రివ్యూయర్ :: పార్ధసారధి పోట్లూరి ……… అదన్న మాట సంగతి ! ఈ చిరంజీవికి ఏమయింది ? భారత దేశంలోనే అమీర్ ఖాన్ లాంటి నటుడు లేడు అంటూ పొగిడాడు హైదరాబాద్ లో, లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్ ఫంక్షన్ లో… గతంలో కూడా ఉప్పెన సినిమా ప్రమోషన్ లో విజయ్ సేతుపతిని తెగ పొగిడేశాడు చిరంజీవి. సరే, ఉప్పెన అంటే స్వంత ఫామిలీ మెంబర్ హీరో కాబట్టి తెగ పొగిడేశాడు అనుకుందాం ! కానీ ఉప్పెన సినిమాలో తన పాత్ర కోసం విజయ్ సేతుపతి 5 కోట్లు డిమాండ్ చేశాడు. అంత ఇవ్వలేము కొంచెం తగ్గించుకోండి అని బతిమిలాడినా సరే ససేమిరా తగ్గను అనేశాడు విజయ్ సేతుపతి… చేసేది లేక 5 కోట్లు ఇచ్చారు. అలాంటిది ప్రమోషన్ ఫంక్షన్ లో దక్షిణ భారత దేశ సినిమాలలో విజయ్ సేతుపతి లాంటి యాక్టర్ లేడని అంతలా పొగడాల్సిన అవసరం ఉందా ?
ఇంతకీ ఈ సినిమా ప్రమోషన్ కోసం చిరంజీవి ఎందుకు వచ్చాడు ? ఎందుకంటే లాల్ సింగ్ చద్దా సినిమాని ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకి గాను గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ ఏకంగా 13 కోట్లు పెట్టి కొన్నాడు కనుక ! 13 కోట్లు గంప గుత్తాగా పెట్టి కొన్నాడు అంటే నష్టం వస్తే భరించాల్సిందే ! ఆంధ్ర, తెలంగాణలకి కొనడానికి ఎవరూ ముందుకు రాకపోతే గీతా ఆర్ట్స్ కొన్నది. అందుకే వేదిక మీద అమీర్ ఖాన్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు చూశారా ?
Ads
మీరు బాయ్ కాట్ చేస్తే వస్తే నష్టం ఏమీ లేదు : కరీనా కపూర్ ! ఈ వ్యాఖ్య వెనుక ఉన్న మర్మం ఏమిటి ? VIACAM 18 అమీర్ నుండి 100 కోట్లకి కొనేసింది. అది పక్కా కార్పొరేట్ సంస్థ. ప్రతిదీ పకడ్బందీగా కాంట్రాక్ట్ లు రాయించుకొని మరీ బయ్యర్లకి అమ్ముతుంది. Viacom 18 అమీర్ ఖాన్ ప్రొడక్షన్ కి 100 కోట్లు ఇచ్చి 67% : 33% ప్రాఫిట్ షేర్ చొప్పున థియేటర్ హక్కులు తీసుకుంది. అయితే గీతా ఆర్ట్స్ మాత్రం ఫ్లాట్ గా 13 కోట్లకి కొనుక్కుంది. తమిళనాడుకి ఉదయనిధి స్టాలిన్ కి చెందిన రెడ్ జెయింట్ [Red Giant] థియేటర్ హక్కులని కొన్నది 15.5 కోట్లకి …
ఇప్పుడు Viacom 18, గీతా ఆర్ట్స్, రెడ్ జెయింట్ సంస్థలు మార్కెట్ లో మంచి రెప్యుటేషన్ ఉన్న డిస్ట్రిబ్యూషన్ సంస్థలు కాబట్టి మాకు నష్టం వచ్చింది అంటూ అమీర్ ఖాన్ ని డబ్బులు వాపస్ ఇవ్వమని ఆడగలేవు. ఎందుకంటే కాష్ రూపంలో లావాదేవీలు జరపవు ఇవి. ఇక కేరళ, కర్ణాటకలకు కలిపి ఒకే డిస్ట్రిబ్యూటర్ కి 12 కోట్లకి అమ్మాడు అమీర్ ఖాన్! ఇక్కడ కూడా పోయిన డబ్బు వెనక్కి రాదు ఆడగలేరు.
