగ్గర కంపౌండర్‌గా కూడా చేరాడు… అప్పట్లో అల్లోపతిని ఎవరూ పట్టించుకునేవారు కాదు… సైకిల్ మీద డాక్టర్, కంపౌండర్ ఊరంతా తిరిగేవారు రోగుల కోసం… ఇది జరిగే పని కాదని ఏదో మిల్లులో చేరాడు… అక్కడ రిసెప్షనిస్టుగా చేరిన తంకమణిని పెళ్లిచేసుకున్నాడు… బిడ్డ ఉమ, ఆమెకు ఓ తమ్ముడు…
తంకమణి కొన్నాళ్లకు ఇంకెవరినో చూసుకుని, లేచిపోయింది… బాలకృష్ణన్ షాక్ తిన్నా, తేరుకున్నాడు… తన బిడ్డను వెంట తీసుకుని రోగుల ఇళ్లకు తిరిగేవాడు… గాయాలు కడిగేవాడు, కట్లుకట్టేవాడు, అవి ఉమ కూడా నేర్చుకుంది… తంకమణి లేచిపోగానే ఉమ మీద కుటుంబభారం పడింది… వాళ్లనూవీళ్లనూ అడిగి, నేర్చుకుని, పొద్దున సాయంత్రం తండ్రికి, తమ్ముడికి వండిపెట్టేది… కాలం గడుస్తోంది…
Ads
ఆమెకు పద్దెనిమిదేళ్లు వచ్చాయి… రోగులకు సేవ చేయాలనే భావనతో మదర్ థెరిస్సా ఆశ్రమంలో చేరేందుకు కలకత్తా వెళ్లింది… కొన్నాళ్లు గడిచాక ఆశ్రమ నిర్వాహకులు ఇంటికి వెళ్లిపోయి, మీ ప్రాంత ప్రజలకు సేవ చేసుకోవమ్మా అని చెప్పి… లోకల్ చర్చి ఫాదర్‌కు ఓ లేఖ రాసి పంపించేశారు… ఆమె కొన్నాళ్లు లోకల్‌గానే వైద్య సేవలు అందించేది… ఈలోపు ఎవరితోనో లేచిపోయిన ఆమె తల్లి అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది ఓరోజు… ఇద్దరూ ప్రేమగా అలుముకున్నారు… కానీ ఆ తల్లి ప్రేమలో నిజాయితీ లేదు… నటించింది… ఈమె నమ్మింది, తల్లితో వెళ్లడానికి రెడీ అయిపోయింది…
తీరా వెళ్తే ఏముంది..? తల్లిని లేవదీసుకుని పోయినోడు ఎడాపెడా అప్పులు చేశాడు… అప్పులవాళ్లు వాటిని తీర్చాలంటూ తల్లి మీద ఒత్తిడి… ఆమెకు ఓ ధనికుడు కనిపించాడు… పేరు ప్రేమన్… డబ్బు కోసం ఆయనకు తన బిడ్డ ఉమను ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పింది… ఇది గమనించి ఉమ తండ్రి వద్దకు పారిపోయి వచ్చింది… తనకు ద్రోహం చేసిన తల్లితోపాటు వెళ్లిందనే కోపంతో ఆ తండ్రి ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు… మళ్లీ తల్లి దగ్గరకు చేరింది… తల్లి, ఆ తల్లి ప్రియుడు కలిసి ఆమెను బలవంతంగా సదరు ప్రేమన్‌కు ఇచ్చి పెళ్లి చేశారు…
నిజానికి అది పెళ్లి కూడా కాదు… ప్రేమన్ చేతుల్లో పెట్టి, ఇకపై ఈమె నీ ఆస్తి అన్నారు… ఈమె నిర్వేదంగా భర్త వెంట నడిచింది… అయ్యగారికి ఆమెకన్నా తొమ్మిదేళ్లు ఎక్కువ వయస్సు… అప్పటికే టీబీ సోకింది… మందులేసుకునేవాడు… ఓ పర్వర్టెడ్… భర్త ఇంట మొదటిరోజు ఎలా గడిచిందో తెలుసా..? ఆమెను తన వెంట ఓ బార్ కు తీసుకెళ్లాడు… ఆమెను ముందు కూర్చోబెట్టుకుని గంటల తరబడీ మందు కొట్టాడు… తన లైఫ్ స్టయిల్ అదేనని చెప్పాడు… ఆమెకు తరువాత తెలిసింది… అతనికి అప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయని…
మొదటి పెళ్లి మూడు నెలలకే విచ్ఛిన్నం అయిపోయింది… రెండో భార్య మరణించింది… మూడో భార్య ఎవరితోనో లేచిపోయింది… ఈమె నాలుగో భార్య… ఇంట్లో పెట్టి, తాళం వేసుకుని వెళ్లేవాడు బయటికి వెళ్తే… అసలు మొదటి ఆరు నెలలు ఆమె బయటికే రాలేదు… తరువాత సంసారం ముంబైకి మారింది… సినిమాల కోసం ముంబై వచ్చేవాళ్లకు ఈ ఇల్లు ఒక అడ్డా… మస్తు తాగేవాళ్లు… ఆ రూంలోనే వాంతులు చేసుకువారు, మూత్రం పోసేవారు… ఓపికగా అందరికీ సేవలు చేసేది… తరువాత కొన్నాళ్లకు మళ్లీ స్వస్థలం వచ్చేశారు… అప్పటికే తనకు టీబీ పెరిగిపోయింది…
