.
ప్రతి సైనికుడి సతీమణి… కనిపించని ఒక వీర పతకం
సరిహద్దుల్లో యుద్ధం ఎలా చేయాలో నాకు నేర్పించారు. ఇంట్లో నిత్యజీవన యుద్ధం ఎలా చేయాలో ఆమెకు ఎవరూ నేర్పలేదు.
Ads
మిలటరీలో చేరేనాటికి నా వయసు 18. ఉత్సాహంగా చేతిలో ఒక పెట్టె, గుండె నిండా ధైర్యంతో అడుగుపెట్టాను. శిక్షణ ముగిసి సైన్యంలో చేరేనాటికి నా వయసు 22.
కొన్నేళ్ళకు పెళ్లయ్యింది. పెళ్లయ్యాకే నాకు నిజమైన ధైర్యం నిరీక్షణలో, ఓపికలో ఉంది తప్ప… యుద్ధరంగంలో లేదని తెలిసింది.
దేశ సరిహద్దులో నాకు పోస్టింగ్ వచ్చినప్పుడు ఆమె దిగులుపడలేదు. కన్నీళ్ళు కార్చలేదు. నవ్వుతూ… ఫోన్ చేస్తూ ఉండు అని సాగనంపింది.
కొన్ని రోజులపాటు ఫోన్ కలవనప్పుడు… మా అమ్మా నాన్న లేక వాళ్ళ అమ్మా నాన్న కంగారు పడినప్పుడు… ఈ ఉద్యోగంలో అంతే… దిగులుపడకండి అని ఓదారుస్తుంది.
ఇంట్లో నేనున్నట్లే ప్రతి పండుగను ఆమె ఆనందంగా జరుపుకుంటుంది. దీపావళి పూట ఇల్లంతా దీపాల వెలుగులతో నింపుతుంది. ఒక సంవత్సరం దీపావళి రోజు కరెంట్ పోయి ఇంట్లో చీకటిగా ఉన్నప్పుడు క్యాండిల్స్ వెలిగిస్తూ… నేను కూడా సరిహద్దుల్లో ఆవేళకు అలాగే దీపాలు వెలిగిస్తూ ఉంటానని అనుకుందట. ఆ సమయానికి నేను ఒక మంచుకొండ మీద టార్పాలిన్ టెంట్ కింద చలికి గడ్డకట్టిన రోటీమీద క్యాంటిన్ పచ్చడిని వేసుకుని… రోటీతో యుద్ధం చేస్తున్నాను.
ఉగాదులు, సంక్రాంతులు, కర్వా చౌత్ లు, దసరాలు, దీపావళులు వస్తుంటాయి. పోతుంటాయి. రుతువులు మారుతుంటాయి. క్యాలెండర్లు మారుతూ ఉంటాయి. ప్రతి పండగకు ఆమె వీడియో కాల్ చేస్తుంది. ఆమె పలకరింపే నాకు పండగ. చాలాసార్లు సిగ్నల్ సరిగాలేక మధ్యలోనే కాల్ కట్ అయినప్పుడు పండగ మధ్యలోనే ఆవిరైపోయినట్లుండేది.
ఆమె ఇంటిని పొదివి పట్టుకుని ఉంటుంది. కరెంటు బిల్లులు మొదలు ఏవి ఎప్పుడు చెల్లించాలో తనే చూసుకుంటుంది. ఇంట్లో సంపులో మోటార్ చెడిపోతే తనే రిపేర్ చేయిస్తుంది. కార్ చెడిపోతే… తోస్తూ ఎలా స్టార్ట్ చేయచ్చో నేర్చుకుంది. ఇంట్లోవాళ్ళకు బాగాలేకపోయినప్పుడు నేను రాలేకపోతే… వారికి తోడుగా తనే ఆసుపత్రుల్లో కూర్చుంది. ముక్కోటి దేవుళ్ళకు మొక్కుకుంది.
ఏరోజూ విసుక్కోలేదు, నాకు ఫిర్యాదులు చేయలేదు.
ఆమె బాగా చదువుకుంది. మంచి భవిష్యత్తు ఉన్న ఉద్యోగం చేసేది. కానీ నా బదిలీల వల్ల ఉద్యోగం మానేసి ఇంటికే పరిమితమయ్యింది. మనమధ్య దూరం పెంచే ఉద్యోగం ఎందుకులే అని నవ్వుతూ అంటుంది. ఒక్కోసారి ఒక్కో నగరం. ఒక్కో సంస్కృతి. ప్రతిచోటా అన్నీ తనే చూసుకుంది.
నువ్వు ఎన్ని మెడల్స్ తెచ్చుకుంటే … మనమధ్య అంత దూరం పెరుగుతూ ఉంటుంది అంటూ… నా మెడల్స్ ను తళతళలాడేలా పాలిష్ చేస్తూ ఉంటుంది.
నిజమైన సెల్యూట్ గౌరవం పెరేడ్ గ్రౌండ్ లో లేదని, రైల్వే ప్లాట్ ఫార్మ్ మీద ప్రతిసారీ వీడ్కోలుగా చేతులూపుతున్న స్త్రీ చూపులో ఉందని నాకు తెలిసింది.
నా భార్యలాంటి స్త్రీమూర్తుల భుజాలకు మిలటరీ గౌరవ నక్షత్రాలు ఉండకపోవచ్చు. కానీ మేము ఇళ్ళల్లో లేని బరువును అత్యంత బాధ్యతగా, గౌరవంగా మోస్తున్న నక్షత్రాలు వారు.
అందుకే ఇకపై మీరెప్పుడైనా సైనికుడిని కలిస్తే రెండుసార్లు సెల్యూట్ చేయండి. ఒకటి- అతడికి; రెండోది- అతడిని యుద్ధరంగంలో బలంగా నిలిపిన ఆమె బలానికి.
నా యుద్ధం దేశంకోసం;
ఆమె యుద్ధం నా కోసం.
ప్రతి యుద్ధంలో ఆమె గెలిచింది.
ప్రతి సైనికుడి సతీమణి…కనిపించని ఒక పతకం.
(సోషల్ మీడియాలో వైరల్ గా తిరుగుతున్న ఒక ఇంగ్లిష్ పోస్టుకు అనువాదం)…. పమిడికాల్వ మధుసూదన్
- (ఈమె పేరు నికిత కౌల్… పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన తన భర్త మేజర్ విభూతి దౌండియాల్ సంస్మరణకు, భర్త అడుగుల్లోనే… సాఫ్ట్‌వేర్ కొలువు వదిలేసి తను కూడా ఆర్మీలో చేరింది…)
Share this Article