డౌటేముంది..? తెలుగు నిర్మాతకే బుద్ధి లేదు… ఎక్కడో మురళీశర్మ గురించి చదువుతుంటే మరోసారి గట్టిగా అనిపించింది ఇదే… నిజానికి ఆ వార్తలో మురళీశర్మ పైత్యం గురించి మొత్తం రాయలేకపోయారు ఎందుకో… నిజానికి దాన్ని పైత్యం అని కూడా అనలేం, పిచ్చి నిర్మాతలు దొరికారు, తను అనుకున్నట్టు నడిపించుకుంటున్నాడు… తన తప్పేం ఉంది..? డిమాండ్ ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలనేది కూడా కొత్త సామెత… తను కూడా అంతే…
తను కేవలం కేరక్టర్ ఆర్టిస్ట్… నో డౌట్, మంచి నటుడు… కానీ రోజుకు 4 లక్షలు… తన సిబ్బంది కోసం మరో 50 వేలు… ప్రత్యేకంగా క్యారవాన్… ప్రత్యేకంగా తనకు వండిపెట్టడానికి వంట మనిషి… తనకే నిర్మాత మూడు కార్లు అరేంజ్ చేయాలి… అన్నింటికన్నా విశేషం ఏమిటంటే… విమానంలో మూడు టికెట్లు కావాలి తనకు… అటూ ఇటూ ఖాళీగా వదిలేస్తాడట… బస పార్క్ హయాత్… (నిజానికి తనది గుంటూరు… తల్లి గుంటూరు, తండ్రి మరాఠీ… ముంబై నుంచే రాకపోకలు…)
ఇక్కడ ఇష్యూ ఏమిటంటే… మరి అంత ఖర్చూ భరిస్తున్నారు తప్ప, రావు రమేష్ వంటి సేమ్ మెరిట్ ఉన్నవాళ్లను ఎందుకు ఎంకరేజ్ చేయడం లేదు..? ఎవరిది తప్పు..? తెలుగులో బోలెడు మంది ఉన్నారు… ఏం మురళీశర్మలు, ప్రకాష్‌రాజ్‌లే కావాలా..? ఇప్పుడేమో నిర్మాణవ్యయం తగ్గింపు గురించి మల్లగుల్లాలు పడుతున్నారు కదా… మురళీశర్మను పిలిచి రెండుసార్లు మాట్లాడారట… ఇవన్నీ దేనికి..? ఇవి మాత్రమే సమకూరుస్తాం అని క్లియర్‌కట్‌గా చెప్పొచ్చు కదా… అదెందుకు చేతకాదు..? తనతో సినిమాకు మార్కెట్‌పరంగా వచ్చే హైప్, అడిషనల్ వాల్యూ ఏముంటుంది అసలు..?
Ads
ఓ చిన్న ఆర్టిస్టు చెబుతున్నాడు ఇలా… ‘‘సార్, వీళ్లకు పెద్ద పెద్ద తలకాయల జోలికి వెళ్లే ధైర్యం లేదు, ఒక్క మాట చెప్పలేరు… మురళీశర్మను వదిలేయండి సార్, పూజా హెగ్డేకు 1.75 కోట్లు ఇస్తే, ఆమెకు ఇతరత్రా రెండు కోట్ల దాకా ఖర్చు పెడతారు… పదిమంది స్టాఫ్ పైసలన్నీ నిర్మాత మీదే రుద్దుతుంది ఆమె… అక్కడ కదా సార్, ఖర్చు కట్ చేయాల్సింది… కానీ వీళ్లేం చేస్తున్నారు… మాలాంటి చిన్న ఆర్టిస్టుల జీతాల్లో కోతలు వేస్తున్నారు… మేకప్ మా బాధ్యతేనట… రోజుకు ఇంత అని తీసేసి, గుండుగుత్తా చెల్లింపులు అంటున్నారు… అసలు సమస్య నిర్మాతల ఆలోచనల విధానమే… ఒకవైపు బీస్ట్ సినిమా ఫ్లాపయి నిర్మాతలు ఏడుస్తుంటే మా స్టాఫ్ భోజనం బిల్లులు అని లక్షల రూపాయలకు టెండర్ పెట్టింది పూజా… ఎహెఫో, పైసా ఇవ్వంపో అన్నారు అక్కడి నిర్మాతలు… ఆ దమ్ము మనవాళ్లకు ఉందా..?’’
అక్షరాలా నిజం… అసలు హీరోకు ఇచ్చే రెమ్యునరేషనే అతి పెద్ద సమస్య… ఏరూపంలో ఇస్తున్నారో పక్కన పెడితే నిర్మాణవ్యయంలో అతి పెద్ద వాటా హీరోకు చేసే చెల్లింపులే… అందులో ఒక్క పైసా తగ్గించడం ఏ నిర్మాతకూ చేతకాదు… కానీ చిన్న ఆర్టిస్టుల పొట్టగొట్టడానికి రెడీగా ఉంటారు… ఏం చిన్న హీరోలు పనికిరారా..? నిఖిల్ చిన్న హీరోయే కదా… కార్తికేయ-2 దుమ్మురేపింది కదా… చూడాల్సింది కథ, కథనం, దర్శకత్వంలో దమ్ము… అంతేతప్ప, పెద్ద హీరో అని కోట్లకుకోట్లు పెడితే, అడ్డంగా తన్నేసిన సినిమాలు ఎన్నిలేవు..?
నిర్మాతల కమిటీ ఓ తీర్మానం చేసి ప్రకటించమనండి… హీరో గానీ, హీరోయిన్ గానీ, ఏ సీనియర్ నటుడైనా సరే… వాళ్ల పారితోషికాలే తప్ప వాళ్ల స్టాఫ్ జీతాలతోగానీ, ఇతర ఖర్చులతో గానీ మాకు సంబంధం లేదు, ఆచరణకు తీసుకొచ్చే ధైర్యముందా..? చిన్న ఆర్టిస్టులు, వర్కర్ల పొట్టలు కొడితే ఏమొస్తుంది..? ఆ కుటుంబాల ఉసురు పోసుకోవడం తప్పితే…!!
Share this Article