.
ఫ్రెండ్స్.. జైలుకు వెళ్లే పరిస్థితి తెచ్చుకోవద్దు! (The Tragic Story of an youth who was in Jail)
NOTE: Galatta Voice (Tamil) యూట్యూబ్ ఛానెల్ ఇటీవల ఓ యువకుడిని ఇంటర్వ్యూ చేసింది. జైల్లో కొంతకాలం ఉండి వచ్చిన అతను అక్కడ తన అనుభవాలు వివరించాడు.
Ads
***
‘… ఓసారి మా ఫ్రెండ్ ఒకడు బంగారు నగ తీసుకొచ్చి, అది తనకు దొరికిందన్నాడు. మేమిద్దరం కలిసి దాన్ని షాపులో అమ్మాం. ఆ తర్వాత తెలిసింది, అది వాడు దొంగతనం చేశాడని. పోలీసులకు దొరకడంతో వాడు నా పేరు కూడా చెప్పాడు. దాంతో మమ్మల్ని కోర్టులో హాజరుపరిచారు. జరిగిన విషయమంతా కోర్టులో జడ్జీతో చెప్పాను. ఆమె అర్థం చేసుకొని నన్ను జైల్లో వేయకుండా వదిలేశారు.
నాకు ఆరో తరగతి నుంచే మందు తాగే అలవాటు ఉంది. అది మెల్లగా గంజాయి, డ్రగ్స్ దాకా వెళ్లింది. చాలామందికి డ్రగ్స్ గురించి తెలియదు. డ్రగ్స్ అంటే చాలా సింపుల్ అనుకుంటారు. డ్రగ్స్ ఒకసారి తీసుకున్నామంటే మన శరీరమంతా ఒకలా మారిపోతుంది. ఎవరైనా మనల్ని కొట్టినా, మనం ఎవరినైనా కొట్టినా ఏమీ తెలియదు. ఆ మత్తులో హత్య చేసినా కూడా చేసెయ్యొచ్చు. అంతగా మన మెదడు మొద్దుబారిపోతుంది.
ఓసారి నేను, మా ఫ్రెండ్స్ బాగా తాగేసి, మత్తులో ఉన్నప్పుడు రోడ్డు మీద వచ్చీపోయేవాళ్ల మీద రాళ్లతో దాడి చేశాం. అందులో ఒకతనికి బాగా సీరియస్ అయ్యి, హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. దీంతో మా మీద పోలీస్ కేస్ అయ్యింది. అప్పుడు రెండు నెలలు జైల్లో ఉన్నాను.
జైల్లో ఉన్న టైంలో నా మనసంతా ఇంటి మీదే ఉంది. అమ్మ ఎలా ఉందో, నాన్న ఎలా ఉన్నాడో అని ఆరాటంగా ఉండేది. జైల్లో పోలీసులెవరూ నన్ను కొట్టలేదు. కానీ నగ్నంగా నిలుచోబెట్టి చెకింగ్ చేశారు. మత్తుపదార్థాలేవీ లోపలికి తీసుకెళ్లకూడదని ఈ ఏర్పాటు. అయినా కూడా కొందరు చాలా రహస్యంగా తమ ప్రైవేటు పార్టుల్లో పెట్టుకొని తెస్తారు. లేదా కోర్టుకు వెళ్లినప్పుడు నిమిషంలో చేతులు మార్చి లోపలికి తీసుకొస్తారు. పోలీసులు చూడకుండా బాత్రూంలో వాటిని వేసుకుంటారు.
జైల్లో రకరకాల మనుషులు వస్తుంటారు. కోడిని, మేకను దొంగతనం చేసిన వాళ్ల దగ్గరి నుంచి, బంగారం చోరీ, పసిపిల్లలపై అత్యాచారాలు చేసినవారు, భార్యని చంపినవారు.. అందరూ వస్తారు. వాళ్ల మధ్యే మనమూ ఉండాలి. ఒక్కో సెల్‌లో ఐదుగురు ఉంటారు. అక్కడ ఏ, బీ అని రెండు బ్లాక్స్ ఉంటాయి. ఏలో కొత్తగా మొదటిసారి వచ్చినవారిని ఉంచుతారు.
బీలో మాత్రం రెండోసారి, మూడోసారి వచ్చినవారిని ఉంచుతారు. ఏలో ఉన్నవారికి కొన్ని సౌకర్యాలు ఉంటాయి. వారికి టైలరింగ్, ఇతర పనులు నేర్పే క్లాసెస్ నిర్వహిస్తారు. వాడు మారి, మళ్లీ లోపలికి రాకుండా ఉండాలని చూస్తారు. మళ్లీ వచ్చినవాణ్ని బీలో ఉంచుతారు. అక్కడి వారికి ఎలాంటి సౌకర్యాలు ఉండవు. లైటున్న ఓ గదిలో ఐదుగురు ఉండాలి. పూటపూటకీ భోజనం వస్తుంది. అది తింటూ, మాట్లాడుకోవడమో, పడుకోవడమో చేయాలి.
జైళ్లల్లో మగ, మగవారి మధ్య లైంగిక సంబంధాలు ఉంటాయి. నేను జైల్లో ఉన్నా ఎప్పుడూ అలాంటివి చూడలేదు. నన్ను ఎవరూ అలా ఇబ్బంది పెట్టలేదు. కానీ అక్కడున్న పెద్దవాళ్లు పనులు చేయమని బెదిరించేవారు. బట్టలుతుకు, నీళ్లు తే అని ఆర్డర్ వేసేవారు.
కొందరు మాత్రం ఇతరులతో ఆ పని చేస్తారని కొంతమంది జైల్లో నాకు చెప్పారు. బాత్రూంకి వెళ్తున్నట్లు వెళ్లి, లోపల వాళ్లు సంభోగం చేసుకుంటారని అన్నారు. కొందర్ని బెదిరించి మరీ అలాంటివి చేయిస్తారని అంటారు. కానీ బయటికి వెళ్లి ఎవరికీ ఏమీ చెప్పలేరు. ఇలాంటివి ఎలా చెప్పుకుంటారు?
జైల్లో ఉన్న రెండు నెలలు అమ్మానాన్నలే ఎక్కువగా గుర్తొచ్చేవారు. ఆ బాధ చెప్పలేనంత భయంకరంగా ఉంటుంది. మన బాధలో మనం ఉంటే, జైల్లో పక్కనున్నోడు మనల్ని ఏదో ఒకటి అంటుంటాడు. మనం తిరిగి వాణ్ని ఏదైనా అంటే, గొడవ పెద్దదై, మనకు శిక్ష పెరుగుతుంది.
దీంతో ఏమీ అనలేక మౌనంగా ఉండిపోవాలి. జైల్లో భోజనం కూడా బాగుండదు. రోజూ మాకు సాంబార్ అన్నం పెట్టేవారు. తినడానికి ఇబ్బందిగా ఉండేది. కానీ తప్పు చేసి లోపలికి వచ్చాను, కాబట్టి శిక్ష అనుభవించాలని అనుకొని అలాగే ఉన్నాను.
నేను జైలుకు వెళ్లిన రెండు రోజుల తర్వాత పొద్దున్న జైలుకు ఫోన్ వచ్చింది. నాన్న చనిపోయారని తెలిపింది. బెయిల్ మీద వెళ్లే పరిస్థితి లేదు. సెలవులు కావడంతో కోర్టు కూడా లేదు. దీంతో నాన్న చివరిచూపుకు వెళ్లి, ఆయనకు తలకొరివి పెట్టలేకపోయాను. అది మాత్రం నా జీవితంలో మర్చిపోలేను.
జైల్లోనే వీడియోకాల్ చేసి, ఆయన శవాన్ని చూపించారు. నాలుగు రోజులపాటు వెక్కి వెక్కి ఏడ్చాను. ఎవరికీ ఇలాంటి బాధ రాకూడదని అనుకున్నాను. ఆ తర్వాత బెయిల్ రావడంతో నాన్న దినకర్మకు వెళ్లగలిగాను. ‘నువ్వెలాంటి పని చేశావో చూశావారా! చివరికి మీ నాన్నని చివరిచూపులు కూడా చూసుకోలేకపోయావు’ అని మా అమ్మ ఏడుస్తూ నన్ను అడిగింది.
ఆ తర్వాత ఇక ఎప్పుడూ జైలుకు వెళ్లకూడదని అనుకున్నాను. కోర్టులో నా కేసు హియరింగ్‌కి వచ్చినప్పుడు జడ్జీ మా అమ్మతో మాట్లాడారు. ‘పిల్లాడు మంచోడే, కానీ మీరుండే ఏరియా సరిగ్గా లేదు. దూరంగా తీసుకెళ్లి ఐటీఐలో చేర్చండి. మీ వాడు రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్తే ఆ అటెండెన్స్ బట్టి కేసు పెట్టాలా వద్దా అని ఆలోచిస్తాను. మరోసారి ఇలా జరిగితే మాత్రం గట్టి శిక్ష పడుతుందని’ చెప్పింది.
మా అమ్మ సరే అని చెప్పి నన్ను ఐటీఐలో చేర్చింది. ఒక సంవత్సరం నుంచి కాలేజీకి వెళ్తున్నాను. మెల్లగా నా జీవితం మారుతోంది. నా జీవితంలో జైలుకు వెళ్లడానికి కారణం చెడు స్నేహాలు, మత్తు పదార్థాలు. అలాంటి వాటికి ప్రస్తుతం దూరంగా ఉంటున్నాను.
జైలుకు వెళ్తే ఈజీగా బయటకు రావొచ్చు అని ఎవరూ అనుకోకండి. అది మిమ్మల్ని, మీ భవిష్యత్తును ఎలాగో మార్చేస్తుంది. నాలాగా ఇలాంటి వాటిలో పడి, జీవితాలను నాశనం చేసుకోవద్దు’. Source: Galatta Voice(Tamil) అనువాదం: విశీ (వి.సాయివంశీ)
Share this Article