Nagaraju Munnuru…….. == The Street Smart Guy and Others == హిండెన్ బర్గ్ (Hindenburg) 24 జనవరి, 2023…. హిండెన్ బర్గ్ రీసెర్చ్ అనే ‘ఫోరెనిక్స్ ఫైనాన్షియల్ పరిశోధన సంస్థ’ ప్రపంచవ్యాప్తంగా కంపెనీల్లో జరిగే అకౌంటింగ్ అవకతవకలను, మోసాలను గుర్తించి పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురిస్తుంది. హిండెన్ బర్గ్ సంస్థను రీసెర్చ్ సంస్థ అనడం కంటే షార్ట్ సెల్లింగ్ కంపెనీ అనడం సరియైనది. ఎందుకంటే ఇది ఏ కంపెనీలో అయితే అవకతవకలు జరిగాయని పరిశోధనాత్మక వ్యాసం రాస్తుందో అంతకు ముందే స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ షేర్లను షార్ట్ సెల్లింగ్ చేస్తుంది.
హిండెన్ బర్గ్ గురించి సింపుల్గా చెప్పాలంటే ముందుగా తాను టార్గెట్ చేసిన కంపెనీ షేర్లను షార్ట్ సెల్లింగ్ చేస్తారు. ఒక కంపెనీ షేర్స్ మన వద్ద లేకపోయినా స్టాక్ మార్కెట్లో అమ్మడాన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు. ఆ తరువాత ఆ కంపెనీ మీద ముందే సిద్దం చేసుకున్న నెగిటివ్ రిపోర్టు పబ్లిష్ చేస్తారు. సహజంగానే వ్యతిరేక వార్తలకు తీవ్రంగా స్పందించే గుణమున్న స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు, రిటైల్ ఇన్వెస్టర్లు తమవద్ద నున్న ఆ కంపెనీ షేర్లను అమ్ముతారు. తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఎదురవడంతో ఆ కంపెనీ షేరు ధర పతనం అవుతుంది. తాము టార్గెట్ చేసిన కంపెనీ షేరు ధర అనుకున్న టార్గెట్ ధర వరకు పడిపోగానే అదివరకు తీసుకున్న షార్ట్ పొజిషన్ క్లోజ్ చేసి లాభాలు మూటగట్టుకుంది హిండెన్ బర్గ్. మొత్తం మీద ఈ షార్ట్ సెల్లింగ్ వ్యవహారంలో హిండెన్ బర్గ్ కొన్ని కోట్ల రూపాయలు (తాము తీసుకున్న లాట్ సంఖ్య అధికంగా ఉంటే ఈ లాభాలు బహుశా కొన్ని మిలియన్ లేదా బిలియన్ డాలర్లు కూడా ఉండవచ్చు) లాభాలను ఆర్జిస్తుంది. స్టాక్ మార్కెట్లో షార్ట్ సెల్లింగ్ అనేది చట్టబద్ధమే కాబట్టి పెద్దగా ఎవరూ ఏమి చేయలేరు.
అదానీ గ్రూప్ (Adani Group) 28 జనవరి, 2023… అదానీ గ్రూప్ తన కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచడం వంటి అవకతవకలకు పాల్పడుతుందని, అకౌంటింగ్ మోసాలు చేస్తుందని, కంపెనీ రుణభారం నిర్దిష్ట పరిమిత స్థాయికి మించి ఉందనే ఆరోపణలతో హిండెన్ బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన రిపోర్టు అదానీ గ్రూప్ కంపెనీల మీద తీవ్రంగానే పడింది. రెండు ట్రేడింగ్ సెషన్లలో అదానీ గ్రూపులోనీ 10 కంపెనీల షేర్లు 5-20% వరకు పతనం అవ్వడంతో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ ₹4.17 లక్షల కోట్లు, భారత స్టాక్ మార్కెట్లు ₹10 లక్షల కోట్లకు పైగా నష్టపోయాయి. గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద రెండు రోజుల్లోనే 20 బిలియన్ డాలర్లు తగ్గడంతో ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో 7వ స్థానానికి దిగివచ్చాడు. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లకు 23 నష్టాలపాలయ్యాయి. ఇంతగా హిండెన్ బర్గ్ రిపోర్ట్ ప్రభావం అదానీ గ్రూప్ సంస్థల మీద, భారత స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది.
