Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బురద రాజకీయాల నడుమ… చిన్న మరకా అంటని నిష్కళంకుడు…

December 27, 2024 by M S R

.

నిజానికి తను పొలిటిషియన్ కాదు… ఆర్థిక రథాన్ని ఎలా నడపాలో బాగా తెలిసిన సారథి… ప్రణాళికవేత్త… అన్నింటికీ మించి పదే పదే ప్రశంసించదగిన సుగుణం… అవినీతి, అక్రమాలతో కుళ్లిన వర్తమాన రాజకీయ వ్యవస్థలోనే దశాబ్దాలపాటు కీలక స్థానాల్లో ఉన్నా సరే, ఏదీ అంటకుండా నిష్కళంకుడిగా బతికిన స్వచ్చుడు…

తన ఆర్థిక విధానాలను, తన పాలన విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తులు, పార్టీలు కూడా ఆయన్ని ఎప్పుడూ అవినీతిపరుడిగా విమర్శలకు పోలేదు… తను ప్రధానిగా ఉన్న పదేళ్ల యూపీఏ పాలనలో బోలెడు అక్రమాలు, అవినీతి బాగోతాలు… అది వైఫల్యం కాదా అనేవాళ్లూ ఉంటారు… తను నిస్సహాయుడు, యూపీఏ హయాంలో కాంగ్రెస్, దాని భాగస్వామ్య పక్షాల నిర్వాకాలకు తను మౌనసాక్షి మాత్రమే…

Ads

మొత్తం తన జీవితచరిత్రలో బాగా నచ్చేది ఈ స్వచ్ఛతే… స్టేట్స్‌మన్ అనే పదానికి ఓ ఐకన్ తను… ఎక్కడా ఒక్క పదం కూడా తూలడు… వ్యర్థ ప్రసంగాలు ఉండవు… అమర్యాద, కుసంస్కారం, బంధుప్రీతి వంటివేమీ లేని టవరింగ్ పర్సనాలిటీ… అందుకే 92 ఏళ్ల జీవితం మకిలిపట్టలేదు…

టూజీ కుంభకోణంలో భ్రష్టుపట్టిన మాజీ కేంద్ర మంత్రి రాజా ఓసారి తమ నిర్ణయాలన్నీ ప్రధానితో సంప్రదించాక తీసుకున్నవే అని ఆరోపించాడు… మన్మోహన్ సింగ్‌కు బురద పూసి, తమపై ఆరోపణల తీవ్రత తగ్గించుకునే మూర్ఖపు ఎత్తుగడ… జాయింట్ పార్లమెంటరీ కమిటీ మన్మోహన్ సింగ్ తప్పు వీసమెత్తు లేదని క్లీన్ చిట్ ఇచ్చింది…

ఇంకేదో ఇష్యూలో అప్పటి ప్రధాని కార్యాలయ అధికారులను సైతం సీబీఐ ప్రశ్నించింది… ఎక్కడా ఎవ్వరూ మన్మోహన్ మీద అణువంత అవినీతి మరకను కూడా చూపలేకపోయారు… తను రాజకీయ పదవులు అధిరోహించిన ఓ హైలెవల్ బ్యూరోక్రాట్… అదీ సింపుల్‌గా మన్మోహన్ సింగ్…

కంట్రాస్టు ఏమిటంటే..? మాజీ ప్రధాని చంద్రశేఖర్ దగ్గర తను ఆర్థిక వ్యవహారాల సలహాదారు… ఆ కాలంలోనే మన ఆర్థిక వ్యవస్థ పాతాళంలోకి పడిపోయి, మన బంగారాన్ని కుదువపెట్టాల్సి వచ్చింది… తను చెప్పినా వినిపించుకునేవారెవరు నాటి పాలన వ్యవస్థలో..? అదే మన్మోహన్ సింగ్ తిరిగి అదే బంగారాన్ని విముక్తం చేయడానికి, దేశ ఆర్థికరథాన్ని గాడిన పడేయటానికి అహర్నిశలూ కష్టపడ్డాడు… అదీ తన తత్వం… పాలసీ డెసిషన్స్ తీసుకునేవాళ్లను బట్టి తన పనితీరు… అంతే… 

నిజానికి పీవీ తనను వెలుగులోకి తీసుకొచ్చాడు అంటారు కానీ కాదు… మినిస్ట్రీ ఆఫ్ పారిన్ ట్రేడ్ లలిత్ నారాయణ్ నారాయణ మిశ్రా తనను సలహాదారుగా తీసుకున్నాడు… అప్పటి నుంచే తను ఆర్బీఐ, ప్లానింగ్ కమిషన్ దాకా బోలెడు బాధ్యతలు నిర్వర్తించాడు… అంతకుముందు సీనియర్ లెక్చరర్, రీడర్, ఐక్యరాజ్యసమితికి కూడా వర్క్ చేశాడు తను…

కాకపోతే పీవీ ఏకంగా తనను ఆర్థికమంత్రిగా తీసుకుని, కావల్సిన స్వేచ్చ ఇచ్చాడు… మన్మోహన్ విధానాల్ని తను ప్రధానిగా డిఫెండ్ చేసుకునేవాడు… ఆర్థిక సరళీకరణకు రథి పీవీ, సారథి మన్మోహన్‌సింగ్… సోనియా ప్రధాని కావాలని భావించినా దేశం యావత్తూ నిరసన చెప్పేసరికి… తను చెప్పినట్టు నడుచుకునే ఓ నాన్ కంట్రవర్సీ బ్యూరోక్రాట్ ప్రధాని కావల్సి వచ్చాడు ఆమెకు… సో, పేరుకు ప్రధాని తనే… కానీ అసలు ప్రధాని కార్యాలయం టెన్ జనపథ్..!

తన పిల్లలు కూడా ఉన్నత విద్యావంతులు… ఎప్పుడూ ఎవరూ రాజకీయాల వాతావరణంలోకి రాలేదు… వర్తమాన రాజకీయ దుర్లక్షణాల వాసన కూడా సోకనివ్వలేదు… తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పనిచేయాలి, దేశానికి ఏమైనా మంచి చేయాలి… అందుకే పెద్దగా మీడియా ముందుకు కూడా వచ్చేవాడు కాదు… మొత్తానికి భారత దేశ చరిత్రలో మన్మోహన్ సింగ్‌ది ఓ విశిష్ట అధ్యాయం..! వెరీ రేర్ పర్సనాలిటీ..! తన నిష్క్రమణ పట్ల ‘ముచ్చట’ నివాళి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions