.
ప్రవీణ్ ప్రకాష్… వివాదాస్పదుడైన మాజీ ఐఏఎస్ అధికారి… తనతో ఏబీఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూ పెద్ద ఆసక్తిని ఏమీ కలిగించలేదు… మాజీ సీఎం జగన్ పాలనపరమైన నిర్ణయాల్ని తప్పుపట్టడానికి రాధాకృష్ణ దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే…
తన వీఆర్ఎస్ తొందరపాటు నిర్ణయమేనని పరోక్షంగా చెప్పుకుంటూ… సీఎం చెప్పింది చేయాల్సిందే కదా అనే వాదనతో తన తప్పుటడుగుల్ని కూడా జగన్ మెడకే చుట్టేసి… రాధాకృష్ణ రూటులో చంద్రబాబుకు కాసింత దగ్గరయ్యే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టుగా ప్రవీణ్ ప్రకాష్ కనిపించాడు… కానీ తన కెరీర్ ఖతం కదా… ఇప్పుడు ఈ ప్రయత్నాలు దేనికో మరి…
Ads
పీఎం లేదా సీఎం ఏది చెబితే అది చేయాలా కీలక స్థానాల్లోని అధికారులు..? రేప్పొద్దున మరి కేసులపాలైతే..? జగన్ కేసుల్లో కనిపిస్తున్నది అదే కదా… సరే, ఈ డిబేట్‌లోకి పోకుండా… నిన్నటి ఇంటర్వ్యూలోని ఓ ప్రస్తావన మాత్రం నచ్చింది…
‘‘పీవీ నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు (1971-73), ఆయనకు ఎన్.వి. కామేశ్వరరావు గారు చీఫ్ సెక్రెటరీ (CS) గా ఉండేవారు…
ఆ రోజుల్లో విజయవాడ ప్రాంతంలోకి సీఎం వెళ్లడానికి వీలు లేని విధంగా తీవ్రమైన ఘర్షణలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి… సమస్య తీవ్రతను స్వయంగా తెలుసుకోవడానికి, పరిస్థితిని చక్కదిద్దడానికి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు గారు స్వయంగా అక్కడికి పర్యటనకు వెళ్లాలని నిశ్చయించుకున్నారు…
ఈ విషయం తెలిసిన వెంటనే చీఫ్ సెక్రెటరీ ఎన్.వి. కామేశ్వరరావు గారు ముఖ్యమంత్రి వద్దకు వచ్చారు… “సార్, మీరు ఆ ప్రాంతానికి వెళ్లడానికి వీలు లేదు,” అని సూటిగా చెప్పారు…
“నాకు రాజకీయంగా (Political Compulsion) వెళ్లాల్సిన అవసరం ఉంది,” అని పీవీ గారు అన్నారు… దానికి సీఎస్ గారు “నేను సీఎస్‌గా చెబుతున్నాను, అక్కడ పరిస్థితి నాకు తెలుసు. మీరు వెళితే పరిస్థితి మా చేతుల్లోంచి దాటిపోతుంది. అందుకే మీరు వెళ్లడానికి వీలు లేదు” అని ఖరాఖండిగా చెప్పారు…
పీవీ నరసింహారావు గారు సీఎస్ మాటను ఖాతరు చేయకుండా, “నేను వెళ్తాను” అంటూ కారు ఎక్కారు… సీఎం కారు ఎక్కిన మరుక్షణమే సీఎస్ కామేశ్వరరావు గారు పక్కనే ఉన్న డ్రైవర్‌ను ఉద్దేశించి గట్టిగా “గెటవుట్ ఆఫ్ ది కార్!” (కారు దిగిపో!) అని ఆదేశించారు…
డ్రైవర్ వెంటనే కారు దిగి నిలబడ్డాడు… సీఎం పీవీ నరసింహారావు గారికి ఒక్కసారిగా కోపం వచ్చింది… ఆయన కారులోంచి డ్రైవర్ వైపు చూస్తూ సీఎస్‌ను గట్టిగా ప్రశ్నించారు “నువ్వు ఏం చేస్తున్న పని ఇది?”
దానికి సీఎస్ కామేశ్వరరావు గారు నిక్కచ్చిగా, నిలబడి ఇలా జవాబిచ్చారు… “నేను మీ దగ్గర పని చేస్తున్నాను. కానీ అతడు (డ్రైవర్) నా కింద పని చేస్తున్నాడు… ఐ యామ్ హెడ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ (నేను పరిపాలనాధిపతిని)’’ అని చెప్పిడ్రైవర్‌ను అక్కడి నుంచి పంపించేశారు…
సీఎస్ ఆదేశంతో డ్రైవర్ వెళ్లిపోవడంతో, ముఖ్యమంత్రి గారి పర్యటన తాత్కాలికంగా ఆగిపోయింది… పరిపాలనాధిపతిగా ఒక ముఖ్యమంత్రి పర్యటనను సైతం రద్దు చేయగల సత్తా, నిజాయితీ కలిగిన ఆ సాహసానికి పీవీ నరసింహారావు గారు చలించిపోయారు…
అనంతరం, పీవీ నరసింహారావు గారు ఆ సీఎస్‌ను పిలిచి ఆయన చిత్తశుద్ధిని, నిబద్ధతను ప్రశంసించి, అభినందించారు… “మీలాంటి అధికారులు ఉండాలి” అని కొనియాడారు…… ఇదీ ఓ సంఘటన…
ఆయన పీవీ కాబట్టి ఆ ఉన్నతాధికారిని అభినందించాడు… ఎందుకంటే, పీవీ స్టేట్స్‌మన్ కాబట్టి… జగన్ అయితే ఈ పరిస్థితి వస్తే సదరు అధికారిని వెంటనే బాపట్లలోని మానవవనరుల అభివృద్ధి కేంద్రానికి బదిలీ చేస్తాడు, అదీ జీఏడీ సెక్రటరీతో బదిలీ ఉత్తర్వులు ఇప్పిస్తాడు… అవునూ, రాధాకృష్ణ గారూ… ఇదే స్థితి చంద్రబాబుకు ఎదురైతే ఏం చేస్తాడు..?! ఇది పీవీ కాలం కాదు, అందరూ పీవీలు కారు కదా..!! పైగా ఎల్వీ సుబ్రహ్మణ్యాలు కూడా లేరు కదా ఇప్పుడు..!!
అన్నట్టు… 2019లో సీఎంగా జగన్ ప్రమాణస్వీకారానికి ముందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తనతో కలిసి వెళ్లి ప్రధాని వద్దకు వెళ్లాడు… దానిపై విమర్శలు వచ్చాయి కూడా… అలాంటి ఎల్వీని జగన్ తనే అవమానకరంగా పంపించేశాడు… కాలమహిమ..!!
Share this Article