దర్శకుడిగా వంశీని పాపులర్ చేసిన సినిమాల్లో శ్రీకనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్… ఇంత పెద్ద టైటిల్ వంశీ వంటి దర్శకులు మాత్రమే పెట్టగలరు… సినిమాకు ఇళయరాజా సంగీతం ఓ అస్సెట్… అప్పట్లో వంశీ సినిమా అనగానే రాజేంద్రప్రసాద్ హీరో అనేవాళ్లు కదా పాపం… దీనికి కూడా రాజేంద్రప్రసాద్ పేరే ఖాయం చేసుకున్నాడు వంశీ మొదట్లో… ఓవైపు ఇళయరాజాలో సంగీత చర్చలు దాదాపు పూర్తయ్యాక, రాజేంద్రప్రసాద్ హీరోగా, నిశాంతి హీరోయిన్‌గా అనుకుని, పబ్లిసిటీ ఆర్టిస్ట్ లంక భాస్కర్‌కు చెప్పేశాడు…
ఆయన డిజైన్ చేస్తే ఆ పోస్టర్‌తో ఎకో రికార్డింగ్ కంపెనీ వాళ్లు ఆడియో క్యాసెట్ కూడా రిలీజ్ చేసేశారు… హఠాత్తుగా ఆ అమ్మాయి హీరోయిన్‌గా వద్దు అంటాడు రాజేంద్రప్రసాద్, వేరే అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకుందాం అని పంచాయితీ… నిశాంతి అంటే భానుప్రియ చెల్లె శాంతిప్రియే… తమిళంలో నిశాంతి అనేవాళ్లు… తెలుగు, హిందీ భాషల్లో శాంతిప్రియ… (ఆమె గాకుండా మరో నిశాంతి లేదా నిశాంత ఎవరైనా ఉన్నారేమో నాకైతే తెలియదు… ఐనా దర్శకుడు వంశీ కాబట్టి ఆమె భానుప్రియ చెల్లెలే అని నమ్మొచ్చు… ఇంకెవరో అయినా సరే, ఈ కథనానికి మార్పులు అక్కర్లేదు..)
ఈ పంచాయితీ ముదిరి, ఒక దశలో వంశీకి చిరాకెత్తి, అసలు ఈ రాజేంద్రప్రసాద్‌ను పీకేస్తే ఎలా ఉంటుందని సీరియస్‌గా ఆలోచించాడు… మరీ ఇప్పటిలాగా హీరోలు చెప్పినట్టు, వంగి వంగి సలాములు కొడుతూ, మిగతా వాళ్లంతా నడిచే దుష్ట జమానా కాదది… నిజంగానే పీకేశాడు… తరువాత ఇంకో ఆలోచన వచ్చింది… నిశాంతి బదులు ఇంకెవరైనా కొత్త హీరోయిన్‌ను తీసుకుందాం అని ఫిక్సయిపోయాడు… సో, సినిమా నుంచి నిశాంతి కూడా ఔట్…
Ads
అనుకోకుండా నరేష్ గుర్తొచ్చాడు వంశీకి… ఇలా ఫోన్ చేశాడో లేదో అలా వాలిపోయాడు… హీరోగా ఫిక్సయిపోయాడు… అంతే… ఇప్పుడిలా ఉన్నాడు గానీ ఫాఫం, అప్పట్లో అణకువగా, ఒద్దికగా ఉండేవాడంటారు మరి… వంశీని కథ ఏమిటో అడగలేదు, ఆయనా చెప్పలేదు… స్వర్ణయుగం… ఇప్పుడు బుడ్డ బుడ్డ హీరోలు సైతం దర్శకుల్ని, నిర్మాతల్ని ఆడిస్తున్న రోజులు… కథల్ని కూడా ఇష్టారాజ్యం మార్చేసి, అవసరమైతే వాళ్లే మెగాఫోన్ పట్టుకుంటారు…
వంశీ అలా కారులో వెళ్తుంటే కోడంబాకం రైల్వేస్టేషన్ గోడమీద ‘సంసారం అదుమిన్ సారం’ సినిమా పోస్టర్ తనను ఆకర్షించింది… కారు ఆపించాడు… ఆ పోస్టర్‌లో ఓ మూలన ఓ అమ్మాయి ఫోటో… నల్లగా, పెద్ద కళ్లతో ఉండి, మనిషి బాగుంది అనిపించడంతో, ఆ సినిమా ఆడుతున్న ఏవీఎం రాజేశ్వరి థియేటర్‌కు వెళ్లాడు… ఆ పిల్ల వేసింది చాలా చిన్న రోల్… కేరక్టర్ పేరు వసంత… షో అయిపోయి ఇంటికొచ్చాడు… ఆ అమ్మాయి కళ్లే వంశీకి పదే పదే కనిపిస్తున్నాయి… నాకు హీరోయిన్ దొరికింది అనుకున్నాడు… ఆరాలు తీశాడు…
తీరా ఆ అమ్మాయిది రాజమండ్రేననీ, పేరు మాధురి అని తెలిసింది… తెలుగమ్మాయి, పైగా రాజమండ్రి అన్నాక వంశీ ఇక వదిలేది ఏముంది..? ఫోటో సెషన్స్ పెట్టించేసి, హీరోయిన్ అనిపించేసి, అడ్వాన్స్ కూడా ఇప్పించేసి ఖాయం చేసేశాడు… ఇప్పుడంటే దేశదేశాలు తిరుగుతుంటారు మన దర్శకులు కొత్త హీరోయిన్ల కోసం… తెలుగు మొహాలు పనికిరావు… మొహం పీనుగలా పీక్కుపోయి ఉన్నా సరే తెల్లగా ఉంటేసరి… కానీ ఒకప్పుడు ఏమిటో చెప్పడానికి ఇదంతా చెప్పుకోవడం… (ఇదంతా వంశీ తను స్వయంగా ఫేస్‌బుక్ పోస్టులో షేర్ చేసుకున్నదేనని గమనించగలరు…)
Share this Article