భర్త ఓ అనుమానపు పక్షి… తరచూ ఆయన్ని తీసుకుని ట్రివేండ్రం పెద్ద హాస్పిటల్‌కు వెళ్లాల్సి వచ్చేది… కాస్త మంచి చీరె కట్టుకుంటే చాలు, డాక్టర్లకు లైనేస్తున్నావా అని బూతులు తిట్టేవాడు… ఆమె అప్పటికే అవన్నీ పట్టించుకోని మెంటల్ స్టేటస్‌కు వచ్చేసింది… టీబీ పెరిగీ పెరిగీ ఓరోజు హరీమన్నాడు… పెళ్లయిన ఏడెనిమిదేళ్లకే విధవరాలు… అప్పటికే తండ్రి మరణించాడు… తల్లి, ఆమె ప్రియుడు ఏమయ్యారో తెలియదు… ఒక్కసారిగా ఆమెకు స్వేచ్ఛ వచ్చింది… ఏం చేయాలో, ఎలా వినియోగించుకోవాలో తెలియని స్వేచ్చ…
తనకు అప్పటికే రోగులకు సేవ చేయడం అలవాటే కదా… భర్త చికిత్స, మందుల కోసం ఆరేడు నెలలపాటు హాస్పిటల్ చుట్టూ తిరిగి ఓ సంగతి గమనించింది… చాలామంది రోగులు మందుల్లేక, చికిత్సల్లేక కాదు మరణించేది… అందుబాటులో సరైన వైద్యసమాచారం, సలహాలు లేక..! ఆమె తన జీవితానికి ఓ లక్ష్యం ఏర్పాటు చేసుకుంది… ఓ భవనం అద్దెకు తీసుకుని… ఇదుగో ఇలా మెడికల్ ఇన్‌ఫర్మేషన్ సెంటర్ ఓపెన్ చేసింది…
మరణించిన భర్త ఆస్తి కరిగిపోయింది… చాలామంది ఆమె సలహాల కోసం వచ్చేవాళ్లు… ఏయే వ్యాధులకు ఎక్కడెక్కడ మంచి వైద్యం, చౌక వైద్యం దొరుకుతుందో తెలుసుకోవడానికి దక్షిణాది రాష్ట్రాలన్నీ తిరిగేది… అప్పటికింకా నెట్ రాలేదు… ఆ ప్రాంతాల్లో ఎక్కువగా డయాబిటీస్, దానివల్ల కిడ్నీ ఫెయిల్యూర్లు ఎక్కువ… వాటిపై తన దృష్టిని ఫోకస్ చేసింది… ఒక కిడ్నీ ఇచ్చినా ఏమీ కాదనీ, హాయిగా బతకొచ్చని చెప్పడానికి ఆమె తన కిడ్నీని కూడా దానం చేసింది… చాలామందిని కిడ్నీ దానాల వైపు మరల్చింది… సేవా కార్యక్రమాలకు విరాళాలు సేకరించేది…
తనే స్వయంగా కొన్ని డయాలసిస్ కేంద్రాలు తెరిచింది… దాదాపు 20 వేల హార్ట్ సర్జరీలు, వందలాది కిడ్నీ మార్పిళ్ల వెనుక ఆమె సలహాలు, ప్రయత్నాలు ఉన్నాయి… మిగతా అనేక వ్యాధులకు సంబంధించి లెక్కే లేదు… తను డాక్టర్ కాదు, ఎవరికీ చికిత్స చేయదు… కానీ ఆమె కేవలం ఓ మెడికల్ కన్సల్టెంటు… హాస్పిటల్ దోపిడీ కోరలకు చిక్కకుండా ఆమె సూచనలు కాపాడేవి…
తన దృష్టిని విస్తరించింది… గిరిజన ఆవాసాల్లో పౌష్టికాహారం దగ్గర్నుంచి పారిశుధ్యం, చిన్న ఆరోగ్య జాగ్రత్తల దాకా చైతన్య ప్రచారం… చౌక ఇళ్ల నిర్మాణం, విద్యాసౌకర్యాలు సరేసరి… సమాజసేవకే ఆమె జీవితం అంకితమైపోయింది… సంఘసేవకు సంబంధించి రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం కూడా అందుకుంది…
ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అనే కదా మీ ప్రశ్న… ఆమె స్పూర్తిదాయక జీవితం ఆధారంగా ఓ బయోపిక్ రూపొందుతోంది… బహుభాషాచిత్రంగా రూపొందే ఈ సినిమాకు దర్శకుడు విఘ్నేశ్వరన్ విజయన్…
ఈమె పాత్రలో ఎవరు నటించబోతున్నారు..? అనేది తరువాత… ముందయితే ప్రిప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసేశాడుట… నిజం… ఇలాంటి జీవితాల్లోనే కష్టం ఉంది, సేవ ఉంది, అడ్డంకులన్నీ ఎదిరించి నిలిచిన ఆత్మవిశ్వాసం ఉంది, సొసైటీకి అంకితం చేసుకున్న సార్థకజీవనం ఉంది… ఒక మంచి బయోపిక్ కు ఇంతకుమించి ఏం కావాలి..? స్ఫూర్తిదాయకమే కదా… !
Share this Article