Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘The sky gets dark slowly’… మెల్లిగా చీకటి పడుతోంది… జీవితం మీద..!

March 3, 2024 by M S R

Paresh Turlapati……. లక్షల కాపీలు అమ్ముడుపోయిన … “The Sky Gets Dark Slowly” అన్న పుస్తకం గురించి శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి వివరణ.

ఈ పుస్తకం నేను చదవలేదు కానీ గూగుల్ లో దీని సారంశం చదివాను. డబ్బు సంపాదన గురించి నా పుస్తకం (ఏప్రిల్ విడుదల) “ఇంటి పెరట్లో లక్ష్మి చెట్టు” లో ‘వృద్ధాప్యం లో డబ్బు అవసరం’ గురించి ప్రస్తావిస్తూ ఆ సారాoశాన్ని ప్రస్తావించాను.

నువ్వు వెల్లకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు. గగనం లో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి. నిన్ను ‘అరే, ఒరేయ్’ అని పిలిచే స్నేహితులొక్కొక్కరూ రాలిపోతూ ఉంటారు. నీ ముందు నిక్కర్లేసుకుని తిరిగిన పిల్లలందరూ … ఇప్పుడు యుక్త వయస్సులోకి వచ్చి నీ చుట్టూ చాలా హడావిడిగా తిరుగుతూ ఉంటారు. నీతో మాట్లాడే సమయం కూడా వారికి ఉండదు.

నీ మీద స్పాట్‌లైట్ ప్రసరించటం మానేసి చాలా కాలం అయిపోయి ఉంటుంది. నీ జీవితంలో నువ్వు ఎన్నో సాధించి ఉండవచ్చు గాక. నీ కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చు గాక. కానీ ప్రస్తుతం దాన్ని ఎవరూ గుర్తించరు. ఈ సొసైటీ నీ గురించి పట్టించుకోవటం మానేసి చాలా కాలం అయివుంటుంది.

దాహంతో దూరంగా ఎక్కడో ఒక కాకి అరుస్తూ ఉంటుంది. నీ లాంటి వృద్ధుడు ఎవరో నీకు అప్పుడప్పుడు ఫోన్ చేసి ఇంట్లో తన అవస్థ చెప్పుకుంటూ ఉంటాడు. నీ అమూల్య అభిప్రాయాల్ని చెప్పటానికి ఒక శ్రోత ఈ ప్రపంచంలో దొరికిన సంతోషం నిన్ను తబ్బిబ్బు చేస్తుంది.

యవ్వనంలో హెల్త్ ఇన్సూరెన్స్ మానేసి ఆ డబ్బు పిల్లల కాలేజీ ఫీజు కట్టావు. మధ్య వయసులో సంపాదించినది పిల్లల్ని అమెరికా పంపించడానికి ఖర్చు పెట్టావు. అందరితో ‘నా కొడుకు అమెరికాలో, కూతురు ఆస్ట్రేలియాలో ఉన్నది’ అని గర్వంగా చెప్తూ ఉంటావు. ఎన్నాళ్ళకొక సారి వాళ్ళు నిన్ను చూడటానికి వచ్చారన్నది మాత్రం చెప్పవు.

అమెరికా నుంచి నీ కొడుకు సెల్ ఫోన్ లో నీ పుట్టినరోజు తేదీ చూసి ఫోన్ చేస్తాడు. నీకు నీ మనవడితో మాట్లాడాలని ఉంటుంది. వాడు చా….లా బిజీ. అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్కగదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది. పక్క మీద గంటల, రోజుల తరబడీ పడుకొని ఉండటం దినచర్య అవుతుంది. పుట్టిన కొత్తలో పక్క మీద శిశువు నెలల తరబడి కదలకుండా ఎలా ఉంటుందో తిరిగి అదే స్థితి సంభవిస్తుంది.

ఒకటే తేడా ఏమిటంటే చిన్నప్పుడు ఆలనాపాలనా చూసుకోవటానికి తల్లి ఉంది. ఇప్పుడెవరూ లేరు. అప్పుడప్పుడూ వచ్చి పలకరించే కూతురూ, తప్పదన్నట్టు సేవలు చేసే కోడలూ. నీ అదృష్టం బాగా లేకపోతే అనాథాశ్రమంలో వారు కూడా ఉండరు. నువ్వు కొద్దిగా ఎక్కువ తిన్నా, అసలు తినకపోయినా మెడిసిన్ చదివిన డాక్టర్లలాగా నీ పిల్లలు నీకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఒళ్ళు వెచ్చబడితే చలిలో తిరిగావనీ, జలుబు చేస్తే చన్నీళ్ళ స్నానం చేశావనీ, కాళ్ళు నొప్పులు పెడితే గుడికి ఎందుకు వెళ్ళావనీ … నిన్ను మందలిస్తూ ఉంటారు.

ప్రొద్దున్న లేచేసరికి అకస్మాత్తుగా ఏ జలుబో, కీళ్ళ నొప్పులో ప్రారంభం అవుతాయి. బాత్‌రూంలో పడటం, కాళ్ళు విరగటం, జ్ఞాపకశక్తి నశించటం, ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ చాలా క్యాజువల్‌గా ‘నీకు కాన్సర్’ అని చెప్పటం మొదలైనవి అన్నీ నీ జీవితంలో భాగమైపోతాయి. నీది మరీ మధ్యతరగతి కుటుంబం అయితే, నువ్వు సంపాదించిన డబ్బు నీ ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా, చూసీ చూడనట్టు నీ మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో … నీ పక్క గదిలో నీ వాళ్ళు చర్చిస్తూ ఉంటారు.

మరేం చెయ్యాలి? THE SKY GETS DARK SLOWLY అనే పుస్తకంలో రచయిత “ప్రస్తుత జీవన విధానం మార్చుకుంటే పై సమస్యల్లో ‘కనీసం కొన్ని’ తగ్గించుకోవచ్చు” అంటాడు. “ఆకాశo క్రమక్రమంగా నల్లబారుతోందనీ, ఒక్కొక్క దీపమే ఆరిపోతుందనీ గ్రహించిన వ్యక్తి జీవితపు ఆఖరి స్టేజి

కోసం ఆరోగ్యవంతంగా ప్రిపేర్ అవ్వాలంటే అయిదు సూత్రాలు గుర్తుంచుకోవాలి” అంటాడు.

ఆకాశం పూర్తిగా నల్లబడక ముందే నీ దారి పొడుగునా లైట్లు వెలిగించి శక్తి ఉన్నంతవరకూ పని చేస్తూ ఉండు. నీకన్నా అశక్తులకీ, అనాథలకీ సహాయం చేస్తూ ఉండు. ఏకాంతం స్థానే శూన్యత ప్రవేశించినప్పుడు అది అతి తొందరలో ఒంటరితనం గా మారుతుందన్న విషయాన్ని నువ్వు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత బాగుంటుంది.

ప్రతి మనిషి చుట్టూ ఒక ‘తావి’ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ అది సుగంధ సౌరభ పరిమళంగానో, దుర్గంధ పూరితoగానో మారుతుంది. ఎలా మారుతుందనేది హుందాతనాల … నీ చాదస్త ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. పిల్లలు పుట్టగానే లావు అవటం సహజం అనుకోకు. జిహ్వ చాపల్యం తగ్గించు. ఒక వయసు వచ్చాక తిండి ఆనందం కాదు. అవసరం. వయసు పెరిగే కొద్దీ శరీరం ఇచ్చే సంకేతాలు గమనించు. పెగ్గులు సిగరెట్లు తగ్గించు.

ఆంధ్ర తెలంగాణాల్లో లక్షకి ఐదువేల మంది స్త్రీలు థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నారని అంచనా. వయసు వల్ల వచ్చిన అధికారంతో .. నీ చుట్టూ ఉన్నవాళ్ళని శాసించకు. వీలైనంత వరకూ వారి చర్యలపై … నీ అమూల్యాభిప్రాయాన్ని వెల్లడి చేయకు. నీ బోధనలు ఆపి ఒక్కడివే ఉండటం ఎలాగో నేర్చుకో. లేకపోతే నీ ఇంటివారు నిన్ను మరింత దూరం పెడతారు.

ఒంటరిగా కూర్చొని పుస్తకాలు చదువు. ఏకాంతంలో సంగీతాన్ని విను. ఓపికుంటే మొక్కల్ని పరిరక్షించు. చిన్న పిల్లలతో కొద్ది సేపు వారికి … ఇంటరెస్టు ఉన్న టాపిక్స్ కబుర్లు చెప్పు. అఫెక్షన్ బ్యాంక్ లో ఆప్యాయతని క్రెడిట్ చేసుకుంటూ వెళ్ళు. “ఎప్పుడైతే నువ్వు మానసికంగా ఇలా ప్రిపేర్ అయ్యావో నీ వృద్ధాప్యాన్ని … ఓ పది సంవత్సరాలు వాయిదా వెయ్యగలవు” అంటాడు ‘The sky gets dark slowly’ అన్న పుస్తకంలో రచయిత. ఈ పుస్తకం కొన్ని లక్షల కాపీలు అమ్ముడుపోయాయ్! Thanks Yandamoori Veerendranath garu for sharing excellent post

Share this Article

Ads



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions