బాబ్బాబు, మీకు వోట్లేస్తాం, గెలిపిస్తాం అని ప్రజలు సిద్ధంగా ఉన్నా సరే, ఠాట్ వీల్లేదు, ఎవడ్రా మాకు వోట్లేస్తామనేది..? అంటారా ఎవరైనా..?! ఎందుకు ఉండరు… తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లేదా ఏం..? నిజంగా ఆ పార్టీ దురవస్థ చూస్తే జాలేస్తుంది… కాదు, నవ్వొస్తుంది… జగ్గారెడ్డి ఎపిసోడ్ పక్కా తార్కాణం… రోజూ పత్రికల్లోకి వస్తూ, టీవీల్లో కనిపిస్తూ ఏదో హల్‌చల్ క్రియేట్ చేయడానికి నానా అవస్థలూ పడుతున్నాడు… పోత పోత అంటాడు, లేదు, లేదు, పోను, నేనెక్కడికి పోత అంటాడు… పంచాయితీ రేవంత్‌తోనే తప్ప పార్టీతో కాదు అంటాడు…
నిన్న తను విలేకరులకు చెప్పిన ముత్యాలముగ్గు సినిమా కథ నిజంగానే నవ్వు పుట్టించింది… జగ్గారెడ్డి చెప్పిన తీరుకో, కథలో నీతికో కాదు… అసలు తను ఏం చెప్పాలనుకుంటున్నాడో తనకైనా తెలుసా అసలు..? ఎస్, వేరే పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం పాళ్లు చాలా ఎక్కువ… క్రమశిక్షణ అనేదాన్ని పెద్దగా సహించదు పార్టీ… రేవంత్ నాయకత్వం నచ్చకపోతే మాకు చెప్పు, లేకపోతే వెళ్లిపో అని నిష్కర్షగా పార్టీ హైకమాండ్ ఎందుకు చెప్పలేకపోతోంది..?
మాటిమాటికీ మీడియాలో కనిపిస్తూ పార్టీని నవ్వులపాలు చేస్తుంటే ఎందుకు సహిస్తోంది..? జగ్గారెడ్డి ముత్యాలముగ్గు సినిమాలో హీరోయిన్ అట, రేవంత్ విలన్ అట, పార్టీ హీరో అట… తనను బదనాం చేస్తున్నారట… పవన్ కల్యాణ్ మీటింగుల్లో బండ్ల గణేష్ ప్రసంగాలు నయం అనిపించేలా… కేఏపాల్ సూక్తుల్లా… జగ్గారెడ్డి ఏం చెబుతున్నాడో, కవిహృదయం ఏమిటో అర్థం చేసుకోలేక విలేకరులకు జుత్తుపీక్కోవాల్సి వచ్చింది… ప్రజెంట్ ట్రెండ్ పొలిటిషియన్ అంటే లుక్కు, భాష, సబ్జెక్టు, ఫోకస్ వంటివి చాలా అవసరం…
Ads
పోనీ, హీరోయిన్ తనే, ఫాఫం అపనిందల పాలవుతున్నాడు… కానీ రేవంత్‌ను తన గదిలోకి కుట్రతో పంపించిన ఆ రావుగోపాలరావు ఎవరు..? చంద్రబాబునాయుడా..? తనకు జగ్గారెడ్డి మీద ద్వేషం ఉండాల్సిన పనేమీ లేదు… పోనీ, కాంగ్రెస్ సీనియర్లా..? వాళ్లతో జగ్గారెడ్డి మిలాఖతేనాయె… మరి అసలు విలన్ ఎవరు..? నాట్ ఓన్లీ జగ్గారెడ్డి… వీహెచ్ ఇంకో కేరక్టర్… మర్రి శశిధర్‌రెడ్డి, మరో ఇద్దరు ముగ్గురు… బయట కనిపించకుండా తెర వెనుక కదిలే ఇంకొందరు సీనియర్లు…
పోనీ, వీళ్లలో ఎవరైనా క్రౌడ్ పుల్లర్ ఉన్నారా..? ఒక జానారెడ్డి, ఒక కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఇన్నేళ్లలో చేసిందేముంది..? టీఆర్ఎస్ దెబ్బలకు పార్టీని అప్పగించేశారు… ఒక సీతక్క, ఒక భట్టి తప్ప మిగతావాళ్లు కనీసం జనంలో ఉంటున్నారా..? పోనీ, తమ నియోజకవర్గాలు దాటి ప్రభావం చూపించే స్థితిలో ఉన్నారా..? మరి రేవంత్ కాళ్లల్లో కట్టెలు దేనికి పెడుతున్నట్టు..? పొరపాటున ప్రజలు వోట్లేసి తమను గెలిపిస్తారేమో, కేసీయార్‌కు నష్టం జరుగుతుందేమో అని భయపడుతున్నారా..?
మొత్తానికి బీజేపీ హేపీగా సోకాల్డ్ కాంగ్రెస్ సీనియర్లకు రోజూ థాంక్స్ చెప్పాలి… ఏమైనా ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంటే, ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూసి, మొహం తిప్పుకుని, వెగటుగా ఓ లుక్ ఇచ్చి, బీజేపీ వైపు చూసేలా చేస్తున్నారుగా… అఫ్‌కోర్స్, బీజేపీ ఏదో సక్కగుందని కాదు… కానీ అందులో కూడా కొట్లాటలు ఉన్నా సరే, అవి తెరమీద కనిపించడం లేదు… జగ్గారెడ్డిలు, వీహెచ్‌లు ఉండవచ్చుగాక… కానీ ఎవరూ ఈ ముత్యాలముగ్గు కథలు చెప్పడం లేదు…!!
పంజాబ్‌లో సిద్ధూ అని ఓ కమెడియన్ ఉండేవాడు… పాకిస్థాన్ అంటే ప్రేమ, పిచ్చి, అభిమానం… తను ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ చుట్టూ అసమ్మతిని పోగు చేస్తూ, పిచ్చి కామెంట్లు చేస్తూ, పెంట పెట్టసాగాడు… కాంగ్రెస్‌ను పూర్తిగా శిథిలం చేసి, కొత్త భవనం నిర్మించాలని బలంగా కలలుగనే రాహుల్ గాంధీకి భలే నచ్చేశాడు… అమరీందర్ పారిపోయేలా చేశాడు… సిద్ధూకు పగ్గాలు ఇచ్చాడు… చివరకు ఏమైంది..? తెలంగాణ కాంగ్రెస్ గతి కూడా అంతేనా..? హేమిటో ఇది కూడా ముత్యాలముగ్గు ఎపిసోడ్‌లా అర్థం కావడం లేదు అంటారా..? అవును, టీపీసీసీ యవ్వారం ఎవరికీ అర్థం గాకుండా మారింది…
Share this Article