టీవీ9 రవి ప్రకాష్… ఎన్డీటీవీ రవీష్ కుమార్… పేర్లలో సామ్యం ఉంది… ఒకరకంగా చూస్తే రవీష్ కుమార్ పాత్రికేయంతో పోలిస్తే రవిప్రకాష్‌ది చాలా పెద్ద సక్సెస్ స్టోరీ… రవీష్ కేవలం ఒక ఉద్యోగి… ఒక కార్పొరేట్ మీడియా కంపెనీ ఎన్డీటీని మరో కార్పొరేట్ కంపెనీ ఆదానీ గ్రూపు టేకోవర్ చేసింది… దాంతో రవీష్ 27 ఏళ్ల హిందీ టీవీ కొలువు ఊడిపోయే పరిస్థితి వచ్చింది… ఆదానీ ఎలాగూ ఉంచుకోడు, అందుకని రాజీనామా చేశాడు…
తను వీడ్కోలు ప్రసంగంలో ‘‘లక్షలు పెట్టి జర్నలిజం కోర్సులు చేస్తున్నవాళ్లూ, జాగ్రత్త, మీరు బ్రోకర్లుగా మార్చివేయబడతారు.. ప్రస్తుతం జర్నలిజంలో ఉన్నవాళ్లు బాగా సఫర్ కాబోయే రోజులొచ్చినయ్… ఆల్‌రెడీ చాలామంది ఈ వృత్తిని వదిలేశారు… కొనసాగుతున్నవాళ్లు ఓ కొలువులాగా తప్పితే ఓ ప్యాషన్‌లా ఫీల్ కావడం లేదు…’’ అన్నాడు రవీష్ కుమార్… నెవ్వర్, రవిప్రకాష్ ఇలాంటి పిచ్చి మాటలు ఎప్పుడూ మాట్లాడలేదు…
ఎన్డీటీవీని ఎవరూ మూసివేయించలేదు… అది చేసుకున్న తప్పులే బోలెడు… ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ బాధ్యతారహిత జర్నలిజాన్ని ఎలా ప్రమోట్ చేశారో అందరికీ తెలిసిందే… ఇప్పుడు అది అమ్ముడుబోతే అది ఏకంగా దేశంలో ఫ్రీప్రెస్‌కు దుర్దినాలు వచ్చాయట… చివరకు అల్‌జజీరా వంటి భారత వ్యతిరేక మీడియా కూడా అందుకుంది… దేశంలో ఫ్రీప్రెస్ మీద మస్తు చర్చ జరుగుతోందట… ఇప్పటికే ఫ్రీప్రెస్ ఇండెక్సులో ఎక్కడో దిగువన కొట్టుకుంటున్న ఇండియాకు ఇది మరింత అపఖ్యాతి అన్నట్టుగా ఏదేదో రాసుకుంటూ పోయింది…
Ads
దొరికింది కదా చాన్స్… న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ కూడా ప్రత్యేక వ్యాసాలు రాస్తాయి… నిజమా..? ఒక మీడియా కంపెనీ ఓనర్ మారితే ఫ్రీప్రెస్‌కు దెబ్బేనా..? అలాగైతే మరి టీవీ9 కథేమిటి..? రవిప్రకాష్‌ను ఏం చేశారు..? కేసులు పెట్టారు..? భయపెట్టారు..? వెళ్లగొట్టారు..? తన మోజో టీవీని మింగేశారు… నిజానికి రవీష్ కుమార్ జస్ట్, ఓ ఉద్యోగి… కానీ రవిప్రకాష్ టీవీ9 వ్యవస్థాపకుడు… తెలుగే కాదు, కన్నడం, గుజరాత్, హిందీ, మరాఠీ, బంగ్లా భాషల్లో అనుబంధ చానెళ్లున్నయ్…
తన సామర్థ్యం వేరు… చానెళ్లను కొత్తగా ఏర్పాటు చేయగలడు… సక్సెస్ బాటన నడిపించగలడు… (పాత పగలు మరిచి ఓ పెద్దాయన రవిప్రకాష్‌తో అయిదు భాషల్లో చానెళ్లు పెట్టించే ఆలోచనల్లో ఉన్నాడని జర్నలిస్టు సర్కిళ్లలో ఒకటే గుసగుస…) మరి రవిప్రకాష్ గెంటేయబడినప్పుడు ఫ్రీప్రెస్ గుర్తుకురాలేదా ఎవ్వరికీ..? జర్నలిజానికి గడ్డురోజులు వచ్చాయనే ఏడుపులు అప్పుడు వినిపించలేదు దేనికి..? రవీష్, రవిప్రకాష్… ఇది కేవలం ఉదాహరణ కోసం ప్రస్తావిస్తున్నాం… కానీ..?
