ప్రత్యర్థిని గెలిపించిన అథ్లెట్… అది ప్యారీస్ ఒలింపిక్స్‌లో జరిగిందా?
గెలుపోటములను సమానంగా తీసుకోవడమే క్రీడా స్పూర్తి (Sporting Spirit) అంటారని మనకు తెలిసిందే. ఎవరైనా ఓడిపోతే స్పోర్టీవ్‌గా తీసుకోరా అని సలహాలిస్తుంటారు. క్రీడాకారులకు ఆటలో శిక్షణతో పాటు అనేక విషయాల్లో రాటుతేల్చే శిక్షణ కూడా ఇస్తారు. స్పోర్ట్స్ సైన్స్, మెంటల్ హెల్త్ అనే సబ్జెక్టులపై క్రీడాకారులకు తర్ఫీదు ఇస్తారు. ఇదంతా ఎందుకంటే.. ఒక ఆటగాడు తన ఎమోషన్స్‌ను నియంత్రణలో ఉంచుకోవడం ముఖ్యం కాబట్టి. గెలిచినా, ఓడినా ప్రత్యర్థి పట్ల దురుసుగా ప్రవర్తించకూడదని.. ఇదంతా ఆటలో భాగమని ఆటగాళ్లకు అర్థమయ్యేలా చెబుతుంటారు.
ఇన్ని లెసెన్స్ చెప్పినా.. తోటి ఆటగాళ్ల పట్ల దురుసుగా ప్రవర్తించేవాళ్లు.. ఎలాగైనా గెలవాలని కుయుక్తులు పన్నే వాళ్లు కూడా ఉంటారు. కానీ ఎదుటి అథ్లెట్ గెలుపు కోసం సాయం పడే వాళ్లు ఉంటారా? గోల్డ్ మెడల్ వచ్చే అవకాశం ఉన్నా.. ఈ గెలుపు తనది కాదు.. తన ప్రత్యర్థిదే అనేంత ఘనమైన స్పోర్టింగ్ స్పిరిట్ ప్రదర్శించే వాళ్లు ఉంటారా అంటే.. అవుననే అంటాను.
Ads
ఒలింపిక్స్ మొదలయ్యాక దాని పేరుతో అనేక కథనాలు బయటకు వస్తున్నాయి. అలా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. కెన్యాకు చెందిన ఒక రేసర్.. ట్రాక్ చివర్లో రాసి ఉన్న భాష అర్థం కాక.. అదే లాస్ట్ లైన్ అనుకొని ఆగిపోయాడు. కానీ అతని వెనకే వస్తున్న స్పానిష్ ఆటగాడు.. కెన్యా ఆటగాడు అక్కడ రాసి ఉన్నది అర్థం కాక నిలబడి పోయాడని గమనించి.. ఇంకా ముందుకు పరుగెత్తు అంటూ ముందుకు తోశాడని.. అలా కెన్యా ఆటగాడిని గెలిపించాడని రాసుకొచ్చారు. స్పానిష్ ఆటగాడు రేసు గెలిచే అవకాశం ఉన్నా.. అద్భుతమైన స్పోర్ట్స్‌మాన్‌షిప్ ప్రదర్శించి తన ప్రత్యర్థిని గెలిపించాడని అందులో పేర్కొన్నారు.
రేసు ముగిసిన తర్వాత ఒక జర్నలిస్టు స్పానిష్ ఆటగాడిని ‘ఇలా ఎందుకు చేశారు.. మీరే రేసు గెలిచే వారే కదా?’ అని ప్రశ్నించగా.. నేనేం అతనికి సాయం చేయలేదు.. అతనే రేసు గెలవబోతున్నాడు. కేవలం భాష రాకపోవడం వల్లే ఆగానని చెప్పాడు. అంతే కాకుండా ఒక వేళ నేను గెలిస్తే దానికి విలువేముంటుంది? నా తల్లి నా గురించి ఏమని అనుకుంటుంది? మానవీయ విలువలు ఒక తరం నుంచి మరో తరానికి పెరుగుతూ ఆనందింపబడాలి. మన పిల్లలకు మనం అదే నేర్పాలి. తప్పు మార్గంలో గెలవడం సరైంది కాదని తర్వాత తరానికి బోధించాలి. నైతికత, నిజాయితీనే ఎప్పుడు విజయం సాధిస్తాయి అని సదరు స్పానిష్ ఆటగాడు చెప్పుకొచ్చాడు.
ఈ కథనాన్ని అంతా రాస్తూ.. ఇది 2024 ప్యారీస్ ఒలింపిక్స్‌లో జరిగిందని.. గోల్డ్ మెడల్ కొట్టే ఛాన్స్ కూడా వదులుకొని కెన్యా అథ్లెట్‌ను గెలిపించాడని వైరల్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన ప్యారీస్ ఒలింపిక్స్‌లో జరిగింది కాదు.
2012 డిసెంబర్ 2న స్పెయిన్‌లోని నవా (Navarre) అనే ప్రావిన్సులో జరిగిన క్రాస్-కంట్రీ రేసులో చోటు చేసుకుంది. క్రాస్-కంట్రీ రేసులో భాగంగా 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ పోటీ నిర్వహించారు. స్టీపుల్‌ఛేజ్ అంటే 28 హార్డిల్స్, 7 వాటర్ జంప్స్ చేస్తూ పరిగెత్తడం. ఈ పోటీలో స్పానిష్ అథ్లెట్ ఇవాన్ ఫెర్నాండెజ్ అనాయా, కెన్యన్ అథ్లెట్ ఏబెల్ ముతాయ్ కూడా పాల్గొన్నారు. ఈ రేసులో ముందంజలో ఉన్న కెన్యన్ అథ్లెట్ ఏబెల్ ముతాయ్.. ఫినిషింగ్ లైన్‌కు 10 మీటర్ల దూరంలో ఆగిపోయాడు. నిర్వాహకుడు మరో 10 మీటర్లు ఉందన్న ఉద్దేశంతో రాసిన లైన్లను.. భాష రాకపోవడంతో లాస్ట్ లైన్‌గా ఏబెల్ భావించి ఆగిపోయాడు. అతని వెనుక వస్తున్న స్పానిష్ అథ్లెట్ ఇవాన్ ఫెర్నాండెజ్‌కు విషయం అర్థం అయ్యింది. కెన్యా ఆటగాడు భాష రాక అక్కడ ఆగిపోయాడని భావించి.. ముందుకు తోశాడు. విషయం అర్థం చేసుకున్న ఏబెల్ ముతాయ్.. ముందుకు ఉరికి ఫినిషింగ్ లైన్ దాటాడు. ఈ విషయం బయటకు వచ్చాక ఇవాన్ ఫెర్నాండెజ్ స్పోర్టింగ్ స్పిరిట్‌ను ఎంతో మంది మెచ్చుకున్నారు.
ఇది ఒలింపిక్స్‌లోనే జరిగిందని చాలా మంది భావించడానికి కారణం కూడా ఉన్నది. కెన్యా ఆటగాడు ఏబెల్ ముతాయ్.. ఈ రేసుకు ముందు 2012 లండన్ ఒలింపిక్స్‌లో 3000 స్టీపుల్‌ఛేజ్‌లోనే కాంస్యాన్ని గెలిచాడు. దీంతో లండన్ ఒలింపిక్స్‌లోనే ఈ ఘటన జరిగిందని స్టోరీలు బయటకు వచ్చాయి. కాస్త వెనక్కు వెళ్లి చూస్తే.. ఇది స్పెయిన్‌లోని ఒక క్రాస్-కంట్రీ రేసులో జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది.
మరోవైపు ఈ రేసులో ఇవాన్ అలా కెన్యా ఆటగాడిని గెలిపించడంతో అతని కోచ్ మార్టిన్ ఫిజ్ నిరాశకు గురయ్యాడు. ప్రతీ ఆటగాడికి క్రీడా స్పూర్తి ఉండాలి. కానీ ఇవాన్ చేసినదాన్ని మాత్రం నేను అంగీకరించను. ఇది అథ్లెటిక్స్‌లో ఉండకూడదు. ఇవాన్ స్థానంలో నేను ఉంటే తప్పకుండా ముందుకు ఉరికి రేసును గెలిచేవాడని అని కోచ్ మార్టిన్ ఫిజ్ చెప్పుకొచ్చాడు.
ఇక ఇప్పుడే ఈ ఫొటో ఎందుకు వైరల్ అవుతోందంటే.. 2012లో ఈ ఘటన జరిగిన తర్వాత 10 ఏళ్లకు.. అంటే 2022 డిసెంబర్ 2న ఇవాన్ ఫెర్నాండెజ్ అప్పటి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘నా జీవితంలో డిసెంబర్ 2 చాలా ప్రత్యేకం. గత పదేళ్లుగా డిసెంబర్ 2న అనేక మంది అభిమానులు ఆ రోజును గుర్తు చేసుకుంటూ నాకు మెసేజెస్ చేస్తుంటారు. నేనొక మంచి పని చేశానని అభినందిస్తుంటారు. కానీ నేను కేవలం గెలిచే వాడికి చిన్న సాయం మాత్రమే చేశాను. ఆ గెలుపు ఎవరికి దక్కాలో వారికే దక్కింది’ అంటూ పోస్టు పెట్టాడు.
ప్రస్తుతం ఒలింపిక్స్ జరుగుతుండటంతో రెండేళ్ల క్రితం పోస్టు మళ్లీ వైరల్ అయ్యింది. 2012లో జరిగినది అని పేర్కొనడంతో లండన్ ఒలంపిక్స్ అనుకున్నారు. అది ఇంకాస్త ముందుకు వెళ్లి ప్యారీస్ ఒలింపిక్స్‌గా మారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదీ అసలు విషయం…. భాయ్ జాన్…. [ John Kora ]
Share this Article