తెలంగాణ రాజకీయాల్లో రేవంత్‌రెడ్డి కేంద్ర బిందువు అవుతున్నాడా..? నిజానికి రాజకీయాల్లో పొద్దున ఉన్న సిట్యుయేషన్ మాపు ఉండదు, ఈరోజు లెక్క వేరు, రేపటి లెక్క వేరు… పరిస్థితులు ఎటు నుంచి ఎలా తన్నుకొస్తాయో ఎవరూ అంచనా వేయలేరు… ఒక దశలో తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేయడానికి సిద్ధమై, కాంగ్రెస్ చేతకానితనంతో అది అమలు జరగక… ఇక ఏడేళ్లుగా కేసీయార్ రాష్ట్రంలో రకరకాలుగా కాంగ్రెస్ పార్టీని తొక్కీ తొక్కీ నారతీసి, చీరి చింతకుకట్టి, కుళ్ల బొడిచాడు… ఇక నాకు రాష్ట్రంలో ప్రత్యర్థి లేడు, బతికినన్నాళ్లూ ఇక నాదే హవా అనుకున్నాడు… వర్తమాన రాజకీయాల్లో ఓ ఫక్తు రాజకీయవేత్తగా తన అడుగులు కరెక్టే… కానీ కాంగ్రెస్ బలహీనపడే కొద్దీ, బీజేపీ బలపడుతూ, ఖాళీ స్పేస్‌లోకి జొరబడుతూ, అసలైన థ్రెట్‌గా మారుతోంది… ఈ పరిణామాన్ని కేసీయార్ ఊహించలేదు…
ప్రభుత్వ వ్యతిరేకత ఎలాగూ సహజం… అది రాను రాను ఎవరికి లాభించనుంది రాష్ట్రంలో..? సగటు టీఆర్ఎస్ కార్యకర్త భావన ఏమిటంటే..? కాంగ్రెస్, బీజేపీ సమానబలాన్ని కలిగి ఉంటే, ప్రభుత్వ వ్యతిరేక వోట్లు చీలిపోయి, మళ్లీ కేసీయార్ నెత్తి మీద కిరీటం తప్పదు అని..! కానీ రాజకీయాల్లో 2+2=4 అనే ఈక్వేషన్ ఎప్పుడూ సరికాదు… ఏడు ఎంపీ స్థానాలు కాంగ్రెస్, బీజేపీ పరమయ్యాయి… దుబ్బాక పోయింది, సంపూర్ణ శక్తియుక్తులు వెచ్చించి, ఇక ఇలాంటి ఎన్నిక దేశంలో నభూతోనభవిష్యతి అనిపించుకున్న హుజూరాబాద్‌లో పరువూ పోయింది… జీహెచ్ఎంసీలో కూడా అంతే… సో, అన్ని రోజులూ మనవి కావు… ఇప్పుడు ఏమిటి మరి..?
