.
ప్రభాస్..! తన సినిమాలు ఫ్లాపా హిట్టా పక్కన పెట్టేయండి… తనంటే ప్రేక్షకులకు పిచ్చి… ఆ క్రేజ్ లెవల్ వేరు… తన స్టామినాకు తగిన సినిమాలు డీల్ చేయాలంటే ఓ రేంజ్ ఉండాలి… అది దర్శకుడు మారుతికి లేదు… తనను సొమ్ము చేసుకోవడానికీ ఓ రేంజ్ ఉండాలి… అది నిర్మాత విశ్వప్రసాద్‌కు లేదు…
- ఏనాటి నుంచో నిర్మాణం… చివరికి బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లపై కూడా అర్ధరాత్రి దాకా టెన్షన్, అంతకుముందు కోర్టు ఏం తీర్పు ఇస్తుందోననే టెన్షన్… ఏపీలో షోలు ప్రారంభమయ్యాక కూడా తెలంగాణలో స్టార్ట్ కాని అదోరకం పరిస్థితి… హిందీలో పూర్ బుకింగ్స్… ఇతర భాషల్లో కూడా… సినిమా ప్రారంభం నుంచి ట్రెయిలర్, రిలీజు దాకా ఏదీ సజావుగా, సాఫీగా లేదు…
- అవును, చివరకు సినిమా నాణ్యత కూడా…!!
అందుకే రాజా సాబ్ మెప్పించలేకపోయాడు… కనీసం ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్లయినా మెప్పించలేకపోయాడు… అసలు ప్రభాస్ సినిమా అంటే ఎలా ఉండాలి..? ప్రేక్షకుల్లో హై రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి… వాటి సమీపంలోకి వెళ్లలేకపోవడం కాదు, అసలు ఓ సాదాసీదా సినిమాను తీసి వదిలారు ప్రేక్షకుల మీదకు…
Ads
- ప్రీమియర్ షో చూస్తూ మధ్యలో ఓ వీర డైహార్డ్ ఫ్యాన్ పంపించిన మెసేజ్ ఏమటో తెలుసా..? ‘‘చాలా ఏళ్ల తరువాత ఒక థియేటర్‌లో సినిమా చూస్తూ నిద్రపోయా కాసేపు, థాంక్స్ టు మారుతి..’’ (సినిమా రన్ టైమ్ మూడు గంటలకుపైగా… పూర్ ఎడిటింగ్ వాల్యూస్)…
- ప్చ్, చేతులు కాలాక ఇప్పుడు ప్రభాస్ మారుతిని ‘కమ్ టు మై రూమ్’ అన్నా లాభం లేదు… సారీ రాజా సాబ్…
ఎస్, ప్రభాసే ఈ సినిమాకు ఆకర్షణ… తను తెరపై కనిపించాలి జనానికి, అంతే… కానీ ఏం జరిగింది..? తను బాగానే చేశాడు, వింటేజ్ ప్రభాస్… పాత ప్రభాస్… యాక్షన్ సీన్లు చేసీచేసీ బాహుబలి ప్రభాస్ మళ్లీ ఫ్రెష్‌గా… ఓ డిఫరెంట్ జానర్… హారర్, కామెడీ, ఫాంటసీ, లార్జర్ దేన్ లైఫ్, డివైన్, బ్లాక్ మ్యాజిక్ ఎట్సెట్రా అన్నీ కలిపిన ఓ వింత జానర్…
కానీ..? ఏనాటి నుంచో సాగుతున్న నిర్మాణం ఇది… కొన్ని సీన్లలో ఒకలా, మరికొన్ని సీన్లలో మరొకలా కనిపిస్తాడు ప్రభాస్…
పోనీ, సినిమాలో తారాగాణం తక్కువా..? ఏకంగా ముగ్గురు హీరోయిన్లు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్… అందరూ ఆరబోసేవాళ్లు… కానీ ఎవరి పాత్రకూ స్కోప్ లేదు… హీరో మీద ఎగబడటానికే సరిపోయారు…