Ads
జనవరి 24న హిండెన్ బర్గ్ విడుదల చేసిన నివేదిక అదానీ గ్రూప్ కంపెనీల మీద తీవ్ర ప్రభావం చూపిందని పడిపోయిన అదానీ గ్రూప్ కంపెనీల షేర్స్ విలువలు తెలియజేస్తున్నాయి. సెప్టెంబర్ 2022లో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ 290 బిలియన్ డాలర్లు (దాదాపు ₹24 లక్షల కోట్లు) ఉండగా ఫిబ్రవరి 20, 2023 నాటికి 90 బిలియన్ డాలర్లకు (దాదాపు₹7.44 లక్షల కోట్లు) చేరింది. అంటే 200 బిలియన్ డాలర్లు (₹16.54 లక్షల కోట్లు) మార్కెట్ విలువ కోల్పోయింది.
20 ఫిబ్రవరి, 2023………. సెప్టెంబర్ 2022లో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ 290 బిలియన్ డాలర్లు (దాదాపు ₹24 లక్షల కోట్లు) ఉండగా ఫిబ్రవరి 20, 2023 నాటికి 90 బిలియన్ డాలర్లకు (దాదాపు ₹7.44 లక్షల కోట్లు) చేరింది. అంటే 200 బిలియన్ డాలర్లు (₹16.54 లక్షల కోట్లు) మార్కెట్ విలువ కోల్పోయింది.
అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువతో పాటు గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద విలువ కూడా గణనీయంగా తగ్గింది. జనవరి 24న 119 బిలియన్ డాలర్లు ఉన్న గౌతమ్ అదానీ సంపద 20 ఫిబ్రవరి నాటికి 49 బిలియన్ డాలర్లకు పరిమితం అయ్యింది. అంటే కేవలం 26 రోజుల్లో 70 బిలియన్ డాలర్లు (₹5.79 లక్షల కోట్లు) గౌతమ్ అదానీ నష్టపోయారు.
అదానీ గ్రూపులో 10 కంపెనీల షేర్స్, 52 వారాల గరిష్టం, 20 ఫిబ్రవరి నాటి విలువ, నష్ట శాతం వంటి వివరాలు కింది విధంగా ఉన్నాయి.
Company – 52 weeks high – 20 Feb’23 – Loss
Adani Ent – 4189 – 1619 – 61.34%
Adani Green – 3048 – 597 – 80.39%
Adani Trans – 4238 – 873 – 79.38%
Adani Total – 3998 – 925 – 76.86%
Adani Ports – 987 – 579 – 41.32%
Adani Power – 432 – 163 – 62.33%
Adani Wilmar – 878 -429 – 51.10%
Ambuja Cement – 598 – 353 – 40.93%
ACC – 2784 – 1850 – 33.54%
NDTV – 567 – 209 – 63.15%
మొత్తం మీద అదానీ గ్రూపు కంపెనీలు మరియు గౌతమ్ అదానీ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక వలన భారీగా నష్టపోయారు. కానీ ఇది కూడా ఒకరకంగా అదానీకి మంచే చేస్తుందనీ స్వామినాథన్ అయ్యర్ అనే విశ్లేషకుడు అభిప్రాయ పడ్డారు.
సాధారణ మదుపరులు (Retail Investors)
స్టాక్ మార్కెట్ పెట్టుబడులలో దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DII), విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) వంటి భారీ పెట్టుబడిదారులతో పాటు సాధారణ మదుపరులు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. అందుబాటు ధరలలో స్మార్ట్ ఫోన్లు, చౌక డేటా లభించడం, సులభంగా ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసి మొబైల్ అప్లికేషన్ ద్వారానే ట్రేడింగ్ చేసుకునే సౌకర్యం ఉండటం, ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ సమయంలో అనేకమంది యువత కొత్తగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లోకి ప్రవేశించడం వలన స్టాక్ మార్కెట్లో సాధారణ మదుపరుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. అయితే హిండెన్ బర్గ్, అదానీ వ్యవహారంలో నష్టపోయింది మాత్రం కొన్ని నెలల క్రితం అంటే జనవరి 24 కంటే ముందు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు కోనుగోలు చేసి పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేసిన రిటైల్ ఇన్వెస్టర్లు. ఒకవేళ వీళ్ళు ఇప్పటికీ షేర్స్ హోల్డ్ చేసినట్లయితే ఇంకా నష్టాల్లోనే ఉండే అవకాశం ఎక్కువ. ఒక అంచనా ప్రకారం అదానీ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన రిటైల్ ఇన్వెస్టర్లు సుమారు ₹3500 కోట్లు నష్టపోయినట్లు సమాచారం.
కొన్ని పత్రికలు, టీవీలు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, నాయకులు జనవరిలో హిండెన్ బర్గ్ రిపోర్టు వచ్చిందో లేదో అదానీ మీద సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోయడం మొదలు పెట్టారు. హిండెన్ బర్గ్ గొప్ప పరిశోధనా సంస్థ ఎంతో రిసెర్చ్ చేసి ఈ నివేదిక ఇచ్చిందని ఈ సుద్దపూసలు ఒకటే కాకి గోల మొదలెట్టారు. ఇక దేశం నాశనం అవుతుందని, ఆర్థికంగా పతనం అవుతుందని, మోడి దేశ సంపదనను అదానికి దోచిపెట్టాడనీ, అసలు దేశాన్ని నడిపిస్తున్నది పరోక్షంగా అదానీనే అని, ప్రజలు ఎల్ఐసికి కట్టిన డబ్బులు అదానీ పాలయ్యాయని సోషల్ మీడియాలో, టీవీలలో, పత్రికలలో చివరికి పార్లమెంటులో కూడా రచ్చ రచ్చ చేశారు. కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఎల్ఐసినీ కాపాడాలని, జెపిసి (JPC) వేయాలని, సుప్రీంకోర్టు విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటులో గాంధీ విగ్రహం ముందు ధర్నా కూడా చేశాయి.
24 మే, 2023…….. మూడు నెలల క్రితం ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో మోడి తన మిత్రుడు అదానీ కోసం ఎల్ఐసినీ నాశనం చేస్తున్నాడని పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి, గాంధీ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశాయి. 24 మే, 23న ఎల్ఐసి ప్రకటించిన ఆర్థిక ఫలితాలలో 2022-23 ఆర్థిక సంవత్సర జనవరి – మార్చి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 5 రెట్లకు పైగా (547%) పెరిగి ₹13,191 కోట్లకు చేరింది. 2021-22 ఇదే కాలంలో నికర లాభం ₹2,409 కోట్లు మాత్రమే. అంటే ప్రతిపక్షాలు ఏ జనవరిలో అయితే ఎల్ఐసి ప్రభుత్వం నాశనం చేస్తున్నదని నిరసనలు వ్యక్తం చేశాయో అదే సమయంలో ఎల్ఐసి గతంలో కంటే 5 రెట్లు మెరుగ్గా రాణించింది. అదొక్కటే కాదు 2022-23 పూర్తి ఆర్థిక సంవత్సరం నికర లాభం ₹35,997 కోట్లు. అంతకు మునుపు ఆర్థిక సంవత్సరం 2021-22లో ₹₹4,125 కోట్లు మాత్రమే. ఇక ఎల్ఐసి అదానీ గ్రూపు కంపెనీలలో ఏడు కంపెనీలలో పెట్టిన పెట్టుబడుల మార్కేట్ విలువ కూడా ₹44,670 కోట్లకు పెరిగింది.
ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు అన్ని అవాస్తవాలు అని, ఎల్ఐసి సంస్థ గతంలో కంటే 5 రెట్లు మెరుగ్గా రాణించింది అన్నది కళ్ళకు కనబడుతున్నా సత్యం. ఎల్ఐసినీ కాపాడాలని అన్నారు కదా! దేని నుండి కాపాడాలి? లాభాలు సంపాదించడం నుండా? తప్పుడు ఆరోపణలు చేసిన ప్రతిపక్షాలు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.
