Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మరణించని అమరజవాన్..! చదివి తీరాల్సిన ఓ వీరుడి పోరాటగాథ..!!

March 3, 2025 by M S R

.

యాభై ఎనిమిది సంవత్సరాల క్రితం అసువులు బాశాడు ఆ జవాను… కానీ ఈరోజుకూ తను సర్వీసులో ఉన్నట్టుగానే భావిస్తూ ప్రమోషన్లు ఇస్తుంది ప్రభుత్వం…! మహావీరచక్ర పురస్కారం ఇచ్చింది… తను బలిదానం చేసిన చోట ఓ గుడి వెలిసింది… ఆ ప్రాంతం నుంచి వెళ్లే జవాన్లు అక్కడ ఆగి మనసారా మొక్కుకుని వెళ్తారు…

తన పేరిట ఓ చలనచిత్రం కూడా వచ్చింది… ఇంట్రస్టింగు కదా… అవును, జశ్వంత్‌సింగ్ రావత్… భారతీయ సైన్యం ఎప్పుడూ మరిచిపోలేని పేరు… ఈమధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఆయన కథ ఓసారి చదువుదాం… అన్నట్టు ఆయన మందిరం ఇదే, చూడండి… ప్యూర్ మిలిటరీ గుర్తులు, సంప్రదాయలే రేకుల మీద, గోడల మీద, జెండాల మీద… 

Ads

jaswant_Garh_War_Memorial ‘‘చైనా1959లో అకస్మాత్తుగా టిబెట్‌ను ఆక్రమించుకుంది… అక్కడి బౌద్ధ గురువు దలై లామా ఇండియాకు శరణార్ధిగా వచ్చాడు… ఆయనకు రాజకీయ ఆశ్రయం ఇవ్వడం, ఆయన టిబెటన్ ప్రవాస ప్రభుత్వాన్ని ఇండియాలో ఉండి కొనసాగించడంతో ఇండియాపై శతృత్వం పెంచుకుంది చైనా… పైగా దాని గుణమే దురాక్రమణవాదం… టిబెట్‌ను మింగేసి, ఇక 1962లో చైనా భారత్ భూభాగాలపై దాడిచేయడం ప్రారంభించింది…

ఇండియా దగ్గర సరైన ఆయుధ సామగ్రి లేదు… నాసిరకం ఆయుధాలు, పైగా అకస్మాత్తుగా చైనా దాడితో మన వైపు నుంచి సరైన వ్యూహలు లేవు… దాంతో తవాంగ్ ప్రాంతం నుంచి మన సైనికులకు వెనక్కి రావాలని అప్పట్లో నెహ్రూ, రక్షణ మంత్రి కృష్ణమీనన్ ఆదేశించారు…  

అయితే నూర్‌నాంగ్ (అరుణాచల్ ప్రదేశ్) దగ్గర కాపలా కాస్తున్న గర్వాల్ రైపిల్ ఆర్మీ డివిజన్‌లోని ముగ్గురు యువకులకు శత్రువులకు వెన్నుచూపడం ఇష్టం లేదు… అక్కడే ఎత్తైన కనుమలో దాక్కొని శత్రువులపై ఎదురుదాడికి దిగారు… కేవలం ముగ్గురు మూడు వందలపైగా వున్న చైనా సైనికులను నిలువరించసాగారు…

1962… నవంబర్ -15 … నూర్నాంగ్ పోస్టుపై చైనా జవాన్లు కాల్పులు ప్రారంభించారు… మన ముగ్గురు జవాన్లు ధైర్యంగా ఎదుర్కొన్నారు… అందులో 21 సంవత్సరాల యువకుడు చాలా చురుకుగా కదులుతున్నాడు… అతని గురి తప్పడం లేదు. ప్రత్యర్థులలో చాలామందికి తూటాలు దిగాయి… ఒక అరగంట తరువాత వారి నుండి కాల్పులు ఆగిపోయాయి. అంతే… ఇద్దరు యువజవాన్లు మెరుపు వేగంతో వారి వైపు కదిలారు… తూటాలకు బలైన చైనా జవాన్ల దగ్గరనుండి ఆయుధాలను తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చేసారు…

మళ్ళీ కొన్ని గంటల తరువాత మళ్ళీ చైనా నుండి కాల్పులు ప్రారంభమయినాయి. మళ్ళీ మన వైపు నుంచి ఎదురుకాల్పులు… మళ్ళీ కొంతసేపటి తరువాత కాల్పులు ఆగిపోయాయి… మళ్ళీ మన జవాన్లు వారి వద్దకు కదిలారు… ఆయుధాలను తస్కరించి, తిరిగి వస్తున్న సమయంలో మన జవాన్లను గమనించి శత్రుసైనికులు కాల్పులు జరిపారు… ఆ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు… తన కళ్ళ ముందే తన సహచరులు నేలకూలడం నిస్సహాయంగా చూస్తుండిపోయాడు 21యేండ్ల గర్వార్ రైఫిల్ మాన్…

1962 నవంబరు 16… మిగిలిన ఆ జవాన్ ఒక్కడే యుద్దానికి సిద్దమవుతున్నాడు… తన దగ్గర వున్న ఆయుధాలను కొన్ని అడుగులకు ఒకటి చొప్పున అమర్చుకుంటున్నాడు… అతని పోరాటం గమనిస్తున్న సెరా, నూరా అనే గిరిజన యువతులు అతనికి సహాయంగా వచ్చారు… వారికి రైఫిల్స్‌లో ఎలా మందుగుండ్లు పెట్టాలో నేర్పించాడా యువకుడు…

మళ్ళీ చైనా కాల్పులు ప్రారంభించింది… ఈ యువ జవాన్ మెరుపు వేగంతో కదిలాడు. ఒక్కొక్క రైఫిల్ దగ్గరకు వెళ్ళడం కాల్పులు జరగడం, మళ్ళీ మరొక పోస్టు దగ్గరకు పరుగెత్తడం, అక్కడి నుంచి కాల్పులు జరపడం… అతను నలువైపుల నుండి జరిపే కాల్పులకు తికమకపడిపోయిన చైనా జవాన్లు భారత సైనికులు చాలామంది వున్నట్లుగా భావించారు… భారత సైనికుల వ్యూహం అర్థం కాలేదు వారికి… అప్పటికే వందకు పైగా తమ సహచరులు మరణించారు… నూరనాంగ్ కనుమలో భారీగా భారత సైనికులున్నట్లు అధికారులకు సందేశం పంపారు…

1962 నవంబరు-17…  మళ్ళీ చైనా జవాన్లపై అటాక్ మొదలు పెట్టాడు ఆ 21 యేండ్ల యువ జవాన్… సెరా, నూరా సహాయంతో శత్రు శిబిరంలోని జవాన్లను ఒక్కొక్కరిగా నేలకూలుస్తున్నాడు ఆ వీరుడు… అతని ధాటికి మరింత వెనక్కి వెళ్లారు చైనా జవాన్లు… చాలా మంది ప్రాణాలొదిలారప్పటికే… 

ఇంతలో ఎవరో అపరిచితుడు ఏదో తీసుకొని కొండపైకి వెళుతుండటం చైనా జవాన్లు గమనించి, నిర్బంధించారు… చిత్రహింసలు పెట్టేసరికి, తాను కొండపై ఉన్న జవానుకు భోజనం తీసుకెళుతున్నట్లు చెప్పేశాడు ఆ వ్యక్తి… అది విని హతాశులైపోయారు చైనా జవాన్లు….

కేవలం ఒక్కడు, ఒకే ఒక్కడు మూడు రోజుల నుండి వారిని ఎదుర్కోవడం.., వంద మందికి పైగా తమ జవాన్ల ప్రాణాలు తీయడం భరించలేక పోయారు… కోపంతో ఊగిపోతూ చైనా జవాన్లు చుట్టు ముట్టారు… చివరిదాకా పోరాడాడు తను…

సాయంత్రం సూర్యుడస్తమిస్తుండగా శత్రువుల తూటా గొంతులో దిగి, జైహింద్ అంటూ ప్రాణాలొదిలేశాడు ఆ యువకుడు… సెరా శత్రువుల నుండి తప్పించుకొనేందుకు కొండపై నుండి లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది… నూరాను చిత్రహింసలు పెట్టి చంపారు చైనీయులు… మన జవాన్ గొంతు కోసి తలను తీసుకెళ్ళారు…

ఆ జవాన్ పేరే “జస్వంత్ సింగ్ రావత్”… కేవలం ఒక్కడే దాదాపు 72 గంటలు శత్రుసైన్యాన్ని అడుగు ముందుకు వేయకుండా ఆపిన వీరుడు…150 మందికి పైగా చైనా జవాన్లను అంతమొందించాడు… శాంతి చర్చలలో భాగంగా అతని తలను ఇండియాకు అప్పగించారు చైనా అధికారులు… అక్కడే మందిరం కట్టారు తనకు…

ఆ ప్రాంత ప్రజలకు తను దేవుడు… సెరా, నూరాలకూ ఘాట్లు కట్టారు. ప్ర తిరోజూ డ్యూటీలకు వెళ్ళే జవాన్లు అతనికి దండం పెట్టుకొని వెళ్తారు…’’…… ఇదీ కథ… 72 అవర్స్, మార్టయిర్ హూ నెవర్ డైడ్ అనే చిత్రం తన పోరాటం మీద ఆధారపడిందే… అవునూ, ఇది మన పాఠ్యపుస్తకాల్లో పాఠం ఎందుకు కాలేకపోయింది..? 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions