Vijayakumar Koduri………. మరల నిదేల ‘బలగం’ బన్నచో !______________________
కాస్త ఆలస్యంగా ‘బలగం’ సినిమా చూసాను
ఒకసారి కాదు – రెండు సార్లు
Ads
కాకపోతే, బలగం సినిమా మీద వరదలా వచ్చి పడుతోన్న మిత్రుల పోస్టుల నడుమ, ఒక నాలుగు మాటలు పంచుకోవడానికి కాస్త తటపటాయించాను
1
నాలుగేళ్ల క్రితం మలయాళం లో మనిషి చావు నేపథ్యంలో వచ్చిన ‘ఈ మా యు’ సినిమా చూసి అనుకున్నాను – కమిట్ మెంట్ వుండాలే గానీ మన స్థానికతతో సినిమా తీయడానికి ఇటువంటి కథలు తెలుగు నాట దొరకవా?
క్రితం సంవత్సరం విడుదలైన కన్నడ ‘కాంతార’ సినిమా చూసినపుడు కూడా అనిపించింది – కాస్త శ్రద్ధ పెట్టాలే గానీ, స్థానిక సంస్కృతి నేపథ్యంలో తీయడానికి మన దగ్గర ఎన్ని కథలు దొరకవూ ?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ‘తెలంగాణ సినిమా’ అంటూ చర్చలు జరిగింది, ఆర్ నారాయణ మూర్తి మార్క్ తెలంగాణ సినిమాలు కాకుండా, తెలంగాణ స్థానిక సంస్కృతిని, జీవ భాషను ప్రతిబింబించే సినిమాలు రావాలనే! ఆ వంకతోనయినా తెలుగు సినిమా, ఒక మలయాళ సినిమాలా ‘కాస్త నేల పైకి’ దిగుతుందని ఒక ఆశ.
దొరసాని, మల్లేశం వంటి ఒకటీ అరా సినిమాలు కొంత ప్రయత్నం చేసినా ఎక్కడో ఒక వెలితి ఉండిపోయింది.
ఆ వెలితిని చాలావరకు పూడ్చిన సినిమా – బలగం!
2
బలగం సినిమా ఇంతగా జనం లోకి వెళ్ళడానికి కారణం, దర్శకుడు వేణు నిజ జీవితంలో తాను చూసి కదిలిపోయిన సంఘటనలను నిజాయితీగా తెర మీద ఒక కథగా ఆవిష్కరించడం అనుకుంటాను. ఊళ్ళో బండి మీద కూరగాయలు అమ్ముకునే స్థాయి నుండి వచ్చిన వాడు కాబట్టి, కథలోని పాత్రలను ఎటువంటి తొడుగులూ లేకుండా నిజ జీవితం నుండి రక్తమాంసాలతో తీసుకొచ్చి తెర మీద నిలిపాడు. కథను, పాత్రలను నడిపించే తీరులో ‘అనవసర మేధావితనం’ ప్రదర్శించలేదు.
దర్శకుడు చెప్పాలనుకున్నది ఉమ్మడి కుటుంబాల కథ కాదు.
ఒక ఇంట్లో పుట్టిన వాళ్ళు, పెద్ద పెరిగి, ఎవరి కుటుంబాలతో వాళ్ళు ఎక్కడెక్కడో స్థిరపడినా, వాళ్ళ నడుమ ఎప్పుడో వచ్చిన మనస్పర్థలతో ఒకరి ముఖం ఒకరు చూడ ఇష్టపడని శత్రువుల్లా మారిపోయినపుడు, వాళ్ళను కన్నవాళ్ళు ఎంత క్షోభకు గురవుతారో దర్శకుడు చెప్పాలనుకున్నాడు.
తాను చెప్పాలనుకున్నఈ మానవీయ కథకు ఇంటి పెద్దాయన చావుని కేంద్రంగా తీసుకుని, మనిషి చనిపోయిన తరువాత జరిపే క్రతువులను నేపథ్యంగా తీసుకున్నాడు. ఈ క్రతువులలో ‘పిట్టకు పెట్టడం / పిట్ట ముట్టడం’ అన్న క్రతువుకు ప్రజల మనసులో ఒక తాత్విక భూమిక వున్నది కాబట్టి, దానినే సినిమా కథకు కీలకమైన ‘సంఘర్షణ (conflict)’ అంశంగా తీసుకున్నాడు.
3
‘కాంతార’ దర్శకుడు రిషబ్ శెట్టి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘more native is more universal’ అన్నాడు. ఆ మాట విన్నపుడు, ‘తెలుగులో ఇట్లా చెప్పే దర్శకుడు ఎవరైనా వున్నారా ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాను. ‘బలగం వేణు’ ఇట్లా చెప్పలేకపోవచ్చు గానీ, ‘నా ఊళ్ళో నేను చూసిన కథను వెండి తెర మీద ఆవిష్కరిస్తే తక్కిన ప్రపంచం కూడా కనెక్ట్ అయి ఆదరిస్తుంది అని నమ్మి ఈ సినిమా తీసాడు. తెలుగు సినిమాను కాస్త నేల మీదకు దింపాడు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇంకా ఒక దశాబ్దం కూడా కాలేదు కాబట్టి, భాష , సంస్కృతి వంటి అంశాలలో పడ్డ అవమానాల గాయాల పచ్చి ఇంకా పూర్తిగా ఆరలేదు కాబట్టి, ‘ఇది మేము గర్వపడే మా సినిమా’ అని తెలంగాణ అంటే, మిగతా తెలుగు ప్రజలు అంతగా తప్పు పట్టవలసిన పని లేదు. నిజానికి, సామాన్య తెలుగు ప్రేక్షకులకు ఇవన్నీ పెద్దగా పట్టవు అని చెప్పడానికి ఆంధ్ర సీడెడ్ ప్రాంతాలలో ఈ సినిమాకు వచ్చిన లాభాలే సాక్ష్యం !
తరాల ఆఫ్రికా మూలవాసుల కథను చెప్పిన అలెక్స్ హేలీ నవల ‘ఏడు తరాలు’ ని తెలుగు నవలతో సమానంగా ఆదరించలేదా?
వంగ దేశ కథ అయినా దేవదాసుని తెలుగు వాళ్ళు ఇది తమ నేల మీది కథే అన్నంతగా ఆదరించలేదా?
కాంతార సినిమా కథా నేపథ్యం మంగళూరు సమీపంలోని కోస్తా ప్రాంత ప్రజల సంస్కృతి అయినా ‘ఇది మేము గర్వంగా చెప్పుకునే మా కన్నడ సినిమా’ అని మొత్తం కన్నడ వాళ్ళు అనుకోలేదా?
‘మహేషింటే ప్రతీకారం’ అన్న మళయాళ సినిమా ‘ఇడుక్కి’ ప్రాంత సంస్కృతి, భాష ల నేపథ్యంలో తీసినా, దానిని మలయాళీలు మొత్తం ‘ఇది మా సినిమా’ అని గర్వంగా చెప్పుకున్నారు కదా!
4
బలగం సినిమా మీద పెట్టిన విమర్శలలో ‘మూఢ నమ్మకాలు’ అన్న విమర్శ కూడా కొంత విచిత్రంగా అనిపించింది
ఇక్కడ కొన్ని విషయాలు పంచుకోవాలని వుంది.
నాకు అర్థమయినంత మేరకు, పైన చెప్పినట్టు దర్శకుడు చెప్పాలనుకున్నది- ఒకే ఇంట్లో పుట్టిన వాళ్ళ నడుమ సంబంధాలు విరిగిపోతే వాళ్ళను కన్నవాళ్ళు ఎంత క్షోభ పడతారో చావు నేపథ్యంలో చూపించడం. కాబట్టి, సహజంగానే ఇంట్లో మరణం సంభవించినపుడు, దానికి సంబంధించి స్థానిక ప్రజలు జరిపే క్రతువులు అన్నీ కథలో భాగంగా వొచ్చాయి.
