నిన్న రామయ్య అనే మాజీ లష్కర్ అన్నమయ్య ప్రాజెక్టు కింద ఉండే కొన్ని ఊళ్ల ప్రజల్ని సమయానికి ఎలా అలర్ట్ చేసి, వాళ్ల ప్రాణాల్ని కాపాడాడో ఓ స్టోరీ చదివాం కదా… అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము దాకా తెలిసినవాళ్లందరికీ ఆయన ఫోన్లు చేసి, అప్రమత్తం చేయడం వల్ల ఆ ప్రాజెక్టు తెగి, ఊళ్లను ముంచెత్తినా సరే, చాలా ప్రాణనష్టం తప్పింది… హఠాత్తుగా ఓ కథ గుర్తొచ్చింది… ఏ క్లాసో గుర్తులేదు, కానీ చిన్నప్పుడు ఒక నాన్-డిటెయిల్‌లోని ఇంగ్లిష్ కథ… నిజానికి రామయ్య కథకూ ఆ పాత కథకూ లింక్ లేదు, కానీ ఎవరో ఒకరి కారణంగా కొన్నిసార్లు జననష్టం అనుకోకుండా ఎలా నివారించబడుతుందో రెండు కథలూ చెబుతాయి… ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథలో హీరో హమాగుచి… ఆయనది జపాన్…
మనకు సునామీ గురించి ఎప్పుడు తెలుసు..? 2004లో తూర్పు తీరాన్ని ముంచెత్తినప్పుడు… అపారమైన నష్టం… అసలు అప్పటికి సముద్రకంపనాన్ని సునామీ అంటారని కూడా మన మీడియాకు తెలియదు… ఆరోజు ఈనాడు ఈవినింగ్ ఎడిషన్ వేసింది… (అసాధారణం)… కానీ సునామీ అనే పేరు రాసినట్టు కూడా గుర్తులేదు… తెల్లవారి వార్త పత్రిక త్సునామీ అని హెడ్డింగ్ పెట్టినట్టు కూడా గుర్తుంది… కానీ సునామీలు, భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనాలు వంటి విపత్తులు జపాన్‌లో ఎక్కువే… మనం హమాగుచి కథాకాలానికి వెళ్దాం ఓసారి…
Ads
ఆయనది జపాన్‌లోని ఓ తీర గ్రామం… ఈయన అప్పటికే వృద్ధుడు… ఊళ్లోవాళ్లందరికీ పెద్దమనిషి… ఊళ్లో వాళ్లందరూ వరి పండిస్తారు… ఓ మిట్ట ప్రాంతం, అంటే దాదాపు ఓ చిన్న గుట్టవంటి ప్రాంతంపై ఈయన ఇల్లు… పైనే చదునుగా ఉన్నచోట తను కూడా వరి పండిస్తుంటాడు… వాలులో కొన్ని ఇళ్లు, గుట్ట దిగువన ఊరు ఉంటయ్… ఓసారి వరి విరగపండింది, మస్తు దిగుబడి… కోతలు సాగుతున్నయ్, వరి కుప్పలు పేరుస్తున్నారు… ఓరోజు హమాగుచి తన బాల్కనీలో నిలబడి చుట్టూ చూస్తున్నాడు… దిగువన ఊళ్లో రైతులు సెలబ్రేషన్స్‌కు రెడీ అవుతున్నారు… అకస్మాత్తుగా వాతావరణం వేడెక్కుతున్నట్టు గమనించాడు… స్వల్ప ప్రకంపనలు… అవి ఆ ఊరి వాళ్లకు అనుభవమే… చిన్న చిన్న భూకంపాలకు అలవాటు పడినవాళ్లే… కానీ ఆయనకు ఇంకేదో అసాధారణంగా తోస్తున్నది… సముద్రం వెనక్కి వెళ్తోంది… అప్పుడప్పుడు అదీ అనుభవమే, కానీ ఇదేదో ఎక్కువ అసహజంగా కనిపిస్తోంది ఆయనకు…
తనుండేది గుట్టపై భాగంలో కాబట్టి సముద్రంలో చాలాదూరం వరకూ కనిపిస్తుంది… తేరిపార చూశాడు… ఇలాంటి సూచనలు భారీ సముద్రకంపానికి, ప్రమాదానికి సూచికలు అని చిన్నప్పుడు తాత చెప్పినవన్నీ గుర్తొచ్చాయి… దూరంగా నల్లటి గుట్టల్లా అలలు లీలగా కనిపిస్తున్నయ్… మనసు కీడు శంకించింది… అందరినీ అలర్ట్ చేయాలి, కానీ కమ్యూనికేట్ చేయడం ఎలా..? అరిస్తే దిగువ దాకా వినబడదు… తన ఆరోగ్యం కూడా బాగాలేదు, వెంటనే దిగువకు పరుగెత్తి అందరినీ హెచ్చరించేంత టైమ్ కూడా లేదు, దేహం కోఆపరేట్ చేసేట్టు లేదు… రైతులు పండుగ మూడ్‌లో ఉన్నారు, గుట్టపై ఉన్న ఓ గుడి గంట మోగించినా లాభం లేదనిపించింది… తళుక్కున ఓ ఆలోచన మెరిసింది… ప్రమాదం దగ్గర పడుతోంది…
తక్షణం ప్రజల దృష్టిని ఆకర్షించాలి… అందుకని ఆయన తన వరి కుప్పల్ని తనే తగులబెట్టసాగాడు… తన వెంట ఉన్న మనమడు వారిస్తున్నా వినలేదు, తాతకు పిచ్చి పట్టినట్టుందనుకున్నాడు మనమడు… మంటలు ఎగిశాయి, పొగ రేగింది… గ్రామస్థుల దృష్టి దానిపై పడింది… ఏమైందీ ఏమైందీ అనుకుంటూ అనేకమంది పరుగెత్తుకొచ్చి, ఆర్పడానికి ప్రయత్నించారు… ఆ వృద్ధుడు గుడిలో గంట మోగిస్తూ, మంటలు ఆర్పవద్దన్నాడు, అందరూ పైకి రావాలి, ప్రమాదం ముందుకొస్తోంది అని దూరంగా చూపించాడు… గంట మోత, మంటల పొగ గమనించి మరికొందరు గుట్ట పైకి వచ్చేశారు, ఆ వృద్ధుడి అరుపుల మేరకు, గబగబా మిగతా వాళ్లను కూడా హడావుడిగా పైకి తీసుకొచ్చేశారు, పిల్లలు-తల్లులు, వృద్ధులు… ఈలోపు సముద్రం ఉరిమింది… రానే వచ్చింది ముప్పు… ఊళ్లో వాళ్లు చూస్తుండగానే భారీ సునామీ ప్రళయఘోషతో ఊరిని ముంచేసింది… కొన్ని కిలోమీటర్ల మేర నీరే… పంటలు, పశువులు, ఇళ్లు అన్నీ కనిపించకుండా పోయాయ్…
భారీ విధ్వంసం… కానీ ప్రాణనష్టం లేదు… వందల మంది రక్షింపబడ్డారు… మనమడిని చూస్తూ అన్నాడు ఆ తాత… ‘‘వాళ్లను తక్షణం పైకి రప్పించాలంటే, ప్రమాదం గురించి హెచ్చరించాలంటే ఇంతకుమించిన ఆలోచన తట్టలేదురా మనమడా..? ఇప్పుడు పంట పోతేనేం, మళ్లీ పండించుకుందాం… కొత్త ఊరు నిర్మించుకుందాం, కానీ ప్రాణాలంటూ మిగలాలి కదా… ఊరి నష్టంలో మన నష్టం ఎంత..? ఇదొక త్యాగమా..? పోతేపోనీ… నేనెందుకు వరి కుప్పల్ని ఎందుకు కాలబెట్టానో అర్థమైంది కదా’’ అని వివరించాడు… ఊరివాళ్లందరికీ ఆయనకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కాలేదు… కొన్నాళ్లకు ఊళ్లోనే ఆయనకు ఓ గుడి కట్టారు, రోజూ ఉదయమే ఆయన్ని స్మరించుకోవడం అలవాటైంది… అదీ కథ… మనకు ఇంకా నూకలు మిగిలి ఉంటే ఇలాంటి అద్భుతాలు మనల్ని ఒడ్డున పడేస్తయ్… ఎవరో ఓ హమాగుచి దేవుడిలా ఆదుకుంటాడు…!!
Share this Article