మాలీవుడ్‌కు టాలీవుడ్ ఏమీ భిన్నం కాదు… కోలీవుడ్, శాండల్‌వుడ్, బాలీవుడ్… ఏ వుడ్డయినా సరే అదే రీతి… ఆడది ఓ అంగడిసరుకు… లైంగిక దోపిడీ కామన్… నిష్ఠురంగా ఉన్నా ఇదే నిజం.., వివక్ష, అవమానం, వంచన, దోపిడీ… చెల్లింపుల్లో గానీ, ప్రయారిటీలో గానీ, వాడేసుకోవడంలో గానీ ఏ వుడ్డూ తీసిపోదు…
మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ రిపోర్టు ఓ కలకలం… కేసులు, అరెస్టులు, ఆంక్షలు గట్రా ఒకదాని వెనుక మరొకటి… తెలుగు ఇండస్ట్రీలోనూ ఓ హేమ కమిటీ ఒకటి ఉండాలని ఒక అభిప్రాయం… కోలీవుడ్ హేమ కమిటీ అంటే హేమ అనే రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఏర్పడిన కమిటీ, అందులో సీనియర్ నటి శారదతోపాటు రిటైర్డ్ ఐఏఎస్ వత్సల కుమారి కూడా ఉన్నారు…
అది ఇప్పటిదేమీ కాదు… 2017లో ఓ నటిపై జరిగిన లైంగిక దాడి తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ, రీసెంటుగా ‘ఎడిటెడ్ వెర్షన్’ రిలీజ్ చేసింది ప్రభుత్వం… మిటూ ఆరోపణలు, ఫిర్యాదులు ఇక్కడా ఉన్నాయి కదా… తాజాగా కొరియోగ్రాఫర్, జనసేన నాయకుడు జానీ మాస్టర్ తన అసిస్టెంటుకు చేసిన అన్యాయం మీద కలకలం… ఇంకొందరూ నోళ్లు విప్పి మాట్లాడుతున్నారు… నటి పూనం కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌నూ బజారుకు లాగుతున్నట్టుంది…
Ads
బాధితురాలికి అల్లు అర్జున్ బాసటగా నిలిచాడనేది ఓ వార్త… వెంటనే బన్నీ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ నడుమ సోషల్ రగడ స్టార్ట్… మరి పుష్ప జగదీష్ కేసులో బాధితురాలికి ఎందుకు అండగా నిలవలేకపోయావ్ అని ప్రశ్న… హేమ కమిటీ గురించి కదా చెప్పుకునేది… నిజానికి ప్రత్యేకంగా హేమ కమిటీ అక్కర్లేదు… ఆల్రెడీ లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ ఒకటి ఉంది ఇండస్ట్రీలో… చాన్నాళ్లయింది ఏర్పాటై… మాలీవుడ్ కమిటీ ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల అధ్యయనం, నివేదిక ఇవ్వడం కోసం ఉద్దేశించింది…
ఈ టాలీవుడ్ కమిటీ ప్రభుత్వ ఏర్పాటు కమిటీ కాదు, పైగా ఇది సొల్యూషన్స్, ఫిర్యాదులపై స్పందించి యాక్షన్‌కి దిగే కమిటీ… 2013లో ఆసరా అని స్టార్ట్ చేశారు, తరువాత 2018లో ఈ ప్యానెల్ ఏర్పాటైంది… తెలుగు ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు ఇది… ఇందులో ఝాన్సీ, భరద్వాజలతోపాటు సుచిత్రా చంద్రబోస్, వివేక్ కూచిభొట్ల, ప్రగతి మహావాది, దామోదర్ ప్రసాద్‌తోపాటు లీగల్, మీడియా సహకారం కోసం కూడా సభ్యులున్నారు…
జానీ మాస్టర్ ఇష్యూ కలకలం రేపుతుండేసరికి తెర మీదకు వచ్చిన ఆ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు… నటి ఝాన్సీ , తమ్మారెడ్డి భరద్వాజ తదితరులున్నారు ఈ ప్యానెల్‌లో… ఓ ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు, వాట్సప్ నంబర్ వెల్లడించారు… జానీ మాస్టర్ డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడట, ఆ పోస్టు నుంచి తొలగించారు… జనసేన పార్టీ తనను సస్పెండ్ చేసింది… జానీ మాస్టర్ అసిస్టెంట్ ఫిర్యాదుపై ఈ ప్యానెల్ విచారణ సాగిస్తోంది, ఓ కమిటీ వేసుకుంది…
ఆమె మైనర్ అట… (మైనర్లతో ఇండస్ట్రీ పనిచేయించుకోవచ్చా..? ఏ విభాగాల్లో అనుమతించొచ్చు..?) ఆమె లీగల్‌గా కూడా ప్రొసీడవుతోంది… కోర్టు విచారణ వోకే, కానీ ఈ ప్యానెల్ అధికార పరిధి ఎంత అనేది ఇప్పుడు చర్చనీయాంశం… పైగా వాళ్లే చెబుతున్నారు, మాకు వచ్చిన ఫిర్యాదులు చాలా తక్కువ అని… ఇప్పుడు జానీమాస్టర్ బాధితురాలి ఫిర్యాదుతో ఈ ప్యానెల్ ఉందనే విషయం బయటికొచ్చింది… ఈ ప్యానెల్ చెబుతున్నట్టు ఫిర్యాదుదారుల వివరాలు రహస్యంగా ఉంచుతారు, గుడ్, అవసరమే… కానీ సినిమా సర్కిళ్లలో ఒక్కసారి ఎవరైనా ఇలాంటి ఫిర్యాదులు చేస్తే ఇక ఆమెకు అవకాశాలు బంద్… అందుకే, ఆ భయంతోనే ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా ఎవరూ ఫిర్యాదుకు ముందుకు రారు… అదుగో అదే అసలు సమస్య…
జానీ మాస్టర్ అసిస్టెంటుకు అండగా ఓ నిర్మాణ సంస్థ, ఓ దర్శకుడు, ఓ సీనియర్ హీరో అండగా నిలబడటానికి ముందుకొచ్చారని ఝాన్సీ చెబుతోంది, గుడ్… ఎన్నాళ్లు..? ఇలా ఎంత మందికి..? లిటిగెంట్ అనే ముద్ర వేసి, అనవసరంగా చిక్కులు అనుకుని దూరం పెడుతుంటారు… ‘న్యాయానికి అసలు అవరోధం’ అదే… తేలికగా జవాబు దొరకని ప్రశ్న కూడా ఇదే..!! కానీ ఒకటి మాత్రం నిజం… ఒకరిద్దరికి శిక్షలు, మీడియా బదనాం గట్రా నష్టాలు ఎదురైతేనే, మిగతావాళ్లు కొంతైనా జాగ్రత్తగా వ్యవహరించే అవకాశముంది..!!
Share this Article