దేశంలో బీజేపీ ప్రాభవం గణనీయంగా తగ్గిపోతోంది, ఈసారి బీజేపీకి మెజారిటీ రాదు, అకాలీదళ్, శివసేన వంటి మిత్రులూ ఎన్డీఏ వదిలేశారు… ఎలాగూ రాష్ట్రంలో కూడా బీజేపీ జోష్ కాస్త పెరుగుతోంది… అందుకని కేసీయార్ మెల్లిమెల్లిగా కాంగ్రెస్ వైపు కదులుతున్నట్టుగా కనిపిస్తోంది… తెర వెనుక ఏం జరుగుతోంది, తీరా సమయానికి ఏం చేస్తాడనేది అనూహ్యం… ఆయన ఎవరికీ అంతుపట్టడు… కానీ ఎన్నడూ లేనిది ఢిల్లీలో కాంగ్రెస్ అధ్వర్యంలో జరిగిన విపక్ష పార్టీల మీటింగుకు టీఆర్ఎస్ హాజరు కావడం ఓ విశేషమే… చర్చనీయాంశమే…
Ads
అంటే… కాంగ్రెస్ పార్టీతో ఏదైనా స్థూల అవగాహనకు వస్తాడా..? యూపీఏలో చేరిపోతాడా..? తటస్థ వైఖరిని వదిలేసి కాంగ్రెస్ కూటమికి జై అంటాడా..? ఇవన్నీ కాలం చెప్పాల్సిన సమాధానాలు… సింపుల్‌గా చెప్పాలంటే రేప్పొద్దున తనకు అవసరమైనన్ని సీట్లు గనుక రాకపోతే కాంగ్రెస్ సహకారం తీసుకుంటాడేమో… అంతేతప్ప కాంగ్రెస్‌తో పొత్తు అసాధ్యం… ఒకవేళ అదే గనుక జరిగితే బీజేపీ నెత్తిన సోనియా, కేసీయార్ కలిసి పాలు పోసినట్టే… గెలుపో, ఓటమో జానేదేవ్… రాష్ట్రంలో అది మరింత బలపడుతుంది… ఆ చాన్స్ కేసీయార్ ఇవ్వడు… అసలు ప్రస్తుత బీజేపీ వ్యతిరేక ధోరణిని కూడా కొనసాగిస్తాడా అనేదీ డౌటే… అగ్గిపెడతా, కాలబెడతా అని ఢిల్లీకి వెళ్లి, ఏం చేసి వచ్చాడో చూశాం కదా… పైగా యూపీఏ అనేదే లేదు, కాంగ్రెస్ నేతృత్వం అక్కర్లేదు, దానికేమీ చేతకాదు, మేమే ఓ కూటమి కడతాం అంటోంది మమత… శరద్ పవార్‌ను కలిసింది, నాలుగైదు రాష్ట్రాలకూ పార్టీని విస్తరిస్తోంది… యాంటీ-బీజేపీ వేదికకు సై అంటోంది… కేసీయార్‌కు తెలియదా ఇది..? సో, నాలుగు రోజులాగితే గానీ తన అడుగులేమిటో అర్థం కావు…
సరే, ఒకవేళ రేప్పొద్దున కాంగ్రెస్‌తో కలిసి వ్యూహరచన చేయకతప్పని స్థితి వస్తే… రేవంత్ పరిస్థితి ఏమిటి..? అసలే ‘ఇంటి నిండా శత్రువులు’… కేసీయార్ పొడ గిట్టదు… రాజకీయాల్లో శత్రుత్వం, మితృత్వం శాశ్వతం కాదనేది నిజమే గానీ కేసీయార్, రేవంత్ ఒక ఒరలో ఇమడరు… కేసీయార్‌తో దోస్తీ తప్పదు అని సోనియా, కాంగ్రెస్‌తో కలిసి వెళ్లక తప్పదు అని కేసీయార్ అనుకుని, బలంగా ఫిక్సయితే రేవంత్ ఏమైపోవాలి..? ఈటలలాగే బీజేపీకి జై అనాలా..? అసలే అక్కడ సీఎం అభ్యర్థులు ఎక్కువైపోతున్నారు, ఈ కొత్త అభ్యర్థిని రానిస్తాయా ఆ శక్తులు..? సొంత పార్టీ పెట్టుకోవాలా..? ఇప్పుడున్న స్థితిలో సొంత పార్టీని నడపడం, బలంగా జనంలోకి వెళ్లడం సాధ్యమేనా..? పైగా కాలం సమీపిస్తోంది… కేసీయార్ మరింత ముందస్తు ఎన్నికలకు వెళ్తాడనే ప్రచారం సాగుతోంది… అంటే సమయం కూడా సరిపోదు… వెరసి ఓ క్వశ్చన్ మార్క్… వర్తమాన తెలంగాణ రాజకీయాలే ఓ పెద్ద క్వశ్చన్ మార్క్… సరైన అంచనాలకు, విశ్లేషణలకు ఇప్పట్లో అందకపోవచ్చు…!!
Share this Article