Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చుక్కల ఇంట్లో రుచి అధ్వాన్నం.. బయట హోటల్లో ఆత్మారాముడి ఆనందం…

March 13, 2023 by M S R

Taste less ‘Star’s:

“మనకు ఉచితంగా జ్ఞాన బోధ ఎవరయినా చేస్తారు;
మన భోజనం మాత్రం మనమే సంపాదించుకోవాలి”
అన్నాడు పతంజలి.

“There is no free meal in this world”
ప్రపంచంలో ఏదీ ఊరికే రాదు అన్న అర్థంలో ఇంగ్లీషులో ప్రఖ్యాత నానుడి.

Ads

“అన్నమయితేనేమిరా?
సున్నమయితేనేమిరా?
పాడు పొట్టకు అన్నమే వేద్దామురా!”
అని కొంటె సామెత ఉండనే ఉంది.

అధ్వ అంటే దారి;
అన్నం- తిండి.
రెండు మాటలు సవర్ణదీర్ఘ సంధితో కలిస్తే “అధ్వాన్నం”. అంటే దారి మధ్యలో వండుకుని తిన్నది, వండినది అని. ఇంట్లోలా అన్నీ కుదిరినా, కుదరకపోయినా, రుచి-శుచి లేకపోయినా ఆకలితో అలమటించి స్పృహతప్పి పడిపోకుండా దారిలో ఏదో ఒకటి అనుకుని తినే అన్నమే “అధ్వాన్నం”.

భాషలో మాటలకు అర్థవ్యాప్తి, అర్థ సంకోచాలు వస్తుంటాయి. ఆ రుచి పచీ లేని ఆహారపరమైన అధ్వాన్నం కాస్త బాగలేని దేనికయినా “అధ్వాన్నం” అయ్యింది. అలా విశాఖలో నాకుఎదురయిన ఒకానొక ఫైవ్ స్టార్ అధ్వాన్నం సంగతి ఇది.

అర్ధరాత్రి రైలు దిగి అయిదు చుక్కల (నక్షత్రాల) హోటల్ కు వెళ్లగానే రిసెప్షన్లో శ్రీకాకుళం అబ్బాయి ఇంగ్లీషులో మాట్లాడుతూ నా పుట్టు మచ్చల వివరాలు, ఆధార్ కార్డు, బుకింగ్ కన్ఫర్మేషన్ లాంటివన్నీ తీసుకుని రూము స్మార్ట్ కార్డ్ కీ ఇచ్చాడు. చుక్కల హోటల్ కాబట్టి రూము కిటికీ గాజు తలుపు తెరవలేము. వంద అడుగుల దూరంలో ఎగురుతున్న సముద్రం అలలను స్క్రీన్ మీద చూస్తున్నట్లు కిటికీ అద్దం గుండా చూడాలి అంతే. అలల హోరును మనసుతో వినాలి. అంతే.
“కొండ అద్దమందు కొంచెమై ఉన్నప్పుడు-
సముద్రం కిటికీ అద్దమందు కొంచెమై ఉండదా?”
అనుకున్నా.

ఆ చుక్కల హోటల్లో రెండ్రోజులు రాత్రి భోజనం చేసే సరికి చుక్కలు కనిపించాయి. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీలో వెజిటబుల్స్ మిక్స్ కాలేదు. రోటీ పీక్కు తినడానికి రెండు చేతులు చాలలేదు. బిసిబేలిబాత్ లో బిసీ (వేడి) ఉంది కానీ అందులో బియ్యం మెతుకులు తప్ప బేలి (బేడలు) లేవు. “అధ్వాన్నం” వ్యుత్పత్తి అర్థాన్ని ఎదురుగా తింటున్న ప్లేట్లో సాధించుకుని… రూముకెళ్లి పడుకున్నా.

