ఇప్పుడు కాదు… ఎప్పటి నుంచో…. దశమగ్రహం అనే పదం భారత రాజకీయాల్లో ప్రముఖపాత్ర పోషిస్తూనే ఉంది… అంటే అల్లుడు…!! నిజానికి మన రాజకీయాల్లో అసలు అధికారాన్ని అనుభవించేది అల్లుళ్లే… తిక్కలేస్తే మామను ఫసాక్ అనిపించి ఆ అధికారాన్ని హైజాక్ చేసేదీ అల్లుళ్లే… పెళ్లిళ్లు కాని ఆడ నేతలకు, పెళ్లయ్యీ కొడుకులు చవటలైన మగ నేతలకు చాలావరకూ అల్లుళ్లే దిక్కు… సరే, మన పాలిటిక్సులో అల్లుళ్ల గురించి చెబుతూ పోతే ఒడవదు, తెగదు… పైగా అల్లుడు అనగానే అందరూ ఓ విలన్‌లాగే చూస్తుంటారు… మరి మనం చదివిన చరిత్రలు అలాంటివి కదా… కానీ ఈ అల్లుడు హీరో… మామను గెలిపించిన అల్లుడు… వయస్సు మళ్లిన మామను, కాలదోషం పట్టిన పాత ఆలోచనల నుంచి బయటికి లాగి, ఆధునిక ట్రాక్‌పైకి ఎక్కించి… సీఎంను చేశాడు… ఆ మామ పేరు ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్… ఆ అల్లుడి పేరు వేదమూర్తి శబరీశన్… అదేమిటి..? స్టాలిన్‌ను గెలిపించింది, మంత్రదండాన్ని గాలిలో ఊపి ఎడాపెడా వోట్ల వర్షం కురిపించింది ప్రశాంత్ కిషోర్ అన్నారుగా… ఏమో… మనం ఓసారి శబరీశన్ కథలోకి వెళ్దాం పదండి…
స్టాలిన్ చిన్నప్పటి నుంచే రాజకీయవేత్త… మరీ పద్నాలుగు, పదిహేనేళ్ల వయస్సు నుంచే డీఎంకే యువజన విభాగంలో వర్క్ చేసేవాడు… ఇప్పుడు 68 ఏళ్లు… అంటే పాలిటిక్సులోకి వచ్చాక 50 ఏళ్లకు తన సీఎం కోరిక నెరవేరింది… కరుణానిధి మరణించేవరకూ వేరేవాళ్లకు ఏ చాన్స్ లేదు కదా… పైగా కరుణానిధికి ముగ్గురు భార్యలు, ఆరుగురు పిల్లలు… వాళ్ల పరివారం… అందరికీ అధికారం అనుభవించాలనే కోరికే… బోలెడు పవర్ సెంటర్స్… అళగిరి, మారన్ అండ్ కో, కనిమొళి తదితరులన్నమాట… ఇక స్టాలిన్ విషయానికొద్దాం… ఇద్దరు పిల్లలు… కొడుకు ఉదయనిధి, బిడ్డ సెంతామరై (తెలుగులో అర్థం ఎర్రకలువ)… మన సిస్టం ప్రకారం కొడుకే కదా వారసుడు… కానీ ఉదయ్ రాహుల్ టైపు… కరుణానిధి ఇందిర అయితే స్టాలిన్ రాజీవ్… బిడ్డ సెంతామరై భర్త శబరీశన్… ప్రేమవివాహం… ఆమె చెన్నైలోనే ఓ సీబీఎస్ఈ స్కూల్ నడిపిస్తుంది… శబరీశన్ కూడా కరుణానిధి బతికి ఉన్నన్నాళ్లూ స్టాలిన్ రాజకీయ వ్యవహారాల్ని పట్టించుకునేవాడు కాదు, భార్య స్కూల్ వర్క్ చూసుకునేవాడు…
Ads
కరుణానిధి మరణం తరువాత స్టాలిన్ ముందుగా చేసిన పని పార్టీపై గ్రిప్… తన కుటుంబంలోని పవర్ సెంటర్స్ అన్నీ క్లోజ్ చేశాడు… పార్టీ వ్యవహారాలన్నీ తన ద్వారా మాత్రమే జరిగేలా చూశాడు… ఉదయ్ మీద ఆధారపడే స్థితి లేదు… అప్పుడు వచ్చాడు అల్లుడు శబరీశన్… అనేక వ్యవహారాల్లో అల్లుడి మీద ఆధాారపడాల్సి వచ్చింది స్టాలిన్‌కు… తనకంటూ ఓ నమ్మకస్తుడు కావాలి మరి… వ్యక్తిగతంగా శబరీశన్ కలుపుగోలు… అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ నేతలందరితోనూ బాగుండేవాడు… గతంలో ఓ ఎన్నికల వ్యూహకర్తను తెచ్చాడు… కానీ ఫలం దక్కలేదు… దాంతో ప్రశాంత్ కిషోర్‌ను పట్టుకొచ్చి, కంట్రాక్టు మాట్లాడింది శబరీశనే… పేరుకు ప్రశాంత్ కిషోర్ అయినా ఎక్కువ ప్రచారవ్యూహం శబరీశన్దే… అన్నాడీఎంకే, బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క వోటు కూడా చీలిపోవద్దనే భావనతో లెఫ్ట్, కాంగ్రెస్ తదితర పార్టీలతో పర్ఫెక్ట్ కూటమిని ఏర్పాటు చేశారు… ‘స్టాలిన్ వస్తున్నాడు’ వంటి పాటలతో, వీడియో బిట్లతో సోషల్ మీడియాను విపరీతంగా వాడుకున్నారు… అన్ని ప్రిపోల్ సర్వేల్లోనూ డీఎంకే హవా కనిపిస్తోంది… అధికార పార్టీకి నాయకత్వలేమి…
బీజేపీకి తిక్కలేచింది… తనకు అలవాటైన రీతిలో పోలింగుకు అయిదారు రోజుల ముందు శబరీశన్ ఇల్లు సహా పలుచోట్ల ఐటీ దాడులు చేయించింది… డబ్బు పంపిణీ కూడా ఈ ఇంటి నుంచే జరుగుతోంది, కట్టడి చేయాలి అనేది బీజేపీ ప్లాన్… కానీ శబరీశన్‌కు బీజేపీ స్ట్రాటజీలు తెలుసు కదా… ఐటీ రెయిడ్లు చూసి నవ్వుకున్నాడు… డీఎంకేలో గందరగోళాన్ని క్రియేట్ చేయాలనుకున్నది బీజేపీ… కానీ ఐటీ రెయిడ్లు కూడా డీఎంకేకు ఉపయోగపడ్డయ్… అన్నాడీఎంకే, బీజేపీ కూటమి వోట్లు కన్సాలిడేట్ కాలేదు… వాళ్లకు సరైన ప్రచారకర్త కూడా లేడు… కానీ డీఎంకే కూటమి వోట్లు పక్కాగా కన్సాలిడేట్ అయ్యాయి… తెర వెనుక శబరీశన్… తెరపై స్టాలిన్… చివరకు… సీన్ కట్ చేస్తే… సీఎం కుర్చీపై స్టాలిన్..! ఇదంతా వోకే గానీ, శబరీశన్ను నమ్మొచ్చా..? ఏమో… అది కాలం చెప్పాలి… ప్రస్తుతానికి కనిమొళి నిశ్శబ్దంగానే ఉంది…!!
Share this Article