.
Bharadwaja Rangavajhala…………. అనగనగనగా ఎదురులేని మనిషి అనబడే అశ్వనీదత్ సినిమా షూటింగు జరుగుతోంది. అందులో ఎన్టీఆర్ కథానాయకుడు. వాణిశ్రీ హీరోయిన్ను… కృష్ణా ముకుందా మురారీ అనే ఓ ఆకతాయి పాట షూటింగు జరుగుతోంది. షాట్ గ్యాప్ లో వాణిశ్రీ గారు ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చి …
అన్న గారూ … ఆ పాటలో డాన్స్ మాస్టర్ చూపిస్తున్న మూమెంట్స్ గమనించారా … చాలా దుర్మార్గంగా ఉన్నాయనిపించింది నాకు … మీరు కాస్త ఆ డైరక్టర్ ని పిల్చి చెప్తే బాగుంటుంది కదా అన్నారట … నేను చెప్పను వాణిశ్రీ గారూ అన్నారట అన్నగారు …
Ads
అదేంటని ప్రశ్నించారు వాణిశ్రీ గారు. ‘‘ఇప్పటి ట్రెండ్ ఇది అని నమ్మి వాళ్లు తీస్తున్నారు. అది తప్పో ఒప్పో చెప్పడానికి మనమెవరం? మనం చేయం అంటే వేరెవరినైనా పెట్టుకుని తీసేసుకుంటారు వారు. డబ్బులు పెట్టేది వారు కనుక, ఎలా తీస్తే లాభం వస్తుందనే ఆలోచన చేసే తీస్తారు కదా … దాన్ని మనం ఎలా కాదనగలం?
కనుక మన ముందున్న దారులు రెండు. ఒకటి నచ్చకపోతే పూర్తిగా వదిలేసి వెళ్లిపోవడం … లేదూ … సర్దుకుపోయి నటించడం … నాకు తెల్సి ప్రస్తుతం మనం రెండో దారి ఎంచుకోవడమే కరక్టేమో వాణిశ్రీ గారూ’’ అన్నారట …
మీరు ఒక్క మాట చెప్తే … అని మరోసారి అన్నారట వాణిశ్రీ … (అమె కన్విన్స్ కానట్టుంది)… నేను మహా అయితే ఇంకో ఐదారేళ్లు నటిస్తానేమో … కనుక వారు చెప్పినట్టు చేసుకెళ్లడమే బెటరనే నిర్ణయానికి వచ్చేశాను … ట్రెండు ఫాలో కావడం అంటారు కదా … అలా … వ్యక్తిగత ఇష్టాలతో ప్రమేయం ఏముంటుంది? అని మరింత వివరణ కూడా ఇచ్చారట అన్న గారు ….
సరిగ్గా ఎన్టీఆర్ వివరణ పూర్తయ్యాక … వాణిశ్రీ ఆలోచనల్లోకి వెళ్లారట … ఇక మానేయడమే బెటరనే అభిప్రాయానికి ఆవిడ రావడానికి ఆ సంఘటనే కారణం అంటారు …. ఈ విషయాలు వాణిశ్రీ గారే స్వయంగా చాలా ఇంటర్యూల్లో చెప్పారు … (ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఆమె ఈ విషయాల్ని ఇంకా వివరంగా, నిర్మొహమాటంగా, కుండబద్దలు కొట్టేసినట్టుగా చెప్పింది)… (ఆ పాట ఈ పాటే కదా… ఓసారి చూసేయండి)…
ఇంకాస్త ఈ కథనాన్ని ‘ముచ్చట’గా విస్తరిద్దాం… ఎన్టీయార్ బాగానే చెప్పాడు, కాస్త కళ్లు మూసుకో ఈసారి అని… ఒకటి గుర్తొస్తుంది… నమక్ హలాల్ సినిమాలో ఆజ్ రపట్ జాయేతో పాట… అప్పటిదాకా సమాంతర సినిమాల్లో ఉదాత్త పాత్రలు పోషించిన స్మితా పాటిల్ అమితాబ్‌తో వానల్లో తడిసి, ఎగిరి, గెంతి, స్టెప్పి, హత్తుకుని, ఏదేదో చేస్తుంది…
షూటింగ్ అయిపోయాక రాత్రంతా ఏడుస్తూ… ఏ తెల్లవారుజామునో అమితాబ్‌కు ఫోన్ చేసింది… ఛ, ఇదేం వెగటు పాత్ర, వెకిలి స్టెప్పులు అని రోదించింది… అచ్చంగా అమితాబ్ కూడా ఎన్టీయార్‌లాగే చెప్పాడుట… మనం కాకపోతే ఇంకెవడో చేస్తాడు, మనం వెనకబడిపోతాం, తప్పదు అని కౌన్సలింగ్ చేశాడుట… మరుసటి రోజు ఆ కౌన్సెలింగ్ ఫలించి మరింతగా రెచ్చిపోయిందట ఆమె… అంతా మాయ..!
Share this Article