Sankar G……….. ది రెవెనెంట్ సినిమా చూశారా? సినిమా గొప్పతనం ఏమిటి? నేడు ప్రపంచ సినిమాలో అత్యుత్తమ సాంకేతిక దర్శకుల్లో అలెహాండ్రో ఇన్యారిటు ముందు వరుసలో ఉంటారు. అత్యుత్తమ సాంకేతిక దర్శకులు అంటే?
అద్భుతమైన లేదా ఒరిజినల్ కథ లేకపోయినా కథనం, దర్శకత్వం, సంగీతం, సినిమటోగ్రఫీ విభాగాల్లో అత్యుత్తమ సృజన చూపేవారు. వెస్ ఆండర్సన్, డెనిస్ వెల్నూవ్, స్పైక్ జాంజ్, టైకా వైటిటి, అలెక్స్ గార్లండ్, ఎడ్గర్ రైట్, అల్ఫోన్సో కువరో ఈ కోవకు చెందిన వారు. వీరి సినిమాల్లో పైన చెప్పిన విభాగాలన్నీ విస్మయ పరిచేంత అద్భుతంగా ఉంటాయి, ఒక్కొక్కరిదీ ఒక్కో కథన శైలి అయినప్పటికీ.
ఉదాహరణకు వెస్ ఆండర్సన్ సినిమాల్లో రంగుల ప్రయోగానికి పాత్రల నైజం, సన్నివేశాల ధోరణి భలే నప్పుతాయి. అలెహాండ్రో ఇన్యారిటు సినిమాలు మానవ నైజంలో పలు కోణాలను విస్పష్టంగా, వడపోత లేకుండా Rawగా (పచ్చిగా అనవచ్చేమో) చూపుతాయి. కొన్ని దృశ్యాలు సినిమటోగ్రఫీ అబ్బురపడేలా చేస్తే, కొన్ని కథనానికి విస్మయపడేలా చేస్తాయి. కొన్ని దృశ్యాల చిత్రీకరణ సినిమా చూసేసిన వారం రోజుల దాకా బుర్రను వదలవు.
Ads
ది రెవెనెంట్ సినిమాలో ఉదాహరణలు చూద్దాం. ||హింస ఎక్కువ, చూడలేనివారు చూడవద్దు|| సినిమటోగ్రఫీ: సినిమా మొదట్లో హీరో సమూహంపై ఆదివాసీల దాడి… ఇలాంటి పోరాట సన్నివేశాలు 2-3 నిముషాల పాటు ఒకే అవిచ్ఛిన్న షాట్‌గా తీయటం చాలా కష్టం. అటువంటి దృశ్యాలు ఈ సినిమాలో బోలెడు.
సినిమటోగ్రఫీ + కథనం + సంగీతం: హీరోపై ఎలుగు దాడి……. థియేటర్లో ఈ సన్నివేశం సాంతం అయిపోయే వరకు ఊపిరి బిగబట్టి చూసినట్టు అనిపించింది నాకు. కెమెరా పనితనం, గ్రాఫిక్స్ రెండూ కలిసి దాడిని వాస్తవికంగా చూపటం జరిగింది. చెప్పుకుంటూ పోతే సినిమా మొత్తం ఇలాంటి దృశ్యాలే. ఆఖరులో ప్రతీకార పోరాట దృశ్యాలైతే సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి.
సినిమా షూటింగ్ జరిగింది 80 రోజులే అయినా దర్శకుడు ఎంచుకున్న అతిశీతల ప్రదేశాల్లో తీవ్రమైన చలి వల్ల ఆ 80 రోజులు తొమ్మిది నెలల్లో తీయవలసి వచ్చింది. గ్రాఫిక్స్ ఎక్కువగా లేని హాలీవుడ్ సినిమాకు తొమ్మిది నెలల షెడ్యూల్ చాలా ఎక్కువ. అలెహాండ్రో ఇన్యారిటు సినిమాల్లో నటులు ఎవరైనా, నటన అత్యుత్తమంగా ఉంటుంది. అదీ లియొనార్డో డి కాప్రియో, టామ్ హార్డీ వంటి నటులైతే ఆకాశమంత అంచనాలతో వెళ్ళినా ఆశాభంగం అవ్వదు.
ఈ సినిమా కోసం లియొనార్డో స్వతహాగా శాకాహారి అయినా బైసన్ కాలేయాన్ని పచ్చిగా తినటం అభ్యసించి, నటించాడు; రెండు ఆదివాసీ భాషలూ నేర్చుకున్నాడు. తన కెరీర్‌లోని అత్యంత కఠినమైన పాత్ర ఇదేనని పలు మార్లు చెప్పాడు కూడా.
సినిమా గొప్పతనం ఏమిటి? పైన చెప్పినవన్నీ కారణాలైతే సినిమా గొప్పతనం మాత్రం దర్శకుడే. 21 Grams, Babel, Birdman వంటి ఆయన ఇతర సినిమాలు కూడా ఆ గొప్పతనానికి అతీతం కావు. ఇవన్నీ కూడా దాదాపు సినిమా సాంతం క్రేన్లు, ట్రాలీలు లేకుండా చేత బట్టిన కెమెరాలతోనే చిత్రీకరణ జరిగింది. 21 Grams కథ కూడా విభిన్నంగా ఉంటుంది. Birdman సినిమా మొత్తం కట్స్ లేకుండా ఒకే షాట్ అనిపించేలా తీశారు. ప్రపంచ సినిమాపై ఆసక్తి ఉన్న ఔత్సాహికులు తప్పక చూడవలసిన సినిమాలు ఈ దర్శకుడివి…
Share this Article