.
“ఎస్పీ గారు కౌన్సిలింగ్ కి రమ్మన్నారు” …. పోలీసుల నోటినుంచి ఈ మాట వినగానే చోటా నాయకుల నుంచి బడా నాయకుల వరకు గుండెల్లో రైళ్ళు పరిగెట్టేవి
రౌడీల సంగతి సరేసరి
దొరగారి నుంచి కౌన్సిలింగ్ పిలుపు రాకముందే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు
“కౌన్సిలింగ్” ఈ పదం వింటే చాలు కొందరికి ముచ్చెమటలు పట్టేవి
భయంతో గజగజా వణికిపోయేవారు
ఇందాక టీవీల్లో పోలీసు అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును కస్టడీకి కోరుతూ కోర్టులో పోలీసుల పిటిషన్ అన్న వార్త చూడగానే ఆంజనేయులు విజయవాడ సీపీ గా ఉన్నప్పుడు రౌడీలకు చేసిన కౌన్సిలింగ్ గుర్తుకొచ్చింది
Ads
ఈ కౌన్సిలింగ్ గురించి తెలియాలంటే రీలు కొన్ని సంవత్సరాలు వెనక్కి తిప్పాలి
ఒకప్పుడు గుంటూరు పేట రౌడీలకు నాటు రౌడీలకు ప్రసిద్ధి
ఈ నాటు రౌడీలకు కొంతమంది రాజకీయ నాయకులు గాడ్ ఫాదర్లు అన్న సంగతి గుంటూరు వాసులకు తెలుసు
అటువంటి గుంటూరు జిల్లాకు ఎస్పీగా పీఎస్ఆర్ ఆంజనేయులు ఎస్పీగా వచ్చారు
అప్పుడు పుట్టింది ఈ “కౌన్సిలింగ్” అనే పదం
సాధారణంగా నగరంలో రౌడీ షీట్ ఉన్నవాళ్ళని స్థానిక స్టేషన్కు పిలిపించి పోలీసులే కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు
కానీ పీఎస్ఆర్ ఆంజనేయులు రూటే సెపరేట్
ఆయనే స్వయంగా తన కార్యాలయంలో కౌన్సిలింగ్ ఇచ్చేవాడు
మొదట్లో ఈ కౌన్సిలింగ్ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు
కానీ రెండు సెషన్లు అయిన తర్వాత ఆ పేరు వింటేనే రౌడీలు భయపడి పారిపోయే పరిస్థితి వచ్చింది
మెల్లిగా ఈ కౌన్సిలింగ్ లిస్టులో రౌడీల నుంచి రాజకీయ నాయకులు కూడా యాడ్ అవటంతో అప్పట్లో గుంటూరు రాజకీయ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది
ఫలితం ట్రాన్స్ఫర్
***
గుంటూరు ఎస్పీ పీఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ సీపీ గా బదిలీ అయ్యారు
పదవితో పాటు కౌన్సిలింగ్ ను కూడా ఆయన విజయవాడకు షిఫ్ట్ చేసుకున్నారు
విజయవాడలోనూ సీపీ గారి కౌన్సిలింగ్ మొదలైంది
పీఎస్ఆర్ ఆంజనేయులు కౌన్సిలింగ్ దెబ్బకు స్థానిక రౌడీలు గుంటూరు పారిపోయారు
నెక్ట్స్ ఆయన చూపు రౌడీలను పెంచి పోషిస్తున్న రాజకీయ నాయకుల మీద పడింది
రోజుకో నాయకుడికి సీపీ ఆఫీసు నుంచి కౌన్సిలింగ్ కు హాజరు కావాలని కబురు వెళ్ళింది
గుంటూరులో ఆంజనేయులు కౌన్సిలింగ్ సంగతి విని ఉండటంతో చాలామంది చోటా నాయకులు గుడ్ బాయ్ లు అయిపోయారు
జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రిని సైతం తన ఆఫీసుకు పిలిపించి ” మాజీ మంత్రివనే గౌరవంతో కూర్చోబెట్టి మాట్లాడుతున్నా.. వెంటనే రౌడీలకు షెల్టర్ ఇవ్వటం ఆపేయండి. దందాలు ఆపేయండి.. దొడ్లో పంచాయతీలు ఆపేయండి.. లేదంటారా? ఈసారి కౌన్సిలింగ్ లో ఫస్ట్ పర్సన్ మీరే అవుతారు ” అని వార్నింగ్ ఇవ్వటం కొంతమందికి లీక్ అయి అప్పట్లో సెన్సేషన్ అయ్యింది
అయితే ఆ నాయకుడు విషయాన్ని పూర్తిగా బయటకు పొక్కనివ్వకుండా తాత్కాలిక మౌనం పాటించటంతో వివాదం చెలరేగకుండా ముగిసింది
సరిగ్గా అప్పుడు పడింది సీపీ కన్ను వల్లభనేని వంశీ మీద
రాజకీయాల్లో అప్పుడప్పుడే ఎదుగుతున్న ఓ కుర్రాడు తొమ్మిది బొలెరో జీపుల కాన్వాయిలో తిరుగుతుండటం.. అన్ని జీవులకు నైన్ నంబర్లు ఉండటంతో వంశీ ఫైల్ తెప్పించి చూసాడు ఆంజనేయులు
అనంతపురం పరిటాల రవి శిష్యుడిగా వంశీ పేరు రికార్డుల్లో ఉంది
కొంతకాలం పరిటాల దొడ్లో పనిచేసిన తర్వాత గన్నవరం వచ్చి రాజకీయాల్లో చక్రం తిప్పటం మొదలు పెట్టాడు
అంతే దొరగారి కౌన్సిలింగ్ కు రావాలని వంశీకి కూడా కబురు వెళ్ళింది
అయితే సీపీ ఊహించని పరిణామం జరిగింది
తను కౌన్సిలింగ్ కు ఎందుకు రావాలని వంశీ ఎదురు తిరిగాడు
సీపీ అహం దెబ్బ తింది
ఎట్టి పరిస్థితుల్లోనూ రావాల్సిందే అన్నాడు
రాకపోతే పోలీస్ మర్యాదలతో తీసుకెళ్లాల్సి ఉంటుంది అని హెచ్చరించాడు
ఎలా తీసుకెళ్తావో నేనూ చూస్తా అని ఏకంగా సీపీ కే ఛాలెంజ్ విసిరి అనుచరులతో సెంటర్లో మకాం వేయడం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది
ఒకపక్క డ్యూటీలో కఠినంగా వ్యవహరిస్తాడనే పేరున్న సీపీ ఆంజనేయులు ,
మరోపక్క అప్పుడప్పుడే గన్నవరం రాజకీయాల్లో నాయకుడిగా ఎదుగుతున్న వంశీ ,
ఏం జరుగుతుందా అని ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సమయంలో కౌన్సిలింగ్ కు హాజరు కాకుండా కోర్ట్ నుంచి ఆర్డర్ తెచ్చుకుని సీపీ కి సవాల్ విసిరాడు వంశీ
దాంతో సీపీ కూడా నిస్సహాయంగా మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది
కానీ వంశీ మౌనంగా లేడు
ఆ విషయం సీపీ కూడా పసిగట్టలేకపోయాడు
కొద్దిరోజుల తర్వాత వంశీ మీడియాకు ఓ వీడియో రిలీజ్ చేశాడు
ఆ వీడియోలో అంతటి కఠినమైన నిజాయితీ అధికారి అని పేరు తెచ్చుకున్న సీపీ కూడా ఎంత వారలైనా కాంత దాసులే కదా అన్న చందాన వంశీ పన్నిన హనీ ట్రాప్ లో అడ్డంగా దొరికిపోయారు
ఆడవాళ్ళతో ఆంజనేయులు చేసిన చాట్ టీవీల్లో రావడంతో ప్రభుత్వం అప్పటికప్పుడు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసి డిపార్ట్మెంటల్ ఎంక్వయిరీకి ఆదేశించింది
***
విధి విచిత్రం
ఆ రోజు ఈగోలకు పోయి ఒకరిమీద ఒకరు బాణాలు సంధించుకున్న వంశీ అండ్ రామాంజనేయులు ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా జైల్లో మగ్గుతున్నారు
గన్నవరం టీడీపీ ఆఫీసు మీద దాడి కేసులో వంశీ అరెస్ట్ అవగా.. నటి జెట్వానీ కేసులో అరెస్ట్ అయి రామాంజనేయులు జైల్లో ఉన్నారు
కాకపోతే ఒకే జైలా.. ఒకే సెల్లా అనేది నాక్కూడా తెలీదు.. నన్నడక్కండి …….. పరేష్ తుర్లపాటి
Share this Article