అయిపోయిందిగా… సారంగదరియా పాట వివాదం చల్లబడిందిగా… తరతరాలుగా పాడుకునే జానపదగీతాలపై హక్కెవరిది అనే బలమైన చర్చకు దారి తీసింది ఆ వివాదం… నిజానికి సారంగదరియా పాట రొమాంటిక్… దాన్ని అదే ట్యూన్లో, ఆదే టోన్‌లో దర్శకుడు సాయిపల్లవి మీద చిత్రీకరించుకున్నాడు… ఆ పల్లవి మాత్రమే వాడుకున్నాడు, మిగతాది సుద్దాల సొంత రాతే… జానపద గీతాలను ఇష్టమొచ్చినట్టుగా వాడుకుని, ఖూనీ చేయడం తెలుగు ఇండస్ట్రీకి కొత్తేమీ కాదు… ఆఖరికి భక్తిపాటలను కూడా, వాటి అర్థాన్ని వదిలిపెట్టేసి, వెకిలి వేషాలతో చిత్రీకరించిన ఉదాహరణలూ ఉన్నయ్… వాటిల్లో ఒకటి ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కల్యాణ్ పాడిన ‘బేట్రాయి సామి దేవుడా’ పాట… నిజంగా ఓ జానపద భక్తి గీతాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఖూనీ చేశాడు… ఈ రేంజులో ఓ పాపులర్ జానపద గీతాన్ని చెడగొట్టిన దర్శకుడు ఇంకొకరు లేరేమో…
ఇప్పటికీ నాటి యూట్యూబ్ వీడియోలలో ఈ పాట రచయిత పేరు సముద్రాల రాఘవాచార్య అని కనిపిస్తుంది… వోకే, పాడింది ఎలాగూ పవన్ కల్యాణే… వేరే వివాదమేమీ లేదు… ఎటొచ్చీ ఈ పాట రచయిత ఎవరు…? ఈ ఆర్టికల్ దిగువన ఓ యూట్యూబ్ వీడియో ఉంటుంది చూడండి… యడ్ల రామదాస అనే ఓ వడ్డెర కులస్థుడు రాసిన పాట ఇది… ఊరూరూ తిరుగుతూ రాళ్లు కొట్టుకునేవాడు… ఓసారి ఓ రాయిని పగుల గొడితే అందులో నుంచి కప్ప బయటపడుతుంది… దానితో జీవం, దేవుడి మీద మథనంతో… దేవుడి దశావతారాలనూ తనదైన జానపద శైలిలో కీర్తిస్తాడు… దశావతారాలు మానవ పరిణామ గతిని, మనిషి పిండ దశ నుంచి తల్లి గర్భంలో ఎదిగే పలు దశల్ని కూడా సూచిస్తాయి తెలుసు కదా… ఇదీ అంతే… ఈ భక్తి గీతాన్ని దేవిశ్రీప్రసాద్ తీసుకున్నాడు, ఏమీ మార్పులు చేర్పులు లేవు, బాగానే పాడించాడు పవన్ కల్యాణ్‌తో… ఎటొచ్చీ, దాన్ని సినిమాలో వాడుకున్న తీరే ఘోరం… ఆ సీన్ ఓసారి గుర్తుకుతెచ్చుకొండి… పవన్ కల్యాణ్ ఓ పైట వేసుకుని, గెంతులేస్తుంటే చుట్టూ ఉన్నవాళ్లు ఎగురుతూ, నోట్లు విసురుతూ… ఓ క్లబ్ డాన్స్ చేశాడు త్రివిక్రముడు… దీంతో పోలిస్తే సారంగదరియా అనేది అసలు ఓ వివాదమే కాదు…
Ads
ఈ బేట్రాయి స్వామి దేవుడా పాట మొత్తం ఓసారి చదవండి…
బేట్రాయి సామి దేవుడా – నన్నేలినోడ, బేట్రాయి సామి దేవుడా
కాటమ రాయుడా – కదిరి నరసిమ్ముడా
మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా ||బేట్రాయి||
శాప కడుపు సీరి పుట్టగా – రాకాసిగాని కోపామునేసి కొట్టగా
ఓపినన్ని నీల్లలోన వలసీ వేగామె తిరిగి
బాపనోల్ల సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ ||బేట్రాయి||
తాబేలై తాను పుట్టగా ఆ నీల్లకాడ దేవాసురులెల్లకూడగా
దోవసూసి కొండకింద దూరగానే సిల్కినపుడు
సావులేని మందులెల్ల దేవర్లకిచ్చినోడ ||బేట్రాయి||
అందగాదనవుదులేవయా – గోపాల గోవిందా రచ్చించా బేగరావయా
పందిలోన సేరి కోర పంటితోనె ఎత్తి భూమి
కిందు మిందు సేసినోడ సందమామ నీవె కాద ||బేట్రాయి||
నారసిమ్మ నిన్నె నమ్మితి – నానాటికైన కోరితి నీ పాదమే గతీ
ఓరి నీవు కంబాన సేరి ప్రహ్లాదు గాచి
కోర మీసవైరిగాని గుండె దొర్లసేసినోడ ||బేట్రాయి||
బుడత బాపనయ్యవైతివి ఆ సక్కురవరితి నడిగి భూమి నేలుకుంటివే
నిడువు కాల్లోడివై అడుగు నెత్తిపైన బెట్టి
తడవు లేక లోకమెల్ల మెడిమ తోటి తొక్కినోడ ||బేట్రాయి||
రెండుపదులు ఒక్కమారుతో ఆ దొరలనెల్ల సెండాడినావు పరసుతో
సెందకోల బట్టి కోదండరామసామికాడ
బెండు కోల సేసికొనే కొండకాడకేగినోడ ||బేట్రాయి||
రామదేవ రచ్చించరావయా సీతమ్మతల్లి
శ్యామసుందర నిన్ను మెచ్చగా
సామి తండ్రిమాట గాచి ప్రేమ భక్తినాదరించి
ఆమైన లంకనెల్ల దోమగాను సేసినోడ ||బేట్రాయి||
దేవకీదేవి కొడుకుగా ఈ జగములోన
దేవుడై నిలిచినావురా
ఆవూల మేపుకొనీ ఆడోళ్ళా గుడుకొనీ
తావుబాగ సేసుకొనీ తక్కిడి బిక్కిడి సేసినోడ ||బేట్రాయి||
ఏదాలు నమ్మరాదనీ ఆ శాస్త్రాలా
వాదాలూ బాగలేవనీ
బోధనలూ సేసికొనీ బుద్ధులూ సెప్పుకొనీ
నాదావినోదుడైన నల్లనయ్య నీవెకాద ||బేట్రాయి||
కలికి నా దొరవు నీవెగా ఈ జగములోన
పలికినావు బాలసిసువుడా
చిల్లకట్టు పురములోన సిన్నీ గోపాలుడౌర
పిల్లంగోవె సేతబట్టి పేట పేట తిరిగినోడ ||బేట్రాయి ||
అనంతపురం జిల్లా, కదిరిలో ఉన్న నరసింహుడిని కీర్తించేది ఇది… తనకు వేటరాయుడు అనే పేరు కూడా ఉంది… వేట్రాయి కాస్తా కన్నడ ప్రభావంతో బేట్రాయి అయ్యింది… అందుకే బేట్రాయి సామి అయ్యాడు… ఎంత మంచి కీర్తన అంటే..?
- చేపగా పుట్టి, సోమకాసురుడిని చంపి, వేదాల్ని (బాపనోళ్ల చదువులెల్ల) బ్రహ్మకు తిరిగి ఇవ్వడం…
- తరువాత తాబేలు… (కొండకింద దూరగానే సిల్కినప్పుడు) క్షీరసాగరమథనం… ఇక్కడ సావులేని మందు అంటే అమృతం…
- పందిలోన సేరి కోర పంటితోనే ఎత్తి భూమి… ఇదంతా వరాహావతారం, భూమిని మోస్తూ రక్షించడం… అందగాడనవుదులేవయా అని కొంటెగా కీర్తిస్తాడు రచయిత…
- కంబానా చేరి… వైరిగాని గుండె దొర్లసేసినోడ… ఇది నరసింహావతారం… కంబం అంటే స్తంభం… హిరణ్యకశిపుడిని వధించడం…
- శక్కురవరితి, బుడత బాపయ్య… తడవు లేక లోకమెల్ల మెడిమ తోటి తొక్కినోడ… అంటే బలిచక్రవర్తిని వామనుడు పాతాళానికి తొక్కేయడం…
- రెండు పదుల్ ఒక్కమారు అంటే ఇరవై ఒకటి… దొరలనెల్లా సెండాడినావ్ అంటే పరుశురాముడు క్షత్రియ రాజుల్ని ఊచకోత కోయడం…
- తండ్రి మాటా గాచి… అంటూ రాముడి అవతారం ప్రస్తావన…
- ఆవూల మేపుకోనీ, ఆడోళ్లా గూడుకోనీ… బృందావనంలోని కృష్ణుడి జీవన సరళి ప్రస్తావన…
- తరువాత బుద్దుడిని కూడా ఓ అవతారంగా చూస్తాడు రచయిత… ‘ఏదాలూ నమ్మరాదనీ, బోధనలు సేసికొనీ, బుద్దులూ సెప్పుకొనీ’ పదాలన్నీ అవే…
- చివరగా కల్కి అవతారాన్ని ఊహించి ముగిస్తాడు… ఎన్నెన్ని అచ్చ తెలుగు పదాలు, మాండలికాలు… చివరగా ఈ వీడియో ఓసారి చూడండి… ఈ పాటను ఓ మలయాళీ గాయకుడు ఎంత శ్రావ్యంగా పాడాడో… పాట నేపథ్యాన్ని కూడా ఎంత చక్కగా వివరించాడో… అలాగే మరో వీడియో ఉంటుంది… అది మన మంగళంపల్లి బాలమురళీకృష్ణ అదే జానపద రీతిలోనే అద్భుతంగా పాడిన వీడియో… కాస్త పదాల్లో మార్పులుంటయ్… అదీ వినేయండి…
Share this Article