ఏదో ఉన్నారా అంటే ఉన్నారు… ఎంత జీతమొస్తోందంటే అదీ చాలీచాలని వేతనం. పోనీ అదీ వద్దనుకుంటే పేద బతుకు ఎలా బతికేది… అందుకేం చేసేదో అర్థం కాని దైన్య స్థితి. ఈక్రమంలో చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగాన్నీ ఎంతోమంది చిత్తశుద్ధిగా నిర్వర్తిస్తున్న క్రమంలో… అసలు డెడికేషన్ కు ఓ కేరాఫ్ లా నిలుస్తోంది రేలూ వాసవి. అందుకే ఆమె గురించి ఈ ముచ్చట.
మహారాష్ట్రలో నందూర్బార్ జిల్లాలోని మారుమూల గ్రామమైన చిమల్కాడిలో ఉన్న అంగన్వాడిలో ఉదయం తన పని పూర్తి చేసుకుని రేలూ వాసవి నేరుగా తన ఇంటికే వెళ్లిపోవాలి. వాస్తవానికి అంతటితోనే అంగన్ వాడీ కార్యకర్తగా ఆమె డ్యూటీ ముగుస్తుంది. నిజమే అక్కడితోనే ఆమె విధులు ముగిస్తే ఇప్పుడీ ముచ్చటెందుకు చెప్పుకుంటాం..? తన విధులు పూర్తయ్యాక ఆమె మధ్యాహ్నం ఒంటరిగా ప్రయాణించి… మరిన్ని కుగ్రామాలను సందర్శిస్తుంది. వెంట ఆహార పదార్ధాలు, బేబీ వెయిటింగ్ మెషిన్, బాలామృతం వంటి వాటిని వెంట పెట్టుకుని వెళ్లుతుంది.
Ads
గిరిజన గూడాల్లోని శిశువులు, బాలింతలు, గర్భిణులకు పోషకాహారం అందుతుందో, లేదోనన్న తపన, మానవత్వ స్పృహే… రేలూ వాసవిని ఏకంగా తన డ్యూటీ ముగిశాక మరో 18 కిలోమీటర్లు ప్రయాణించేలా చేస్తోంది. అయితే ఆమె చేసే ప్రయాణం కూడా ఓ సాహసోపేతమైందే. స్థానిక జాలర్ల నుంచి ఓ నాటు పడవను కిరాయికి తీసుకుని… నర్మదా నదిలో ప్రయాణించి పర్వత ప్రాంతాలనధిరోహించి మరీ ఆ మారుమూల గ్రామాల్లో తన అంగన్ వాడీ సేవలందిస్తోంది 27 ఏళ్ల రేలూ.
మంచి స్విమ్మర్ గా కూడా అనుభవమున్న రేలూ… ఇప్పుడా గ్రామాల్లో ఏడుగురు పిల్లలతో పాటు… 25 మంది నవజాత శిశువులకు పోషకాహారాన్నందించేందుకు తన డ్యూటీ కాకున్నా… ఓ అంగన్ వాడీ కార్యకర్తగా ఏకంగా 18 కిలోమీటర్లు ఓ నదిలో నాటుపడవలో ప్రయాణించి.. కొండ, కోనలు దాటి సేవలిందించడమంటే అది కదా మానవత్వమంటే! దాన్ని మించిన దైవత్వమంటే!! రేలూ సంరక్షణలో ఇప్పుడా గ్రామాల్లోని నవజాత శిశువులతో పాటు… గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంగా ఉండటంతో… రేలూ సేవలను ఇప్పుడక్కడ సీఎం కార్యాలయం సైతం గుర్తించి ప్రశంసించింది. జిల్లా పరిషత్ కార్యాలయంలోనూ రేలూ సేవలకు అక్కడి అధికారులు జేజేలు పలుకుతున్నారు.
అప్పుడప్పుడూ తన స్నేహితురాలు, దగ్గరి బంధువైన సంగీతతో కలిసి ఈ ప్రయాణం చేస్తానంటున్న రేలూ… కరోనా కాలం ప్రారంభమైన్నాట్నుంచి ఆయా గ్రామాల పరిస్థితులు తన దృష్టికి రావడంతో తన సేవలను ప్రారంభించిందట. కరోనా నుంచి పూర్తిగా ఫ్రీ అయ్యే వరకూ కూడా తాను వారికి సేవలందిస్తానంటోంది. అందులోనే ఆత్మసంతృప్తి ఉందంటోంది రేలూ…
- రమణ కొంటికర్ల
Share this Article