మునిగిపోయిన కొనుగోలుదార్లు… ముంబై, ఢిల్లీలలో 1500 థియేటర్లలో 4.5 లక్షల మినిమం గ్యారంటీ ఒప్పందంతో రిలీజ్ చేశారు. ఉత్తర భారతంలో ఒక్కో థియేటర్ కి 1.5 లక్షలు మినిమం గ్యారంటీతో రిలీజ్ చేశారు. ఇక హిందీ బెల్ట్ లో ఒక్కో థియేటర్ కి ఒక లక్ష మినిమం గ్యారంటీ తో రిలీజ్ చేశారు. ఇక మిగిలిన చోట్ల 2.5 లక్షలు మినిమం గ్యారంటీతో రిలీజ్ చేశారు. ఇలా చూస్తే థియేటర్ యజమానులకి రావలసిన మినిమం గ్యారంటీ మొత్తం 46 కోట్ల రూపాయలు.
మొత్తం 2000 థియేటర్ యజమానులు పర్సెంటేజ్ బేసిస్ మీద సినిమా రిలీజ్ చేశారు… అంటే లాభంలో ఇంత శాతం అని తీసుకుంటారు… కానీ కలెక్షన్లు లేక సినిమా ఎత్తేసింది… ఇలా పర్సంటేజ్ మీద రిలీజ్ చేసిన థియేటర్ యజమానులు రిస్క్ తీసుకొని నష్టపోయారు. నిన్నటి వరకు అంటే మంగళ వారం వరకు మొత్తం కలెక్షన్లు 53.57 కోట్ల రూపాయలు, అయితే ఇందులో పన్నులు పోను మిగిలింది 43 కోట్లు మాత్రమే. మొత్తంగా చూస్తే డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు అన్నమాట.
అమీర్‌ఖాన్‌కు అసలు షాక్ ఏమిటంటే..? సినిమా కోసం ఖర్చు పెట్టింది మహా అయితే ఓ 120 కోట్లు [180 కోట్లు లేదా 200 వందల కోట్లు అనేది ఒట్టి మాట]. అయితే నష్టపోయింది మాత్రం ఓ 40 నుండి 60 కోట్లు దాకా ఉంటుంది. కాకపోతే భవిష్యత్తులో అమీర్ ఖాన్ సినిమాని అవుట్ రైట్ గా ఎవరూ కొనరు, అంటే ముందే టేబుల్ బిజినెస్ జరగకపోవచ్చు లేదా ఎక్కువ అంచనాలు వేయకుండా తక్కువకి అయితే కొనడానికి ముందుకు వస్తారు. అమీర్ ఖాన్ మీద వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా నిర్మించడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చు. అందుకే Thugs of Hindusthan వల్ల వచ్చిన నష్టంతో ఈ సినిమాను తన స్వంత ప్రొడక్షన్ లో నిర్మించాల్సి వచ్చింది అమీర్ ఖాన్. ఇక ముందు అదీ ఉండదు.
ముంబై లోని మరాఠీ మందిర్, గెయిటీ, జెమిని థియేటర్ యజమాని మాత్రం ఈ సినిమాను తీసేసి ఏదన్నా వేరే సినిమా వేస్తే కానీ తమకి ఇప్పటికే వచ్చిన నష్టాన్ని పూడ్చుకోలేము అని వాపోయాడు. ముంబై మరాఠీ మందిర్ లో మొదటి రోజు కలెక్షన్లని బట్టి ఆ సినిమా హిట్టా ఫట్టా అనేది తెలిసిపోతుంది. ఇది మొదటి నుండి వస్తున్న సినిమా సెంటిమెంట్.
పెద్దగా అంచనాలు లేకుండా హిందీ బెల్ట్ లో విడుదల అయిన కార్తికేయ2 కి మంచి ఆదరణ లభిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ తో డ్యూయెట్లు లేకుండా నేరుగా సినిమా కథనం మీద దృష్టి పెట్టి తీశాడు దర్శకుడు చందు మొండేటి. ఇది హాలీవుడ్ ఫార్ములా ! ఫోటోగ్రఫీ, నేపథ్య సంగీతం మరియు మంచి స్క్రిప్ట్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్లు అయినట్లు ఉత్తరాది ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. లో బడ్జెట్ లో తీసిన కార్తికేయ 2 మంచి లాభాలని ఆర్జిస్తున్నది.
ఉత్తరాదిన లభిస్తున్న ఆదరణని ఉపయోగించుకొని లాభపడాల్సిన తరుణంలో షూటింగ్ లు ఆపేసి నిర్మాతలు బావుకునేది ఏమిటో ఎవరికీ అర్ధం కాదు. పింక్ సినిమా బడ్జెట్ 20 కోట్ల లోపే కానీ మంచి లాభాలు వచ్చాయి… అదే సినిమాని తెలుగులో రీమేక్ చేసి 80 కోట్లు ఖర్చు పెట్టింది ఎందుకు ? ఇప్పుడు లాభాలు రావట్లేదని టెక్నీషియన్స్ కడుపు కొట్టడం దేనికి ?
Share this Article