.
రిపోర్టర్‌గా కన్నీళ్లు పెట్టిన కథ..
జర్నలిస్ట్ గా నేను గెలిచానా? మనిషిగా నిలబడ్డానా? నాకు తెలియదు..
1990–91 కాలం…
అప్పుడు నా వయసు 24–25 ఏళ్లు. చందానగర్ నుంచి పటాన్‌చెరు వరకు ఆంధ్రభూమి స్ట్రింగర్‌గా వార్తలు కవర్ చేసేవాడిని.
ఒకరోజు పటాన్‌చెరులోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్‌లో విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపించి ప్రభుత్వ సొమ్ము తింటున్నారన్న సమాచారం వచ్చింది. వెంటనే హాస్టల్‌కు వెళ్లాను.
Ads
రిజిస్టర్‌లో ఉన్న లెక్కతో పోలిస్తే అక్కడ 12 మంది విద్యార్థులు తక్కువగా ఉన్నారు. అప్పట్లో నా వార్తలకు ఆంధ్రభూమితో పాటు డెక్కన్ క్రానికల్‌లోనూ ప్రాధాన్యం ఉండేది. దీంతో హాస్టల్‌లో బోగస్ విద్యార్థులు… వారి పేర్లపై వచ్చే డైట్ సొమ్ము దారి మళ్లింపు అంటూ వార్త రాశాను.మరుసటి రోజు వార్త చూసి చాలా సంతోషపడ్డాను.
“యువ రక్తంలో సాధించిన విజయం” అనిపించింది. అదే రోజు సాయంత్రం జిల్లా అధికారులు హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. నా వార్తకు ప్రభుత్వం స్పందించింది.
నా రిపోర్టింగ్‌తో చర్య వచ్చింది. అంతకంటే ఆనందం ఒక యువ రిపోర్టర్‌కు ఇంకేం ఉంటుంది?
రెండు రోజుల తర్వాత…
చందానగర్ హుడా కాలనీలోని మా ఇంటి ముందు ఉదయం ఏడుపు వినిపించింది.
అప్పుడు నేను తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి గంగారం వెళ్లి పేపర్లు తెచ్చి ఇంటింటికీ వేసి, సుమారు 6.30 గంటలకు ఇంటికి చేరేవాడిని. ఆ రోజు కూడా పని ముగించుకుని ఇంటికి వచ్చి కొద్దిసేపు నిద్రపోతున్నాను.
ఉదయం సుమారు తొమ్మిది గంటలు.
పిల్లలు ఏడుస్తున్నట్టుగా వినిపించిన ఆ శబ్దంతో ఒక్కసారిగా లేచాను.
గేటు తీసుకుని బయటకు వచ్చాను.
ఇంటి ముందు పది మంది వరకు పిల్లలు.
ఏడుస్తున్నారు.
వారి వెనుక ఒక పెద్దాయన…
చేతులు జోడించి నిలబడి ఉన్నాడు.
ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు.
పిల్లల ఏడుపు చూసి కంగారుపడ్డాను. ఇంట్లో నుంచి అమ్మ, నాన్న, అన్న, అక్క అందరూ బయటకు వచ్చారు. చుట్టుపక్కల వాళ్లు కూడా చేరారు.
ఆ పిల్లల్లో కొందరు నా కాళ్ల మీద పడిపోయారు.
ఆ పెద్దాయన ఒక్కసారిగా నా చేతులు పట్టుకుని బావురుమన్నాడు.
నాకు మతి పోయినట్టయింది.
నాకు తెలిసి చీమకు కూడా హాని చేయని మనసు నాది. కానీ ఇప్పుడు నా కళ్ల ముందున్నది ఏడుస్తున్న పిల్లలు.
నా కళ్ల నుంచి కూడా కన్నీళ్లు ధారగా కారడం మొదలైంది.
పిల్లలను ఓదారుస్తూ…
“ఏమైంది? చెప్పండి…” అని అడిగాను.
అప్పుడు ఆ పెద్దాయన చెప్పిన మాట నన్ను లోపల నుంచి కుదిపేసింది.
“సార్… మీరు వార్త రాసిన హాస్టల్ వార్డెన్‌ను నేనే. వీళ్లంతా నా కన్న పిల్లలు.”12 మంది బోగస్ విద్యార్థులు… నిజమే సార్!”ఆయన చెప్పిన కథ విన్న తర్వాత నా కాళ్ల కింద నేల కదిలినట్టయింది. “సార్… 12 మంది బోగస్ విద్యార్థులు అని మీరు రాసింది రిజిస్టర్ ప్రకారం నిజమే. అందులో ఆరుగురు నా పిల్లల పేర్లు పెట్టాను. మిగతా వాళ్లు డ్రాప్‌అవుట్ పిల్లలు.”