ఆ మధ్య మలయాళంలో ‘జల్లికట్టు’ అని ఒక అద్భుతమైన సినిమా వచ్చింది. గ్రామాలలో తరాలుగా వస్తున్న పశువును తరిమి పట్టుకుని బంధించే ఒక సంప్రదాయం నేపథ్యంలో నడిచే సినిమా అది. కానీ, ఆ సినిమాని ఎవరూ మూడాచారాన్ని ప్రోత్సహించిన సినిమా అనలేదు. ‘భూత కోల’ నేపథ్యంలో వచ్చిన ‘కాంతార’ ను కూడా ఎవరూ మూడాచారాలను ప్రోత్సహించిన సినిమా అనలేదు.
మూడొద్దులు, ఐదొద్దులు, పెద్దకర్మ చేయడం, పిట్టకు పెట్టడం వంటివి ఒక్క తెలంగాణ లోనే కాదు, ఏవో కొన్ని మార్పులతో దాదాపు అన్ని ప్రాంతాలలోను వున్నాయి. అవి ఆచారాలు / సంప్రదాయం లో భాగంగా మారిపోయాయి. అట్లా అని అవి పాటిస్తున్న వాళ్లంతా మూడాచారాలను పాటిస్తున్న వాళ్ళని అనగలమా? అంతరిక్షం లోకి రాకెట్లు పంపించే శాస్త్రవేత్తలు, అరుదైన సర్జరీలు చేసే డాక్టర్లు కూడా పని ప్రారంభించే ముందు దేవుడికి దండం పెట్టుకునే దేశంలో ‘దేనిని వొదిలేయాలి- దేనిని ఆక్షేపించాలి’ అన్న సున్నితమైన విషయాన్నిశాస్త్రీయ వామపక్ష మేధావులు ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేదా అనిపిస్తుంది
ఇక్కడే మరొక విషయం కూడా చెప్పాలి
కొన్నేళ్ల క్రితం కేరళ లోని తుంచన్ మెమోరియల్ ఉత్సవాలకు వెళ్లాను. తుంచన్ మలయాళీల ఆదికవి. ఆ సెంటర్ కు వాసుదేవన్ నాయర్ చైర్మన్. ఆ ఉత్సవాలలో భాగంగా ఒకరోజు వాళ్ళు ఆ ఆదికవి ఉపయోగించిన కలాన్ని పూలతో అలంకరించి ఏనుగు అంబారీపై ఊరంతా ఊరేగిస్తారు. ఊరేగింపులో పాల్గొనే వాళ్లంతా సంప్రదాయ దుస్తులలో పాల్గొంటారు. ఉత్సవాలలో భాగంగా కథాకళి వంటి అనేక కేరళ కళా రూపాలను ప్రదర్శిస్తారు.
కేరళ వాళ్లకన్నా, ముఖ్యంగా కేరళ రచయితలూ మేధావులకన్నా గొప్ప వామపక్షవాదులు వేరే ఎవరున్నారు?
‘సామాన్య ప్రజల జీవితంలో సంప్రదాయాలుగా / ఆచారాలుగా / సంస్కృతిగా మారిపోయి, ఎదుటి వాళ్లకు హాని చేయని వాటిని పక్కన పెట్టాలి’ అన్న ముచ్చట ఏదో లోపించడం మాత్రమే కాదు – కులం, ఆస్తి, స్త్రీ పురుష సంబంధాలు, వివాహం, అమెరికా సామ్రాజ్య వ్యతిరేకత వంటి అంశాల విషయంలో తెలుగు నేల మీది “మెజారిటీ” కమ్యూనిస్టుల మాటలకు, ఆచరణకు పొంతన లేకపోవడం వల్ల కూడా ‘ఇవన్నీ మూడాచారాలు’ అని చెప్పే మాటలు ప్రాసంగికతను కోల్పోతున్నాయేమో అని ఒక చిన్న బాధ!
5
ఇంతకూ, బలం సినిమా లో చూపించిన సంస్కృతి, ‘తెలంగాణ సంస్కృతి’ ఎందుకయింది?
బలగం సినిమాలో కన్నబిడ్డల మీద రంధితో చనిపోయే కొమురయ్య – ‘గాజుల కొమురయ్య’
తెలంగాణ జనాభాలో అత్యధిక శాతం బహుజనులు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు అని చెప్పే చాలా అంశాలు తెలంగాణ బహుజనుల జీవితాల లోనివి.
చాలా అంశాలలో, తెలంగాణ లోని అగ్ర కులాల సంస్కృతి, సంప్రదాయాలు కూడా బహుజనుల సంస్కృతి, సంప్రదాయాలకు దగ్గరగా ఉండడం కూడా ఒక కారణం అనుకుంటా !
కొంతకాలం క్రితం తెలుగులో ‘కలిసుందాం రా’ అని హీరో వెంకటేష్ సినిమా వచ్చింది. ఆ సినిమా స్టోరీ లైన్ కూడా ఇంచుమించు బలగం స్టోరీ లైన్ ను పోలి ఉంటుంది. కానీ, ‘తెలుగు పల్లె సంస్కృతి’ పేరున అటువంటి సినిమాలలో చూపించిన సంస్కృతి ఎవరిది? మొత్తం తెలుగు జనాభాలో వాళ్ళ శాతం ఎంత? పోనీ, అటువంటి సినిమాలలో పాత్రలకు వాడిన భాష అయినా స్థానిక జీవ భాష కాదుగదా!
బలగం సినిమా తెలంగాణ స్థానిక సంస్కృతిని ప్రతిబింబించిందా, కోస్తా సంస్కృతిని ప్రతిబింబించిందా, రాయలసీమ సంస్కృతిని ప్రతిబింబించిందా అన్నది ముఖ్యం కాదు-
‘ప్రధాన స్రవంతి వ్యాపార తెలుగు వెండి తెర’ ప్రజల జీవితాలలో నుండి కథను తీసుకుని, దానికి అతి నాటకీయత రుద్దకుండా, ప్రజలు తమ రోజువారీ జీవితంలో మాట్లాడుకునే జీవభాషతో, ప్రజల సంస్కృతిలో భాగమైన పాటలతో ఒక అచ్చమైన బహుజనుల తెలుగు సినిమాకు జన్మనిచ్చింది. రేపు ఒక రాయలసీమ పల్లె నుంచో, లేక ఒక కోస్తా వాడ నుంచో మరొక నిండైన తెలుగు సినిమా రావడానికి కావలసిన ధైర్యాన్నితెలుగు సినిమా వ్యాపారులకు ఇచ్చింది. ఇది కాస్త ఆహ్వానించదగిన మార్పే కదా!
తెలుగు సినిమాలో ప్రధాన పాత్రల పేర్లు – కొమురయ్య, నారాయణ, సాయిలు etc., ఊహించామా ఈ మార్పుని ?
6
సినిమాలో నటించిన వాళ్లలో ఎవరి నటన బాగుంది అని అడిగితే చెప్పడం కష్టం !
‘ఆగుతవా రొండు నిమిషాలు’ అనే రచ్చ రవి నుండి, ‘నాలుగు యాటలు కాదుర – పది యాటల కోస్త’ అని రెచ్చిపోయే నారాయణ పాత్రధారి వరకు, చివరికి ‘పద్ధతేనాయె’ అని చెప్పే చిన్న పాత్ర వేసిన నటుని వరకు అందరూ తెలంగాణ పల్లెను కళ్ళ ముందు నిలబెట్టారు.
నారాయణ ‘నల్లి బొక్క’ కోసం పంచాయితీ పెట్టుకొనుడు ఏంది – అనడం అన్యాయం! ఇప్పుడు బాగా తగ్గింది గానీ, ‘సరైన మర్యాద దక్కలేదు’ అని అల్లుళ్ళు అత్తగారి ఇంటి మీద చీటికీ మాటికీ అలగడం ఒకప్పుడు చాలా ఎక్కువ! మా ఇంట్లో నా చిన్నప్పుడు మా మేనత్తల విషయంలో ఇటువంటివి చూసేవాడిని. కానీ, మా మావయ్యల అలకలు కాసేపు వుండి ఆరిపోయేవి గానీ, వాళ్ళ ప్రేమలు మాత్రం మేము ఎప్పటికీ మరచిపోలేము.
సినిమా చూస్తూ ఉన్నంత సేపు ‘ఇవన్నీ మన ఇళ్లల్లో కూడా జరిగినవే కదా, వొచ్చిన వాళ్ళందరి మీదా పడి ఏడుపు అందుకునే ఇటువంటి స్త్రీలను మన ఇళ్లల్లో కూడా చూసాము కదా’ అనిపించింది. కాకపొతే, సినిమా చివరిలో వొచ్చే బుడగ జంగాల పాట దగ్గర మాత్రం దుఃఖం ఆపుకోలేకపోయాను !
ఎన్నాళ్ళ, ఎన్నేళ్ల తరువాత ఒక తెలుగు సినిమా చూస్తూ నేను దుఃఖించడం !
సినిమా కథ రాసుకుని, రూపొందించిన వేణు నిస్సందేహంగా అభినందనీయుడే గానీ, సినిమాకు ‘సగం ప్రాణం’ పోసింది సంగీతం అందించిన భీమ్స్ – పాటలు రాసిన కాసర్ల శ్యామ్ !
ఇవి కదా ‘అత్యుత్తమ పురస్కారం’ దక్కవలసిన ‘తెలుగు పాటలు’!
తప్పనిసరిగా దక్కవలసిన మరొక ప్రశంస, సినిమాటోగ్రాఫర్ వేణు ఆచార్యకు-
7
సినిమాలో లోపాలు లేవా ?
ఎందుకు లేవు ?
ఒక మిత్రుడు అన్నట్టు, పల్లెటూరు అంటే, ఆ పల్లెటూరు కు మాత్రమే ప్రత్యేకమైన పశుపక్ష్యాదుల అరుపులు, బండ్ల శబ్దాలు, గుడి గంటలు /భక్తి పాటలు, మజీదు ప్రార్థనలు వినిపించాలి కదా !
కానీ, నన్ను వెంటాడిన సంగతులు రెండు వున్నాయి
సంప్రదాయాలు, ఆచారాలు పాటించడం సరే –
వాటిని పాటించే పేరున చేసే ఆర్భాటాల వలన పెళ్లి కార్యక్రమాల లాగే చావు కార్యక్రమాల వల్ల కూడా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి కదా ! స్వామి ‘సావు కూడు’ కథ గుర్తుంది కదా ?
రెండు నెలల క్రితం ఒక వార్త వచ్చింది.
తండ్రి పెద్ద కర్మను ఘనంగా చెయ్యాలన్న బంధువుల ఒత్తిడిని తట్టుకోలేక మేడ్చల్ లో ముప్పై ఐదేళ్ల కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని.
పెళ్లి కార్యక్రమాలు అయినా, చావు కార్యక్రమాలు అయినా విస్తృత అవగాహన ఏదైనా కల్పించాలంటే అది సింపుల్ గా కార్యక్రమాలు జరుపుకోవడం విషయంలోనే అనుకుంటా !
ఇక రెండవ సంగతి –
ఇంత చక్కగా తీసిన సినిమాలో ‘అమ్మ’ (కొమురయ్య భార్య) ప్రస్తావన కనీసం మాట వరుసకైనా రాలేదే ?
8
సినిమా కాబట్టి, దర్శకుడు చెప్పాలనుకుంటున్న పాయింటు ప్రేక్షకుల హృదయాలను బలంగా తాకిన తరువాత ఒక దగ్గర ఆగిపోయింది.
కొమురయ్య పదకొండొద్దుల ముచ్చట అయిపోయిన తరువాత, నారాయణ తన కూతురుని సాయిలుకు ఇచ్చి పెళ్లి చేసే విషయంలో పునరాలోచన చెయ్యొచ్చు!
కొమురయ్య చిన్న కొడుకు మొగిలి తన వాటా పొలం అమ్మకానికి పెట్టే విషయంలో అన్నతో మళ్ళా కొత్త పంచాయితీ పెట్టొచ్చు !
సవాలక్ష అవసరాలతో, సవాలక్ష బలహీనతల నడుమ బతికే మనుషులం కదా !
కానీ, కథ చెప్పే, సినిమా తీసే సృజనకారులు ఇవన్నీ ఆలోచిస్తే ముందుకు సాగలేరు –
నీషే చెప్పినట్టు – ‘సృజనకారులు జీవన వాస్తవికతను జీర్ణించుకోలేరు’
—–తెలుగు సినిమా వర్ధిల్లాలి—–
Share this Article