మీడియా కంపెనీల టేకోవర్లు చాలా సహజం… ఎన్డీటీవీ మీదే ఎందుకీ రచ్చ సాగుతోంది… దాన్ని ఆదానీ టేకోవర్ చేశాడు కాబట్టి… తను మోడీ మనిషి కాబట్టి… ఇక అది కాషాయ శిబిరంలో చేరిపోతుంది కాబట్టి… అంతేనా..? ఈ కొనుగోలు వ్యవహారంలో ఆదానీ ప్రణయ్ రాయ్‌ను, రాధికా రాయ్‌ను ఏమీ బెదిరించలేదు… కేసులు పెట్టలేదు… లీగల్‌గా టేకోవర్ చేశాడు… (దేశాన్ని శాసించే స్థితికి ఆదానీ ప్రమాదకరంగా ఎదుగుతున్నాడు అనేది వేరే చర్చ)… ఒకటే ప్రశ్న రవిప్రకాష్ కేసులో దెబ్బతినని ఫ్రీప్రెస్ స్పిరిట్ రవీష్ కుమార్ రాజీనామాతో బాగా దెబ్బతిన్నదా..? పైగా అమ్ముడుబోని నిప్పు అని రవీష్ పై సోషల్ డప్పులు… అసలు తనని కొందామని ఎవడు చూశాడు..?
చానెల్ నడపడం అంత తేలికైన యవ్వారమేమీ కాదు… ఎక్కడెక్కడి ఉదాహరణలో దేనికి… ఇప్పుడు లబోదిబో అంటున్న సీపీఎం జనంతో పెట్టుబడి పెట్టించిన చానెల్‌ను కార్పొరేట్ శక్తులకు అమ్ముకోలేదా..? సీపీఐ తన చానెల్‌ను వదిలించుకోలేదా..? అరకొర వనరులతో మీడియా నడవదు ఈరోజుల్లో… ఏదో ఒక భారీ పెట్టుబడిదారీ శక్తి వెనుక ఉండాలి…
ఆ శక్తులకు పొలిటికల్ లైన్స్ ఉంటాయి… వాటిని బట్టే జర్నలిస్టుల రాతలు, కూతలు ఉంటాయి… కాగా జర్నలిజం ఇక బ్రోకరిజమే అని ఓ కొలువు ఊడిన ఉద్యోగి వాపోతే, ఫాఫం, ఇక జర్నలిజం బతికేదెట్లా అని నాలుగు కన్నీటి బొట్లు రాల్చాలా..?! ష్… ఈనాడు, ఈటీవీల్లో అంబానీ వేల కోట్ల డబ్బుల్లేవా..? ఈటీవీ ఇతర భాషాచానెళ్లన్నీ టేకోవర్ చేయలేదా..? రాజకీయాలైనా, కార్పొరేట్ వ్యాపారమైనా, మీడియా దందా అయినా… చిన మాయను పెదమాయ, పెదమాయను పెనుమాయ ఎప్పుడూ కబళిస్తూనే ఉంటయ్…!!
Share this Article