Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సుంకిశాలను మరో మేడిగడ్డలా చూపిస్తే… అదంతా ఉల్టా తగిలేది కేసీయార్‌కే…

August 8, 2024 by M S R

హైదరాబాద్‌కు నాగార్జునసాగర్ కనీస నీటిమట్టం నుంచి కూడా తాగునీటిని సప్లయ్ చేయడానికి ఉద్దేశించిన పథకం… సుంకిశాల ప్రాజెక్టు..! అంటే సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి కూడా నీటిని పంప్ చేయడానికి ఉద్దేశించింది…

ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయి… అయితే హఠాత్తుగా శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు వరదనీటి ప్రవాహం పెరిగింది… ఆగస్టు మొదటి వారంలోనే ఇంత వరద వస్తుందని ఎవరూ అంచనా వేయలేదు… ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిర్ణయం తీసుకున్న కేసీయార్ సంకల్పంలో తప్పులేదు…

మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పైపులు, లిఫ్టులు, సాగునీటి ప్రాజెక్టులు అనగానే వెంటనే గుర్తొచ్చేది మేఘా కంపెనీయే కదా… రాజకీయ నాయకులకు అత్యంత ప్రీతిపాత్రమైన కంపెనీ కదా… డబ్బులే డబ్బులు కదా… 2021లో మేఘా ఇంజనీరింగ్ సంస్థకు పనులు అప్పగించింది కేసీయార్ ప్రభుత్వం… మరోసారి చదవండి, ఈ టెండర్ అప్పగించింది మేఘాకు, ఇచ్చింది కేసీయార్…

Ads

ఇందులో భాగంగా ఇన్‌టేక్ వెల్, సంపు, పంపు హౌజ్, 3 టన్నెళ్లు, పంప్ హౌజ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం చేయాల్సి ఉంది… పంపింగ్ మెయిన్స్‌లో 50 కి.మీ మేరకు 3 వరుసల్లో 2325 ఎంఎం డయా పైపుల్ని వేయాలి… ఎలాగూ పంపులు, మోటార్లు, సబ్‌స్టేషన్లు, పవర్ ట్రాన్స్‌మిషన్ మెయిన్స్ ఉంటాయి కదా…

ఇన్‌టేక్ వెల్ పనులు 60 శాతం, పంపింగ్ మెయిన్ పనులు 70 శాతం, ఎలక్ట్రోమెకానికల్ పనులు 40 శాతం పూర్తయ్యాయి… రిజర్వాయర్ టన్నెల్ వైపు సైడ్ వాల్స్ 2023లోనే పూర్తయ్యాయి… అంటే కేసీయార్ కాలంలోనే…! మూడు టన్నెల్స్ ప్రతిపాదించారు కదా, అవీ దాదాపు 90 శాతం పూర్తయ్యాయి… వచ్చే వేసవికి ఉపయోగపడాలని ముందైతే మిడిల్ టన్నెల్ పనులు పూర్తి చేయాలని మేఘా సంస్థ నిర్ణయించింది… సంప్ వైపు టన్నెల్‌పై గేటు పెట్టారు, రిజర్వాయర్ వైపు మట్టిని తీసేశారు, సైడ్ వాల్స్ నడుమ టై బీమ్ కనెక్టివిటీ కాస్టింగ్ పనులు చేస్తున్నారు…

sunkisala

ఇక్కడి వరకూ ఎవరినీ ఎవరూ తప్పుపట్టేది లేదు… మిడిల్ టన్నెల్ కోసం గేట్ ఫిక్సింగ్ పనులు చేపట్టారు… జూలై 29, 30, 31 తేదీల్లో గేటు బిగింపు పనులు జరిగాయి… ఇదే సమయంలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగి (3.5 లక్షల క్యూసెక్కులు) టన్నెల్‌లోకి నీళ్లు వచ్చాయి… గేటు ధ్వంసమైంది… సైడ్ వాల్ కొంత కూలిపోయింది…

సైడ్ వాల్ పొడవు 270 మీటర్లు… వెల్ లోపల నిర్మించిన మొత్తం గోడల పొడవు సుమారు 1020 మీటర్లు… ఇందులో ప్రస్తుతం కూలిన గోడ సుమారు 50 మీటర్లు… ఈ పనులు అన్నీ జులై 2022లో ప్రారంభమై 2023లో పూర్తి అయ్యాయి… అంటే మొత్తం కేసీయార్ పాలనకాలంలోనే… ఇక విషయానికి వస్తే… నమస్తే తెలంగాణలో ఓ పెద్ద స్టోరీ కనిపించింది పొద్దున్నే… బహుశా ఎక్స్‌క్లూజివ్ స్టోరీ… అయితే గుడ్… అభినందించాలి సదరు రిపోర్టర్‌ను…

కానీ జలమండలి ఈ విషయాన్ని దాచిపెడుతోంది అనే యాంగిల్‌కే ప్రాధాన్యం ఇచ్చింది స్టోరీ… ఇదేదో రేవంత్ సర్కారు నిర్వాకం అని ఎస్టాబ్లిష్ చేయడానికి విశ్వప్రయత్నం చేసింది… కేసీయార్ హయాంలోనే ఆ పనులు అప్పగించారు, ఈ కూలిన సైడ్ వాల్ పనులు కూడా ఆయన హయాంలోనే పూర్తయ్యాయనే విషయాల్ని తను దాచిపెట్టింది స్టోరీ… పైగా ఇదేమీ జలమండలికి అప్పగించలేదు, అసలు నిర్మాణాలే పూర్తి కాలేదు… ఇప్పుడు ఏం జరిగినా సదరు మేఘా సంస్థదే బాధ్యత… ఇందులో జలమండలి నిర్లక్ష్యం ఏమీ లేదు, ఆగస్టు ఫస్టే ఇది జరిగినా రేవంత్ అసెంబ్లీలో చెప్పకుండా దాచిపెట్టాడనే ఆరోపణ కూడా అర్థరహితం…

ఒకవేళ దీన్ని మరో మేడిగడ్డలా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తే… అది ఉల్టా తగిలేది కేసీయార్‌కే..! తన అడ్డగోలు కమీషన్ల యావతో నాసిరకం పనులకు తెరతీశాడని కేసీయార్ మీద మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం నింద వేయడానికి ఈ స్టోరీ ఆస్కారమిస్తోంది… ఈ వార్త రాగానే పింక్ సోషల్ క్యాంప్ కూడా రెచ్చిపోయి, ఆ వీడియోలు, ఆ ఫోటోలతో రేవంత్ సర్కారు మీద ఏదో బురద జల్లే పనిని నెత్తికెత్తుకుంది… తీరా చూస్తేనేమో ఇవీ నిజాలు… ఎందుకు గోక్కోవడం..!?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక కోట… ఒక బ్రహ్మి… ఎప్పుడు చూసినా నవ్వులు పండించే హిట్ మూవీ….
  • ఒక గొప్ప ఫోటో..! దీని వెనుక ప్రతి లీడర్ తప్పక చదవాల్సిన ఓ కథ..!!
  • నీలిపూల నిద్రగన్నేరు చెట్టు… పరోమా! ఉదాత్తమైన అక్రమ ప్రేమ కథ…
  • గొప్పల తిప్పలు తరువాత… ముందు నీ గోచీ సరిచూసుకోవయ్యా ట్రంపూ…
  • ఇది ఆ పాత కాంగ్రెస్ కాదు… ఈ జుబ్లీ గుట్టల్లో కొత్తగా స్ట్రాటజిక్ అడుగులు…
  • ‘‘కేసీయార్‌వి ప్రచార నాటకాలు- రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలా కాదు’’
  • మొన్నటి అమ్మాయిల విజయం వెనుక ఓ అలుపెరుగని గురువు..!!
  • ఓ సుదీర్ఘ వీక్షణం… ఆ పాత వైబ్స్ లేవు, ఆ గూస్ బంప్స్ లేవు…
  • అదే రవితేజ… అదే మొనాటనీ… అదే యాక్షన్… అదే ‘మాస్ జాతర’…
  • నిన్న అమ్మాయిల గెలుపు హోరు… నేడు అబ్బాయిల పేలవ ఆటతీరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions