సోషల్ మీడియాలో కొన్ని ఠక్కున ఆకర్షిస్తయ్, ఒకింత ఆలోచనలో లేదా ఆందోళనలో పడేస్తయ్… అనుమానించేలా చేస్తయ్… చివరకు అదేమీ లేదులే అని తేల్చుకున్నాక కుదుటపడుతుంది… ఇదీ అలాంటిదే… బాలయ్య హీరోగా రామానుజాచార్యుల బయోపిక్ తీయబోతున్నారు, బాలయ్య 109వ సినిమా ఇదే, చినజియ్యర్ స్వామి సూచనలతో కథ ఉంటుందనేది ఆ పోస్టు సారాంశం… ఓ ఫోటో కూడా పెట్టారు… ఆరా తీస్తే, కొన్ని పరిస్థితులు, ప్రజెంట్ ట్రెండ్స్ పరిశీలిస్తే ఈ ప్రాజెక్టు ఉండకపోవచ్చునని తేలిపోతుంది…
రామానుజాచార్యుల కథ విశిష్టం… ఆయన మార్గం విశిష్ట అద్వైతం… దేశమంతా ఎరిగిన వైష్ణవ గురువు… చెప్పదగిన కథే… చెప్పాల్సిన కథే… అయితే అటు భక్తజనాన్ని మెప్పిస్తూనే, సగటు ప్రేక్షకుడికీ ఎక్కేలా… అదే సమయంలో మైనస్ బడ్జెట్ గాకుండా కనీసం పెట్టిన డబ్బయినా తిరిగి వచ్చేలా ఎవరు నిర్మించాలి..? ఎవరు దర్శకత్వం వహించాలి..? సరైన కథకుడు కావాలి… తిరుమంత్రాన్ని గుడిగోపురం ఎక్కి మరీ వినిపించడం వంటి వావ్ అనిపించే సీన్లు చాలా పడితే తప్ప సినిమా విజయపథంలో సాగదు…
కమర్షియల్ కోణంలో ఎందుకు సాగాలి..? రాఘవేంద్రుడు చెత్త మసాలాలు నింపిన నాగార్జున అన్నమయ్యలా గాకుండా… ప్లెయిన్‌గా, ప్యూర్‌గా ప్రబోధాత్మకంగానే ఎందుకు తీయకూడదు అనే ప్రశ్న వస్తుంది… కానీ జనం ఆదరిస్తారా..? అదే కదా అసలు ప్రశ్న… అలా కేవలం ప్లెయిన్ బయోపిక్ తీయడానికి చినజియ్యర్ దగ్గర కూడా డబ్బేమీ లేదు… మైహోం రామేశ్వరరావుకూ ఆయనకూ సత్సంబంధాలు ఏమీ లేవు… ఇప్పటికే తలపెట్టిన సమతా ప్రాజెక్టే ఒడిదొడుకుల్లో ఉంది… విస్తరణ లేదు, ఆశించిన నిర్మాణాలూ లేవు… సో, వాళ్లు రామానుజుడి సినిమాను తీసే సీన్ లేదు…
Ads
నిజానికి బాలయ్య కూడా ఆ మూడ్‌లో లేడు… చేయలేడని కాదు, మెప్పించగలడు… కానీ అఖండ మాయలో ఉన్నాడు… మంచి పవర్ ఫుల్ పంచ్ డైలాగులు గనుక పడితే సినిమా బాగా వస్తుంది… కానీ అఖండ మార్క్ ఫైట్లు, డ్యూయెట్లు వంటివి రామానుజుడి సినిమాకు సూట్ కావు… స్టెప్పుల నటుడు చిరంజీవికి ఈ పాత్ర అస్సలు సూట్ కాదు, తను చేయడు… ఇందులోనూ లాహే లాహే అన్నాడంటే సగటు వైష్ణవుడి మనస్సు ఛిద్రమైపోతుంది… రాజశేఖర్, వెంకటేష్ అస్సలు పనికిరారు…
వాస్తవంగా ఈ సినిమాకు సూటయ్యేది నాగార్జున… ఫిజిక్ కూడా సరిపోతుంది… అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డి సాయిబాబా వంటి పాత్రలు పోషించిన అనుభవమే కాదు, తను కొన్నిసార్లు ఇలాంటి పాత్రలకు సాహసిస్తాడు… కాకపోతే మరీ అన్నమయ్య, రామదాసుల్లోని రొమాంటిక్ డ్యూయెట్లు ఇందులో కుదరకపోవచ్చు… ఎలాగూ తన కమర్షియల్ మూవీస్ అన్నీ ఢమాలే… రామానుజుడి పాత్ర చేస్తే మంచిదే… కానీ సరైన దర్శకుడు ఎవరు..? ఈ ప్రశ్నకు జవాబు కష్టం…
విష్ణు అవతారాలను, వాటి విశిష్టతను సంక్షిప్తంగా, గానరూపంలో చెబుతూ… రామానుజుడి కథను బ్లెండ్ చేయడం ఓ మంచి మార్గం… కానీ అది చేయాలంటే మంచి పాటల రచయిత, మంచి మ్యూజిక్ కంపోజర్ కావాలి… ఇప్పుడున్న ప్రముఖ కంపోజర్లందరూ ఊ అంటావా బాపతే కదా… 1989లో తమిళంలో రామానుజుడి మీద ఓ సినిమా వచ్చింది… జీవీ అయ్యర్ దర్శకుడు… మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత దర్శకుడు… ఇంట్రస్టింగు… కానీ ఆ సినిమా ఏమైందో, తను కంపోజ్ చేసిన పాటల వివరాలూ లభ్యం కావు… మనసు పెడితే కీరవాణి సంగీతపరంగా పరిపుష్టం చేయగలడు… కానీ కొన్నాళ్లుగా తను అవుట్ ఆఫ్ ట్రాక్…!!
Share this Article