Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కత్తితో ఆడుకున్నాడు… ఆ కత్తితోనే ఖతమయ్యాడు… చదవాల్సిన రియల్ స్టోరీ…

March 12, 2024 by M S R

నిండా 19 ఏళ్లు. చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి, అందులో రౌడీలు, డాన్‌లు చేసే పనులు నచ్చాయతనికి. తానూ అలాగే అవ్వాలని అనుకున్నాడు. మెల్లగా మొదలైన అతని నేరాల పరంపర భారీ స్థాయికి చేరింది. చివరకు అతని ప్రాణాలు తీసింది. కత్తి పట్టినవాడు కత్తి వల్లే మరణిస్తాడనే బైబిలు వాక్యం నిజమైంది. 20 ఏళ్లు రాకుండానే మరణించిన ఈ యువకుడి జీవితం ఎంతోమందికి గుణపాఠం. పిల్లల్ని పెంచే తల్లిదండ్రులకు జీవనపాఠం.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో 2000 సంవత్సరం నవంబర్ 8న జన్మించాడు దుర్లబ్ కశ్యప్. తండ్రి వ్యాపారి కాగా, తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. వారిద్దరివీ విద్యావంతుల కుటుంబాలు. వారి ఏకైక సంతానం దుర్లబ్. చిన్నప్పటి నుంచి అతణ్ని చాలా గారాబంగా పెంచారు. తల్లికి కొడుకంటే ప్రాణం. సినిమాలంటే చాలా ఇష్టం కలిగిన దుర్లబ్ టీవిలో ఎక్కువగా వాటిని చూసేవాడు. ఫైటింగ్ సీన్లు, గొడవలు వంటి దృశ్యాలు అతణ్ని బాగా ఆకర్షించేవి. ముఖ్యంగా రౌడీలు, డాన్‌ల పాత్రలు అతనికి బాగా నచ్చేవి. తానూ అలా మారితే బాగుంటుందని, ఒకేసారి ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు అనుకునేవాడు.
రౌడీ కావాలంటే ముందుగా తన ఆహార్యం మార్చుకోవాలని అనుకున్న దుర్లబ్ 2017లో తన రూపానికి మార్పులు చేసుకున్నాడు. చిన్నగా ఉండే హెయిర్ స్టైల్, కంటికి నల్ల కళ్లజోడు, నుదిటిపై పెద్ద బొట్టు, మెడలో నల్లరంగు తువ్వాలు.. ఇదీ అతని ఆహార్యం. వాటితో ఫొటోలు దిగి తన ఫేస్‌బుక్‌లో పెట్టాడు. వాటికి వచ్చిన కామెంట్లను బట్టి తన రూపాన్ని మరింత మార్చుకుంటూ రౌడీగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్నపిల్లలు, యువత అతనికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్‌గా మారిపోయారు. మెల్లగా వారిలో తనకంటూ క్రేజ్ సంపాదించుకున్నాడు.
ఆ తర్వాత రౌడీ కావాలన్న తన ఆశకు అడుగులు వేశాడు. తనకు ఫ్యాన్స్‌గా మారిన కొందరు యువకులు, పిల్లల్ని కూడగట్టుకొని ఒక గ్యాంగ్‌ని ఏర్పాటు చేశాడు. దుర్లబ్‌గా ఉన్న తన పేరును ‘కోహినూర్’‌గా మార్చుకుని, తనది ‘కోహినూర్ గ్యాంగ్’ అని ప్రకటించాడు. దానికి DGang అనే పేరు పెట్టాడు. అతని అభిమానులంతా ‘హాష్‌ట్యాగ్ డీగ్యాంగ్’ పేరిట ఫేస్‌బుక్‌లో ఒక బృందంగా మారారు. వారి ద్వారా అతను రోడ్డు పక్కన ఉండే దుకాణదారుల వద్ద డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. ఎవరైనా తిరిగి ప్రశ్నించినా, డబ్బులు ఇవ్వకపోయినా వారిని కత్తితో బెదిరించడం, కొట్టడం వంటివి చేసేవాడు.
ఆ తర్వాత మెల్లగా తన నేరాలను విస్తరించాడు. దారి మధ్యలో అటకాయించి డబ్బులు వసూలు చేయడం, పోలీసులకు చెప్తే మీ ఇంటికొచ్చి చంపేస్తానని బెదిరించడం చేసేవాడు. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే తనకు చెప్పాలని, ఎవరి కాళ్లు, చేతులు తీసేయడానికైనా తాను సిద్ధమేనని ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టేవాడు. ఇదంతా చేసేనాటికి అతని వయసు 17. అప్పటికే అతను ఇంట్లో వారికి దూరంగా ఉన్నాడు. సిగరెట్, మందు అతనికి బాగా అలవాటయ్యాయి.
దుర్లబ్ చేసే పనులు చూసి చాలామంది స్థానిక యువకులు అతని గ్యాంగ్‌లో చేరారు. ఆ యువకుల తల్లిదండ్రులు పోలీసులకు అతని గురించి సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు కాపు కాసి వారందరినీ అరెస్టు చేశారు. మొత్తం 25 మందిని బాలల సంరక్షణశాలలో ఉంచారు. దుర్లబ్‌కి 18 ఏళ్లు నిండాక అతణ్ని విడుదల చేశారు.
ఆ తర్వాత కొన్ని నెలలపాటు ఉజ్జయినిలో తన తల్లి వద్ద ఉన్న అతనికి మళ్లీ పాత రౌడీ జీవితంలోకి వెళ్లాలన్న కోరిక కలిగింది. జనం ఇంకా తనని చూసి భయపడుతున్నారన్న విషయం తెలుసుకుని మెల్లగా బయటికి వచ్చి స్థానిక ప్రజల్ని బెదిరించడం మొదలుపెట్టాడు. ఈసారి తన పాత గ్యాంగ్‌ని వదిలి, వయసులో పెద్ద వారితో కలిసి గ్యాంగ్‌గా మారాడు. అప్పటికే స్థానికంగా పాతుకుపోయిన కొందరు బడా రౌడీలు తమ పనుల కోసం అతణ్ని వాడుకోవడం ప్రారంభించారు. గతంలో చిన్న చిన్న దుకాణాల వద్ద వసూళ్లు చేసే అతను ఇప్పుడు పెద్ద షాపింగ్ మాల్స్ దాకా ఎదిగాడు. వాటి యజమానులను కొట్టి, బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు.
ఈ రకంగా కొద్ది రోజుల్లోనే దాదాపు కోటి రూపాయల దాకా కూడబెట్టాడు దుర్లబ్. తన గ్యాంగ్‌లో ఉన్నవారికి నల్లరంగు దుస్తులను డ్రెస్‌కోడ్‌గా పెట్టాడు. తన కార్యకలాపాలను మరింత విస్తరించాడు. ఎవరు తనకు ఎదురు తిరిగినా చంపేస్తానని బెదిరించేవాడు. మెల్లగా అతనికి శత్రువులు పెరిగారు. డబ్బు విషయంలో తన గ్యాంగ్‌లోని మనుషులనే అతను అవమానించడంతో వారిలోనూ అతనిపై ద్వేషం నెలకొంది. అతణ్ని ఎలాగైనా అంతం చేయాలని స్థానికంగా ఉన్న రెండు, మూడు గ్యాంగ్‌లు ప్రణాళికలు రూపొందించాయి. ఇవన్నీ తెలిసినా దుర్లబ్ తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. తనకేమీ జరగదన్న నమ్మకంతోనే ఉన్నాడు.