“వాళ్ల పేర్ల మీద వచ్చే డబ్బుతో నా ఆరుగురు పిల్లలను పోషిస్తున్నాను సార్.
కడుపు నిండా తిండి పెట్టలేని నా ఆర్థిక పరిస్థితిలో తప్పు చేశాను.
మీ వార్త వల్ల నా ఉద్యోగం పోయింది.
నా పిల్లలు… నేను రోడ్డున పడ్డాం.
డ్రాప్‌అవుట్ పిల్లలను కూడా తెచ్చాను.
కడుపు నింపడం కోసం చేసిన నేరం సార్… కోట్లు కొల్లగొట్టడం కోసం చేసిన నేరం కాదు.”
అని కన్నీరు మున్నీరయ్యాడు.
ఆ క్షణంలో నా మనసులో ఒక్కటే ప్రశ్న—
“నేను రాసిన వార్త తప్పా?”
కాదు.
నేను చూసింది నిజమే.
రిజిస్టర్‌లో 12 మంది ఎక్కువే ఉన్నారు.
డైట్ సొమ్ము కూడా వారి పేర్ల మీదే వచ్చింది.
వార్త కరెక్టే.
కానీ…
తప్పు చేసిన మనిషి వెనుక ఉన్న కారణం వేరు.
ఒక జర్నలిస్టుగా నేను తీసుకున్న నిర్ణయం
కొద్దిసేపు ఆలోచించాను.
ఆ కుటుంబాన్ని రోడ్డున పడేయడం నా ఉద్దేశం కాదు.
తప్పును బయటపెట్టడం నా పని.
ఇద్దరి మధ్య తేడాను అర్థం చేసుకున్నాను.
అప్పటి పటాన్‌చెరు ఎంపీపీ నందీశ్వర గౌడ్ గుర్తుకు వచ్చారు.
ఆయన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అధికారులను ఒప్పించి, కొంతకాలం తర్వాత ఆ వార్డెన్‌కు తిరిగి ఉద్యోగం వచ్చేలా చేశారు.
ఆ పిల్లల బాధ్యతను కూడా అదే నందీశ్వర గౌడ్‌కు అప్పగించాను.
ఆయన నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.
ఆ రోజు ఆయన ఒక నాయకుడిగా కాదు… ఒక కుటుంబం కష్టాన్ని అర్థం చేసుకున్న మనిషిగా నాకు సహాయం చేశారు.
ఆ రోజు నేర్చుకున్న పాఠం…
ఆ సంఘటన తర్వాత జర్నలిజం గురించి నా ఆలోచన మారింది.
వార్త నిజం కావాలి.
వార్త ఎవరికీ వ్యక్తిగతం కాకూడదు.
తప్పు కనిపిస్తే రాయాలి.
అధికారులను ప్రశ్నించాలి.
ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగాన్ని బయటపెట్టాలి.
కానీ…
ఒక రిజిస్టర్‌లో కనిపించే తప్పు వెనుక ఒక కుటుంబం ఉండొచ్చు.
ఒక కేసు వెనుక ఒక ఆకలి ఉండొచ్చు.
ఒక నేరం వెనుక ఒక మనిషి నిస్సహాయత ఉండొచ్చు.
అది నేరాన్ని సమర్థించడం కాదు.
నిజాన్ని రాస్తూనే… మనిషిని కూడా అర్థం చేసుకోవడం.
అదే నేను ఆ రోజు నేర్చుకున్న జర్నలిజం.
ఆ రోజు నేను ఒక వార్త రాశాను.
కానీ ఆ వార్త నాకు ఇచ్చిన పాఠం…
నా జీవితాంతం నాతోనే ఉంది.
ఇప్పటికీ ఆ పిల్లల ఏడుపు గుర్తొస్తే నా కళ్లలో నీళ్లు తిరుగుతాయి.
ఎందుకంటే…
ఆ రోజు నేను రిపోర్టర్‌గా గెలిచానా?
లేదా ఒక మనిషిగా పరీక్షించబడ్డానా?
నాకు ఇప్పటికీ తెలియదు.
కానీ ఒక్కటి మాత్రం తెలుసు—
జర్నలిస్టు కలం నిజం కోసం పదునుగా ఉండాలి…
అదే సమయంలో ఆ కలం వెనుక మనసు కూడా ఉండాలి.
— మీ సత్తెన్న 9701538700
Share this Article