సుప్రీంకోర్టు కమిటీ దర్యాప్తు నివేదిక…… 19 మే, 2023…. ప్రతిపక్షాలు డిమాండ్ చేసినట్లు అదానీ – హిండెన్ బర్గ్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అదానీ గ్రూప్ కంపెనీల మీద హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలపై విచారణకు ఒక కమిటీని నియమించండి అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరితే కేంద్ర ప్రభుత్వం ఆ కమిటీలో సభ్యులుగా ఎవరు ఉండాలో నిర్ణయించి, ఆ పేర్లను ఒక సీల్డ్ కవర్లో పెట్టి సుప్రీంకోర్టుకు అందజేసింది. అయితే ఈ సీల్డ్ కవర్ వ్యవహారం మాకు నచ్చదు, అంతా పారదర్శకంగా జరగాలి, మీరు సిఫార్సు చేసిన పేర్లను మేం తిరస్కరిస్తున్నాం, కమిటీలో సభ్యులుగా ఎవరు ఉండాలి అనేది మేమే నిర్ణయిస్తాం అని సుప్రీంకోర్టు స్వయంగా జస్టిస్ ఏ.ఎం.సప్రే అధ్యక్షతన ఆరుగురు సభ్యుల ఒక ప్రత్యేక కమిటీని నియమించింది.
ఈ కమిటీ విచారణ జరిపి ఒక రిపోర్టు ఇచ్చింది. ఈ నివేదికలో అదానీ గ్రూప్‌పై హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తేల్చి చెప్పింది. స్టాక్ ధరల్ని కృతిమంగా పెంచి చూపించినట్లు గానీ, అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడినట్లు గానీ ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని వెల్లడించింది. ఇంకా ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లోనూ ఎలాంటి మోసాలు జరగలేదని స్పష్టం చేసింది.
అంతే కాకుండా హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వెలువడేందుకు కొన్ని రోజుల (జనవరి 24) ముందు అదానీ గ్రూప్ స్టాక్స్‌లో షార్ట్ పొజిషన్లు పెరిగాయని చెప్పింది. ఇందులో 4 FPI లు, ఒక కార్పొరేట్ సంస్థ, ఒక వ్యక్తి అదానీ కంపెనీలపై భారీగా షార్ట్ పొజిషన్లు తీసుకున్నట్లు తెలిపింది. హిండెన్ బర్గ్ రిపోర్టు వెలువడి అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పతనం కాగానే వాళ్ళు తీసుకున్న షార్ట్ పోజిషన్స్ స్క్వేర్ ఆఫ్ చేసుకుని భారీ లాభాలు మూటగట్టుకున్నారని కూడా కమిటీ నిర్ధారించింది. అంటే ఎవరో లాభాలు సంపాదించడానికే ఈ హిండెన్ బర్గ్ రిపోర్ట్ తయారు చేసినట్లు సుప్రింకోర్టు కమిటీ పరోక్షంగా ఒప్పుకున్నట్లు అయింది.
ఈ ఆరు సంస్థలు లేదా వ్యక్తుల వెనుక ఎవరు ఉన్నారు అనేది సెబీ (SEBI) చేస్తున్న తదుపరి విచారణలో బయట పడుతుంది అని కమిటీ చెప్పింది. సెబీ తీసుకుంటున్న నియంత్రణ చర్యల వల్లే హిండెన్ బర్గ్ నివేదిక విడుదల ఆయిన తరువాత కూడా భారత స్టాక్ మార్కెట్ హెచ్చుగా ఒడిదుడుకులకు లోనవకుండా ఉందని కమిటీ అభిప్రాయ పడింది.
ఒకవేళ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం సీల్డ్ కవర్లో సూచించిన వ్యక్తులనే దర్యాప్తు కమిటీ సభ్యులుగా నియమించి ఉంటే, ఇప్పుడా కమిటీ కనుక అదానీకి క్లీన్ చిట్ ఇచ్చి ఉంటే మోడీ తన మిత్రుడు అదానీనీ రక్షించడానికి తనకు నచ్చిన వారిని కమిటీ సభ్యులుగా నియమించి అదానీకి క్లీన్ చిట్ ఇప్పించాడు అని ప్రతిపక్షాలు మోడీని విమర్శించేవి. సందు దొరికితే మోడీని విమర్శిద్దాం అనుకునే మోడీ ద్వేషులకు ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది.