ప్రభాస్ నాయనమ్మగా ఒకప్పటి హీరోయిన్ జరీనా వాహెబ్ మాత్రమే కాదు, ఇందులో కన్నడ హీరోయిన్ మనీషా కందుకూర్, ఓ చిన్న హీరోయిన్ సుల్తానా, తమిళ హీరోయిన్ అమ్ము అభిరామి, మరో తమిళ హీరోయిన్ ఆనంది… ఎందరు కావాలి రాజా..? (ఈ హీరోయిన్ల జాబితా చూస్తే మాత్రం ఇది పక్కా పాన్-ఇండియా సినిమా అనిపిస్తుంది)…
- వీళ్లేనా..? విలన్‌గా వెరీ పాపులర్ బాలీవుడ్ యాక్టర్, హీరో సంజయ్ దత్… కొన్నాళ్లుగా మంచి పేరు తెచ్చుకున్న సముద్రఖని… ఏ పాత్రనైనా రక్తికట్టించగల బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ… ఇంతమంది ఉండి ఏం సుఖం..? వెండితెర వెలవెలపోయింది… ప్రధానంగా చెప్పాల్సింది తమన్ గురించి…
పూర్ పర్‌ఫామెన్స్… ఏవేవో మద్దెల దరువులే బీజీఎం అనే భ్రమల్లో ఉండిపోయాడు… పాటలూ పూర్… పోనీ, ఎప్పటిలాగే ఏవైనా మంచి ట్యూన్లు కాపీ కొట్టలేకపోయావా తమన్…? అరయగ కర్ణుడీల్గె అన్నట్టు ఈ సినిమా ఫ్లాపులో తమన్‌దీ ప్రధాన పాత్రే… హీరో ఎంట్రీ సాంగ్, మోస్ట్ పాన్ ఇండియా బ్యాచ్‌లర్‌ను అనే లిరిక్ అస్సలు బాగాలేవు…
సినిమాలో సౌండ్ మిక్సింగ్ కూడా సరిగా లేదు… లిరిక్స్, డైలాగులు కూడా సరిగా వినిపించవు…
- ప్రస్తుతం ట్రెండ్ ఏమిటి..? క్షుద్ర శక్తులు, ఆధ్యాత్మిక శక్తులు, ఫాంటసీ, మూఢ నమ్మకాలు, పాత రాజరికాలు… ప్లస్ దీనికి ఏదైనా ఎమోషన్… కొత్తగా హిప్నాటిజం, సైకాలజీ కూడా కలిపి… అన్నీ కలగలిపి మిక్సీ చేశారు కథను… ఇందులో ఓ నాయనమ్మ- ఓ మనమడు ఎమోషన్ కలిపారు… మరి కమర్షియల్ వాల్యూస్ అంటారా..? ముగ్గురు హీరోయిన్లు ఎగబడే హీరో, వాళ్ల వేషాలు… పోనీ, కామెడీ..? అదీ వర్కవుట్ కాలేదు… వీటీవీ గణేష్, ప్రభాస్ సీను, సప్తగిరి, సత్య… ఎందరో…, కానీ ఒక్క నవ్వూ విరియలేదు…
సో, భారీ తారాగణం ఉన్నా సినిమాకు ఫాయిదా లేదు అని చెప్పడానికి మంచు కన్నప్పే అవసరం లేదు, ది రాజా సాబ్ కూడా ఓ ఉదాహరణే… అసలు ట్రెయిలర్ అప్పుడే సినిమా గ్రాఫిక్ వర్క్ నాసిరకం అని అందరూ తేల్చేశారు… ఇదీ అంతే… చేతులు కాలాక చేసేదేముంది..? ఆదిపురుష్‌లాగా చేతులెత్తేయడమే… అదే జరిగింది…
సింపుల్‌గా కథ ఏమిటంటే..,? విపరీతమైన ధనకాంక్ష కలిగిన ఓ విలనుడు… ఓ రాణిని పెళ్లిచేసుకుని, దోచుకుని వదిలేస్తాడు… ఆమె మనమడు తీసుకునే ప్రతీకారమే కథ… మధ్యలో మంత్రాలు, తంత్రాలు, మన్నూమశానం… అవేవీ ఈ భారీ సినిమాను గట్టెక్కించలేకపోయాయి పాపం… సారీ రాజా సాబ్… ఇది నీ రేంజ్ సినిమా కాదు… సంక్రాంతి పండుగ కంబాలా పరుగుల పోటీలో… మొదట్లోనే చతికిలపడిపోయావ్..!!
బాహుబలి తరువాత ప్రభాస్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచిన ఒక రాధేశ్యామ్... ఒక ఆదిపురుష్... ఒక రాజా సాబ్..!!
Share this Article