Automatic: తక్కువ సమయంలో యంత్రాలతో ఎక్కువ పని చేయించుకోవడం ఒకప్పుడు గొప్ప. పారిశ్రామిక విప్లవం తరువాత ప్రపంచమంతా ఫ్యాక్టరీల పొగ గొట్టాలే. సైరన్ మోతలే. యంత్రాల రోదలే. కాలం ఎప్పుడూ నిలిచి ఉండేది కాదు. ప్రవహించేది. ఇప్పుడు మనుషులు యంత్రాలను నడపడం ఓల్డ్ ఫ్యాషన్. యంత్రాలను యంత్రాలే నడపడం లేటెస్ట్ ట్రెండ్. ఆమధ్య గుజరాత్ లో గుండె డాక్టర్ ఒక చోట, రోగి మరోచోట ఉండగా రోబోటిక్ పద్ధతిలో డాక్టరు ఉన్నచోటునుండే ఎక్కడో ఉన్న రోగి గుండెకు శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేశాడు. ఆ గుండె గుండ్రాయిలా ఆరోగ్యంగా పనిచేస్తోంది.
ఆటోమొబైల్ పరిశ్రమల్లో ఎప్పటినుండో రోబోలు కార్లను తయారు చేసి కంటైనర్లలో లోడ్ చేసి చలో అంటున్నాయి. బెంజ్, ఆడి లాంటి కార్ల తయారీ పరిశ్రమల్లో మానవరహిత రోబో యంత్రాల పనులే ఎక్కువ. మహా అయితే మనుషుల ప్రమేయం ఇరవై అయిదు శాతం ఉంటే ఎక్కువ.
Ads
విమానాల్లో ఆటో పైలట్ మోడ్ ఎప్పటినుండో ఉంది. గగనయానంలో అంతర్జాతీయ ప్రయాణాలు పది, పదిహేను గంటలు కూడా ఉంటాయి. మ్యాన్యువల్ గా పైలట్ ఎక్కువ భాగం చేత్తో నడిపినా- ఒకేవేగంతో ఒకే దారిలో వెళ్లగలిగే అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు ఆటో పైలట్ మోడ్ లో పెట్టి పైలట్ నిద్ర పోవచ్చు. పక్కన కో పైలట్ తో పిచ్చాపాటీ మాట్లాడుకోవచ్చు. ఆకాశంలో నక్షత్రాలను లెక్కపెట్టవచ్చు. ఆటో మోడ్ లో ఉంటుంది కాబట్టి-విమానం దాని మానాన అది వెళుతూ ఉంటుంది.
గాల్లో దీపం అన్నట్లు గాల్లో ప్రయాణం కాబట్టి మన తొమ్మిది గ్రహాలు సవ్యంగా ఉంటే దిగాల్సిన చోట భద్రంగా దిగుతాం. అయితే మనమేమి చేస్తున్నామో మన సీట్ల మీద ఉన్న చిన్న రంధ్రాల్లో బిగించిన కెమెరాల ద్వారా పైలట్ చూడగలుగుతాడు. తలుపులు గడియపెట్టి బిగించుకున్న కాక్ పిట్ లో పైలట్ ఏమి చేస్తున్నాడో చూసే కెమెరాలు మనకు ఉండవు కాబట్టి- పైలట్ బాధ్యతగా, భద్రంగా తన కంటి ముందు ఉన్న ఆరేడు వందల మీటలను జాగ్రత్తగా ఎప్పటికప్పుడు నొక్కుతున్నాడనే మనం అనుకోవాలి. అంతకుమించి ప్యాసెంజర్లకు మరో అప్షన్ కూడా లేదు.
కొంచెం పెద్ద కార్లు, లేదా విలాసవంతమయిన కార్లలో కూడా క్రూయిజ్ కంట్రోల్ అని ఒక డ్రైవింగ్ అప్షన్ ఉంది. ఎనభై కిలో మీటర్ల వేగం దగ్గర క్రూయిజ్ కంట్రోల్ అప్షన్ నొక్కితే- ఇక ఎక్సలేటర్ తొక్కాల్సిన పనిలేకుండా ఎనభై కిలోమీటర్ల వేగంతో కారు అలా తనకు తానే వెళుతూ ఉంటుంది. మనం స్టీరింగ్ తిప్పుకుంటూ ఉంటే చాలు. బ్రేక్ వేస్తే మామూలుగానే ఆగిపోతుంది.
ఆమధ్య ఢిల్లీలో ఇంజిన్ డ్రైవర్ లేకుండా రైలు ప్రయాణించింది. అంటే డ్రైవర్ ను మరిచిపోయి ఇంజిన్ తనకు తానే వెళ్లిందని కంగారు పడాల్సినపనిలేదు. ఇది డ్రైవర్ రహిత ఇంజిన్ /రైలు. ఒక ప్రత్యేక సాఫ్ట్ వేర్ లో ముందే ప్రోగ్రామింగ్ అంతా రాసిపెడతారు. సెన్సార్, జి పి ఎస్ ఆధారిత అనేక సాంకేతిక వ్యవస్థలతో అనుసంధానం చేస్తారు. వీటి ఆధారంగా ఎక్కడ ఆగాలో అక్కడ ఆగుతుంది. నియమిత సమయం తరువాత దానంతటదే మళ్లీ బయలుదేరుతుంది. బయటి దేశాల్లో మెట్రో, మోనో రైళ్లలో డ్రైవర్ రహితంగా నడపడం ఇప్పటికే ఉంది.
డ్రైవర్ రహిత కార్లను గూగుల్ ప్రయోగాత్మకంగా పరీక్షించింది. అమెరికాకు చెందిన టెస్లా కారు భారత్ లోకి రాబోతున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గడ్కరీ ప్రకటించారు. కరెంటుతో నడిచే ఈ టెస్లా కారు బానెట్ ఓపెన్ చేస్తే వెనక లగేజ్ పెట్టుకునే డిక్కీలా ఖాళీగా ఉంటుంది. భారత్ మార్కెట్లో టెస్లా కారు ధర యాభై, అరవై లక్షలు ఉండవచ్చని అంచనా. ఎలెక్ట్రిక్ కార్లు పర్యావరణానికి చాలా మంచివే అయినా- అరకోటి పెట్టి కొనే శక్తి ఇండియాలో ఎంతమందికి ఉంటుంది?
డ్రయివర్ రహిత వాహనాల తయారీ పరిశోధనల మీద పెద్ద పెద్ద కంపెనీలు వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయి. నడుపుతున్న డ్రయివర్ కు సలహాలిచ్చే సాఫ్ట్ వేర్ మొదలు, అసలు స్టీరింగ్, డ్రయివర్ అవసరమే లేని వాహనాల దాకా ఈ పరిశోధనల్లో కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగాయి. అవన్నీ ఇప్పుడు ప్రయోగాల దశల్లో ఉన్నాయి. నెమ్మదిగా రోడ్ల మీదికి రావడం ఖాయం.
నెమ్మదిగా కార్లు, బస్సులు, రైళ్లల్లో డ్రైవర్ లు మాయమయ్యే రోజులు వచ్చేశాయి.
అందెశ్రీ పాటను కొంచెం మార్చి ఇలా పాడుకోవచ్చు.
“మాయమైపోతున్నడమ్మా!
డ్రైవరన్న వాడు!
మచ్చుకయినా కానరాడు!”
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
Share this Article