కానీ సమయం రానే వచ్చింది. 2020 సెప్టెంబర్ 7 రాత్రి 7 గంటలకు తన ప్రాంతంలోని ఒక దుకాణంలో టీ తాగడానికి తన గ్యాంగ్‌తో కలిసి వచ్చాడు. ఆ సమయంలో అతని శత్రు గ్యాంగ్‌కి చెందిన షెహనవాజ్ అనే యువకుడితో దుర్లబ్‌‌కి వాగ్వాదం జరిగింది. ఆ కోపంలో తన వద్ద ఉన్న కత్తితో దుర్లబ్ అతణ్ని పొడిచాడు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. తర్వాత జరిగే పరిణామాలు ఊహించిన అతని గ్యాంగ్‌లోని సభ్యులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. దగ్గరలోనే ఉన్న షెహనవాజ్ స్నేహితులు దుర్లబ్‌ని పట్టుకొని, అతని కత్తితోనే అతణ్ని 34 సార్లు పొడిచారు. ఆ గాయాల కారణంగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో అతను అక్కడిక్కడే మరణించాడు.

అతను మరణించిన తరువాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దుర్లబ్ మరణం వారికి తలనొప్పి వ్యవహారంగా మారింది. స్థానిక రౌడీలను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యారని అప్పటికే పెద్ద ఎత్తున విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ హత్య జరగడం వారిని మరింత కలవరపెట్టింది. దుర్లబ్ జీవితం కత్తితో మొదలై, కత్తితో ముగిసింది. అతనిపై ప్రేమతో అతని అంత్యక్రియల్ని అభిమానులు ఘనంగా నిర్వహించారు. అతని పేరిట నేటికీ ఫేస్‌బుక్‌లో పేజీలు, అకౌంట్లు నడుపుతూ అతని వీడియోలు, ఫొటోలు పెడుతున్నారు. వారిలో కొందరు అతని బాటలోనే నడవాలని చూస్తూ ఉండటం భయం కలిగించే విషయం. దుర్లబ్ పేరిట యూట్యూబ్‌లో పాటలు, అనేక వీడియోలు కూడా ఉన్నాయి.

Ads

16 ఏళ్లకు రౌడీగా మొదలైన దుర్లబ్ జీవితం 20 ఏళ్లు కూడా పూర్తిగా రాకుండానే ముగిసిపోయింది. ఇందులో తప్పు ఎవరిదనే తీర్పులు ఇవ్వలేం, కానీ బాధ మాత్రం ఆ తల్లికి మిగిలింది. ఆ వేదనతోనే దుర్లబ్ తల్లి పద్మ 2021 ఏప్రిల్ 27న మరణించారు. నిండుగా చందమామలా ఉండే ముఖం దుర్లబ్‌ది. సరైన సమయంలో సరైన గైడెన్స్ దొరికి ఉంటే అతని మార్గం మారేదేమో, ఇవాళ అతనూ ఒక చక్కని జీవితం జీవించేవాడేమో!? తల్చుకుంటే బాధగా ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, పనులు, ఆలోచనలపై దృష్టి పెట్టి, వారితో మనసు విప్పి మాట్లాడకపోతే ఇబ్బందులు తప్పవు. అలా చేయకపోతే ఇంకా ఇంకా దుర్లబ్‌లు పుడుతూనే ఉంటారు, చిన్న వయసులోనే మరణిస్తూ ఉంటారు… – విశీ (వి.సాయివంశీ)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions