తెలుగుదేశం పార్టీకన్నా ఈనాడు, ఆంధ్రజ్యోతి పండుగ చేసుకున్నాయి… టీవీ5 గురించి చెప్పేదేముంది..? ఏడుగురి ఎన్నిక జరిగితే ఒక్క టీడీపీ విజేత జీవితచరిత్ర రాయడం నవ్వు పుట్టించింది కూడా…! ఇక జగన్ పని అయిపోయింది, రాబోయేది మళ్లీ తెలుగుదేశమే అన్నంత సంబరం కనిపిస్తోంది ఆ క్యాంపుల్లో…! జగన్‌కూ, చంద్రబాబుకూ నడుమ తేడా అదే… చంద్రబాబు అవకాశాల్ని గట్టిగా ఒడిసిపట్టుకుంటాడు, జగన్‌కు అది చేతకాదు…
ఒక్కసారి చంద్రబాబు ప్రభుత్వ హయాంలోకి వెళ్లండి… వైసీపీ క్యాంపును ఊచకోత కోశాడు… బోలెడు మంది ఎమ్మెల్యేలను లాగేసుకున్నాడు… తద్వారా వైసీపీని పూర్తి డిఫెన్సులో పడేశాడు… మరి ఇప్పుడు జగన్ లాగేసుకోగలిగింది కేవలం నలుగురు… తీరా తన పార్టీ నుంచే నలుగురు రెబల్స్ టీడీపీకి వోటేశారు… జగన్ తెల్లమొహం వేశాడు… దీనిపై ఏం స్పందించాలో, ఎలా స్పందించాలో అర్థం గాక సజ్జల మొహం కూడా వాడిపోయింది…
నిజానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లు టీడీపీ గెలుచుకోవడం జగన్‌కు ఎదురుదెబ్బ… ఇప్పుడు అనూరాధ గెలుపు ఆ దెబ్బల మీద దెబ్బ… 23, 23, 23 అనే అంకెలు వల్లెవేస్తూ టీడీపీ చేసుకుంటున్న సంబరం నిజానికి పెద్ద విశేషమేమీ కాదు… రాజకీయాల్లో ఇవన్నీ అత్యంత సహజం… కేసీయార్ మ్యాండేట్ ఇచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థులు తెలంగాణలో చిత్తుగా ఓడిపోలేదా..? ప్రజలు మళ్లీ కేసీయార్‌ను అధికారంలోకి తీసుకురాలేదా..?
Ads
సహజంగానే జగన్ తన ఎంపీలు, ఎమ్మెల్యేలతో వ్యవహరించే ధోరణిపై చాలామందిలో అసంతృప్తి ఉంది.., టైమ్ చూసి స్పందించారు… దీనికి టీడీపీ వారిని ఏదో ప్రలోభపెట్టింది అనే విమర్శ కూడా సరైంది కాదు… అంతకుముందు టీడీపీ నుంచి నలుగురు వైసీపీ వైపు వచ్చారు కదా, మరి దాన్ని ఏమందాం..? అసలు ఈ రెండు ‘దెబ్బ’లు ముఖ్యం కాదు… నిజంగానే ఫీల్డులో జగన్ పాలన పట్ల వ్యతిరేకత కనిపిస్తోందని సమాచారం… అయితే అది ‘‘ఇక జగన్ మాకు వద్దే వద్దు’’ అనే స్థాయిలో లేదు ఇప్పటికైతే… ఇది మరింత పెరిగితే…? చెప్పలేం… మూడో ప్రత్యామ్నాయం కూడా గతిలేని ఏపీలో మళ్లీ చంద్రబాబు మొహమే ప్రజలకు గుర్తొస్తోంది… అదొక విషాదం…
నిజానికి చాలా వైఫల్యాలున్నయ్ జగన్ పాలనలో… అనేకానేక పథకాలకు తన సొంత పేర్లు, వైఎస్ పేర్లు పెట్టుకోవడం కాదు… ఇదుగో ఇదీ మా ప్రభుత్వ ఘనత అని చెప్పుకునే ఒక్క పనీ లేదు… జస్ట్, అలా పైపైన చూస్తే… పోలవరం మినీ రిజర్వాయర్ లేదా ఓ డ్యామ్‌గా మారిపోతోంది… తొలి దశ, మలి దశ అని కొత్తగా చెప్పడమే ఓ ద్రోహచింతన… అసలు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని ఇన్ని నెలలవుతోంది, రిపేర్ దిశలో జరిగింది ఏమిటి..? అసలు ఆ మంత్రికి డయాఫ్రమ్ వాల్ అంటేనే తెలియదు… పరిహారాల్ని కేంద్రం నుంచి మెడలు వంచి తెప్పించుకోలేక మొత్తం ప్రాజెక్టు ప్రయోజనాల్నే పణంగా పెట్టడం ఇది…
కంట్రాక్టర్లను ఊడబీకి, తమ అనుకూల కంట్రాక్టర్లకు అప్పగించి ఇన్నేళ్లవుతోంది… ఒరిగిందేమిటి..? ఇవేనా..? రాజధాని అంశం అత్యంత గందరగోళంగా ఉంది… మండలి వద్దని అసెంబ్లీ తీర్మానం చేసి, మళ్లీ ఆ మండలి రాజకీయాల్లోనే కూరుకుపోవడాన్ని ఏమనాలి..? వివేకా హత్య కేసు విషయంలోనూ జగన్ వ్యతిరేకతను కూడగట్టుకున్నాడు… అసలు నీటి ప్రాజెక్టులకు సంబంధించి తన గొప్పగా చెప్పుకునే ఒక్క పనైనా ఉందా..? వైఎస్ అనగానే ఫీజు రీయింబర్స్‌మెంటు, ఆరోగ్యశ్రీ, పలు నీటి ప్రాజెక్టులు గట్రా గుర్తొస్తాయి… జగన్‌కు ఏమున్నయ్..?
పైగా మద్యం, ఇసుక… ఊళ్లల్లో తన వర్గం లీడర్ల పెత్తనాలు… వైఎస్ ఎప్పుడు నలుగురు విలేకరులు ఎదురుపడినా పలకరించి, వాళ్ల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవాడు… ప్రశ్న నుంచి ఎప్పుడూ తను పారిపోలేదు… జగన్‌కు ప్రెస్‌మీట్లంటేనే ఎలర్జీ… అన్నీ సజ్జల మీదకే వదిలేస్తే ఎలా..? సజ్జల ఆచితూచి మాట్లాడతాడు, కానీ పలు విషయాల్లో జగన్‌ను ఎలా సమర్థించుకోవాలో తనకే అంతుపట్టడం లేదు…. ఇలా తరచి చూస్తే బోలెడు అంశాలు… నిజానికి జగన్ కొట్టిన దెబ్బలకు చంద్రబాబు పార్టీ కకావికలు కావల్సింది ఇప్పటికే… ఊరూరా ఎన్ని వేల కేసులో కదా… కానీ తను పార్టీని, కేడర్‌ను కాపాడుకుని చంద్రబాబు సవాళ్లు విసురుతున్నాడు… ఇదుగో ఈ దశలోనే జగన్‌కు సరైన ఆత్మసమీక్ష అవసరం… అదేమీ జరుగుతున్నట్టు లేదు, అదే అసలైన విషాదం, వైఫల్యం…
Share this Article