GQG పార్టనర్స్…… 02 మార్చి, 2023……. అమెరికాకు చెందిన రాజీవ్ జైన్ నేతృత్వంలోని GQG పార్టనర్స్ అనే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ సంస్థ 02 మార్చి, 2023నాడు అదానీ గ్రూప్ లోని నాలుగు కంపెనీలలో (అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ ఎంటర్ ప్రైజేస్) 1.87 బిలియన్ డాలర్లు అంటే, ₹15,446 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఇప్పుడీ పెట్టుబడుల విలువ 65% పెరిగి ₹24,515 కోట్లకు చేరుకుంది. అంటే మూడు నెలల్లోనే ₹10,069 కోట్ల రూపాయల లాభం సంపాదించింది.
మార్కెట్లో అదానీ స్టాక్స్ పడిపోతున్న సమయంలో అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం వెనకున్న హేతుబద్ధత ఏమిటని రాజీవ్ జైన్ ను ప్రశ్నించగా “మేము మా పెట్టుబడుల నిర్ణయాలను లోతైన అధ్యయనం ఆధారంగా తీసుకుంటాము మరియు మేము గుంపును అనుసరించము” అని చెప్పారు. కానీ విచిత్రం ఏమిటంటే GQG పార్టనర్స్ అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది అని తెలిసిన మరుసటి రోజు ఆ కంపెనీ షేరు 3 శాతం పడిపోయింది. కానీ ఇప్పుడు వారి పెట్టుబడుల నిర్ణయం సరియైనది అని నిరూపితం అయ్యింది.
ప్రధానిగా మోడీ పనితీరు (PM Narendra Modi) 26 మే, 2014 – 2023……… ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని ఆ దేశ స్టాక్ మార్కెట్ ప్రతిబింబిస్తుంది అని చెప్పవచ్చు. 26మే, 2023 నాటికి నరేంద్ర మోడీ ప్రధానిగా 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. మరి ఈ తొమ్మిదేళ్ళ కాలంలో కోవిడ్ వంటి సంక్షోభం ఎదురైనా కూడా భారత స్టాక్ మార్కెట్లు మదుపరులకు లాభాల పంట పండించాయి అంటే అది ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణం అని చెప్పవచ్చు. గత తొమ్మిది సంవత్సరాలలో సెన్సెక్స్, నిఫ్టీ 150 శాతానికి పైగా లాభపడ్డాయి. అంటే సగటున సంవత్సరానికి 17% శాతం లాభం సంపాదించాయి. 26 మే, 2014న BSE sensex 24,716 ఉండగా నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ₹85.21 లక్షల కోట్లుగా ఉంది. ఇది 26 మే, 2023 నాటికి BSE sensex 62,501కి చేరుకోగా, నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ₹282.67 లక్షల కోట్లకు చేరుకుంది.
సింపుల్ గా చెప్పాలంటే మీరు గనుక మోడి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న 26మే, 2014న సెన్సెక్స్ లేదా నిఫ్టీ సూచీలలో ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే ఆ పెట్టుబడి విలువ ఈరోజు రెండున్నర లక్షల రూపాయలు అయ్యేది. నిఫ్టీలోని ఇతర సూచీలు ఈ తొమ్మిది ఏళ్లలో నిఫ్టీ కంటే అధిక ప్రతిఫలాన్ని ఇచ్చాయి. నిఫ్టీ ఐటీ -219%, నిఫ్టీ ఆర్థిక సేవలు – 216%, నిఫ్టీ బ్యాంక్ – 190%, నిఫ్టీ ఏంఎన్సి – 186%, నిఫ్టీ ఎఫ్ఎంసిజి -177%, నిఫ్టీ వినియోగ – 177% ప్రతిఫలం ఇవ్వగా నిఫ్టీ ఇంధన – 140% నిఫ్టీ వాహన – 115% నిఫ్టీ కంటే తక్కువ ప్రతిఫలం ఇచ్చాయి. స్టాక్ మార్కెట్ సూచీలు పెరగడానికి తగ్గడానికి అనేక కారణాలు ఉంటాయి. నిఫ్టీ ఐటీ సూచీ గత తొమ్మిదేళ్లలో అత్యధిక రిటర్న్స్ ఇవ్వడానికి కారణం మోది తీసుకువచ్చిన డిజిటల్ విప్లవానికి తోడు కరోనా సమయంలో అన్ని రంగాలు డిజిటల్ కు మారడం వల్ల ఐటీ కంపెనీలకు భారీగా ప్రాజెక్టులు రావడం మరొక కారణం.
భారత జిడిపి ప్రస్తుత 3.5 ట్రిలియన్ డాలర్ల నుండి 2031 నాటికి 7.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, 2027 నాటికి జపాన్, జర్మనీ దేశాలను అధిగమించి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, వచ్చే ఐదేళ్లలో సెన్సెక్స్ ప్రస్తుతమున్న 62,501 స్థాయి నుండి 1,00,000 పాయింట్లను చేరుతుందని అంచనాలు ఉన్నాయి.
The Street Smart Guy….. 01 ఫిబ్రవరి, 2023 – 26 మే, 2023……… ఈ ఆర్టికల్ కి హీరో ఇతనే. తన పేరు వెల్లడించడానికి ఇష్టపడటం లేదు, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల మీద విశేష అనుభవం ఉన్న కారణంగా దలాల్ స్ట్రీట్, వాల్ స్ట్రీట్ పేర్ల స్ఫూర్తితో Street Smart Guy అనే పేరు పెట్టాను. ఇతను సాధారణంగా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతుంటాడు. కానీ ఎందుకో తెలియదు కానీ ఇతని పోర్టుఫోలియోలో ఫిబ్రవరి, 2023కి ముందు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఒక్కటి కూడా లేవు. జనవరి 24న ఎప్పుడైతే అదానీ గ్రూప్ మీద హిండెన్ బర్గ్ నివేదిక ఇచ్చిందో అప్పుడే ఊహించాడు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పతనం అవుతాయని. అనుకున్నట్లు గానే రెండు ట్రేడింగ్ సెషన్లలో అదానీ గ్రూప్ కంపెనీల్లో అనేక షేర్లు లోయర్ సర్కిట్ తాకాయి. ఒక టార్గెట్ ధర వరకు రాగానే అదానీ స్టాక్స్ కోనుగోలు చేయాలని సిద్దం అయ్యాడు. ఫిబ్రవరి నెల మొదటి వారంలో ఎంటర్ అయి చివరి వారం వరకు రోజుకు కొన్ని షేర్స్ చొప్పున అదానీ గ్రూప్ 10 కంపెనీల షేర్స్ accumulate చేశాడు. ఇతను కోనుగోలు చేసిన అదానీ షేర్స్ సగటు ధర, 26 మే నాటి ప్రస్తుత విలువ, లాభ శాతం ఈ కింది విధంగా ఉంది.
Name – Avg Price – Current Price – Profit %
Adani Ent – 1193 – 2544 – 113.18%
Adani Green – 462 – 963 – 108.43%
Adani Trans – 676 – 850 – 25.62%
Adani Total – 714 – 760 – 6.50%
Adani Ports – 395 – 726 – 83.94%
Adani Power – 139 – 258 – 85.18%
Adani Wilmar – 344 – 450 – 30.76%
Ambuja Cement – 329 – 424 – 28.69%
ACC – 1694 – 1785 – 5.32%
NDTV – 181 – 227 – 25.43%
అదానీ vs హిండెన్ బర్గ్ వ్యవహారంలో షార్ట్ సెల్లింగ్ చేసిన హిండెన్ బర్గ్ లాభ పడింది, అదానీ గ్రూప్ బిలియన్ డాలర్లు నష్టపోయినా కూడా దీర్ఘకాలంలో సంస్థకు మేలు జరుగుతుంది, అదానీలో పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసి లాభాల్లో ఉంది, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారు GQG పార్టనర్స్ లాభపడింది, బుగ్గ అయ్యింది ప్రభుత్వం మీద పసలేని విమర్శలు చేసిన ప్రతిపక్షాలు, బుర్రలో చటాక్ గుజ్జు లేకుండా సోషల్ మీడియాలో దెడ్ దిమాక్ ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టేవారు, హిండెన్ బర్గ్ ఆరోపణలను నమ్మిన సాధారణ మదుపరులు…….
Share this Article