నాలుగో రోజు పనులన్నీ ముగించుకుని… సాయంత్రం బీచ్ లో వాకింగ్ చేసి… రూముకొచ్చి స్నానం చేసి… కారును, డ్రయివర్ ను వదిలేసి…హోటల్ గేటు దాటి రోడ్డు మీదికి వచ్చా. చుక్కల హోటల్ గేటు ముందు వరుసగా ఆటోలు శుభ సూచకంగా కనిపించాయి. నలుగురు ఆటో డ్రయివర్లు ఒక ఆటోలో పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు.
“నాయనా! నాది ఈ ఊరు కాదు. ఈ హోటల్లో నా తిండి “అధ్వాన్నం” అయ్యింది. రాత్రిళ్లు నేను అన్నం తినను. ఇంకో రెండ్రోజులు ఇక్కడే తింటే…ఇక మధ్యాహ్నాలు కూడా అన్నం మానేయాల్సి వస్తుంది. మంచి వెజిటేరియన్ టిఫిన్లు దొరికే చోటికి తీసుకెళ్లి…మళ్లీ ఇక్కడే దించాలి” అని ఒప్పందం కుదుర్చుకున్నా.

“ఓస్! అంతే కదా!
ఓయ్ ఆప్పల్నాయుడూ…
ఎన్ టి ఆర్ విగ్రహం ముందు రామనగరం రోడ్డు మీద
‘మా నేతి విందు’కు
బేగి ఎల్లిపోయి వచ్చిసీ…”
అని ఒక ఆటో డ్రయివర్ మంచి ఉత్తరాంధ్ర మాండలికంలో మరో ఆటో అతడికి పురమాయించాడు. “బేగి వచ్చిసీ” మాట అందం వింటే తెలుస్తుంది. రాస్తే అందదు. ఆ మాండలికం మధురిమకే సగం కడుపు నిండిపోయింది.
“మా నేతి విందు” పేరే పేరిన నెయ్యిలా ఘుమఘుమలాడుతోంది.

“ఒక్కొక్క ఐటెం రుచి చూస్తాను. ఇడ్లి ఒక ముక్క, దోసె ఒక ముక్క…అలా ఉన్నవన్నీ ఇస్తావామ్మా?”
అని అడిగితే “అలగెలగవుతుంది?” అని అమాయకంగా మొహం పెట్టింది.
కావాలంటే ఇచ్చిన ప్రతి ఐటెంకు ఒక్కొక్క ప్లేట్ బిల్ తీసుకో అన్నాను.
ఏమనుకుందో… కౌంటర్లో అడిగి వచ్చి… సరే అంది. అతి కొద్దిగానే అయినా ఒకదాని తరువాత ఒకటి ఆరేడు ఐటమ్స్ వడ్డించింది. మసాలా ఇడ్లి, స్పాంజ్ దోసె, పూరీ… అన్నీ బాగున్నాయి. ఏడు ప్లేట్ల బిల్లు వస్తుందనుకుంటే… రెండు ప్లేట్ల బిల్లు రెండొందలే తెచ్చింది. ఇదేమిటమ్మా? అంటే మీరు తిన్నది రెండు ప్లేట్లతో సమానం సార్ అంది. వర్షాకాలంలో వర్షాలు పడుతుండడానికి ఇంకా ఇలాంటి ధర్మాలేవో బతికి బట్ట కడుతుండడమే కారణం కావాలి.

అక్కడ తినలేకపోయిన బిసిబేళి బాత్ కు వెయ్యి రూపాయలు ఇచ్చా.
ఇక్కడ తినగలిగినన్ని తిన్నా రెండొందలే ఇచ్చా. రాను పోను ఆటో ఖర్చుతో కలిపినా 350 రూపాయలు దాటలేదు.

ఉపోద్ఘాతం మాటలతోనే ఉపసంహారం చేస్తా.

“రుచిలేని ఆహార జ్ఞానం ఎవరయినా పెడతారు;
రుచిగలిగిన ఆహారం మనమే సంపాదించుకోవాలి”

“అన్నమయితే ఏమి?
సున్నమయితే ఏమి?”
అని ప్రాస కుదిరిందని పాడు కడుపుకు సున్నం వేయలేము కదా?

ఇల్లు దాటి… బయటికెళితే… అంతా “అధ్వాన్నమే”. ఆ అధ్వాన్నాల్లో మెరుగయిన అధ్వాన్నాన్ని వెతుక్కోవడమే తరుణోపాయం!

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions